సాకులు చెప్పొద్దు..
అనంతపురం సిటీ : సీజనల్ వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో బాధితులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ కోన శశిధర్ వైద్యాధికారులను ఆదేశించారు. సాకులు చెబితే కుదరదని, సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో సోమవారం వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
జ్వరాలబారిన పడిన చిన్నారుల కోసం నాలుగు వార్డుల ఏర్పాటు చేసే విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో చర్చించారు. అయితే వైద్యులు, నర్సుల కొరతతోపాటు మందులు కూడా తగినన్ని లేవని చెప్పడంతో కలెక్టర్ మండిపడ్డారు. అన్నింటికీ ఇలా సాకులు చెప్పొద్దన్నారు. డ్రగ్ స్టోర్ అధికారితో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడగా నిబంధనల మేరకే మందులు తీసుకోవాలని అనడంతో ‘ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే రూల్స్ ఏంటి’ అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి మందుల కొరత సమస్యకు పరిష్కారం చూపారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సైకియాట్రిక్ వార్డ్‌లో ఫిమేల్, మేల్ చిన్నారులను ఉంచేందుకు రెండు వార్డులు ఎంపిక చేసి 50 పడకలు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఈ వార్డుల్లో చిన్నారులను అడ్మిషన్ చేసుకుని, వైద్యసేవలందించాలని ఆదేశించారు. డెంగీ జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులను ట్రామా కేర్ సెంటర్‌లో ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసి, నలుగురు వైద్యులను నియమించారు.