సాక్షి, అనంతపురం : వారం రోజుల పాటు కురిసిన వర్షాల ప్రభావంతో జిల్లాలో వేలాది మంది విష జ్వరాలతో మంచం పట్టారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించాయి. రోజుల తరబడి జ్వరం తగ్గక పోవడంతో చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాల్లో మాత్రం ఏదో పసరు తాగి ఇంటి వద్దే మంచాలపై మగ్గుతున్నారు.
మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగీ జ్వరాలు విసృ్తతంగా వ్యాపించాయి. వీటి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు గొప్పలు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు సరిగా అందుబాటులో లేక పోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. గడిచిన మూడు నెలల్లోనే జిల్లాలో 1,044 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఇందులో మలేరియా కేసులు ఏడు, విషజ్వరం కేసులు 286 తేలాయి. తరిమెల పీహెచ్‌సీ పరిధిలోని కల్లుమడికి చెందిన రాజేంద్రప్రసాద్, కరకముక్కల పీహెచ్‌సీ పరిధిలో రాజేష్, గుత్తి మండలం వన్నేదొడ్డికి చెందిన జ్యో త్స్న డెంగీతో బాధపడుతున్నారు.
అపరిశుభ్రతే కారణం
ఇటీవల కురిసిన జడివాన వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఇళ్ల ముందే వర్షపు నీరు నిలిచి.. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దోమలు విజృంభిస్తూ... ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనికితోడు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లు తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి. దీనివల్ల తాగునీటిలోకి వర్షపు నీరు, మురుగు నీరు కలుషితమవుతోంది. పారిశుద్ధ్యం మెరుగుదలకు పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... గ్రామాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రభుత్వ వైద్యులు తమ సొంత ఆస్పత్రుల్లో శుభ్రతపై చూపిస్తున్న శ్రద్ధ.. ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామాలపై చూపడం లేదు.
ప్రైవేటు ప్రాక్టీస్‌పైనే దృష్టి
పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యుల్లో 90 శాతం మంది పట్టణాల్లోనే కాపురముంటున్నారు. పీహెచ్‌సీల్లో మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తూ.. సొంత నర్సింగ్ హోమ్‌ల అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే రోగులను సైతం తమ నర్సింగ్ హోమ్‌లకు పిలిపించుకుంటూ జేబులకు చిల్లు పెడుతున్నారు. ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లలో రోగులకు రకరకాల వైద్య పరీక్షలను సిఫారసు చేస్తూ వేలాది రూపాయలు గుంజుతున్నారు.
మలేరియా బాధితులకు రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500, డెంగీ రోగులకైతే రూ.3 వేల వరకు, టైఫాయిడ్ బాధితులకు రూ.800 నుంచి రూ.900 వరకు బిల్లు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెల క్రితం అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన పద్మ టైఫాయిడ్‌తో బాధపడుతూ... ఇంటి ఎదురుగా ఉండే నర్సింగ్‌హోమ్‌కు వెళ్లింది. మూడు రోజుల పాటు ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని వైద్యులు సూచించారు. రోజుకు ఒక ఫ్లూయిడ్ చొప్పున ఎక్కించారు. మందుల బిల్లు రూ.2,500 కాకుండా..ఫ్లూయిడ్స్ ఎక్కించిన దానికే రూ.5,500 వేశారు. ఈ బిల్లు చూసి పద్మ భర్త విస్తుపోయాడు.
ఆందోళన కల్గిస్తున్న విష జ్వరాలు
జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజలకు ఆందోళన కల్గిస్తున్నాయి. వారం పదిరోజులైనా జ్వరం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదని రోగులు వాపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విష జ్వరాలతోనే 18 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 30 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో 3,21,507 మందికి రక్త పరీక్షలు చేశారు. 95 మంది మలేరియా, ముగ్గురు డెంగీ, ఒకరు చికున్ గున్యా, 27 మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మలేరియా, విష జ్వరాల పీడితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రిలో ఆగస్టులో 474 మందికి వైద్య పరీక్షలు చేయగా 103 మందికి విష జ్వరాలు ఉన్నట్లు తేలింది.
సెప్టెంబర్‌లో 467 మందికి గాను 97, అక్టోబర్‌లో 292 మందికి గాను 86 మంది విష జ్వరాలతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే ఈ మూడు నెలల్లోనే ఏడు మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మలేరియా, టైఫాయిడ్, విషజ్వర పీడితుల సంఖ్యకు లెక్కేలేదు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదముంది.
మంచమెక్కిన ‘అనంత’
Published Wed, Oct 30 2013 2:59 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement