అంబేద్కర్ దీప్తి
దళిత భారతం
దళితుల విముక్తికి.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌కు మధ్య విడదీయలేని సంబంధం 20వ శతాబ్దంలోనే మొదలుకాగా.. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అంబేద్కర్ భావజాలమొక్కటే తమను ముందుకు తీసుకెళ్లగలదన్న దశకు దళిత ఉద్యమం చేరుకుంది. అసమానతలు బలంగా వేళ్లూనుకున్న భారతీయ సమాజంలో నిరంతరం సమానత్వం కోరుతూండటమే దళిత సాధికారత.
సుమారు 500 ఏళ్ల క్రితం దళితుల విముక్తి కోసం భక్తి ఉద్యమం ద్వారా తొలి ప్రయత్నం జరిగింది. దేవుడి ముందు అందరూ సమానమేనని.. గుడి, పూజారీ వంటి మధ్యవర్తుల అవసరం లేదన్న భావనతో మొదలైన భక్తి ఉద్యమనం తరువాతి కాలంలో భిన్న వర్గాలు, మతాలుగా విడిపోయాయి. బసవణ్ణను ఆరాధించేవారు లింగాయతుల్లో వెనుకబడిన తరగతివారిగా మారిపోతే.. రవిదాస్‌ను అనుసరించే వారు రవిదాసీల పేరుతో దళితులుగా రూపాంతరం చెందారు. కబీర్‌ను పూజించే వారు కబీర్ పంతి పేరుతో దళితులయ్యారు. మొత్తమ్మీద చూస్తే భక్తి ఉద్యమం సమాజంలో సమానత్వం తేవడంలో విఫలమైందని చెప్పాలి.
20వ శతాబ్దంలో మహార్, మాల, పల్లన్, పరాయణ్, పులయ, హోలియా, దుషాద్ వర్గాల వారికి స్థానిక పాలేగాళ్లు, రాజుల సైనిక దళాల్లో ప్రాతినిధ్యం లభించడంతో దళిత అభ్యున్నతిపై కొన్ని ఆశలు రేకెత్తాయి. ఛత్రపతి శివాజీ సైన్యంలో మహార్లను ప్రాతినిధ్యమున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సైనికులుగా తమ ధీరత్వం సామర్థ్యాలతో బ్రిటిష్ పాలకులనూ మెప్పించడంతో తమకు మరిన్ని అవకాశాలు అందబాటులోకి వస్తాయని దళితులు ఆశించారు. క్రైస్తవ మిషనరీల రాక కూడా ఈ విషయంలో పెద్ద భూమికనే పోషించింది. ఆది ఆంధ్ర, ఆది హిందు, ఆది ద్రావిడ, ఆది కర్ణాటక ఉద్యమాలు, పంజాబ్‌లో ఆది ధార్మి ఉద్యమం 20వ శతాబ్దం తొలి దశకాల్లో వచ్చాయి. ఆది ఆంధ్రులను వర్గీకరించి ఒకశాతం రిజర్వేషన్ కల్పించేందుకు 2000లో జరిగిన ప్రయత్నం వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసింది.దళితుల విముక్తి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మూడు వ్యవస్థలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. 1947 వరకూ దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలక వర్గం ఇందులో ఒకటైతే.. ఇంకోకటి మహాత్మగాంధీ! మహాత్మాగాంధీ వ్యతిరేకించినప్పటికీ 1932 నాటి రౌండ్ టేబుల్ సమావేశాలు, పూనా ఒప్పందాల ద్వారా చట్టసభల్లో దళితులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసే అవకాశం కల్పించాయి.
వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా (1942 – 1946) అంబేద్కర్ దళితులకు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను ప్రవేశపెట్టగా అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. 1944లో అంబేద్కర్ ప్రవేశపెట్టిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కూడా ఇప్పటికీ కొనసాగుతోంది. నెహ్రూ కేబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా తొలి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4) రూపంలో విద్యాసంస్థల్లో దళితులకు సీట్లు రిజర్వ్ చేయించిన ఘనత కూడా అంబేద్కర్‌దే. ఇక అంబేద్కర్ పోరాడిన మూడో వ్యవస్థ హిందూమతం. విపరీతమైన విమర్శల తరువాత 1956లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అదే సంవత్సరం మహా పరినిర్వాణం చెందారు.
స్వాతంత్య్రం తరువాత దేశంలో దళిత ఉద్యమం, సాధికారత అన్నవి అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగ నిబంధనల సాయంతోనే నడుస్తున్నాయి. చట్టసభల్లో దళితుల రిజర్వ్‌డ్ సీట్లకు 1960తోనే ముగింపు పలకాల్సి ఉండగా జవహరలాల్ నెహ్రూ కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇందిరాగాంధీ తదితరులూ నెహ్రూ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది. 2017 నాటికీ కొనసాగుతున్న ఈ రిజర్వేషన్లను ఇప్పుడు తొలగించడం, సవరించడం దాదాపుగా అసాధ్యం.
1955లో అస్పృశ్యతపై నిషేధంతో వచ్చిన ‘ద అన్‌టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్’, 1976 నాటికి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మారిపోయింది. దళిత ఉద్యమం కారణంగా 1989లో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం రాగా కె.రాజు, సిరివెళ్ల ప్రసాద్ వంటి వారి రెండు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా 2013లో ఈ చట్టానికి శక్తిమంతమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల హక్కులు, మనుషులతో పారిశుద్ధ్య పనులు చేయించడంపై బెజవాడ విల్సన్ నిరంతర పోరు కారణంగా 2013లో పారిశుద్ధ్య కార్మికుల పునరావాస చట్టం వచ్చాయి.
దాదాపు 70 ఏళ్ల దళిత ఉద్యమంలో అత్యున్నత ఘట్టం 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేయడం. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో దళిత ఉద్యమకారుడు, జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య పదిహేనేళ్లపాటు జరిపిన పోరాటం ఫలితమిది. తాజాగా 2017 కేంద్ర బడ్జెట్ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ చట్టంలోనూ తగు మార్పులు చేసేలా లక్ష్మయ్య జాగ్రత్తలు తీసుకున్నారు.
అయినా దళితులపై అత్యాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటరానితరం, వివక్ష పలు రూపాల్లో ఇప్పటికీ అస్తిత్వంలో ఉన్నాయి. ఆర్థిక సరళీకరణలు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను ప్రభుత్వ రంగం నుంచి దూరం చేయగా దళితులకు ఈ రెండూ దక్కడం దుర్లభమవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత పరస్పర విరుద్ధ పరిస్థితులన్న దశకు చేరుకున్నాం. దళిత బాలిక టీనా దాబీ ఐఏఎస్ పరీక్షల్లో తొలిర్యాంకు సాధించినా.. గరగపర్రు లాంటి సంఘటనలు అత్యద్భుతమైన రాజ్యాంగం, చట్టాలు ఉన్నప్పటికీ దళితుల విముక్తికి 70 ఏళ్ల సమయం చాలా తక్కువన్న అంశాన్ని సమాజానికి, పాలకవర్గాలకు గుర్తు చేస్తూనే ఉంటుంది.
– రాజశేఖర్ వుండ్రు, ఐఏఎస్
(రచయిత నేషనల్ లా స్కూల్ నుంచి అంబేద్కర్‌పై పీహెచ్‌డీ చేశారు)