మోహనా.. తగునా!
► పాత కలెక్టర్ అనాలోచిత నిర్ణయం
► ప్రత్యేక నిధుల విషయంలో చిత్రాలు
► వచ్చే రెండేళ్ల కాలానికీ కేటాయింపులు
► ముందస్తు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
► కేంద్ర నిధులతో ఇష్టారాజ్యం
► వెనుకబడిన ప్రాంతాలకు చేకూరని ప్రయోజనం
► కొత్త కలెక్టర్ నిర్ణయంపై చర్చ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఏటా కేటాయిస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్‌డీపీ) వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి విమర్శల పాలవుతోంది. ఏటా వచ్చే నిధులను ఆ ఏడాది అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సి ఉంది. అయితే, రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఇప్పడే పేర్కొని వాటికి కూడా నిధులు విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా పోతూపోతూ పాత కలెక్టర్ వచ్చే రెండేళ్ల కాలానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఓకే చెప్పేసి నిధుల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం ఆసక్తి రేపుతోంది.
కేంద్రం నుంచి ఇంకా నిధులు రాకముందే ఈ విధంగా ప్రతిపాదనలకు ఓకే చెప్పేయడం విమర్శల పాలవుతోంది. ఎక్కడ అవసరమో అక్కడ నిధుల విడుదలకు అంగీకారం ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ నేతలు చెప్పిన ప్రతిపాదనలకు అంగీకరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కొత్త కలెక్టర్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది ఆసక్తి రేపుతున్న అంశం.
అధికార పార్టీ నేతలకే...
వాస్తవానికి కేంద్రం మంజూరు చేసే ఈ నిధులను పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల్లో దీర్ఘకాలం ఉపయోగపడే పనులకు వెచ్చించి వాటి ఫలితాల ద్వారా జిల్లా అభివృద్ధికి తోడ్పడాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా అధికార పార్టీ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా అధికారులు అంగీకరించి పనులకు నిధులు విడుదల చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా నిజంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రక్రియ దోహదం చేయదని నిపుణులు అంటున్నారు.
దీర్ఘకాలంలో ఉపయోగపడే పనులకు మాత్రమే నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా తాత్కాలిక అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తున్నారు. పంటలను కాపాడేందుకు ఉద్దేశించిన రెయిన్‌గన్లకే కోట్లాది రూపాయలను వెచ్చించడం విమర్శల పాలవుతోంది. వాస్తవానికి రెయిన్‌గన్లు ఉపయోగించి పంటలను కాపాడటమనేది రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ఫలితాల మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పనులకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులను వెచ్చించడంపై బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి.
ముందుగానే మంజూరు...!.. వాస్తవానికి ఏ పనికైనా మన వద్ద ఉన్న బడ్జెట్‌కు అనుగుణంగా ప్రణాళిక వేసుకుంటాం. వచ్చే ఏడాది వచ్చే జీతం డబ్బులను కూడా ఇప్పుడే ఖర్చు చేసేయడం మంచి ఆర్థిక పరిణామం కాదు. అయితే, ప్రస్తుతం ఎస్‌డీపీ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అచ్చు ఇలాగే ఉంది. రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ముందుగానే అధికారులు చేశారు. అది కూడా బదిలీపై వెళుతూ వెళుతూ పాత కలెక్టర్ అనుమతులు ఇచ్చేయడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ఈ ప్రతిపాదనలను మరోసారి ప్రస్తుత కలెక్టర్ పరిశీలించి.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మారుస్తారా? పాత వాటినే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.