బి.కొత్తకోట, న్యూస్‌లైన్ : జిల్లాలో కిలోమీటరు దూరంలో ఉండి, రవాణా సౌకర్యంలేని పాఠశాలల విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి ఎస్.లక్ష్మి తెలిపారు. గురువారం బి.కొత్తకోట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆమె జీసీడీవో రమాదేవితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు రవాణాఖర్చులు చెల్లించేం దుకు తొలి ఆరు నెలలకు రూ.49 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. జిల్లాకు సంబంధించిన విద్యాసమాచారం, యూ-డైస్ వివరాలను పూర్తిస్థాయిలో అందించి రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచామన్నారు.
విద్యార్థుల ఆధార్ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదుచేయడం ద్వారా ప్రతి విద్యార్థి వివరాలూ అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఆర్పీలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పనితీరు వివరాలను తెలియజేయాలని కోరారు. త్వరలో కేజీబీవీల్లోనూ సలహా కమిటీల ఎన్నికకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఆర్వీఎంకు రూ.149 కోట్లు మంజూరుకాగా అందులో రూ.99 కోట్లు ఉపాధ్యాయుల వేతనాలకు పోతుందని, మిగిలిన రూ.50 కోట్లతో వివిధ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్టు వెల్లడించారు.
గతంలో ఫిజియోథెరపీ కోసం వచ్చే వికలాంగపిల్లలకు నిలిపివేసిన రూ.100 రవాణాభత్యాన్ని పునరుద్ధరించామన్నారు. వీరి కోసం ఈ డాది రూ.కోటి వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. కేజీబీవీలకు ఏడాదికి రూ.50 లక్షలు ఖర్చుచేస్తున్నామని, జిల్లాలో విద్యార్థుల యూనిఫారం కోసం రూ.11.6 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు అకడమిక్ శిక్షకులను నియమించినట్టు తెలిపారు.
ఇందులో తెలుగుకు 86 మంది, ఉర్దూకు 86 మందిని నియమించి ఒక్కొక్కరికి నెలకు రూ.5వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో కేవీ.పల్లె, గుడిపల్లె, శ్రీకాళహస్తి, వీ.కోటల్లో రెసిడెన్షియల్ ట్రైనింగ్ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మదనపల్లెలో ఇప్పటికే రెసిడెన్సియల్ ట్రైనింగ్ కేంద్రం ప్రారంభమైందని ఆమె వెల్లడించారు.
విద్యార్థులకు రవాణా భత్యం
Published Fri, Nov 29 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement