‘మహా’ ప్రభుత్వం చేతగానితనంవల్లే.. | Maharastra government fail to control situation | Sakshi
Sakshi News home page

ఈ ఘటనలు సిగ్గుచేటు

Published Thu, Jan 4 2018 1:23 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

Maharastra government fail to control situation - Sakshi

సమాజంలో ఘర్షణలు తలెత్తకుండా నివారించడం, ఒకవేళ అలాంటివేమైనా జరిగితే వెనువెంటనే రంగంలోకి దిగి సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చూడటం ప్రభుత్వాల కనీస కర్తవ్యం. ఈ రెండు విషయాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడం వల్ల ఆ రాష్ట్రం రెండురోజులుగా హింసతో అట్టుడుకుతోంది. పుణే సమీపంలో 30 ఏళ్ల దళిత యువకుడొకరు ప్రాణాలు కోల్పోగా ఆ వర్గానికే చెందిన పలువురు గాయాలపాలయ్యారు. భారీయెత్తున ఆస్తినష్టం సంభవించింది. అనేకచోట్ల దళితులపై దాడులు అడ్డూ ఆపూ లేకుండా కొనసాగాయి. 200 ఏళ్లక్రితం ఆధిపత్య కులాలపై సవాలు విసిరి ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించిన దళిత వీరుల స్మారకార్ధం ఏటా జరుపుకుంటున్న సంస్మరణ ఇంతటి హింసకూ, బీభత్సానికీ కారణమైందంటే ఆశ్చర్యం కలుగుతుంది. సమాజం మునుపటిలా లేదని, స్వాతంత్య్రం వచ్చిననాటితో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగైందని వాదించేవారున్నారు. దళితులకిచ్చిన రిజర్వేషన్ల అవసరమే లేదని చెప్పేవారున్నారు. దళితుల కోసం తీసుకొచ్చిన అత్యాచారాల నిరోధక చట్టంలాంటి ప్రత్యేక పరిరక్షణ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని వాదించే ఘనులున్నారు. కానీ దళితులపై ఆధిపత్య కులాల అహంకార వైఖరి ఇంకా నశించలేదని, వారిపై సామాజిక అణచివేత చర్యలు ఆగటం లేదని, కనీసం తమవారిని స్మరించుకునే హక్కును కూడా వారికి లేకుండా చేద్దామన్న ప్రయత్నం సాగుతోందని వర్తమాన మహారాష్ట్రను చూస్తే అర్ధమవుతుంది.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జన్మస్థలి మహారాష్ట్ర. అక్కడ 70వ దశకంలో పెల్లుబికిన దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు...ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. అలాంటిచోట గత కొన్ని దశాబ్దాలుగా ఏటా జనవరి 1న పుణే సమీపంలోని భీమా నది ఒడ్డున గల స్మారక చిహ్నం వద్దకు దేశం నలుమూలలనుంచీ వేలాదిమంది దళితులు రావడం తమ వీరులను స్మరించుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాదితో ఆ ఉదంతం జరిగి 200 ఏళ్లు అవుతున్నది గనుక ఈసారి మరిన్ని వేలమంది అక్కడికొచ్చారు. ఇలాంటి సభ సజావుగా సాగడం కోసం ప్రభుత్వ యంత్రాంగం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సభకు వచ్చేవారిలో పిల్లలు, వృద్ధులు ఉంటారు గనుక వారిని దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది. ఇవేమీ లేకపోగా కనీస సంఖ్యలో ఉండాల్సిన పోలీసులు కూడా అక్కడ పత్తా లేరంటే అది బీజేపీ–శివసేన ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఆ సభకు రెండు మూడు రోజుల ముందు ఆ సమీప ప్రాంతాల్లో జరిగిన ఉదంతాల వల్ల ఉద్రిక్తత ఏర్పడి ఉంది.

ఈసారి సభ జరగనిచ్చేది లేదని ఒకటి రెండు కుల సంఘాలు హెచ్చరిస్తే డాక్టర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ స్వయంగా వారి దగ్గరకెళ్లి వెళ్లి మాట్లాడి రివాజుగా జరిగే సభను అడ్డుకుంటామనడం భావ్యం కాదని హితవు చెప్పారు. పర్యవసానంగా కొందరు వెనక్కి కూడా తగ్గారు. శివ్‌రాజ్‌ ప్రతిష్టాన్, హిందూ ఏక్తా అఘాదీ అనే రెండు సంస్థలు ఈ విజయోత్సవంలో బ్రిటిష్‌ అనుకూలతను వెదికాయి. అప్పటి పీష్వాలకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ సేనలు పోరాడి విజయం సాధించి తమ పాలనను సుస్థిరం చేసుకున్న ఈ సందర్భాన్ని విజయోత్సవంగా జరుపుకోవడమేమిటన్నది వాటి ప్రశ్న. కానీ దళితులు దీన్ని మరో కోణంలో చూస్తున్నారు. అంటరానితనాన్ని పాటించి తమను జంతువుల కన్నా హీనంగా చూసిన పీష్వాలపై దళితులు  ప్రతీకారం తీర్చుకునేందుకే భారీయెత్తున ఈస్టిండియా కంపెనీ సైన్యంలో చేరారని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెగించి పోరాడారని అంటున్నారు. సారాంశంలో పీష్వా పాలన అంతం దళితుల విజయమని చెబుతున్నారు. ఆ సంస్మరణకు అభ్యంతరం వ్యక్తం చేసే ముందు...ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ రెండు శతాబ్దాలనాటి అమానుషత్వమే ఎందుకు రాజ్యమేలుతున్నదన్న ప్రశ్న వేసుకుంటే ఆ సభ నిర్వహణలోని ఔచిత్యమేమిటో అర్ధమయ్యేది.

అది ఒకానొక కాలంలో అమలైన అమాను షంగానే...అప్పటి తరంలోని ఆధిపత్య వర్గం సంకుచిత భావాలతో వ్యవహరించిన తీరుగానే పరిగణించి అన్ని వర్గాలవారూ ఆ సంస్మరణలో సమష్టిగా పాలు పంచుకునే విశాల దృక్పథం అందరిలో ఏర్పడి ఉంటే మనం సాధించిన ఏడు దశాబ్దాల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు అర్ధం ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు లేవు సరికదా సమీప భవిష్యత్తులో సైతం ఏర్పడబోవని మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న ఘటనలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఈ సభకు కొన్ని రోజుల ముందు అక్కడికి సమీప గ్రామంలో ఉద్రిక్తతలు రాజేయడం, సభకు వస్తున్న వారినీ, దాన్నుంచి వెళ్తున్నవారినీ లక్ష్యంగా చేసుకుని అనేకచోట్ల దాడులు చేయడం చూస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందనిపిస్తుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంవల్ల వరసగా రెండురోజులు రాష్ట్రం స్తంభించిపోయింది.  ఆస్తులు దహనమయ్యాయి. పొరుగునున్న గుజరాత్‌కు సైతం ఈ ఆందోళనలు పాకాయి. 2016 డిసెంబర్‌లో మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి సవరణలు తీసుకురావాలని ఉద్యమించినప్పుడు కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలింది. తాజా ఘటనలపై న్యాయవిచారణ జరిపిస్తామని ఫడ్నవీస్‌ చెబు తున్నారు. అది చాలదు. సభకు మూడు నాలుగు రోజుల ముందునుంచీ ఉద్రిక్తతలు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితుల వెనక ఉన్నదెవరో, సభ జరిగే రోజున అనేకచోట్ల దళితులపై దాడులు చేసిందెవరో కూడా విచారణాంశాల్లో చేర్చాలి. ఎన్నో రంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని, ప్రపంచమంతా మనవైపే చూస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ సామాజికంగా ఇంకా మధ్య యుగాలనాటి న్యాయమే అమలవుతున్నదని భీమా–కోరెగావ్‌ ఉదంతం, తదనంతర పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే మనం సాధించిన స్వాతంత్య్రానికి అర్ధం ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement