కార్పొరేషన్.. గుబులు
కార్పొరేషన్.. గుబులు
Published Sun, Sep 25 2016 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
అధికార పార్టీని కుదిపేస్తున్న ఎన్నికలు
– గెలవలేకపోతే నాయకత్వ లోపమేనన్న ఇన్‌చార్జి మంత్రి
– పొదుపు రుణాలు మాఫీ చేయకపోతే కష్టమన్న కార్యకర్తలు
– పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను విస్మరించిన నేతలు
– హడావుడిగా విగ్రహం.. ఆ తర్వాత పక్కకు
– సమావేశంలో వార్డు నాయకుల హాజరు పలుచన
– మాట్లాడే అవకాశం దక్కక అసహనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కార్పొరేషన్ ఎన్నికల విషయంలో అధికార పార్టీ నేతలకు భయం పట్టుకుందా? నేరుగా ప్రజల ఓట్లతో గెలవలేమన్న సంకేతాలు ఉన్నాయా? అందుకనే దొడ్డిదారిన గెలవాలనే ఆలోచనకు బీజం పడిందా? ఒకవేళ కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే జిల్లాలోని మొత్తం నాయకత్వం వథా అంటూ స్వయంగా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందనే వాదనలకు బలం చేకూరుతోంది. పైగా కార్యకర్తలు కూడా ఆషామాషీగా ప్రచారం చేస్తే గెలవలేమనే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో నేతల ప్రసంగాలు, కార్యకర్తల మనోభావాలు ఇవే విషయాలను బయటపెట్టాయి. ఈ సమావేశానికి కర్నూలు నగరంలోని వార్డుల నుంచి కార్యకర్తల హాజరు శాతం మరీ పలుచగా ఉండటం అధికార పార్టీ నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక వార్డుల నుంచి ఎందుకు ఎక్కువగా కార్యకర్తలు హాజరుకాలేదని ఇన్‌చార్జి మంత్రితో పాటు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణా రెడ్డి ఆరా తీయడం గమనార్హం.
ఎన్‌టీఆర్‌ను మరిచిన నేతలు
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు మాజీ మంత్రులు ఏరాసు, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్‌ను విస్మరించడం కార్యకర్తలకు మింగుడుపడలేదు. సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని తెప్పించి మణిగాంధీ, ఏరాసుల ముందుంచారు. అయితే, విగ్రహం కాస్తా అడ్డుగా ఉందంటూ చివరకు పూర్తిగా అక్కడి నుంచి తీసి పక్కన పడేశారు. ఎన్‌టీఆర్‌కు అవమానం జరిగిందంటూ పలువురు కార్యకర్తలు వాపోయారు. పార్టీ స్థాపించిన ఎన్‌టీఆర్‌ను స్మరించుకునే తీరు ఇదేనా అనే చర్చ ఈ సందర్భంగా చోటు చేసుకుంది.
గెలుపు ఆషామాషీ కాదు..
అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదని స్వయంగా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలూ అభిప్రాయపడ్డారు. కొన్ని వార్డుల నుంచి కార్యకర్తల హాజరు మరీ పలుచగా ఉండటం నేతలను కలవరపాటుకు గురిచేసింది. వచ్చిన కొద్ది మందిని కూడా సమస్యలపై మాట్లాడిచేందుకు అంగీకరించకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది. పాతతరం నేతలు, కార్యకర్తలను విస్మరిస్తున్నారని.. కేవలం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆషామాషీగా ప్రచారం చేస్తే మనం గెలిచే అవకాశం లేదని.. కేవలం రోడ్లు వేస్తే ప్రజలు అభివద్ధి చేశారని నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలో ఉండే పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేయాలని కార్యకర్తలు కోరారు. లేనిపక్షంలో పొదుపు సంఘాల మహిళలు పార్టీకి ఓటేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తే అభివద్ధి ఆగిపోతుందని ప్రజలకు చెప్పండంటూ ఇన్‌చార్జి మంత్రి పిలుపునిచ్చారు. మొత్తం మీద కార్పొరేషన్ ఎన్నికల్లో తమ గెలుపు అంత సులువు కాదని ఈ సమావేశం సాక్షిగా అందరికీ తేటతెల్లమయ్యిందని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Advertisement