
సాక్షి, ముంబయి : మహారాష్ట్రలో దళితులు శాంతించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగిరావడంతో వారు తమ బంద్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపుమేరకు బంద్‌ను ఆపేశారు. కోరేగావ్ -భీమా యుద్ధానికి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉత్సవం కాస్త కొన్ని అగ్రకులాలవారి జోక్యంతో ఘర్షణగా మారడం, ఇందులో ఓ వ్యక్తి చనిపోవడం,పలు చోట్ల దళితులపై దాడులు జరగడం వంటి కారణాలతో ప్రకాశ్ అంబేద్కర్ మంగళవారం నుంచి నిరవదిక బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముంబై, థానే, పూణే నగరాల్లో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. రెండు నగరాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడ ఆగిపోయింది. ముంబై నగరంలో మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. థానే నగరంలో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. పూణెలో మొదలైన దళిత ఉద్యమం మొత్తం మహరాష్ట్ర అంతటా విస్తరించింది. బుధవారం బంద్ సందర్భంగా మహారాష్ట్రలో పాఠశాలలు మూసేశారు. ప్రజారవాణ దాదాపు ఆగిపోయింది. థానేలో ఆందోళనకారులు రైలు సేవలకు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నించారు. మంగళవారం జరిగిన హింసలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 187 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో చివరకు ఈ విషయం చేయిదాటక ముందే అప్రమత్తమైన ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ రంగంలోకి దిగారు. దళితులపై జరిగిన దాడి విషయంలో విచారణకు ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాస్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపిస్తామన్నారు. హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.