క్షమించు రాబందూ... మన్నించండి గద్దల్లారా ... అక్రమార్కులు ఎక్కడ అవినీతి చేసినా గద్దల్లా తన్నుకుపోయారు... గద్దల్లా పొడుచుకుతిన్నారు ... రాబందుల్లా మెక్కేశారని ఏ పాపం ఎరుగని మీతో ఈ అవినీతి నేతలను సరిపోల్చుతున్నాం. పొట్ట నింపుకోడానికి చేస్తున్న మీ పనిని కూడా మేం తప్పుపడుతున్నాం. మీ ఆకలి తీరాక ఆ జోలికే పోరు...రేపటి కోసం సంపాదించుకోవాలనే ఆత్రమే మీకు ఉండదు. కానీ గతంలో దండిగా సంపాదించినా... ఇంకా...ఇంకా అంటూ జిల్లాలోని టీడీపీ నేతలు ఆత్యాశతో అభివృద్ధి పనుల పేరిట అక్రమాలకు పాల్ప డ్డారు. తినడంలో మీతో పోటీ పడుతున్నారు.
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి) : స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) పేరుతో జిల్లాకు మంజూరైన నిధులతో టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. రూ.229 కోట్ల నిధుల్లో రూ.111 కోట్ల మేరకు ఖర్చు చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేశారు. ఇంకో ఏడాది ఎన్నికలు రాకుండా ఉండి ఉంటే ఆ నిధులను కూడా గుటకాయ స్వాహా చేసేసేవారే. ఈ తంతును పసిగట్టిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘చెక్’ పెట్టడంతో కోట్ల రూపాయలకుపైగా నిధులు దుర్వినియోగం కాకుండా ఆగిపోయాయి. ఎక్కడ ఆ అవినీతి బయటపడుతుందోనని ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నార’ంటూ తెలుగు తమ్ముళ్లు కొంగొత్త గోల చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయన అనుచరులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్ద మొత్తాలను టెండర్లుగా పిలిస్తే పోటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో నామినేటెడ్ పద్ధతిలో పనులను దక్కించుకొని భారీగా నిధులు దోచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న పనులనే ముక్కలు ముక్కలుగా చేసి, విలువను తగ్గించి అప్పనంగా కట్టబెట్టేయడంతో పనులు చేయకుండానే నిధులు కొట్టేసే వ్యూహ రచన చేసి కొంతమేర సఫలీకృతులయ్యారు. ఇంతలో ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ దోపిడీకి బ్రేక్ పడింది. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన టీడీపీ నేతల పేరున కూడా నిధులు విడుదల చేశారు.
నిధులు మంజూరు చేయించుకోండి...నచ్చినంత దోచుకోండి అన్నట్టుగా ప్రజాధనాన్ని గంపగుత్తగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేశారు. ఇలా గత ఐదేళ్లలో తన పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 242.60 కోట్ల మేర కేటాయించారు. అంతటితో ఆగకుండా తమ ఎమ్మెల్యేలు సూచనల మేరకు పనులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇంకేముంది టీడీపీ నేతలు చెలరేగిపోయి నచ్చినట్టుగా పనుల ప్రతిపాదనలు తయారు చేయించి, వాటికి మంజూరు చేయించుకుని, నిధులు ఇష్టారీతిన వాడుకున్నారు. నిబంధనల మేరకైతే రూ.5 లక్షల విలువ దాటితే సంబంధిత పనులకు విధిగా టెండర్లు పిలవాలి. ఓపెన్ టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి కాంట్రాక్ట్ అప్పగించాలి. ఇలా చేస్తే అన్ని పార్టీలకు చెందిన వారు టెండర్లలో పోటీ పడతారని, ఏకపక్షంగా తమ వారికి పనులు దక్కవనే ఉద్దేశంతో వర్క్ విలువను రూ.5 లక్షలు దాటకుండా ఇంజినీరింగ్ అధికారుల ద్వారా డిజైన్ చేయించారు.
సంవత్సరాల వారీగా ఎస్‌డీఎఫ్ వినియోగ అధికారిక వివరాలివి (
సంవత్సరం |
మంజూరైననిధులు (కోట్లలో) |
పూర్తయిన పనులు | ఖర్చు చేసిననిధులు (కోట్లలో) |
2015–16 | 28.00 | 641 | 25.30 |
2016–17 | 43.29 | 729 | 27.93 |
2017–18 | 88.94 | 1594 | 46.16 |
2018–19 | 69.18 | 343 | 11.99 |
229.41 | 3307 | 111.38 |
వాస్తవానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువున్న పనులు అనేకం ఉన్నాయి. అయితే, వాటికి టెండరు పిలవాల్సి వస్తుందని ఒకే వర్క్‌ను ఆరేడు భాగాలు (ముక్కలు ముక్కలు)గా చేసి పనుల ప్రతిపదనలు తయారు చేయించి, వాటిని మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఎక్కడే వర్క్ జరిగిందో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఒకే వర్క్‌ను చూపించి రెండు మూడు బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక వర్క్‌ను తూర్పు నుంచి పడమరకు వైపునకు, అదే వర్క్‌ను పడమర వైపు నుంచి తూర్పునకు చూపించి రెండేసి బిల్లులు చేసుకున్నారన్న వాదనలున్నాయి. ఇలా పంచి పెట్టిన పనులను నామేకే వాస్తేగా చేసి, కొన్ని పనులకు పైపై మెరుగులు దిద్ది పెద్ద ఎత్తున నిధులు దోచేశారు.
ఎన్నికలకు ముందు హడావుడి
ఎన్నికల ముందు నాయకులకు తాయిలాలుగా మరింత ఎరవేసే యత్నం ఎమ్మెల్యేలు చేశారు. అంతకుముందు సంవత్సరాల్లో బేరం కుదరక ఆగిన పనులను, మరికొన్ని ఎన్నికలకు ముందు సీఎం చేత మంజూరు చేయించుకున్న పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు హడావుడి చేశారు. అయితే, ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో కొందరు సానుకూలంగా వ్యవహరించగా, మరికొందరు ఎన్నికలప్పుడు ఎందుకింత హడావుడి అని సహకరించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1935 పనులు ప్రారంభ దశలో ఉండగా, రూ.52.02 కోట్ల విలువైన పనులు ప్రారంభం కాకుండా ఉండిపోయాయి. ప్రారంభ దశలో ఉన్న పనులకు దాదాపు రూ.60 కోట్ల వరకు చెల్లింపులు జరిగిపోవడం గమనార్హం.
కొత్త ప్రభుత్వ ఆదేశాలతోవందల కోట్ల దోపిడీకి బ్రేక్
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఇంజినీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, టెండర్లు పిలవకుండా నామినేటేడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల పనులను ఏకపక్షంగా కట్టబెట్టి దోచిపెట్టారని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదిలోనే గుర్తించారు. అధికారుల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా చేసుకుని ఇంజినీరింగ్ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో 25 శాతంలోపు జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు చేయకుండా ఆపాలని, ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో ప్రారంభ దశలో ఉన్న 1935 పనులు దోపిడీకి గురికాకుండా ఆగాయి. అలాగే, ప్రారంభం కాని 1268 పనులకు సంబంధించిన రూ.52.02 కోట్ల నిధులు మంజూరు కాకుండా నిలిపివేశారు. ప్రభుత్వం అప్రమత్తం కాకపోయి ఉంటే సందట్లో సడేమియాలా వీటిని కూడా ఊదేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment