యాభై ఏళ్ల కింద మహారాష్ట్రలో మొదలైన ‘దళిత్ పాంథర్’ ఉద్యమ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఇది ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. దళిత్ పాంథర్ వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు; దేశంలోని అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది.
శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్, మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూర్చున్నారు. చర్చలు సాగుతున్నాయి. అంతలో సందర్శకుల గ్యాలరీలో ఏదో అలజడి. ఇద్దరు యువకులు భాస్కర్ గవలి, నారాయణ్ మోరే సభలోకి అగ్నిగోళాలు విసిరారు. అగ్నిగోళాలు విసురుతుండగానే ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. అగ్నిగోళాలు అంటే, కిరోసిన్‌లో ముంచిన గుడ్డతో చేసిన బంతులు. రాష్ట్ర మంత్రి శంకర్ రావు పాటిల్ రాజీనామ చేయాలని కూడా ఆ యువకులు నినదించారు. అంతేకాకుండా, దళితులకు ప్రత్యేక దేశం కావాలంటూ ప్రచురించిన కరపత్రాలను సభలోకి విసిరారు.
ఇది 1972 జూన్ 12న మహారాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటన. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో పొగబాంబులు వేసి నినదించిన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌ల తర్వాత మళ్ళీ ఈ దళిత నాయకులే అటువంటి వీరోచితమైన పనికి పూనుకున్నారు. ఇది జరిగి యాభై సంవత్సరాలు గడిచాయి. ఈ సంఘట నకు ఒక సంస్థ ఆవిర్భావం ప్రధాన కారణం. దాని పేరే, ‘దళిత్ పాంథర్’! ఆ సంస్థ కేవలం మహారాష్ట్రలోనే కాదు, భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అందుకే ఆ సంస్థ స్వర్ణోత్సవాలను దేశ వ్యాప్తంగా దళితులు ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుపుకొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన దళిత పాంథర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించే అవకాశం నాకు రావడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. అంతకుమించిన గొప్ప అనుభవాన్నిచ్చింది.
ఇద్దరు దళిత యువకులు మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిగోళాలు విసిరేంతటి సాహసానికి పూనుకోవడానికి రెండు దుస్సంఘటనలు కారణమయ్యాయి. ఒకటి, పుణే జిల్లాలోని బావ్డా గ్రామంలో దళితులను మిగతా కులాలన్నీ ఏకమై వెలివేశాయి. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ రావు సోదరుడు శహాజిరావు పాటిల్ దీనికి నాయకత్వం వహించారు. రెండవది, పర్భని జిల్లా భాహారా గావ్‌లో ఒక అగ్రవర్ణానికి చెందిన బావి నుంచి ఇద్దరు దళిత మహిళలు నీళ్ళు తోడుకొని తాగుతున్నందుకు వారిని పట్టుకొని నగ్నంగా ఊరేగించారు. ఇది వారి గుండెల్ని మండించింది.
ఈ సాహసం చేయడానికీ, దళిత పాంథర్ ఉద్యమం ప్రారంభం కావడానికీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇలయపెరుమాళ్ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అత్యాచారాల వివరాలను 1969లో బయటపెట్టింది. 1965లో విచారణ ప్రారంభించిన కమిటీ 1969 జనవరి 30 నాడే నివేదికను పార్లమెంటుకు అందజేసింది. ఆ నివేదిక పార్లమెంటును కుదిపివేసింది. అందులో మహారాష్ట్రకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇవి యువకులనూ, రచయితలనూ బాగా కదిలించాయి. వీటికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనను నిర్మించాలనీ, ప్రభుత్వాలకు ఒక గుణపాఠం నేర్పాలనీ ఆ కార్యకర్తలు నిర్ణయించారు. ఈ ఉద్యమ ప్రయత్నంలో జేవీ పవార్, దయా పవార్, అర్జున్ డాంగ్లే, నామ్‌దేవ్ దసాల్, ప్రహ్లద్ చార త్వంకర్‌లను మొదటి వ్యక్తులుగా చెబుతున్నారు.
‘ముందుగా ఒక ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటున్నాం. దళితులపైన జరుగుతున్న దాడులనూ, దౌర్జన్యాలనూ వివరిస్తూనే, దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను, అన్యాయాలను ప్రభుత్వం అరికట్టకపోతే, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది. దానిమీద రాజా ధాలే, నామ్‌దేవ్ దసాల్, అర్జున్ డాంగ్లే, భీంరావు షిర్‌వాలే, ఉమాకాంత్ రణధీర్, గంగాధర్ పంతాల్నే, వామన్ నింబల్కర్, మోరేశ్వర్ వహానే సంతకాలు చేశారు. ఆ విధంగా ప్రారంభమైన దళిత్ పాంథర్ ఉద్యమం 1972 నుంచి 1977 వరకు మరెన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఇదే స్ఫూర్తితో అక్కడక్కడా అనేక దళిత పోరాటాలు సాగాయి. దారుణమైన నిర్బంధాన్నీ, అరెస్టులనూ ఈ ఉద్యమం ఎదుర్కొన్నది. అయితే వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. ప్రభుత్వాలను తమ తప్పు తెలుసుకునేటట్టు చేయగలిగింది. కులతత్వాన్ని బోధించే హిందూ శక్తులను ప్రతి ఘటించింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది.
1992 ఆగస్టు 12న ఎరగావ్‌లో ఒక దళిత రైతును దేవుడికి బలిచ్చిన దారుణమైన అకృత్యం జరిగింది. రామ్‌దాస్ నార్నవరె అనే దళిత రైతు ఎనిమిది ఎకరాల ఆసామిగా ఉండి, ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడడం కులతత్వ వాదులకు నచ్చలేదు. అతడిని అత్యంత దారుణంగా ముక్కు, చెవులు కోసి, గొంతు కోసి చంపేశారు. పోస్టు మార్టమ్, పోలీసు కేసు కూడా లేకుండా అతని దేహంతో పాటే ఈ దేశ దళితుడి ఆత్మగౌరవాన్ని భూమిలో పాతేశారు. ఇది తెలిసిన దళితులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తే, నిజాలు బట్టబయలయ్యాయి. అప్పుడు నిందితులను అరెస్టు చేయక తప్పలేదు.
పుణే జిల్లా భంగావ్ గ్రామంలో 1973 సెప్టెంబర్ 17న దళిత్ పాంథర్స్ కార్యకర్తలు జరిపిన బహిరంగ సభ ఆ గ్రామంలోని దళితులను ఏకం చేసింది. రాజ్‌గురు తహశీల్‌లోని అస్థేడ్ గ్రామంలో దళిత రైతుకు చెందిన 30 ఎకరాల భూమిని సాగుచేయకుండా, తుపాకితో బెదిరించిన భూస్వామిని నిలదీసి ఆ భూమిని ఇప్పించారు. దళిత్ పాంథర్‌కు చెందిన 92 మంది యువకులు ప్రత్యక్షంగా గ్రామంలోకి వెళ్ళారు. వాళ్ళ మీద అగ్రకులాలు దాడిచేశాయి. వాళ్ళను ప్రతి ఘటించి విజయం సాధించారు. ఇట్లా ఎన్నో సంఘటనల్లో తమదైన మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించారు. ఒకానొక దశలో యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యక్షంగా నిలబడి పోరాటం సాగించడం వల్ల దళితుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది.
అప్పటికి వివిధ పార్టీలలో ఉన్న దళిత నాయకులు నిర్లిప్తంగా ఉండడం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీ నాయకత్వ అవకాశవాదాన్ని ఈ ఉద్యమం బహిర్గత పరిచింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన ఆర్‌పీఐ నాయకత్వం దళితులకు దూరమైంది. ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పుణే పర్యటనలో దళిత్ పాంథర్స్ ప్రతిఘటనల పిలుపుతో తన ప్రయాణాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. దళిత్ పాంథర్ ఉద్యమం ఒక రకంగా నాటి కుల సమాజాన్నీ, దౌర్జన్య కాండనూ సవాల్ చేసింది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలతో అంటకాగకుండా స్వతంత్ర మార్గంలో సాహసోపేతంగా ఉద్యమాన్ని నడిపింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడులలో అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. ఎంతో మంది దళిత రచయితలు రాసిన తమ స్వీయ చరిత్రలు నూతన సాహిత్య విలు వలకూ, ధోరణులకూ పునాదులు వేశాయి.
గత యాభై ఏళ్ళలో దళితుల జీవితాల్లో మార్పు రాలేదని అనలేం. కానీ దాడులు, అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, దళిత సమస్యలే అజెండాగా, రాజకీయ అవకాశ వాదంలేని ఒక స్వతంత్ర దళిత ఉద్యమం మళ్ళీ ఆరంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
- మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment