టార్గెట్ మేయర్!
శ్రీధర్‌పై టీడీపీ పెద్దల గుర్రు
అత్యవసర సమావేశంలో ‘క్లాస్’
కుర్చీ లాగేసేందుకు కుట్ర?
పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం
మేయర్ కోనేరు శ్రీధర్‌కు ఇంటా బయటా ముచ్చెమటలు పడుతున్నారుు. అసలే కార్పొరేషన్ ఉద్యోగులతో ఘర్షణకు దిగి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోరుున ఆయనపై తాజాగా సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు భారీగానే విమర్శలు గుప్పించినట్టు తెలిసింది. ఇటీవల ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి మేయర్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఏకపక్షం కుదరదని, ఏదైనా కలిసే నిర్ణయం తీసుకోవాలని పలువురు పార్టీ పెద్దలు ఆయనకు సూచించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మేయర్‌ని టార్గెట్ చేసి ఆయన కుర్చీకి ఎర్త్ పెట్టే కుట్ర నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ వ్యవహారాలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి. మేయర్ శ్రీధర్ అనుకూల, వ్యతిరేక వర్గాల కీచులాటల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని హైకమాండ్ గుర్తించింది. ఈ క్రమంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కార్యాలయంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నాగుల్‌మీరా, నగర కన్వీనర్ బుద్దా వెంకన్నలు మేయర్, డెప్యూటీ మేయర్‌లతో ఇటీవల అత్యవసర సమావేశం నిర్వహించారు. మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. కౌన్సిల్‌లో ప్రతిపక్ష సభ్యుల మాదిరిగా తమతో వ్యవహరిస్తున్నారని, ముఖ్యమైన విషయాలపై సమగ్రంగా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఒక కార్పొరేటర్ పేర్కొన్నట్లు తెలిసింది. 200 పైచిలుకు అంశాలతో అజెండా రూపొందించి రెండు రోజుల్లో హడావుడిగా కౌన్సిల్ సమావే శాలు ముగించాలనుకోవడం వల్లే అప్రదిష్టపాలవుతున్నామని మరో కార్పొరేటర్ గట్టిగానే నిలదీశారని సమాచారం. ‘అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. అధికారులతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నింటినీ వివాదాలుగా మార్చడం మంచిది కాదు. వీటిని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.’ అని పలువురు సభ్యులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరదు
‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇస్తే గ్రూపు రాజకీయాలతో కీచులాడుకోవడం మంచిది కాదు.’ అని ఎమ్మెల్యేలు మందలించినట్లు తెలుస్తోంది. దర్గా భూముల తీర్మానంలో మార్పు, ఇటీవల అధికారులతో వివాదాల విషయూల్లో మేయర్ తీరును ఒక ఎమ్మెల్యే తప్పుబట్టారని సమాచారం. కార్పొరేషన్ వ్యవహారాలకు సంబంధించి పార్టీలో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని గతంలో అనుకున్నప్పటికీ అలా ఎందుకు జరగడం లేదని పలువురు పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇకపై ఏక పక్షంగా వ్యవహరిద్దామనుకుంటే కుదరదని, ఇలా అయితే నిండా మునిగిపోతామని, సమష్టిగానే నిర్ణయూలు తీసుకుందామని ఓ ఎమ్మెల్యే చెప్పినట్టు పార్టీశ్రేణుల ద్వారా తెలిసింది.
మేయర్‌పై వ్యతిరేకత..
అనూహ్యంగా మేయర్ పదవి దక్కించుకున్న కోనేరు శ్రీధర్‌కు పార్టీలో వ్యతిరేకవర్గం గట్టిగానే ఉంది. నగరపాలక సంస్థ వ్యవహారాల్లో ఒక ఎమ్మెల్యే జోక్యాన్ని మేయర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టినట్టు సమాచారం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను అంతర్గత బదిలీలు చేయాలని ఇరవై రోజుల కిందట మునిసిపల్ కమిషనర్ హరికిరణ్ నిర్ణయించారు. అధికారులు ఫైల్ కూడా సిద్ధం చేశారు. బదిలీలకు సంబంధించి మేయర్ ఒక నివేదిక ఇవ్వగా, ఎమ్మెల్యే మరో జాబితా ఇచ్చినట్లు తెలిసింది. నగరపాలక సంస్థ వ్యవహారాలకు సంబంధించి మేయర్ సిఫారసులకే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కమిషనర్‌కు చెప్పారని, దీన్ని దృష్టిలో పెట్టుకున్న సదరు ఎమ్మెల్యే ఈ సమావేశంలో మేయర్‌ను టార్గెట్ చేశారని వినికిడి. కాగా, పలువురు కార్పొరేటర్లు తరచూ రహస్య సమావేశాలు నిర్వహించి మేయర్ వైఖరి, భవిష్యత్ వ్యూహాలపై వాడివేడిగా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలే భేటీ నిర్వహించడంతో తమ ఆక్రోశాన్ని మొత్తం వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.