‘బడి’కి నోటిఫికేషన్!
రాష్ట్రంలో తొలిసారిగా పాఠశాలల్లో ప్రవేశాలకు షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు దానిని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 20న ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వ స్కూళ్ల తరహాలో ఈనెల 21వ తేదీనుంచే కొత్త విద్యా సంవత్సరాన్ని (పైతరగతుల బోధన) ప్రారంభించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీగా చేపట్టాల్సిన చర్యలనూ వివరించింది.
డ్రాపౌట్లు ఉండకుండా చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో వంద శాతం పైతరగతుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వచ్చే నెల 3 నుంచి 13 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈసారి ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం కోసం డిమాండ్ ఉంటే.. బోధనకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు టీచర్లు, తల్లిదండ్రులు ముందుకు వస్తే.. ‘బడిబాట’కార్యక్రమంలోనే నిర్ణయం తీసుకుని, (ఒకటో తరగతిలో) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే 90 శాతం పాఠ్య పుస్తకాలను జిల్లాలకు చేర్చింది. ఈనెల 21న స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులందరికి పుస్తకాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. వేసవిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
కొత్త విద్యా సంవత్సర కార్యక్రమాలు
► ఈనెల 21 నుంచి పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం. పిల్లలకు పైతరగతుల బోధన. పాఠ్య పుస్తకాల పంపిణీ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహణ. తల్లిదండ్రులతో సమావేశం, డ్రాపౌట్స్‌ను తిరిగి పాఠశాలల్లో చేర్చేలా చర్యలు, విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్‌డేషన్.
► 22న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగన్‌వాడీ కేంద్రాల ను సందర్శించి అక్కడి పిల్లల జాబితాను సేకరించడం. పైతరగతులకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం. ప్రత్యామ్నా య బోధనకు ప్రణాళికల రూపకల్పన.
► 23న అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించడం. అక్షరాభ్యాసం కార్యక్రమం.
24వ తేదీ నుంచి..: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యామ్నాయ బోధన ప్రారంభం. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం.
► 25 నుంచి ఏప్రిల్ 15 వరకు: పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం.
ప్రీప్రైమరీ కోసం 5,318 స్కూళ్ల దరఖాస్తులు
గతేడాది హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రీప్రైమరీ విద్యార్థి లిఫ్టులో పడి మరణించడంతో.. ప్రీప్రైౖమరీ స్కూళ్ల నియంత్రణ, వాటి గుర్తింపు అంశం తెరపైకి వచ్చింది. అంతకుముందు ప్రీప్రైమరీ స్కూళ్ల గుర్తింపును ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఘటనతో ప్రీప్రైమరీకి కూడా తప్పనిసరిగా గుర్తింపు పొందేలా, నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రీప్రైమరీ గుర్తింపు కోసం ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,318 ప్రైవేటు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో పాత స్కూళ్లు 4,773 ఉండగా.. కొత్త గా ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు 545 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 3 వేల వరకు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇదీ ప్రవేశాల షెడ్యూల్
► ఈ నెల 20న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
► 20 నుంచి 24 దాకా ప్రారంభ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
► 25 న ఎంపిక జాబితాల ప్రకటన
► 27 నుంచి ప్రారంభ తరగతిలో చేరిన వారికి తరగతుల బోధన ప్రారంభం
► ఏప్రిల్ 15 లోగా ఆయా విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
► జూలై 30 వరకు ఇతర తరగతుల్లో సాధారణ ప్రవేశాల గడువు.
► సెప్టెంబర్ 24 వరకు ప్రవేశాలకు అవకాశం.
► విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏ పాఠశాల కూడా విద్యార్థులకు ప్రవేశాలను నిరాకరించడానికి వీల్లేదు.
► పాఠశాలల్లో ఆలస్యంగా చేరిన వారికి ప్రత్యేక బోధన చేపట్టాలి.