విపక్షాలు సహకరించాలి
కేంద్ర మంత్రి వెంకయ్య విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘చైనా ఆర్థికవృద్ధి మందగించింది. ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని దేశాలకు భారత్ ఒక్కటే ఆశాకిరణంగా నిలిచింది.
ఇలాంటి కీలక సమయంలో అధికార, ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పని చేయాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక అభివృద్ధి వేగంగా పెరగడానికి అవసరమైన చట్టాల ఆమోదంలో ప్రతిపక్ష పార్టీలు క్రియాశీలక పాత్ర పోషించాలి. జీఎస్‌టీ, భూ సేకరణ (సవరణ) వంటి కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
అందరికీ అవకాశాలు కల్పిస్తే తప్పెలా
అర్హత కలిగినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకు విద్యావ్యవస్థలో కీలక స్థానాలను అప్పజెప్పడం తప్పెలా అవుతుందని వెంకయ్య ప్రశ్నించారు.ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షపై వెంకయ్య స్పందిస్తూ రాజకీయ పార్టీలు తమకు నచ్చిన కార్యక్రమాలను చేసుకోవడంలో తప్పు ఏముంటుందన్నారు.హోదా కోసం ఇటీవలే కోటి ఎస్‌ఎంఎస్‌ల ఉద్యమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు తనకు ఒక్క ఎస్‌ఎంఎస్ కూడా రాలేదని చెప్పారు.