Dalit movement
-
రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం
కారంచేడు తర్వాత దక్షిణ భారతంలోనే పేర్కొనదగిన ఉద్యమం చుండూరు దళిత ఉద్యమం. గుంటూరు జిల్లాలో విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న ఊరు చుండూరు. 1991 ఆగస్ట్ 6న దళితులను ఆధిపత్య కులాల వారు ఊచకోత కోసిన అమానవీయ ఘటన జరిగింది. అదే చుండూరు ఘటనగా ప్రసిద్ధి చెందింది. తెనాలి ప్రాంతంలో హరిత విప్లవం ద్వారా భూములు సస్యశ్యామలం అయినాయి. దళిత వాడ కూడా బలంగా ఉంది. మాలలు, మాదిగలు కలిసి సుమారు 500 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వీరిలో కారంచేడు ఉద్యమం తర్వాత సామాజిక చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లాడో, పిల్లో ఉన్నారు. కొందరు ఉద్యోగులూ ఉన్నారు. ఈ చైతన్యానికి ఆధిపత్య కులాలవారు తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా హైస్కూళ్ళలో ఎస్సీ విద్యార్థులు పక్కపక్క బెంచీల్లో కూర్చోవడం, విద్యా సహకారాన్ని పొందడం... ఇవన్నీ అగ్రకుల గ్రామాల్లో చర్చనీయ అంశాలయ్యాయి. కొన్ని చోట్ల ప్రేమ ఘట్టాలు జరగటం కూడా విద్వేషం రావడానికి మూల కారణం అయ్యింది. ఫలితంగా 8 మంది దళితులు ఆధిపత్య కులాల వారి దాడిలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో మరో ఇద్దరు దళితులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఊరు నడి బొడ్డున ‘రక్త క్షేత్రం’లో పాతి పెట్టాం. చుండూరు బాధితుల పక్షాన జరిగిన ఉద్యమానికి నేను నాయకత్వం వహించడం వలన అంబేడ్కర్ ఆలోచనల్ని జాతీయస్థాయి పోరాటంలో మమేకం చేసే అవకాశం కలిగింది. ఉద్యమం ముఖ్యంగా ఢిల్లీ అంబేడ్కర్ భవన్లో కొన్నివందల మంది ఆశ్రయం తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరి బోట్ క్లబ్ వరకు 13 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించాం. 1991 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఢిల్లీ కోటను ముట్టడించాం. ఢిల్లీలోని 120 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం బలపరచడంతో ఈ ఉద్యమానికి బలం చేకూరింది. మాజీ హోం మినిస్టర్ బూటా సింగ్, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్లమెంట్ సభ్యులు రామ్ విలాస్ పాశ్వాన్, ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు సమస్య పట్ల అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర వహించారు. అక్టోబర్ నాలుగవ తేదీ ప్రధానమంత్రి – ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. బాధిత కుటుంబాలతో పాటు నేనూ చర్చలకు హాజరయ్యాను. చర్చలు చుండూరు కేసు విచారణకు, దాడి జరిగిన చుండూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్. 440 బాధిత కుటుంబాలకూ ఇళ్ళ స్థలంతో సహా ఒక ఇల్లు నిర్మించడం, ప్రతి కుటుంబానికీ ఒక ఎకరం పొలం ఇవ్వడం, బాధిత కుటుంబాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలలో 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, చుండూరులో ఒక రెసిడెన్షియల్ హైస్కూల్ ఏర్పాటు, 150 మంది ముద్దాయిలందరనీ అరెస్ట్ చేయడం వంటివి బాధితులు ప్రధానమంత్రిని చేసిన మరికొన్ని డిమాండ్లు. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) చుండూరు ఉద్యమం భారతదేశ దళిత ఉద్యమానికి చుక్కాని. 111 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలని ఏకం చేసి రాష్ట్రపతి భవన్‌కు దళిత ఉద్యమం ర్యాలీ చేయించిన మహోన్నత చారిత్రక ఘటన. అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ ప్రత్యేక కోర్టు నివేదనను తిరస్కరించడంతో... రాష్ట్రపతి దళితుడు కావాలి అనే నినాదం చేయడం ద్వారా ఇప్పుడు ఒక నారాయణన్, ఒక గోవింద్, ఒక ద్రౌపదీ ముర్మూలు ఆ పీఠాన్ని అధిష్టించడానికి అవకాశం కల్పించిన ఉద్యమం. ‘ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్–1989’ ననుసరించి చుండూరులోనే ప్రత్యేక కోర్టును సాధించిన ఉద్యమం. కమ్యూనిస్టులూ కుల సమస్య గురించి చర్చించేలా చేసిన ఉద్యమం. మూడు దశాబ్దాల తర్వాత ‘రక్త క్షేత్రం’ ఆగస్ట్ 6ను దళిత బహుజన మైనారిటీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడే బాధ్యతను మనకు అప్పజెబుతున్న రోజుగా భావిద్దాం. అంబేడ్కర్ మార్గంలో విజయ సోపానాన్ని అధిరోహించేద్దాం. (క్లిక్: ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?) - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు (చుండూరు ఘటనకు మూడు దశాబ్దాలు) -
దళిత ఉద్యమాలకు ఉగ్రరూపం
యాభై ఏళ్ల కింద మహారాష్ట్రలో మొదలైన ‘దళిత్ పాంథర్’ ఉద్యమ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఇది ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. దళిత్ పాంథర్ వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు; దేశంలోని అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్, మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూర్చున్నారు. చర్చలు సాగుతున్నాయి. అంతలో సందర్శకుల గ్యాలరీలో ఏదో అలజడి. ఇద్దరు యువకులు భాస్కర్ గవలి, నారాయణ్ మోరే సభలోకి అగ్నిగోళాలు విసిరారు. అగ్నిగోళాలు విసురుతుండగానే ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. అగ్నిగోళాలు అంటే, కిరోసిన్‌లో ముంచిన గుడ్డతో చేసిన బంతులు. రాష్ట్ర మంత్రి శంకర్ రావు పాటిల్ రాజీనామ చేయాలని కూడా ఆ యువకులు నినదించారు. అంతేకాకుండా, దళితులకు ప్రత్యేక దేశం కావాలంటూ ప్రచురించిన కరపత్రాలను సభలోకి విసిరారు. ఇది 1972 జూన్ 12న మహారాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటన. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో పొగబాంబులు వేసి నినదించిన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ల తర్వాత మళ్ళీ ఈ దళిత నాయకులే అటువంటి వీరోచితమైన పనికి పూనుకున్నారు. ఇది జరిగి యాభై సంవత్సరాలు గడిచాయి. ఈ సంఘట నకు ఒక సంస్థ ఆవిర్భావం ప్రధాన కారణం. దాని పేరే, ‘దళిత్ పాంథర్’! ఆ సంస్థ కేవలం మహారాష్ట్రలోనే కాదు, భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అందుకే ఆ సంస్థ స్వర్ణోత్సవాలను దేశ వ్యాప్తంగా దళితులు ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుపుకొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన దళిత పాంథర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించే అవకాశం నాకు రావడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. అంతకుమించిన గొప్ప అనుభవాన్నిచ్చింది. ఇద్దరు దళిత యువకులు మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిగోళాలు విసిరేంతటి సాహసానికి పూనుకోవడానికి రెండు దుస్సంఘటనలు కారణమయ్యాయి. ఒకటి, పుణే జిల్లాలోని బావ్డా గ్రామంలో దళితులను మిగతా కులాలన్నీ ఏకమై వెలివేశాయి. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ రావు సోదరుడు శహాజిరావు పాటిల్ దీనికి నాయకత్వం వహించారు. రెండవది, పర్భని జిల్లా భాహారా గావ్‌లో ఒక అగ్రవర్ణానికి చెందిన బావి నుంచి ఇద్దరు దళిత మహిళలు నీళ్ళు తోడుకొని తాగుతున్నందుకు వారిని పట్టుకొని నగ్నంగా ఊరేగించారు. ఇది వారి గుండెల్ని మండించింది. ఈ సాహసం చేయడానికీ, దళిత పాంథర్ ఉద్యమం ప్రారంభం కావడానికీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇలయపెరుమాళ్ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అత్యాచారాల వివరాలను 1969లో బయటపెట్టింది. 1965లో విచారణ ప్రారంభించిన కమిటీ 1969 జనవరి 30 నాడే నివేదికను పార్లమెంటుకు అందజేసింది. ఆ నివేదిక పార్లమెంటును కుదిపివేసింది. అందులో మహారాష్ట్రకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇవి యువకులనూ, రచయితలనూ బాగా కదిలించాయి. వీటికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనను నిర్మించాలనీ, ప్రభుత్వాలకు ఒక గుణపాఠం నేర్పాలనీ ఆ కార్యకర్తలు నిర్ణయించారు. ఈ ఉద్యమ ప్రయత్నంలో జేవీ పవార్, దయా పవార్, అర్జున్ డాంగ్లే, నామ్‌దేవ్ దసాల్, ప్రహ్లద్ చార త్వంకర్లను మొదటి వ్యక్తులుగా చెబుతున్నారు. ‘ముందుగా ఒక ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటున్నాం. దళితులపైన జరుగుతున్న దాడులనూ, దౌర్జన్యాలనూ వివరిస్తూనే, దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను, అన్యాయాలను ప్రభుత్వం అరికట్టకపోతే, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది. దానిమీద రాజా ధాలే, నామ్‌దేవ్ దసాల్, అర్జున్ డాంగ్లే, భీంరావు షిర్వాలే, ఉమాకాంత్ రణధీర్, గంగాధర్ పంతాల్నే, వామన్ నింబల్కర్, మోరేశ్వర్ వహానే సంతకాలు చేశారు. ఆ విధంగా ప్రారంభమైన దళిత్ పాంథర్ ఉద్యమం 1972 నుంచి 1977 వరకు మరెన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఇదే స్ఫూర్తితో అక్కడక్కడా అనేక దళిత పోరాటాలు సాగాయి. దారుణమైన నిర్బంధాన్నీ, అరెస్టులనూ ఈ ఉద్యమం ఎదుర్కొన్నది. అయితే వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. ప్రభుత్వాలను తమ తప్పు తెలుసుకునేటట్టు చేయగలిగింది. కులతత్వాన్ని బోధించే హిందూ శక్తులను ప్రతి ఘటించింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. 1992 ఆగస్టు 12న ఎరగావ్లో ఒక దళిత రైతును దేవుడికి బలిచ్చిన దారుణమైన అకృత్యం జరిగింది. రామ్‌దాస్ నార్నవరె అనే దళిత రైతు ఎనిమిది ఎకరాల ఆసామిగా ఉండి, ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడడం కులతత్వ వాదులకు నచ్చలేదు. అతడిని అత్యంత దారుణంగా ముక్కు, చెవులు కోసి, గొంతు కోసి చంపేశారు. పోస్టు మార్టమ్, పోలీసు కేసు కూడా లేకుండా అతని దేహంతో పాటే ఈ దేశ దళితుడి ఆత్మగౌరవాన్ని భూమిలో పాతేశారు. ఇది తెలిసిన దళితులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తే, నిజాలు బట్టబయలయ్యాయి. అప్పుడు నిందితులను అరెస్టు చేయక తప్పలేదు. పుణే జిల్లా భంగావ్ గ్రామంలో 1973 సెప్టెంబర్ 17న దళిత్ పాంథర్స్ కార్యకర్తలు జరిపిన బహిరంగ సభ ఆ గ్రామంలోని దళితులను ఏకం చేసింది. రాజ్‌గురు తహశీల్‌లోని అస్థేడ్ గ్రామంలో దళిత రైతుకు చెందిన 30 ఎకరాల భూమిని సాగుచేయకుండా, తుపాకితో బెదిరించిన భూస్వామిని నిలదీసి ఆ భూమిని ఇప్పించారు. దళిత్ పాంథర్‌కు చెందిన 92 మంది యువకులు ప్రత్యక్షంగా గ్రామంలోకి వెళ్ళారు. వాళ్ళ మీద అగ్రకులాలు దాడిచేశాయి. వాళ్ళను ప్రతి ఘటించి విజయం సాధించారు. ఇట్లా ఎన్నో సంఘటనల్లో తమదైన మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించారు. ఒకానొక దశలో యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యక్షంగా నిలబడి పోరాటం సాగించడం వల్ల దళితుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. అప్పటికి వివిధ పార్టీలలో ఉన్న దళిత నాయకులు నిర్లిప్తంగా ఉండడం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీ నాయకత్వ అవకాశవాదాన్ని ఈ ఉద్యమం బహిర్గత పరిచింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన ఆర్పీఐ నాయకత్వం దళితులకు దూరమైంది. ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పుణే పర్యటనలో దళిత్ పాంథర్స్ ప్రతిఘటనల పిలుపుతో తన ప్రయాణాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. దళిత్ పాంథర్ ఉద్యమం ఒక రకంగా నాటి కుల సమాజాన్నీ, దౌర్జన్య కాండనూ సవాల్ చేసింది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలతో అంటకాగకుండా స్వతంత్ర మార్గంలో సాహసోపేతంగా ఉద్యమాన్ని నడిపింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడులలో అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. ఎంతో మంది దళిత రచయితలు రాసిన తమ స్వీయ చరిత్రలు నూతన సాహిత్య విలు వలకూ, ధోరణులకూ పునాదులు వేశాయి. గత యాభై ఏళ్ళలో దళితుల జీవితాల్లో మార్పు రాలేదని అనలేం. కానీ దాడులు, అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, దళిత సమస్యలే అజెండాగా, రాజకీయ అవకాశ వాదంలేని ఒక స్వతంత్ర దళిత ఉద్యమం మళ్ళీ ఆరంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఆకాశమంత
సగం చాలదు... పూర్తి ఆకాశం కావాలి.యుద్ధానికి సకల ఆయుధాలు కావాలి.వాదనకు అన్ని అవకాశాలు ఉండాలి.ప్రతిఘటనకు సమస్త శక్తియుక్తులు కావాలి. పాలనలో స్త్రీకి స్థానం కావాలి.అణచివేత నుంచి ఒక కంఠం పైకి లేవాలి. సుజాత లాంటి అభ్యర్థికి స్వాగతం పలకాలి. ‘‘మేము చరిత్రను రాసేవాళ్లం కాదు.. చరిత్ర కన్న బిడ్డలం’’ అంటాడు మార్టిన్ లూథర్ కింగ్. అలాంటి చరిత్ర కన్న ఆడబిడ్డే సూరేపల్లి సుజాత. కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. పోరాటంలో ఉన్న వాళ్లకు, పోరాటాలను చూస్తున్న వాళ్లకు ఆమె సుపరిచితురాలు. మరెందుకు ఇప్పుడు ఈ ప్రత్యేక పరిచయం? మార్పు కోసం.. పర్సనల్ ఈజ్ పొలిటికల్ నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుంచి పోటీ చేస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్న శక్తికి సవాలుగా! అందుకే ప్రొఫెసర్, ఉద్యమనేత సూరేపల్లి సుజాత ప్రస్తావన, చిన్న పరిచయం ఇక్కడ.. ఉద్యోగధర్మాన్ని ఎక్కడా తప్పకుండానే ప్రజాసమస్యల మీద ఉద్యమిస్తూనే ఉన్నారు. బలమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?మూడు దళిత్ ఇష్యూస్‌లో నేను ఇన్వాల్వ్ అయినందుకు నామీద కేసులు పెట్టారు. కత్తి మహేష్ నిర్బంధం మీద నేను మాట్లాడ్డం, కరీంనగర్లో చనిపోయిన దళిత స్టూడెంట్‌కు న్యాయం జరగాలని కోరడం, సిరిసిల్లలో తండ్రీ కొడులు చనిపోతే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం. మంతెన మధుకర్ విషయం.. అన్నీ కారణమే. మంతెన మధుకర్ కేస్ ఇంకా కోర్ట్లోనే ఉంది. దళిత, ఆదీవాసీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. నేను రాజకీయాల్లోకి రావడానికి ఇవన్నీ ప్రేరేపించాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి. మోర్దాన్ డికేడ్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తూనే ఉన్నా. కుల సమస్యల మీద మాట్లాడ్డానికి చాలా ఆర్గనైజేషన్స్‌కి, మహిళా ఆర్గనైజేషన్స్‌కీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అంతెందుకు కుల సమస్యల మీద స్పందించడానికి ప్రజాప్రతినిధులే ముందుకురారు. ఇవన్నీ చూశాకే రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుత రాజకీయాల్లో ఆడవాళ్ల పరిస్థితి... ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావడమే ఒక ఉద్యమం అనిపిస్తోంది. మహిళకూ డబ్బు.. బ్యాక్‌గ్రౌండ్ (సామాజిక వర్గం, రాజకీయ కుటుంబ నేపథ్యం) తప్పడం లేదు. న్యాయం, నిజాయితీతో టికెట్ వచ్చే ప్రసక్తే లేదు. నా విషయంలోనూ సామాజిక వర్గం.. కోట్లు లేకపోవడం.. అన్నీ నాకు సవాళ్లే. నాకున్న ఉద్యమ నేపథ్యం, అవగాహనతో ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. నిజానికి సవాళ్లు నాకు కొత్తకాదు. కాబట్టి భయపడేది లేదు. జనరల్‌లో, ఇండిపెండెంట్‌గా కాక ఒక పార్టీ నుంచి ఎందుకు పోటీ? జనరల్‌లోనే వేయాలని నేనూ అనుకున్నా. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మహిళా నేతృత్వం, బహుజన సిద్ధాంతం వల్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వైపు వచ్చా. నా ఆలోచనలు ఈ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నాయి. నా లక్ష్య సాధనకూ ఆ పార్టీలో అయితేనే స్పేస్, సపోర్ట్ ఉంటుందని అనుకున్నా. పార్టీ నన్ను ఎంకరేజ్ చేసింది. ఇక చెన్నూరే ఎందుకు ఎంచుకున్నానంటే.. ఈ ఊరితో నాకు అంతకుముందు నుంచే అనుబంధం. ఇక్కడి ఇష్యూస్ మీద అవగాహన, పోరాడిన అనుభవం ఉంది. కులం, ఓపెన్ కాస్ట్ ఇక్కడున్న పెద్ద సమస్యలు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ల అవుతున్నా ఈ ఊళ్లో హాస్పిటల్ లేదు, కాలేజ్ లేదు. మహిళలు, విడోస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. అన్నీ కోల్పోయినా కూడా ఈ ప్రాంతం ప్రజలు ఒక చైతన్యంతో ఉద్యమాలు నడిపించారు. లక్ష్యాలు... పేదరికం, వెనకబాటు ఉన్న చోట విపరీతమైన దుష్ప్రభావం ఉంటుంది. మార్పు కోసమే రాజకీయపోరాటానికి దిగాను. ‘పర్సనల్ ఈజ్ పొలిటికల్’ నా నినాదం. ప్రధాన దృష్టి యువత ఉపాధి మీదనే. యువత అంటే మగపిల్లలే కాదు. ఆడ, మగపిల్లలు కలిపి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. అందుకే స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ఉపాధి కల్పన, విధ్వంసం లేని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అభివృద్ధి కావాలి. వెనకబాటు తనానికి ప్రధాన కారణం చదువులేకపోవడమే. సో.. అందరికీ విద్య.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించే ప్రయత్నం జరగాలి. ఆడవాళ్లు ప్రభుత్వ పథకాల్లో బెనిఫియరీస్గా కాదు.. ఈక్వల్ సిటిజన్స్‌గా గుర్తింపు పొందాలి. అన్నిరంగాల్లో వాళ్లకు సమానమైన ప్రాతినిధ్యం అందాలి. ఎన్నికల ప్రయాణం ఎలా సాగుతోంది? స్త్రీలు.. అందునా ఒంటరి స్త్రీలు అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? నా క్యాస్ట్, నేపథ్యం అన్నిటితో ఆల్రెడీ నా మీద దాడులు మొదలయ్యాయి. నేను నాన్లోకల్నని, డబ్బులు తీసుకుని తప్పుకున్నాననే ప్రచారమూ చేస్తున్నారు. మహిళా జాక్‌కు ఫౌండర్‌గా, తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించినప్పుడు ఎందుకు ఈ డౌట్ రాలేదు? నా స్థానికతను అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాసమస్యల మీద పోరాడిన, పోరాడుతున్న స్త్రీలందరూ నాకు ఆదర్శం. వాళ్లముందు నేనెంత? అనిపిస్తుంటుంది. వాళ్లే నాకు ప్రేరణ. దళిత జీవితాలు నాకు ఇన్సిపిరేషన్. ‘‘డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యు సీ వైల్ స్లీపింగ్ ఇట్ ఈజ్ సమ్‌థింగ్ దట్ డజ్ నాట్ లెట్ యూ స్లీప్’’ అన్న అబ్దుల్ కలామ్ మాట నా బాట. మద్దతు? థాంక్స్ టు సోషల్ మీడియా పర్ ఎవ్రీ థింగ్. ట్రోల్ చేసింది. ట్రెమండస్ సపోర్ట్‌నూ ఇస్తోంది. నేను ఏ సమస్య మీద స్పందించినా ముందునుంచి సామాజిక మాధ్యమం చాలా మద్దతుగా నిలిచింది. ఇప్పుడైతే వలంటీర్స్ గ్రూప్స్‌గా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు, స్లోగన్స్, బ్యానర్స్, పోస్టర్స్, వెహికిల్స్.. ఇలా ఎవరికి ఏది వీలైతే అది చేస్తున్నారు. డబ్బు రాజకీయాలతో పోటీ పడలేని నాకు.. ఈ సోషల్ మీడియానే మంచి ప్లాట్‌ఫామ్ అయింది. అలాగే నా ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ కూడా. మొదటి నుంచీ నా వెన్నంటి ఉన్న ఫాదర్ ఫిగర్ ఊసాగారు (యు.సాంబశివరావు) అందరూ నా విజయం కోసం కష్టపడుతున్నారు. గెలుపుని కాంక్షిస్తున్నారు. ఫ్యామిలీ... స్వస్థలం సూర్యాపేట్. చదువుకుంది హైదరాబాద్‌లో. అమ్మ వరలక్ష్మి. హౌజ్‌వైఫ్. అమ్మ లేకపోతే ఈ రోజు నేను లేను. ధైర్యంగా ఉండడం ఆమె నుంచే నేర్చుకున్నాను. ఇద్దరు అన్నయ్యలు. నాన్న సూరేపల్లి కృష్ణయ్య .. ఎక్సైజ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. చనిపోయారు. అప్పటి నుంచి కష్టమంతా అమ్మదే. నేను పాలిటిక్స్‌లోకి వస్తుంటే వద్దనకపోవడమే వాళ్లు నాకిచ్చే సపోర్ట్(నవ్వుతూ). అన్నయ్యలు, అమ్మ అందరి సపోర్ట్ ఉంది. ఎక్కడైతే స్త్రీ, శిశు సంక్షేమానికి కూడా పురుషుడే మంత్రిగా ఉన్నాడో, ఎక్కడైతే కొత్తగా మహిళా కమిషన్నూ వేయలేదో.. స్త్రీలు సాయుధ పోరాటం చేసిన నేల మీద పాలనలో స్త్రీలకు భాగస్వామ్యం లేదో.. నిర్బంధం ఉందో.. అక్కడ పాలనలో భాగం కావాలని స్టెప్ వేశాను. చూద్దాం.. గేర్ మార్చిన ఈ ప్రయాణం గమ్యం ఏంటో? ఫలితం ఏదైనా వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ముగించింది. శబరిమలలో స్త్రీల ప్రవేశం? దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కావడానికి ఇంత రభస జరుగుతోందంటే సమాజం ఇన్క్లూడింగ్ ఆల్ పార్టీస్‌లో హిందూమత పితృస్వామ్య వ్యవస్థ భావజాలం ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమైంది కదా! అంతటా డబుల్ స్టాండర్డే. రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కనీస అవగాహన లేనితనానికి నిదర్శనం. మీ టూ మీద? తమ పట్ల జరిగిన హింసను ఇన్నాళ్లకైనా బయటకు వచ్చి చెప్పడం మంచి పరిణామమే. దీన్ని బట్టి దేర్ ఈజ్ నో సేఫ్ స్పేస్ ఫర్ ఉమన్ అని తేలింది. ఏ మహిళకు ఎలాంటి అవమానం జరిగినా సాలిడారిటీ ఉంటుంది. అయితే మీ టూ మీద మీడియా చేసినంత ఫోకస్ సామాన్య స్త్రీలకు సంబంధించిన సమస్యల మీద ఎందుకు చేయదు? మహిళల మీద జరుగుతున్న అన్నిరకాల హింసా ఆగాలి. మహిళలను పక్కన పెట్టే ఎన్ని పథకాలు వచ్చినా అవి పనికిమాలినవే. ఆకాశంలో సగం అంటారు.. ముందు అసలు నేలమీదే సగం లేము. నేను మహిళను కాబట్టి మహిళ గురించి ఆలోచించాలి అని కాకుండా.. అందరూ ఆలోచించి సమభాగస్వామ్యం ఇచ్చినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. స్టార్ క్యాంపెయిన్ నిజంగా ప్రజాసమస్యల మీద అవగాహన ఉండి ప్రచారానికి వస్తే మంచిదే. కాని కేవలం జనాల అటెన్షన్ కోసమే అయితే.. మార్కెట్ కల్చర్‌లో భాగంగా చూస్తా. దళిత్మూవ్మెంట్ స్వాతంత్య్రానికి ముందు.. ఇప్పుడు? దీన్ని టైమ్ అండ్ స్పేస్ కాంటెక్స్›్టలో చూడాలి. అంబేద్కర్ ఉన్నంతవరకు చాలా క్లిష్టమైన రాజకీయ అవగాహన జరిగిందని నా అభిప్రాయం. ఇప్పడు దళిత మూవ్‌మెంటే కాదు అన్ని మూవ్మెంట్స్ హైలీ పొలిటిసైజ్ అయిపోయాయి. అప్పటిలా ఒక్కనేతే దేశమంతా నడిపే అవకాశంలేదు. దళిత ఉద్యమానికి సంబంధించీ అంతే. ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉందో.. అంతే కాన్షస్నెస్ ఉంది. ఫీనిక్స్‌లా పడి లేస్తూనే ఉంది. ఒక స్వతంత్ర శక్తి ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఆ శక్తిపేరు మెర్సీ మార్గరెట్. పొయెట్గా అందరికీ తెలుసు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత కూడా. స్వస్థలం ముషీరాబాద్‌లోని రంగానగర్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం..ఆ ప్రాంత పరిస్థితులే అంటుంది మెర్సీ. ‘నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉంది. ఎలాంటి మార్పు లేదు. అయిదేళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే నేతలు, అబద్ధపు హామీలతో విసిగి పోయున్నారు జనాలు. ఈ సిట్యుయేషన్ మారాలనే ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చా. చిన్నప్పుడు మా తాతయ్య, నాన్న దగ్గర రాజకీయాల గురించి వినేదాన్ని. రైటర్‌గా మారాక ఇంకొంత అవగాహన వచ్చింది.ఎన్జీవోలో పనిచేసినప్పుడూ కొన్ని విషయాలను నేర్చుకున్నా. ఆలోచనలు చేతల్లో ఉంటేనే మార్పు సాధ్యం. దానికి అధికారం ఉండాలి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. విద్య, ఆరోగ్యం, ఉపాధి నా లక్ష్యాలు. గెలుపు ఓటముల కన్నా.. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఆ ధ్యేయంతోనే ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధపడ్డా’’ అంటుంది మెర్సీమార్గరేట్. ప్రస్తుతం ఆమె భారత్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. – సరస్వతి రమ -
‘మహా’ ప్రభుత్వం చేతగానితనంవల్లే..
సమాజంలో ఘర్షణలు తలెత్తకుండా నివారించడం, ఒకవేళ అలాంటివేమైనా జరిగితే వెనువెంటనే రంగంలోకి దిగి సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చూడటం ప్రభుత్వాల కనీస కర్తవ్యం. ఈ రెండు విషయాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడం వల్ల ఆ రాష్ట్రం రెండురోజులుగా హింసతో అట్టుడుకుతోంది. పుణే సమీపంలో 30 ఏళ్ల దళిత యువకుడొకరు ప్రాణాలు కోల్పోగా ఆ వర్గానికే చెందిన పలువురు గాయాలపాలయ్యారు. భారీయెత్తున ఆస్తినష్టం సంభవించింది. అనేకచోట్ల దళితులపై దాడులు అడ్డూ ఆపూ లేకుండా కొనసాగాయి. 200 ఏళ్లక్రితం ఆధిపత్య కులాలపై సవాలు విసిరి ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించిన దళిత వీరుల స్మారకార్ధం ఏటా జరుపుకుంటున్న సంస్మరణ ఇంతటి హింసకూ, బీభత్సానికీ కారణమైందంటే ఆశ్చర్యం కలుగుతుంది. సమాజం మునుపటిలా లేదని, స్వాతంత్య్రం వచ్చిననాటితో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగైందని వాదించేవారున్నారు. దళితులకిచ్చిన రిజర్వేషన్ల అవసరమే లేదని చెప్పేవారున్నారు. దళితుల కోసం తీసుకొచ్చిన అత్యాచారాల నిరోధక చట్టంలాంటి ప్రత్యేక పరిరక్షణ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని వాదించే ఘనులున్నారు. కానీ దళితులపై ఆధిపత్య కులాల అహంకార వైఖరి ఇంకా నశించలేదని, వారిపై సామాజిక అణచివేత చర్యలు ఆగటం లేదని, కనీసం తమవారిని స్మరించుకునే హక్కును కూడా వారికి లేకుండా చేద్దామన్న ప్రయత్నం సాగుతోందని వర్తమాన మహారాష్ట్రను చూస్తే అర్ధమవుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మస్థలి మహారాష్ట్ర. అక్కడ 70వ దశకంలో పెల్లుబికిన దళిత్ పాంథర్స్ ఉద్యమం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు...ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. అలాంటిచోట గత కొన్ని దశాబ్దాలుగా ఏటా జనవరి 1న పుణే సమీపంలోని భీమా నది ఒడ్డున గల స్మారక చిహ్నం వద్దకు దేశం నలుమూలలనుంచీ వేలాదిమంది దళితులు రావడం తమ వీరులను స్మరించుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాదితో ఆ ఉదంతం జరిగి 200 ఏళ్లు అవుతున్నది గనుక ఈసారి మరిన్ని వేలమంది అక్కడికొచ్చారు. ఇలాంటి సభ సజావుగా సాగడం కోసం ప్రభుత్వ యంత్రాంగం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సభకు వచ్చేవారిలో పిల్లలు, వృద్ధులు ఉంటారు గనుక వారిని దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది. ఇవేమీ లేకపోగా కనీస సంఖ్యలో ఉండాల్సిన పోలీసులు కూడా అక్కడ పత్తా లేరంటే అది బీజేపీ–శివసేన ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఆ సభకు రెండు మూడు రోజుల ముందు ఆ సమీప ప్రాంతాల్లో జరిగిన ఉదంతాల వల్ల ఉద్రిక్తత ఏర్పడి ఉంది. ఈసారి సభ జరగనిచ్చేది లేదని ఒకటి రెండు కుల సంఘాలు హెచ్చరిస్తే డాక్టర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ స్వయంగా వారి దగ్గరకెళ్లి వెళ్లి మాట్లాడి రివాజుగా జరిగే సభను అడ్డుకుంటామనడం భావ్యం కాదని హితవు చెప్పారు. పర్యవసానంగా కొందరు వెనక్కి కూడా తగ్గారు. శివ్‌రాజ్ ప్రతిష్టాన్, హిందూ ఏక్తా అఘాదీ అనే రెండు సంస్థలు ఈ విజయోత్సవంలో బ్రిటిష్ అనుకూలతను వెదికాయి. అప్పటి పీష్వాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ సేనలు పోరాడి విజయం సాధించి తమ పాలనను సుస్థిరం చేసుకున్న ఈ సందర్భాన్ని విజయోత్సవంగా జరుపుకోవడమేమిటన్నది వాటి ప్రశ్న. కానీ దళితులు దీన్ని మరో కోణంలో చూస్తున్నారు. అంటరానితనాన్ని పాటించి తమను జంతువుల కన్నా హీనంగా చూసిన పీష్వాలపై దళితులు ప్రతీకారం తీర్చుకునేందుకే భారీయెత్తున ఈస్టిండియా కంపెనీ సైన్యంలో చేరారని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెగించి పోరాడారని అంటున్నారు. సారాంశంలో పీష్వా పాలన అంతం దళితుల విజయమని చెబుతున్నారు. ఆ సంస్మరణకు అభ్యంతరం వ్యక్తం చేసే ముందు...ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ రెండు శతాబ్దాలనాటి అమానుషత్వమే ఎందుకు రాజ్యమేలుతున్నదన్న ప్రశ్న వేసుకుంటే ఆ సభ నిర్వహణలోని ఔచిత్యమేమిటో అర్ధమయ్యేది. అది ఒకానొక కాలంలో అమలైన అమాను షంగానే...అప్పటి తరంలోని ఆధిపత్య వర్గం సంకుచిత భావాలతో వ్యవహరించిన తీరుగానే పరిగణించి అన్ని వర్గాలవారూ ఆ సంస్మరణలో సమష్టిగా పాలు పంచుకునే విశాల దృక్పథం అందరిలో ఏర్పడి ఉంటే మనం సాధించిన ఏడు దశాబ్దాల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు అర్ధం ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు లేవు సరికదా సమీప భవిష్యత్తులో సైతం ఏర్పడబోవని మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న ఘటనలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఈ సభకు కొన్ని రోజుల ముందు అక్కడికి సమీప గ్రామంలో ఉద్రిక్తతలు రాజేయడం, సభకు వస్తున్న వారినీ, దాన్నుంచి వెళ్తున్నవారినీ లక్ష్యంగా చేసుకుని అనేకచోట్ల దాడులు చేయడం చూస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంవల్ల వరసగా రెండురోజులు రాష్ట్రం స్తంభించిపోయింది. ఆస్తులు దహనమయ్యాయి. పొరుగునున్న గుజరాత్‌కు సైతం ఈ ఆందోళనలు పాకాయి. 2016 డిసెంబర్లో మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి సవరణలు తీసుకురావాలని ఉద్యమించినప్పుడు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలింది. తాజా ఘటనలపై న్యాయవిచారణ జరిపిస్తామని ఫడ్నవీస్ చెబు తున్నారు. అది చాలదు. సభకు మూడు నాలుగు రోజుల ముందునుంచీ ఉద్రిక్తతలు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితుల వెనక ఉన్నదెవరో, సభ జరిగే రోజున అనేకచోట్ల దళితులపై దాడులు చేసిందెవరో కూడా విచారణాంశాల్లో చేర్చాలి. ఎన్నో రంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని, ప్రపంచమంతా మనవైపే చూస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ సామాజికంగా ఇంకా మధ్య యుగాలనాటి న్యాయమే అమలవుతున్నదని భీమా–కోరెగావ్ ఉదంతం, తదనంతర పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే మనం సాధించిన స్వాతంత్య్రానికి అర్ధం ఉండదు. -
ఫడ్నవీస్ ప్రామిస్.. శాంతించిన 'మహా'దళిత్
సాక్షి, ముంబయి : మహారాష్ట్రలో దళితులు శాంతించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగిరావడంతో వారు తమ బంద్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపుమేరకు బంద్‌ను ఆపేశారు. కోరేగావ్ -భీమా యుద్ధానికి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉత్సవం కాస్త కొన్ని అగ్రకులాలవారి జోక్యంతో ఘర్షణగా మారడం, ఇందులో ఓ వ్యక్తి చనిపోవడం,పలు చోట్ల దళితులపై దాడులు జరగడం వంటి కారణాలతో ప్రకాశ్ అంబేద్కర్ మంగళవారం నుంచి నిరవదిక బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముంబై, థానే, పూణే నగరాల్లో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. రెండు నగరాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడ ఆగిపోయింది. ముంబై నగరంలో మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. థానే నగరంలో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. పూణెలో మొదలైన దళిత ఉద్యమం మొత్తం మహరాష్ట్ర అంతటా విస్తరించింది. బుధవారం బంద్ సందర్భంగా మహారాష్ట్రలో పాఠశాలలు మూసేశారు. ప్రజారవాణ దాదాపు ఆగిపోయింది. థానేలో ఆందోళనకారులు రైలు సేవలకు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నించారు. మంగళవారం జరిగిన హింసలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 187 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో చివరకు ఈ విషయం చేయిదాటక ముందే అప్రమత్తమైన ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ రంగంలోకి దిగారు. దళితులపై జరిగిన దాడి విషయంలో విచారణకు ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాస్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపిస్తామన్నారు. హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. -
అంబేద్కర్ దీప్తి
దళిత భారతం దళితుల విముక్తికి.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌కు మధ్య విడదీయలేని సంబంధం 20వ శతాబ్దంలోనే మొదలుకాగా.. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అంబేద్కర్ భావజాలమొక్కటే తమను ముందుకు తీసుకెళ్లగలదన్న దశకు దళిత ఉద్యమం చేరుకుంది. అసమానతలు బలంగా వేళ్లూనుకున్న భారతీయ సమాజంలో నిరంతరం సమానత్వం కోరుతూండటమే దళిత సాధికారత. సుమారు 500 ఏళ్ల క్రితం దళితుల విముక్తి కోసం భక్తి ఉద్యమం ద్వారా తొలి ప్రయత్నం జరిగింది. దేవుడి ముందు అందరూ సమానమేనని.. గుడి, పూజారీ వంటి మధ్యవర్తుల అవసరం లేదన్న భావనతో మొదలైన భక్తి ఉద్యమనం తరువాతి కాలంలో భిన్న వర్గాలు, మతాలుగా విడిపోయాయి. బసవణ్ణను ఆరాధించేవారు లింగాయతుల్లో వెనుకబడిన తరగతివారిగా మారిపోతే.. రవిదాస్‌ను అనుసరించే వారు రవిదాసీల పేరుతో దళితులుగా రూపాంతరం చెందారు. కబీర్‌ను పూజించే వారు కబీర్ పంతి పేరుతో దళితులయ్యారు. మొత్తమ్మీద చూస్తే భక్తి ఉద్యమం సమాజంలో సమానత్వం తేవడంలో విఫలమైందని చెప్పాలి. 20వ శతాబ్దంలో మహార్, మాల, పల్లన్, పరాయణ్, పులయ, హోలియా, దుషాద్ వర్గాల వారికి స్థానిక పాలేగాళ్లు, రాజుల సైనిక దళాల్లో ప్రాతినిధ్యం లభించడంతో దళిత అభ్యున్నతిపై కొన్ని ఆశలు రేకెత్తాయి. ఛత్రపతి శివాజీ సైన్యంలో మహార్లను ప్రాతినిధ్యమున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సైనికులుగా తమ ధీరత్వం సామర్థ్యాలతో బ్రిటిష్ పాలకులనూ మెప్పించడంతో తమకు మరిన్ని అవకాశాలు అందబాటులోకి వస్తాయని దళితులు ఆశించారు. క్రైస్తవ మిషనరీల రాక కూడా ఈ విషయంలో పెద్ద భూమికనే పోషించింది. ఆది ఆంధ్ర, ఆది హిందు, ఆది ద్రావిడ, ఆది కర్ణాటక ఉద్యమాలు, పంజాబ్‌లో ఆది ధార్మి ఉద్యమం 20వ శతాబ్దం తొలి దశకాల్లో వచ్చాయి. ఆది ఆంధ్రులను వర్గీకరించి ఒకశాతం రిజర్వేషన్ కల్పించేందుకు 2000లో జరిగిన ప్రయత్నం వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసింది.దళితుల విముక్తి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మూడు వ్యవస్థలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. 1947 వరకూ దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలక వర్గం ఇందులో ఒకటైతే.. ఇంకోకటి మహాత్మగాంధీ! మహాత్మాగాంధీ వ్యతిరేకించినప్పటికీ 1932 నాటి రౌండ్ టేబుల్ సమావేశాలు, పూనా ఒప్పందాల ద్వారా చట్టసభల్లో దళితులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసే అవకాశం కల్పించాయి. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా (1942 – 1946) అంబేద్కర్ దళితులకు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను ప్రవేశపెట్టగా అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. 1944లో అంబేద్కర్ ప్రవేశపెట్టిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కూడా ఇప్పటికీ కొనసాగుతోంది. నెహ్రూ కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా తొలి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4) రూపంలో విద్యాసంస్థల్లో దళితులకు సీట్లు రిజర్వ్ చేయించిన ఘనత కూడా అంబేద్కర్‌దే. ఇక అంబేద్కర్ పోరాడిన మూడో వ్యవస్థ హిందూమతం. విపరీతమైన విమర్శల తరువాత 1956లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అదే సంవత్సరం మహా పరినిర్వాణం చెందారు. స్వాతంత్య్రం తరువాత దేశంలో దళిత ఉద్యమం, సాధికారత అన్నవి అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగ నిబంధనల సాయంతోనే నడుస్తున్నాయి. చట్టసభల్లో దళితుల రిజర్వ్డ్ సీట్లకు 1960తోనే ముగింపు పలకాల్సి ఉండగా జవహరలాల్ నెహ్రూ కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇందిరాగాంధీ తదితరులూ నెహ్రూ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది. 2017 నాటికీ కొనసాగుతున్న ఈ రిజర్వేషన్లను ఇప్పుడు తొలగించడం, సవరించడం దాదాపుగా అసాధ్యం. 1955లో అస్పృశ్యతపై నిషేధంతో వచ్చిన ‘ద అన్‌టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్’, 1976 నాటికి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మారిపోయింది. దళిత ఉద్యమం కారణంగా 1989లో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం రాగా కె.రాజు, సిరివెళ్ల ప్రసాద్ వంటి వారి రెండు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా 2013లో ఈ చట్టానికి శక్తిమంతమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల హక్కులు, మనుషులతో పారిశుద్ధ్య పనులు చేయించడంపై బెజవాడ విల్సన్ నిరంతర పోరు కారణంగా 2013లో పారిశుద్ధ్య కార్మికుల పునరావాస చట్టం వచ్చాయి. దాదాపు 70 ఏళ్ల దళిత ఉద్యమంలో అత్యున్నత ఘట్టం 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేయడం. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో దళిత ఉద్యమకారుడు, జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య పదిహేనేళ్లపాటు జరిపిన పోరాటం ఫలితమిది. తాజాగా 2017 కేంద్ర బడ్జెట్ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టంలోనూ తగు మార్పులు చేసేలా లక్ష్మయ్య జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా దళితులపై అత్యాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటరానితరం, వివక్ష పలు రూపాల్లో ఇప్పటికీ అస్తిత్వంలో ఉన్నాయి. ఆర్థిక సరళీకరణలు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను ప్రభుత్వ రంగం నుంచి దూరం చేయగా దళితులకు ఈ రెండూ దక్కడం దుర్లభమవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత పరస్పర విరుద్ధ పరిస్థితులన్న దశకు చేరుకున్నాం. దళిత బాలిక టీనా దాబీ ఐఏఎస్ పరీక్షల్లో తొలిర్యాంకు సాధించినా.. గరగపర్రు లాంటి సంఘటనలు అత్యద్భుతమైన రాజ్యాంగం, చట్టాలు ఉన్నప్పటికీ దళితుల విముక్తికి 70 ఏళ్ల సమయం చాలా తక్కువన్న అంశాన్ని సమాజానికి, పాలకవర్గాలకు గుర్తు చేస్తూనే ఉంటుంది. – రాజశేఖర్ వుండ్రు, ఐఏఎస్ (రచయిత నేషనల్ లా స్కూల్ నుంచి అంబేద్కర్‌పై పీహెచ్డీ చేశారు) -
మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ
న్యూఢిల్లీ: దిల్లీలో ప్రజాందోళలనకు వేదిక జంతర్ మంతర్ ఆదివారం పది వేల మంది దళితులతో నిండిపోయింది. దళితులు ప్రధానంగా చర్మకారులైన జాటవ్‌ల కొత్త రాజకీయ ఉద్యమం భీం ఆర్మీ నాయకత్వాన ఎవరూ ఊహించని రీతిలో ఇంతటి జన ప్రదర్శన జరగడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం రెండేళ్ల క్రితం సహారన్పూర్ జిల్లాలో పుట్టిన దళితుల సమరశీల యువ సైన్యం భీం ఆర్మీ ఇప్పుడు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తర్‌ప్రదేశ్ షబ్బీర్‌పూర్‌లో మే 9న జరిగిన హింసాకాండకు బాధ్యులనే కారణంతో తమను వెంటాడుతున్న యూపీ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి పోయిన భీం ఆర్మీ నేతలు ‘అడ్వకేట్’ చంద్రశేఖర్ ఆజాద్(రావణ్), వినయ్‌రతన్‌సింగ్‌లు ఈ జంతర్‌మంతర్ ర్యాలీలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జేఎన్‌యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యా కుమార్ కూడా చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు ప్రదర్శనలో కనిపించారు. 350 స్కూళ్లు నడుపుతున్న భీం ఆర్మీ కాలేజీ చదువులు పూర్తి చేసుకుని చంద్రశేఖర్, వినయ్‌రతన్ 2015 జులై 21న భీం ఆర్మీ ప్రారంభ సమావేశం ఏర్పాటుచేశారు. దళితుల పిల్లల కోసం పాఠశాలలు ఆరంభించాలని నిర్ణయించారు. సర్కారీ బడుల్లో అంతంత మాత్రం బోధనతో నష్టపోతున్న దళిత బాలల కోసం సహారన్పూర్ జిల్లా ఫతేపూర్ భాదో గ్రామంలో మొదటి పాఠశాల స్థాపించారు. ఇక్కడ పిల్లలకు తరగతి పాఠాలతోపాటు, అంబేడ్కర్ బోధనలు కూడా వివరిస్తారు. భీం ఆర్మీ స్కూళ్ల సంఖ్య కొద్దికాలంలోనే 350కి చేరుకుంది. అయితే, దళితులపై జరిగే అత్యాచారాలపై పోరాడుతూ, భూస్వామ్య శక్తులను ప్రతిఘటించే క్రమంలో యూపీ పోలీసులు భీం ఆర్మీకి నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించడమేగాక దాని నేతలపై జాతీయభద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. న్యాయం, తగిన నష్ట పరిహారం షబ్బీర్‌పూర్ దళితవాడపై ఠాకూర్లు జరిపిన దాడి, దహనకాండలో నష్టపోయిన దళితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఆస్తి నష్టపోయిన వారికి సవరించిన ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం తగినంత నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే జంతర్‌మంతర్ ర్యాలీకి వచ్చిన దళితులు కోరారు. అంబేడ్కర్ బతికున్న కాలంలోనే అనేక రంగాల్లో పైకొచ్చిన పశ్చిమ యూపీ జిల్లాల నుంచే కొత్త దళిత చైతన్య ఉద్యమం పుట్టుకురావడం సహజమే. అందుకే వేలాదిగా తరలివచ్చిన భీం ఆర్మీ సేనలను పోలీసులు దిల్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు.