స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్... ఇదో రాజకీయ ఎత్తుగడ. అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు రూపొందించిన ప్రతిపాదన. నియోజకవర్గ అభివృద్ధి నిధులైతే అందరు ఎమ్మెల్యేలకు అందివ్వాలని... పక్కన పెట్టి... ప్రత్యేక అభివృద్ధి పేరుతో స్వపక్షీయుల నిధుల దోపిడీకి పచ్చజెండా ఊపే యత్నం. సర్కారు నిధులతో జనానికి ఉపయోగం ఉన్నా... లేకున్నా... తమ్ముళ్ల జేబు నింపేందుకు నిర్మొహమాటంగా సాగుతున్న బహిరంగ దందా.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధులు తమ్ముళ్లకు ఉపాధి మార్గాలుగా మారుతున్నాయి. ఈ నిధులతో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపట్టాల్సి ఉన్నా... అధికార పార్టీ నేతలు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. టెండర్ల వరకు వెళ్లకుండా తమ అనుయాయులకు లబ్ధి చేకూరేలా బిట్లుగా విడగొట్టి నామినేషన్ పద్ధతిలోనే పనులు చేపడుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)వచ్చేవి. అందరికీ నిధులు ఇవ్వడం ఇష్టం లేని సీఎం చంద్రబాబునాయుడు సీడీపీకి మంగళం పాడేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఈ క్రమంలో గజపతినగరం, శృంగవరపుకోట, పార్వతీపురానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలకు చెరో రూ. 2కోట్లు చొప్పున సీఎం విడుదల చేశారు. పనుల ప్రతిపాదనలు దగ్గరి నుంచి అంచనాలు రూపొందించేవరకు ఆ ఎమ్మెల్యేల సూచనల మేరకే జరిగాయి. వారిచ్చిన జాబితాలకే అధికారులు పచ్చజెండా ఊపారు.
స్వప్రయోజనాలే లక్ష్యంగా... : నేతల ఆలోచన సరళి పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే లాభముంటుందనే దృష్టితో వ్యవహరిస్తున్నారు. లాభం లేనిదే ఏ పనుల్నీ చేపట్టకూడదని భావిస్తున్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల విషయంలోనూ అదే తీరు కనబరుస్తున్నారు. ఒక్క గజపతినగరం నియోజకవర్గ పరిధిలో టెండర్ల దశకు వెళ్లే పనులు కొంతమేరకు ప్రతిపాదించారు. శృంగవరపుకోట, పార్వతీపురం నియోజకవర్గ పనులు దాదాపు సీసీ రోడ్లు, డ్రైనేజీలకే పరిమితమయ్యాయి. పనుల విలువ సరాసరి రూ. 10లక్షలకు లోబడే ఉన్నాయి. నిబంధనల మేరకైతే రూ. 10లక్షలు పైబడితే టెండర్లు పిలవాలి. వాటి ద్వారా పారదర్శకత పెరుగుతుంది. రూ. 10లక్షల లోబడి పనులైతే నామినేటేడ్ పద్ధతిలో కట్టబెట్టొచ్చు. ఇప్పుడదే ఎక్కువగా జరిగింది. ఎమ్మెల్యేలు తమ అనుచరులకు లబ్ధి చేకూరేలా చిన్న చిన్న పనుల్ని ప్రతిపాదించారు. అంటే నామినేటేడ్ పద్దతిలో తెలుగు తమ్ముళ్లకు దాదాపు దక్కాయి.
సీసీ రోడ్లకే పెద్దపీట
గమ్మత్తేమిటోగానీ... ప్రతిపాదించిన పనుల్లో దాదాపు సీసీ రోడ్లే ఉన్నాయి. ఇటీవల ఉపాధి మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ. వందల కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు వేశారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, జెడ్పీ జనరల్ ఫండ్స్, మండల పరిషత్ జనరల్ ఫండ్స్ కింద మరికొన్ని రోడ్లు వేశారు. ఈ ఏడాది కూడా సీసీ రోడ్లు వేసుకోవడానికి ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద విడుదలైన నిధులను వేరే పనులకు వినియోగిస్తే బాగుండేది. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు లబ్ధి చేకూరేలా, టెండర్లు లేకుండా పనులు దక్కేలా చిన్నచిన్నవే ప్రతిపాదించారు. దీన్ని బట్టి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేక నిధులు తమ్ముళ్ల జేబుల్లోకి!!
Published Wed, May 18 2016 9:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement