sdp
-
తెలంగాణలో ప్రగతి పరుగులు.. నీతి ఆయోగ్ ‘అర్థ్‌నీతి’ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ విశ్లేషించింది. జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రమని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు, దేశ ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ నీతి ఆయోగ్ ‘అర్థ్‌నీతి–వాల్యూమ్’ 7ను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. ‘జీఎస్డీపీ పరంగా తెలంగాణ ఏడో పెద్ద రాష్ట్రం. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది’ అని పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సగటున వార్షిక వృద్ధి 9 శాతం కంటే ఎక్కువగా ఉందని, ఇది రాష్ట్ర ఆవిర్భావం ముందు కంటే ఎక్కువ అని పేర్కొంది. (చదవండి: Desi Apple: డిమాండ్ ఎక్కువ.. ధర తక్కువ!) రాష్ట్ర దేశీయోత్పత్తి(ఎస్డీపీ)లో సేవా రంగం వాటా 60 శాతంగా ఉందని వివరించింది. అయితే ఉపాధి విషయంలో వ్యవసాయ రంగం గణనీయమైన వాటా కలిగి ఉందని, మొత్తం జనాభాలో 54 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారని వివరించింది. ఎస్‌డీపీలో వ్యవసాయ రంగ వాటా 16 శాతమని, 86 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులేనంది. రాష్ట్ర దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 17 శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ తదితర హైటెక్ రంగాలు, టెక్స్టైల్స్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్ వంటి సంప్రదాయ రంగాల మిశ్రమంగా ఉందని విశ్లేషించింది. 2020, అక్టోబర్ నాటికి రాష్ట్రంలో 153 ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్) ఉండగా, వీటిలో 34 కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, 56 నోటిఫై అయ్యాయని, 63 అనుమతులు పొంది ఉన్నాయని వివరించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 2020లో ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీని ఆవిష్కరించిందని, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఫార్మా రంగంలో నేషనల్ లీడర్... ఫార్మాస్యూటికల్స్ రంగంలో తెలంగాణను నేషనల్ లీడర్‌గా నీతిఆయోగ్ అభివర్ణించింది. 2019–20లో 4.63 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసిందని పేర్కొంది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉందని చెప్పింది. హైదరాబాద్‌ను ఫార్మా సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఈ ఫార్మాసిటీని సుస్థిర పారిశ్రామిక నగరానికి అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌గా ఏర్పాటు చేయనుందని వివరించింది. ఐటీలో స్థిరమైన వృద్ధి... తెలంగాణలో ఐటీ రంగం స్థిరమైన వృద్ధి రేటు కనబరుస్తోందని అర్థ్‌నీతి విశ్లేషించింది. ఐటీ రంగంలోనూ తెలంగాణ అగ్రశ్రేణిలో నిలిచిన రాష్ట్రమని, గడిచిన కొన్నేళ్లలో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్(ఐటీఈఎస్) ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి రేటు కనబరిచిందని తెలిపింది. ఇటీవలే ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) రానున్న ఐదేళ్లలో ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 53 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటు కానుందని వివరించింది. కేంద్ర పన్నుల వాటాలో 6% తగ్గుదల 2019–20 ఆర్థిక సంవత్సర వాస్తవిక వ్యయంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13% అధికంగా రాష్ట్రం వ్యయం చేయనుందని, ఇదే కాలంలో రాష్ట్ర రెవెన్యూలో 31% వార్షిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. అయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,990 కోట్లుగా ఉంటుందని, ఇది 2019–20తో పోల్చితే 6 శాతం తగ్గుదలను సూచిస్తోందని తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ద్రవ్య లోటు లక్ష్యాలను అమలు చేయడం ద్వారా ప్రస్తుతం జీఎస్డీపీలో 29.5 శాతంగా ఉన్న అప్పులు.. 2025–26 నాటికి 29 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2021–26 మధ్య కాలంలో రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు 0.86% వాటా ఉందని, అంటే ప్రతి వంద రూపాయల్లో 86 పైసలు తెలంగాణకు వస్తాయని విశ్లేషించింది. (చదవండి: కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష! ) విస్తృతంగా మౌలిక వసతులు తెలంగాణలో అద్భుత రహదారులు, రైల్వే సౌకర్యం ఉందని, రాష్ట్రం గుండా 2,592 కి.మీ. పొడవైన 16 జాతీయ రహదారులు వెళ్తున్నాయని విశ్లేషించింది. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో ఇది 10% అని తెలిపింది. 200లకుపైగా రైల్వేస్టేషన్లు దేశంలోని ఇతర నగరాలతో అనుసంధానమై ఉన్నాయని వివరించింది. 2021, ఫిబ్రవరి నాటికి 16,931 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిఉందని విశ్లేషించింది. మైస్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) టూరిజానికి హైదరాబాద్ ప్రముఖ ప్రాంతమని, గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ సహా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిందని వివరించింది. అలాగే మెడికల్ టూరిజంలో హైదరాబాద్ మేజర్ సిటీగా అభివృద్ధి చెందిందని, తెలంగాణలోని పలు ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొంది. 2018లో 9.28 మంది దేశీయ పర్యాటకులు, 3.2 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని తెలిపింది. -
మోహనా.. తగునా!
► పాత కలెక్టర్ అనాలోచిత నిర్ణయం ► ప్రత్యేక నిధుల విషయంలో చిత్రాలు ► వచ్చే రెండేళ్ల కాలానికీ కేటాయింపులు ► ముందస్తు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ► కేంద్ర నిధులతో ఇష్టారాజ్యం ► వెనుకబడిన ప్రాంతాలకు చేకూరని ప్రయోజనం ► కొత్త కలెక్టర్ నిర్ణయంపై చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఏటా కేటాయిస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీపీ) వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి విమర్శల పాలవుతోంది. ఏటా వచ్చే నిధులను ఆ ఏడాది అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సి ఉంది. అయితే, రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఇప్పడే పేర్కొని వాటికి కూడా నిధులు విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా పోతూపోతూ పాత కలెక్టర్ వచ్చే రెండేళ్ల కాలానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఓకే చెప్పేసి నిధుల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం ఆసక్తి రేపుతోంది. కేంద్రం నుంచి ఇంకా నిధులు రాకముందే ఈ విధంగా ప్రతిపాదనలకు ఓకే చెప్పేయడం విమర్శల పాలవుతోంది. ఎక్కడ అవసరమో అక్కడ నిధుల విడుదలకు అంగీకారం ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ నేతలు చెప్పిన ప్రతిపాదనలకు అంగీకరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కొత్త కలెక్టర్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది ఆసక్తి రేపుతున్న అంశం. అధికార పార్టీ నేతలకే... వాస్తవానికి కేంద్రం మంజూరు చేసే ఈ నిధులను పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో దీర్ఘకాలం ఉపయోగపడే పనులకు వెచ్చించి వాటి ఫలితాల ద్వారా జిల్లా అభివృద్ధికి తోడ్పడాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా అధికార పార్టీ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా అధికారులు అంగీకరించి పనులకు నిధులు విడుదల చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా నిజంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రక్రియ దోహదం చేయదని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంలో ఉపయోగపడే పనులకు మాత్రమే నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా తాత్కాలిక అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తున్నారు. పంటలను కాపాడేందుకు ఉద్దేశించిన రెయిన్గన్లకే కోట్లాది రూపాయలను వెచ్చించడం విమర్శల పాలవుతోంది. వాస్తవానికి రెయిన్గన్లు ఉపయోగించి పంటలను కాపాడటమనేది రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ఫలితాల మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పనులకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులను వెచ్చించడంపై బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. ముందుగానే మంజూరు...!.. వాస్తవానికి ఏ పనికైనా మన వద్ద ఉన్న బడ్జెట్‌కు అనుగుణంగా ప్రణాళిక వేసుకుంటాం. వచ్చే ఏడాది వచ్చే జీతం డబ్బులను కూడా ఇప్పుడే ఖర్చు చేసేయడం మంచి ఆర్థిక పరిణామం కాదు. అయితే, ప్రస్తుతం ఎస్డీపీ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అచ్చు ఇలాగే ఉంది. రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ముందుగానే అధికారులు చేశారు. అది కూడా బదిలీపై వెళుతూ వెళుతూ పాత కలెక్టర్ అనుమతులు ఇచ్చేయడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఈ ప్రతిపాదనలను మరోసారి ప్రస్తుత కలెక్టర్ పరిశీలించి.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మారుస్తారా? పాత వాటినే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. -
బ్లడ్‌బ్యాంక్‌లో ఎస్డీపీ ప్రారంభం
నెల్లూరు(అర్బన్): నెల్లూరు బ్లడ్‌బ్యాంక్‌లో శనివారం అత్యంత ఆధునికమైన సింగిల్ డోనార్ ప్లేట్ మిషన్‌ను(ఎస్డీపీ) ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బ్లడ్‌బ్యాంక్ చైర్మన్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తాము బేథస్థా హోమ్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు. ఇది ప్రైవేటు బ్లడ్ బ్యాంకు కాదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు, ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరల్లోనే రోగులకు రక్తం అందిస్తున్నామన్నారు. సాధారణంగా రోగులకు ప్లేట్లెట్స్ ఎక్కిస్తే 2వేల నుంచి 4వేల వరకు రక్తకణాలు పెరుగుతాయని తెలిపారు. తాము ప్రవేశ పెట్టిన ఎస్డీపీ యంత్రంతో ఒకే సారి 50వేలకు పైగా రోగికి రక్తకణాలు పెరుగుతాయన్నారు. రోగికి శ్రమ, ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. పేదలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా తక్కువకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రక్తం కొరత తీర్చేందుకు మాత్రమే బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. బ్లడ్ బ్యాంక్ జిల్లా కో–ఆర్డినేటర్ మోపూరు భాస్కర్‌నాయుడు, డాక్టర్లు పెంచలప్రసాద్, సాయినాథ్, భార్గవహెల్త్ ప్లస్ సీఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, స్వచ్ఛందసంస్థల అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు, మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ జలదంకి సుధాకర్ పాల్గొన్నారు. -
ప్రత్యేక నిధికి చెక్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రత్యేక అభివృద్ధి పనులకు సర్కారు చెక్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట మంజూరైన పనులను నిలిపివేయాలని ప్రణాళిక విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమకున్న పరపతితో తమ సొంత నియోజకవర్గాలకు ఈ నిధులు మంజూరు చేయించుకున్నారు. స్వయానా ముఖ్యమంత్రి సిఫారసుతో స్పెషల్ కోటాలో వీటిని తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తమ అనుచరులు, అనుయాయులు, పార్టీ కార్యకర్తలకు ఎర వేసేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ఈ నిధిని ప్రయోగించారు. ఎమ్మెల్యేలకు ఏటేటా కోటి రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)కి అదనంగా ఈ నిధులు విడుదలయ్యాయి. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో విడుదలైన ఎస్డీసీ నిధులపై పోస్ట్‌మార్టం ప్రారంభించింది. సొంత రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఈ పనుల గుర్తింపు.. నిధుల కేటాయింపు జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో వీటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. గడిచిన మూడేళ్లలో ఎస్డీసీ కింద మంజూరైన పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి..? ఇప్పటికీ ప్రారంభం కాని పనులెన్ని..? అనే వివరాలను ఆరా తీసింది. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్నవాటిని యథాతథంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు రూ.15 కోట్ల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గడిచిన మూడేళ్లలో జిల్లాకు రూ.31.32 కోట్లు స్పెషల్ కోటాలో విడుదలయ్యాయి. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 860 పనులు చేపట్టారు. వీటిలో ఇప్పటివరకు సగానికి సగం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నామినేటేడ్ పద్ధతిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే వీటిని దక్కించుకోవటంతో పనుల పురోగతి పక్కదారి పట్టింది. తమ పార్టీ అధికారంలో ఉండటంతో అప్పటి మంత్రి శ్రీధర్‌బాబు, అప్పటి ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి తమ నియోజకవర్గాలకు స్పెషల్ ఫండ్ మంజూరు చేయించుకునేందుకు పోటీ పడ్డారు. నామినేటేడ్ పద్ధతిపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పనులు పంచి పెట్టారు. పార్టీ శ్రేణులకు లాభసాటిగా ఉంటుందని లింక్ రోడ్లు, సిమెంటు రోడ్లు, కాంపౌండ్ వాల్లకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి పనులెలా ఉన్నా.. పార్టీ శ్రేణుల పంట పండింది. 2011-12లో జిల్లాకు ఎస్డీసీ కింద రూ.14.47 కోట్లు విడుదలయ్యాయి. మంథని, హుస్నాబాద్, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో 384 పనులకు వీటిని కేటాయించారు. వీటిలో 302 పనులు పూర్తయ్యాయి. 2012-13లో హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో 214 పనుల పేరిట రూ.9.57 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో 109 పనులు పూర్తవగా.. మిగతా 105 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గత ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు మంథని, మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 262 పనులకు రూ.7.28 కోట్లు కేటాయించారు. అందులో కేవలం 20 పనులు పూర్తయ్యాయి. 242 పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇప్పుడీ నిధులు ఆపేయటంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిత్తరపోతున్నారు.