ఎమ్మెల్యేలకు నిధులు నిల్
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను రద్దుచేసిన సీఎం
కార్పొరేషన్‌కు నిధుల కొరత
ఆగిపోయిన అభివృద్ధి పనులు
టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఫలితంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్థానిక సంస్థల వద్ద నిధులు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు కదలట్లేదు. చిన్నచిన్న పనులు కూడా చేయించలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.
విజయవాడ : ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్ (ఏసీడీఎఫ్) విడుదల చేసేవారు. ప్రజలు తమ ఇబ్బందులను ఎమ్మెల్యేకు చెబితే.. ఆయన తన నిధులు వెచ్చించి ఆ సమస్యను పరిష్కరించేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.2కోట్లు కూడా మంజూరుచేశారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 2015-16 బడ్జెట్‌లో ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.3 కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అప్పటివరకు ప్రజలు ఏ సమస్య చెప్పినా వాటిని పరిష్కరించే అవకాశం ఎమ్మెల్యేలకు ఉండదు. నగరపాలకసంస్థ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్పొరేషన్ నిధులు కూడా లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కూ బ్రేక్
గత ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గానికి రూ.3కోట్లు, తూర్పు, పశ్చిమలోని అభివృద్ధి పనులకు రెండేసి కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ నిధులు వినియోగించే లోగానే ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఈ నిధుల్ని వినియోగించుకుందామంటే ముఖ్యమంత్రి బ్రేక్ వేసినట్లు తెలిసింది. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనులు చేయవచ్చని, గత ప్రభుత్వం ఇచ్చిన పనులకు నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజాప్రతినిధులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
జేబులు ఖాళీ ఆయెనే..
Published Fri, Feb 20 2015 1:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement