సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడుల్లో చేరని బాలల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్ష విభాగం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలన్న లక్ష్యం మేరకు సమగ్ర శిక్ష విభాగం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
విద్యా సంవత్సరంలో ఏ స్కూల్‌లోనూ నమోదు కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రాథమిక విద్యను ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. ఇలా బడి బయట ఉన్న పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా 11,331 మంది ఉన్నట్లు సమగ్ర శిక్ష విభాగం గుర్తించింది. వీరికి నాన్ రెసిడెన్షియల్ విధానంలో 3, 6, 9 నెలల కాల వ్యవధితో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో టీచర్ వలంటీర్లను నియమించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించనున్నారు. అనంతరం ఆ విద్యార్థులను వారి వయసుకు తగ్గ తరగతుల్లో చేర్చనున్నారు. సమగ్ర శిక్ష విభాగం జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తల ద్వారా టీచర్ వలంటీర్లను నియమించనున్నారు.
టెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత
ప్రత్యేక శిక్షణా కేంద్రాలకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో టీచర్ వలంటీర్లకు ఇంటర్మీడియెట్‌తో డీఈడీ, ప్రాథమికోన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. టీచర్ వలంటీర్లకు నెలకు రూ.7,500 చొప్పున అందిస్తారు. వలంటీర్లకు ఐదు రోజులపాటు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
టీచింగ్ టెర్నింగ్ మెటీరియల్ కింద ప్రతి సెంటర్‌కు రూ.1,000 విలువైన వస్తువులు అందిస్తారు. ఇవికాకుండా ప్రతి కేంద్రంలోని పిల్లలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తారు. పిల్లలకు సంబంధించిన స్టేషనరీకి రూ.200, బ్యాగుకు రూ.200, చెప్పులకు రూ.100 చొప్పున అందిస్తారు. పిల్లలకు కావాల్సిన వివిధ సబ్జెక్టుల పుస్తకాలను సమగ్ర శిక్ష విభాగం అందజేస్తుంది.
ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కొండలు, నదులు, వాగులు వంటి ఆటంకాలు ఉన్న చోట స్కూల్ పాయింట్‌లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంఈవోలు, హెడ్మాస్టర్ల పర్యవేక్షణలోనే ఇవి కొనసాగాలని, ఎన్‌జీవోల ద్వారా నిర్వహించరాదని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది విద్యార్థులు ఉండాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో వీరి సంఖ్య 13 వరకు ఉండొచ్చన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీ ఈ కేంద్రాలకు అనుమతి మంజూరు చేస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధిత మండలం, పంచాయతీ, గ్రామానికి చెందిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులైనవారు లేనిపక్షంలో మండల పరిధిలో లేదా డివిజన్ పరిధిలో ఇతరులకు అవకాశం కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment