ప్రత్యేక అభివృద్ధి నిధులేవీ? | Where is the special development funds | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అభివృద్ధి నిధులేవీ?

Published Mon, Jul 17 2017 2:48 AM | Last Updated on Mon, Aug 20 2018 7:17 PM

Where is the special development funds

- అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అయోమయం
రూ.2 కోట్ల స్పెషల్‌ ఫండ్‌ కోసం ఎదురు చూపులు
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు. నిధులు అందుతాయన్న ఆశాభావంతో ఎక్కడికక్కడ పనుల కోసం పచ్చ జెండా ఊపడం వీరికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఏసీడీఎఫ్‌ (అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి) ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీడీఎఫ్‌ కోసం ఏటా రూ.3 కోట్ల నిధులిస్తున్నారు. కాగా, నియో జకవర్గాల్లో మరిన్ని అభివృద్ధి పనుల కోస మంటూ గతేడాది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌)ని ప్రకటించారు. ఏసీడీఎఫ్‌తో సంబంధం లేకుండా ఏటా మరో రూ.2కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఈ నిధి అతీగతీ లేకపో వడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. రూ.4వేల కోట్ల ప్రత్యేక నిధి ముఖ్యమంత్రి ఆధీనంలో రూ.4వేల కోట్ల నిధులు ఉంటాయని గత ఏడాది ప్రకటించారు. గత వార్షిక బడ్జెట్‌లోనే ఈ మేరకు కేటాయింపులు కూడా జరిగాయి. నియోజకవర్గాల పరిస్థితి, అక్కడి సమస్యలు, తక్షణం దృష్టిసారించాల్సిన అంశాలు, శాశ్వత నిర్మాణాల కోసం వెచ్చించాల్సిన అవసరం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నేరుగా సీఎం నిధులు కేటాయించే వెసులుబాటును ఎస్‌డీఎఫ్‌ కల్పించింది. గత ఏడాది రెండు మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా ఎమ్మెల్యేలకు ఈ నిధులు అందాయి. వాటితో పనులు కూడా జరిగాయి. తొలి ఏడాది నిధులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి, రెండో ఏటా ఆశ పెట్టుకున్నారు. ఎలాగూ వచ్చే నిధులే కదా అన్న అతి విశ్వాసంతో కొందరు ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారికి పనులు చేసుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేవారు. వీరిలో కొందరు పనులు కూడా పూర్తి చేశారు. అయితే, ఎస్‌డీఎఫ్‌ కింద బడ్జెట్‌ అందక బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి.  
 
అభ్యంతరాలే అసలు సమస్య 
బడ్జెట్‌లో అనామతు పద్దుకింద ఏకంగా రూ.4వేల కోట్లు కేటాయించడం కుదరదని, కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సారి వార్షిక బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్‌ ఎత్తేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రాంభమైన ఏప్రిల్‌ నుంచి జూన్‌ నాటికి అంటే తొలి క్వార్టర్‌ వరకు రూ.36 కోట్లు వివిధ పథకాల్లో భాగంగా మంజూరు చేశారు. ఆయా ప్రభుత్వ పథకాల్లో ఈ నిధులను విలీనం చేసి పాత జిల్లాల వారీగానే నిధులు కేటాయించారని, ఇవికూడా పూర్తిస్థాయిలో అందలేదని తెలుస్తోంది. ఇక వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు నేరుగా రూ.2కోట్ల చొప్పున ఇవ్వడం కుదరకనే దానిని ఎత్తివేశారని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement