తమ్ముళ్లకు ‘ప్రత్యేక’ పందేరం
♦ రూ.5లక్షల చొప్పున నామినేషన్‌పై ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం
♦ పాత మున్సిపాలిటీలో ప్రతిపాదించకపోవడంపై ఓ నేత అభ్యంతరం
పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. అధికారులను ఏమార్చి.. నిబంధనల రూటుమార్చి దోచుకోండంటూ ‘ప్రత్యేక’నిధులను కేటాయిస్తోంది. ఇంకేముంది అధికారం అండతో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను ‘మీకింత మాకింత’ అంటూ అందినకాడికి దోచుకుతింటున్నారు.
కడప కార్పొరేషన్ : స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) నిధులు అధికార పార్టీ నాయకులకు వరంగా మారాయి. రూ.5లక్షల చొప్పున నామినేషన్‌పై పనులు తీసుకొని పంచుకుతినేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెలితే.. నగరపాలక సంస్థ అధికారులు 20 డివిజన్లలో 48 పనులకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నిధులను కేటాయిస్తుంది. కానీ గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనికి కొత్త భాష్యం నేర్పారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేతలకు ఎస్‌డీఎఫ్ నిధులను కేటాయించి, అధికార పార్టీ నేతలకు పందేరం నిర్వహించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత తెలుగు దేశం ప్రభుత్వంలో కూడా అదే అనవాయితీ కొనసాగుతోంది. ఎస్‌డీఎఫ్ నిధులను స్థానిక ఎమ్మెల్యేను కాదని అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడికి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లంతా ఆ నిధులను విని యోగించుకునేందుకు తహతహలాడుతున్నారు.
ప్రతిపాదనలు మళ్లీ తయారుచేయండి...
పాత మున్సిపాలిటీలో ఒక్క పనిని కూడా ప్రతిపాదించకపోవడంపై ఇటీవల పార్టీ మారిన నగరపాలక సంస్థలోని కీలక నేత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా మళ్లీ ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిసింది. అలాగే అధికారులు ఒకరికి కేటాయించిన పనులను పైరవీలతో మరొకరు ఎగరేసుకు పోతుండటంపై ఒకరదిద్దరు తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అలాగే ఈ పనులను ఏ శాఖ ద్వారా చేయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నగరపాలక సంస్థ ద్వారానే చేయిస్తే మాత్రం మిగతావారు కూడా అదే విధానంలో పనులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంతో నగరపాలక అధికారులు ఇరుకున పడుతున్నట్లు సమాచారం.
కేంద్రప్రభుత్వ నిధులతో జల్సా..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక ం నిధులను దారి మళ్లించి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) పేరిట పట్టణాల్లో ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరికి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలూ చెలరేగుతున్నాయి.
నిధుల పంపకం ఇలా...
44వ డివిజన్‌లోని సత్తార్ కాలనీలో డోర్ నంబర్ 46/87 నుంచి 106-1వరకూ సిమెంటు రోడ్డు, డ్రైనేజీ కాలువ నిర్మాణానికి రూ.10లక్షలు ప్రతిపాదించారు. ఈ పనిని ఆ డివిజన్ కార్పొరేటర్ భర్తకు కేటాయించినట్లు సమాచారం. అలాగే 45వ డివిజన్ బాలాజీనగర్ ఎస్సీకాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి రూ.4.97లక్షలు అంచనాలు రూపొందించి ఆ డివిజన్ కార్పొరేటర్ తనయునికి అప్పగించినట్లు తెలుస్తోంది. 37వ డివిజన్‌లో రూ.4.95లక్షలతో సిమెంటు రోడ్డు, రూ.4.90లక్షలతో సీసీడ్రైన్ నిర్మాణానికి అంచనాలు తయారుచేసి స్థానిక టీడీపీ కార్పొరేటర్‌కు అప్పగించినట్లు తెలిసింది. 41వ డివిజన్‌లో సీసీరోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను స్థానిక టీడీపీ నాయకుడికి అప్పగించారు. ఎస్‌డీఎఫ్ పనుల అంచనా విలువలన్నీ ఖచ్చితంగా రూ.5లక్షలుగానీ, లేకపోతే రూ.4.95లక్షలు, రూ.4.90లక్షలు ఇలా నాలుగైదు వేల తేడాతో అంచనాలు రూపొందించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్‌కు విన్నవించి.. అంచనాలు రూపొందించి..
ఈ మేరకు నగరంలో ఫలానా చోట సమస్యలున్నాయని కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చారు. పనుల వారీగా వాటికి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ కమిషనర్‌ను ఆదేశించారు. ఏ ప్రభుత్వ నిధులనైనా టెండర్ విధానంలో ఖర్చుచేస్తే సంబంధిత శాఖకు ఆదాయం కూడా సమకూరుతుంది. పనుల నాణ్యత కూడా బాగుంటుంది. అలా కాకుండా ఈ నిధులను నామినేషన్‌పై అప్పగించడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లే. ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నాయకులను ఆర్థికంగా బలోపేతం చే చేయడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.