సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రత్యేక అభివృద్ధి పనులకు సర్కారు చెక్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరిట మంజూరైన పనులను నిలిపివేయాలని ప్రణాళిక విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమకున్న పరపతితో తమ సొంత నియోజకవర్గాలకు ఈ నిధులు మంజూరు చేయించుకున్నారు.
స్వయానా ముఖ్యమంత్రి సిఫారసుతో స్పెషల్ కోటాలో వీటిని తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తమ అనుచరులు, అనుయాయులు, పార్టీ కార్యకర్తలకు ఎర వేసేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ఈ నిధిని ప్రయోగించారు. ఎమ్మెల్యేలకు ఏటేటా కోటి రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)కి అదనంగా ఈ నిధులు విడుదలయ్యాయి. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో విడుదలైన ఎస్‌డీసీ నిధులపై పోస్ట్‌మార్టం ప్రారంభించింది. సొంత రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఈ పనుల గుర్తింపు.. నిధుల కేటాయింపు జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వీటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
గడిచిన మూడేళ్లలో ఎస్‌డీసీ కింద మంజూరైన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి..? ఇప్పటికీ ప్రారంభం కాని పనులెన్ని..? అనే వివరాలను ఆరా తీసింది. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్నవాటిని యథాతథంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు రూ.15 కోట్ల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గడిచిన మూడేళ్లలో జిల్లాకు రూ.31.32 కోట్లు స్పెషల్ కోటాలో విడుదలయ్యాయి. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 860 పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటివరకు సగానికి సగం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నామినేటేడ్ పద్ధతిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే వీటిని దక్కించుకోవటంతో పనుల పురోగతి పక్కదారి పట్టింది.
తమ పార్టీ అధికారంలో ఉండటంతో అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, అప్పటి ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి తమ నియోజకవర్గాలకు స్పెషల్ ఫండ్ మంజూరు చేయించుకునేందుకు పోటీ పడ్డారు. నామినేటేడ్ పద్ధతిపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పనులు పంచి పెట్టారు. పార్టీ శ్రేణులకు లాభసాటిగా ఉంటుందని లింక్ రోడ్లు, సిమెంటు రోడ్లు, కాంపౌండ్ వాల్‌లకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి పనులెలా ఉన్నా.. పార్టీ శ్రేణుల పంట పండింది. 2011-12లో జిల్లాకు ఎస్‌డీసీ కింద రూ.14.47 కోట్లు విడుదలయ్యాయి. మంథని, హుస్నాబాద్, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో 384 పనులకు వీటిని కేటాయించారు. వీటిలో 302 పనులు పూర్తయ్యాయి.
2012-13లో హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 214 పనుల పేరిట రూ.9.57 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో 109 పనులు పూర్తవగా.. మిగతా 105 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గత ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు మంథని, మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 262 పనులకు రూ.7.28 కోట్లు కేటాయించారు. అందులో కేవలం 20 పనులు పూర్తయ్యాయి. 242 పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇప్పుడీ నిధులు ఆపేయటంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిత్తరపోతున్నారు.
ప్రత్యేక నిధికి చెక్
Published Thu, Jul 10 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement