రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం | Katti Padmarao Writes on Tsunduru Massacre, Dalit Movement in Telugu States | Sakshi
Sakshi News home page

రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం

Published Sat, Aug 6 2022 12:48 PM | Last Updated on Sat, Aug 6 2022 12:51 PM

Katti Padmarao Writes on Tsunduru Massacre, Dalit Movement in Telugu States - Sakshi

కారంచేడు తర్వాత దక్షిణ భారతంలోనే పేర్కొనదగిన ఉద్యమం చుండూరు దళిత ఉద్యమం. గుంటూరు జిల్లాలో విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న ఊరు చుండూరు. 1991 ఆగస్ట్‌ 6న దళితులను ఆధిపత్య కులాల వారు ఊచకోత కోసిన అమానవీయ ఘటన జరిగింది. అదే చుండూరు ఘటనగా ప్రసిద్ధి చెందింది. తెనాలి ప్రాంతంలో హరిత విప్లవం ద్వారా భూములు సస్యశ్యామలం అయినాయి. దళిత వాడ కూడా బలంగా ఉంది. మాలలు, మాదిగలు కలిసి సుమారు 500 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వీరిలో కారంచేడు ఉద్యమం తర్వాత సామాజిక చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లాడో, పిల్లో ఉన్నారు. కొందరు ఉద్యోగులూ ఉన్నారు. ఈ చైతన్యానికి ఆధిపత్య కులాలవారు తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా హైస్కూళ్ళలో ఎస్సీ విద్యార్థులు పక్కపక్క బెంచీల్లో కూర్చోవడం, విద్యా సహకారాన్ని పొందడం... ఇవన్నీ అగ్రకుల గ్రామాల్లో చర్చనీయ అంశాలయ్యాయి. కొన్ని చోట్ల ప్రేమ ఘట్టాలు జరగటం కూడా విద్వేషం రావడానికి మూల కారణం అయ్యింది. ఫలితంగా 8 మంది దళితులు ఆధిపత్య కులాల వారి దాడిలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో మరో ఇద్దరు దళితులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఊరు నడి బొడ్డున ‘రక్త క్షేత్రం’లో పాతి పెట్టాం.

చుండూరు బాధితుల పక్షాన జరిగిన ఉద్యమానికి నేను నాయకత్వం వహించడం వలన అంబేడ్కర్‌ ఆలోచనల్ని జాతీయస్థాయి పోరాటంలో మమేకం చేసే అవకాశం కలిగింది. ఉద్యమం ముఖ్యంగా ఢిల్లీ అంబేడ్కర్‌ భవన్‌లో కొన్నివందల మంది ఆశ్రయం తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరి బోట్‌ క్లబ్‌ వరకు 13 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించాం. 1991 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాడు ఢిల్లీ కోటను ముట్టడించాం. ఢిల్లీలోని 120 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం బలపరచడంతో ఈ ఉద్యమానికి బలం చేకూరింది. మాజీ హోం మినిస్టర్‌ బూటా సింగ్, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్లమెంట్‌ సభ్యులు రామ్‌ విలాస్‌ పాశ్వాన్, ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు సమస్య పట్ల అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర వహించారు.

అక్టోబర్‌ నాలుగవ తేదీ ప్రధానమంత్రి – ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. బాధిత కుటుంబాలతో పాటు నేనూ చర్చలకు హాజరయ్యాను. చర్చలు చుండూరు కేసు విచారణకు, దాడి జరిగిన చుండూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్‌. 440 బాధిత కుటుంబాలకూ ఇళ్ళ స్థలంతో సహా ఒక ఇల్లు నిర్మించడం, ప్రతి కుటుంబానికీ ఒక ఎకరం పొలం ఇవ్వడం, బాధిత కుటుంబాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలలో 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, చుండూరులో ఒక రెసిడెన్షియల్‌ హైస్కూల్‌ ఏర్పాటు, 150 మంది ముద్దాయిలందరనీ అరెస్ట్‌ చేయడం వంటివి బాధితులు ప్రధానమంత్రిని చేసిన మరికొన్ని డిమాండ్లు. (క్లిక్‌: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి)

చుండూరు ఉద్యమం భారతదేశ దళిత ఉద్యమానికి చుక్కాని. 111 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలని ఏకం చేసి రాష్ట్రపతి భవన్‌కు దళిత ఉద్యమం ర్యాలీ చేయించిన మహోన్నత చారిత్రక ఘటన. అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ ప్రత్యేక కోర్టు నివేదనను తిరస్కరించడంతో... రాష్ట్రపతి దళితుడు కావాలి అనే నినాదం చేయడం ద్వారా ఇప్పుడు ఒక నారాయణన్, ఒక గోవింద్, ఒక ద్రౌపదీ ముర్మూలు ఆ పీఠాన్ని అధిష్టించడానికి అవకాశం కల్పించిన ఉద్యమం. ‘ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎట్రాసిటీ యాక్ట్‌–1989’ ననుసరించి చుండూరులోనే ప్రత్యేక కోర్టును సాధించిన ఉద్యమం. కమ్యూనిస్టులూ కుల సమస్య గురించి చర్చించేలా చేసిన ఉద్యమం. 

మూడు దశాబ్దాల తర్వాత ‘రక్త క్షేత్రం’ ఆగస్ట్‌ 6ను దళిత బహుజన మైనారిటీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడే బాధ్యతను మనకు అప్పజెబుతున్న రోజుగా భావిద్దాం. అంబేడ్కర్‌ మార్గంలో విజయ సోపానాన్ని అధిరోహించేద్దాం. (క్లిక్‌: ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?)


- డాక్టర్‌ కత్తి పద్మారావు 
 సామాజిక ఉద్యమకారుడు
(చుండూరు ఘటనకు మూడు దశాబ్దాలు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement