ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు | Admissions in Class 1 under RTE Act in private schools of AP | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు

Published Mon, Feb 27 2023 3:18 AM | Last Updated on Mon, Feb 27 2023 3:18 AM

Admissions in Class 1 under RTE Act in private schools of AP - Sakshi

సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది.

ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్‌తో సహా నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆయా ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనంతరం విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్‌సైట్‌ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్‌ 7వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్‌ 9 నుంచి 12 వరకు చేపడతారు.

మొదటి విడత కేటాయింపు ఏప్రిల్‌ 13న ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్‌ 15 నుంచి 21వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి. అనంతరం రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్‌ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్‌ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి. రిజిస్ట్రేషన్లను హెచ్‌టీటీపీఎస్‌://సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌లో నమోదు చేయాలి.

ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు.

రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు.

ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్‌ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement