రాజధానికి అనువండీ మా రాజమండ్రి
సాక్షి, రాజమండ్రి :కొత్త ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలూ రాజమండ్రి నగరానికి ఉన్నాయని పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, మేధావులు నిపుణుల కమిటీకి సూచించారు. కొత్త రాజధాని ఏర్పాటుకు సూచనలు చేసేందుకు, కేంద్ర హోం శాఖ రిటైర్డు ఐఏఎస్ అధికారి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి కె.శివరామకృష్ణన్ చైర్మన్‌గా నియమించిన కమిటీ ఆదివారం రాజమండ్రిలో పర్యటించింది. అనారోగ్య కారణాలతో చైర్మన్ హాజరు కాకపోవడంతో కమిటీ సభ్యులు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ విభాగం డెరైక్టర్ రతన్‌రాయ్ ఆధ్వర్యంలో కమిటీ అధికారులతో సమీక్షించింది.
ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులు, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్, బార్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు, పలువురు మేధావులు రాజమండ్రి ప్రాంత ప్రాధాన్యం, అనుకూలతలపై కమిటీకి నివేదికలు అందచేశారు. రాజధాని నిర్మాణానికి ప్రధానంగా అవసరమైన భూమి, భావి అవసరాలకు తగ్గట్టుగా జన వనరులు, అందుబాటులో ఉన్న రోడ్డు, రైలు, జల, రవాణా సదుపాయాలను ఆ నివేదికల్లో వివరించారు. అందుబాటులో ఉంటే అటవీ భూమినైనా డీ నోటిఫై చేసి రాజధాని నిర్మించేందుకు కేంద్రం కూడా అంగీకరిస్తుంది కనుక రాజానగరం శివారులో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అనువైన ప్రాంతంగా స్థానిక మేధావులు కమిటీకి సూచించారు.
ఇదే అనువైన ప్రాంతం
నగరానికి చేరువలో ఉన్న మధురపూడి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయగల వనరులు ఉన్నాయని, జాతీయ రహదారి, ప్రధాన రైలుమార్గం, వాణిజ్య కేంద్రం, గోదావరి తీరం.. చారిత్రక నగరంగా రాజమండ్రికి ఉన్న ప్రాధాన్యం కమిటీకి నివేదికల రూపంలో స్థానికులు వివరించారు. పారిశ్రామికంగా అభివృద్ధికి అనువైన ప్రాంతమే గాక, ఎగుమతి దిగుమతులకు వీలుగా ఉన్న కాకినాడ పోర్టు గురించి పలు సంఘాలు కమిటీ సభ్యులను కలిసి వివరించాయి. వివిధ రాజకీయ పక్షాల నేతలు కూడా కమిటీని కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించారు.
గంటపాటు సమీక్ష
ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నం నుంచి రాజమండ్రి చేరుకున్న కమిటీ హోటల్ రివర్‌బేలో ముందుగా జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో చర్చించింది. నగర పరిసరాల మ్యాప్‌లను అధికారులు కమిటీ సభ్యులకు చూపించారు. వనరులపై విశ్లేషించారు. రవాణా, కమ్యూనికేషన్ సదుపాయాలతో పాటు భౌగోళిక అంశాలపై కూడా కమిటీ అధికారుల నుంచి వివరాలు సేకరించింది. అనంతరం జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, స్వచ్ఛంద సేవాసంఘాల ప్రతినిధులను కూడా కమిటీ కలుసుకుని వారి అభిప్రాయాలు సేకరించింది.
ఆగస్టు 31లోగా తమ కమిటీ కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పిస్తుందని ఈ ప్రాంతవాసులు వివరించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ సభ్యులు చెప్పారు. కాగా కమిటీ సభ్యులు గోదావరి నది అందాలను చూసి పరవశించి పోయారు. పలువురు రాజమండ్రిని రాజధానిగా ఎందుకు చేయాలో వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. న్యూఢి ల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పూర్వపు డీన్ కె.టి.రవీంద్రన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్‌కు చెందిన అరోమర్ రవి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అర్బన్ ఎఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి కమిటీలో ఉన్నారు. విశాఖ నుంచి రాజమండ్రి వస్తుండగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అటవీ భూములను కమిటీకి కలెక్టర్ నీతూప్రసాద్ చూపించారు.