గతం గతః | Congress Government Special Development Fund 44 crore in district | Sakshi
Sakshi News home page

గతం గతః

Published Mon, Jul 7 2014 1:42 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

గతం గతః - Sakshi

గతం గతః

 ఎద్దు పుండు..కాకికి ఏం నొప్పి..అన్నట్లు కనిపిస్తోంది సర్కారు పరిస్థితి. ప్రజలు ఇబ్బందులు పడితే మనకేంటి? మనవాళ్లు అభివృద్ధి చెందితే చాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  గత ప్రభుత్వం హయాంలో నియమించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించేసే  తరహాలోనే గతంలో మంజూరైన అభివృద్ధి పనులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఆ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలెట్టేసింది. అదే క్రమంలో గతంలో మంజూరైన అభివృద్ధి పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశిస్తోంది. కొన్నింటికి నేరుగా ఉత్తర్వులివ్వగా, మరికొన్నింటికి మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో పనులు సాధించుకున్న వారు మింగలేక కక్కలేక ఉంటే.. ఇప్పుడు పనులు సాధించుకోబోతున్న వారు చంకలు గుద్దుకుంటూ..భుజాలెగరేస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలకని కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డీఎఫ్) కేటాయించి సుమారు రూ.44 కోట్లు జిల్లాకు విడుదల చేసింది.  ఆమేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రతిపాదించడమే కాకుండా వాటిని మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ కూడా జిల్లా అధికారులిచ్చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేస్తే ఇబ్బందులొస్తాయని పనులను కూడా వెంటనే ప్రారంభించేశారు. కాకపోతే, పనులప్రగతి అదే వేగంలో ముందుకెళ్లలేదు. ఇంతలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కన్ను ఆ పనులపై పడింది. వాటిని యుద్ధ ప్రాతిపదికన నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అవే పనులను తమ పార్టీ నేతలకు కట్టబెట్టొచ్చన్న యోచనకు వచ్చింది. నిర్ణయం తీసుకోవడమే తరువాయి తక్షణమే ఎస్‌డీఎఫ్ పనులను నిలిపేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.44కోట్ల పనులు ఎక్కడివి అక్కడ ఆపేశారు. ఆ పనులు మళ్లీ ప్రారంభమవుతాయా? లేదంటే రద్దవుతాయా?  అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆప్పట్లో పనులు దక్కించుకున్న వారంతా సందిగ్ధంలో పడ్డారు.
 
 ముందుకెళ్లొద్దు
 తాజాగా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖపై కూడా సర్కార్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ హయాంలో మంజూరై, వాటిలో ప్రారంభం కాని మంచినీటి పథకాల విషయంలో ముందు కెళ్లొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. టెండర్లు పిలవొద్దని, తదుపరి నిర్ణయం తీసుకునే వరకు వాటి  ఊసుపట్టొద్దంటూ స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెనక్కి తగ్గారు. ఈ విధంగా జిల్లాలో  సుమారు రూ.4కోట్ల విలువైన 39 మంచినీటి పథకాలకు బ్రేక్ పడింది. వాటిని తమకు అనుకూలంగా కేటాయింపులు చేసుకుని, పనులు దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇదే తరహాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనుల్ని కూడా నిలిపేయాలని పరోక్షంగా సంకేతాలిచ్చింది. దీంతో అధికారులు ముందుకెళ్లలేక పోతున్నారు.  
 
 ఆర్థికాభివృద్ధి పథకాలదీ అదే పరిస్థితి
 ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థికాభివృద్ధి పథకాల(రుణ యూనిట్లు) పైనా టీడీపీ నేతల దృష్టి పడింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోయినా స్థానిక నాయకులు మాత్రం వాటి విషయంలో ముందడుగు వేయొద్దంటూ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1695 మందికి 1210 యూనిట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా మార్జిన్ మనీస్కీమ్ కింద 3532మందికి, రాజీవ్ అభ్యుదయ యోజన కింద 540మందికి, ఐటీడీఎ ద్వారా 2838మందికి, వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా మండలానికొకరికి, మున్సిపాల్టీల్లో ముగ్గురేసి చొప్పున యూనిట్లు మంజూ రు చేశారు. బ్యాంకుల ఆమోదంతో ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చేశారు. 101 నంబర్ జీవో ముసుగులో కాంగ్రెస్ నేతలే ఇందులో కీలక పాత్ర పోషించా రు. ఇంతలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో మంజూరు చేసిన వాటిైపై ముందుకెళ్లొద్దన్న ప్రభుత్వ సంకేతాల మేరకు అధికారులు చొరవ తీసుకోలేదు.
 
 దీంతో లబ్ధిదారులకు రుణ యూనిట్లు అందలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని గతంలో మంజూరైన వాటిని ఆపేయాలని, తాము చెప్పినట్లు మళ్లీ లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రుణ యూనిట్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. టీడీపీ శ్రేణులకు లబ్ధి చేకూర్చే దృష్టితో  అప్పట్లో చేసిన మంజూరు ప్రక్రియను పూర్తిగా రద్దు చేసే అవకాశం కన్పిస్తోంది. ఇవన్నీ చూస్తుం టే టీడీపీ నేతల పంట పండించేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడగా స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement