‘ప్రైవేట్’లో కృత్రిమ కొరత డిమాండ్ పెంచి దండుకునే యత్నం
అడ్మిషన్ టెస్టులతో అధిక ఫీజులు
అనుమతి లేకపోయినా రెసిడెన్సియల్ నిర్వహణ
ఉపాధ్యాయులే పీఆర్వోలు
లాభసాటి వ్యాపారంగా విద్య
ప్రైవేట్ పాఠశాలల వ్యాపార సూత్రం ప్రజల జేబుకు చిల్లు పెడుతోంది. పిల్లలను బాగా చదివించుకోవాలనే తల్లిదండ్రుల తపనను కొన్ని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నారు. పోటీ ప్రపంచంలో.. ర్యాంకులవేటలో.. డబ్బుకు వెనుకాడని తత్వం నిరుపేదలను విద్యకు క్రమంగా దూరం చేస్తోంది. వేసవి సెలవుల్లోనే పాఠశాలల గేట్లకు తగలేసిన ‘నో అడ్మిషన్స్’ బోర్డు విద్యార్థుల భవితను శాసిస్తోంది.
కర్నూలు(జిల్లా పరిషత్) : ప్రైవేట్ పాఠశాలలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి, 1994న జారీ చేసిన జీఓ 1 నీరుగారుతోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు.. అడ్మిషన్లు.. ఉపాధ్యాయుల నియామకం.. విధివిధానాల విషయంలో యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. జిల్లాలోని 1,123 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 367 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 333 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ఇందులో అధిక శాతం యాజమాన్యాలు జనవరి నుంచే పీఆర్వోలచే అడ్మిషన్లకు అర్రులు చాస్తుండగా.. మరికొందరు ఉపాధ్యాయులనే పీఆర్వోలుగా మార్చేయడం గమనార్హం. మరికొన్ని పాఠశాలలు మరో అడుగు ముందుకేసి సీట్ల కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి తెర తీశాయి. 2015-16 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కర్నూలులోని పలు ప్రైవేట్ పాఠశాలలు నో అడ్మిషన్ బోర్డు పెట్టేశాయి.
ఆయా పాఠశాలలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఫలానా వారు చెప్పినందుకు సీటు ఇస్తున్నామని చెప్పి ఫీజు బాదేస్తున్నారు. కలెక్టరేట్ సమీపంలోని ఓ పాఠశాల.. ఎన్‌ఆర్ పేట.. బెంగళూరు రోడ్డులోని నాలుగు పాఠశాలలు.. చిన్న పార్కు సమీపంలోని ఇంకో పాఠశాల.. సుంకేసుల రోడ్డులోని పాఠశాలలో ఈ తరహా వ్యాపారం సాగుతోంది.
అనుమతుల్లేకుండానే తరగతుల నిర్వహణ
నగరంలో పేరెన్నికగన్న పాఠశాలల్లోనూ కిండర్‌గార్డెన్, యూరోకిడ్స్, స్టార్‌కిడ్స్, ప్లే స్కూల్ పేరుతో ప్లే క్లాస్, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాల ఒకటి నుంచి 7 వరకు జిల్లా విద్యాశాఖ, 8 నుంచి 10 వరకు ఆర్‌జేడీ వద్ద గుర్తింపు తీసుకుంటాయి. కానీ ప్లే స్కూల్, ఎల్‌కేజీ, యూకేజీలకు ఎక్కడా అనుమతులు ఉండవు. దీనికి తోడు పేరెన్నికగన్న పాఠశాలల్లో చాలా వాటిలో అనుమతులు లేకుండానే రెసిడెన్సియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మాత్రం వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్లే స్కూల్‌కే రూ.20వేల దాకా ఫీజు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. హైస్కూల్ విద్యార్థులకు యేడాదికి రూ.60వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేసే పాఠశాలలు కూడా నగరంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఫీజులుం
Published Wed, May 13 2015 3:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement