మనిషి రూపాలే ఆ అక్షరాలు | Katti padmarao writes on c narayana reddy | Sakshi
Sakshi News home page

మనిషి రూపాలే ఆ అక్షరాలు

Published Wed, Jun 14 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

మనిషి రూపాలే ఆ అక్షరాలు

మనిషి రూపాలే ఆ అక్షరాలు

ఉర్దూతో విద్యాభ్యాసం మొదలైనా తెలుగు భాషాభిమాని అయ్యాడు నారాయణరెడ్డి. ఆయన కవిత్వంలో ఉర్దూ గజళ్లలోని మానవతావాద స్పర్శ ఉంది. అయితే ఆయన నిరాశను కాక ఆశావహ సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నించాడు. తెలుగు కవిత్వంలో వేమన, గురజాడ, జాçషువ, శ్రీశ్రీ, సినారె వీరంతా కవిత్వంగా పుట్టి, కవిత్వంగా జీవించారు. శరీరం మట్టిలో కలుస్తుంది. అక్షరం ఆకాశ నక్షత్రమై వెలుగొందుతుంది. అక్షరానికి మరణం లేదు.. కవికీ మరణం లేదు..

ఆకాశం నుంచి భూమికి కవితా వెలుగులు ప్రసరింపజేసినవాడు.. తెలంగాణ మాగాణం నుంచి ఆకాశాన నక్షత్రమై వెలుగొందినవాడు. భూమి పొరలు చీల్చి కవితా జలతరంగమై పొంగినవాడు. కవిత్వాన్ని మానవతా గానం చేసి ఆలపించినవాడు. మానవత్వాన్ని జీవితాచరణగా మలచినవాడు. నిరంతర కవితాధ్యయన సంపన్నుడు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి. సుబంధుడు అన్నట్టు ‘ప్రత్యక్షర శ్లేషమయ ప్రబంధ–విన్యాçస వైదగ్ధ్య నిధి: కవీనామ్‌’. మాటే శ్లేషగా పలికినవాడు.

పలుకు పలుకులో పలుకుబడినీ, శ్రుతినీ మేళ వించి కవిత్వమై భాసించినవాడు. మహాకవి, పరిశోధకుడు, మహోపాధ్యాయుడు, మహావక్త. ‘విశ్వనాథనాయకుడు’లో ఆయనే అన్నట్టు ‘గుండెపై కుంపటి రగుల్కొనగ పరుగెత్తి–పశ్చిమాంభోధి గర్భమున సూర్యు డుదూకె– తన ప్రతాపమ్ము వార్ధక్యదోషోపహత–మైపోయె బ్రతుకెందుకని ముఖము తప్పించె– చిర్రుబుర్రను అల్పచిత్తుల ముఖస్థితికి–ప్రతిబింబమటు లెర్రవడెను పడమటిదిక్కు–ఒక భ్రష్టచేతసుని వికృతోహలకు బాహ్య రూపమోయన్నట్టు వ్యాపించెను తమస్సు’. మహాకవి నారాయణరెడ్డి సూర్యుడినీ, చీకటినీ తన కవిత్వంలో లోతుగా అభివ్యక్తి చేశాడు.

ఆ పలుకు మీద ఎన్ని ప్రభావాలో!
ఇతివృత్తం ఏదైనా దానిని సుసంపన్నం చేయటం ఆయన కవితాశైలి. విశ్వనా«థనాయకుని కావ్యం తంజావూరు రాజుల చరిత్ర నుంచి తీసుకున్నారు. విశ్వనా«థనాయకుని తల్లిని సృష్టించారు. ఈ కావ్యాన్ని అతి ప్రసిద్ధమైన ఖండగతి, మిశ్రగతి, త్రిశ్రగతి ఛందస్సులో రాశారు. ఈ కావ్యం జగత్‌ ప్రసిద్ధి కావటానికి కారణం సినారె అధ్యయం చేసిన, బోధించిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, పాండురంగ మహత్మ్యం, విజయ విలాసం గ్రంథాల అధ్యయన స్పృహ ఇందులో ఉండడమే.

సినారె శ్రీనాథుడిని ఒడిసి పట్టారు. ఆ కవిసార్వభౌముడి సీసపద్యంలో ఉన్న గమకాన్ని తెలుగు వచన ఛందంలోకి ప్రవహింపచేశారు. అటు కృష్ణశాస్త్రినీ, ఇటు శ్రీశ్రీనీ తనలో ఇముడ్చుకొని భిన్నంగా సొంత శైలిని అభ్యసించారు. ఆయనది శ్రీనాధుని జీవనశైలి. ఆత్మాభిమానం కూడా ఎక్కువ. మహాకవి జాషువ అంటే ప్రాణం. జాషువ ప్రభావమూ ఆయన జీవన శైలి మీద, కవిత్వం మీద ప్రగాఢంగా ఉంది. సంభాషణలలో ఆయనే చెప్పినట్టు పుట్టిన ఊరు హన్మాజీపేటలో జానపదులు పాడే జక్కుల కథల నుంచి, హరికథల నుంచి శ్రుతి నేర్చుకున్నారు. భూమి ఉన్న వారి కుటుంబంలో పుట్టినా అహంకారాన్ని వీడి దళితవాడల్లో సంచరించాడు.

ఆయన కవిత తపఃఫలం
కవిత్వాన్ని అలవోకగా రాసినట్టు అనిపించినా అది వచ్చేది మాత్రం తపస్సు నుంచే. భూమిని చూసినా, కొండను చూసినా, నదిని చూసినా సినారె పొంగిపోతాడు. మనిషిని చూస్తే విచ్చుకుంటాడు. జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని తీసుకువచ్చిన ‘విశ్వంభర’ గురించి ఇలా అన్నారాయన: ‘ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి! కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి! ఆదిమ దశ నుంచీ ఆధునిక దశ వరకూ మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు. మనిషి సాధన త్రిముఖం, కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు, క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.

‘విశ్వంభర’ కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది. విశ్వంభరలో ఆయన మానవునిలో ఉండే అన్ని కోణాలను మనముందుకు తీసుకువచ్చాడు. మనిషి అంతర్మథనాన్ని గురించి మహత్తరంగా వర్ణించాడు. ప్రకృతినీ, మనిషినీ ఉజ్జ్వలంగా సమన్వయిం చాడు. కవిత్వానికి మానవతత్వం తోడైతే చిత్తదీప్తిని అభివ్యక్తి చేయగలిగిన మహత్తర గుణం ముందుకు వస్తుంది. మహా కవిత్వంలో ఉండే భావ గాంభీర్యం, రస ప్రతీతి లక్షణాలు విశ్వంభరలో కనిపిస్తాయి. అవి ఇలా సాగాయి: ‘అడుగు సాగుతున్నది అడుసులో నక్కిన ముళ్ళను తొక్కేస్తూ/ అడుగు సాగుతున్నది అడ్డగించిన మంచుబెడ్డలను కక్కిస్తూ/ కనిపిస్తున్నాయి అడుగు కంటికి మనుషుల తోళ్లు కప్పుకున్న తోడేళ్లు/ వినిపిస్తున్నాయి అడుగు చెవికి తునిగిపోతున్నా అరవలేని లేళ్లనోళ్లు. అడుగు గుండెలో ఉబికింది కడలిని ముంచేసే కన్నీరు/ అడుగు గొంతులో ఉరిమింది పిడుగులను మింగేసే హోరు’. ఈ కవిత్వం చదువుతుంటే చేమకూర వేంకటకవి ‘విజయ విలాసం’ చదివినట్టుంటుంది. రామరాజభూషణుడి వసుచరిత్రలా భాసిస్తుంది. కవి త్వంలో శ్రుతిబద్ధతే కాక అంతర్మ«థనం, వ్యక్తిత్వ ప్రకటన, ప్రకృతి అన్వయం మనకు కన్పిస్తాయి.

ఉర్దూ ఉషస్సులో తెలుగు కవితా వాకిలికి
సినారె జీవితంలో విద్యార్జన ఘట్టమూ అధ్యయనపూర్ణమైందే. చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చిన తర్వాత చాదర్‌ఘాట్‌ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలోనే ఆయన (1948–49) ఇంటర్‌ పూర్తిచేశారు. నిజానికి ఉర్దూ భాష మనిషిని ఉన్నతునిగా మారుస్తుంది. సినారె కవిత్వంలోని సాంద్రతకూ, సూక్తుల అభివ్యక్తికీ కారణం ఉర్దూ కవిత్వమే.

ఉర్దూ కవిత్వంలో ఆయనకున్న అభినివేశం మెుత్తం ఆయన కవిత్వంలో పరిమళిస్తుంది. కబీర్‌ అన్నట్టు ‘చక్కీ చలతీ దేఖ్‌ కర్‌దియా కబీరా రోయ్‌– దో పాటన్‌ కే బీచ్‌ మే సాబిత్‌ బచా న కోయ్‌’ (రెండు రాళ్ల మధ్య ధ్యానమంతా నలిగిపోతున్నది. ఏమీ మిగలలేదు. సుఖం, దుఃఖం, పుణ్యం, పాపం, పగలు, రాత్రి, వెలుతురు, చీకటి ఇవన్నీ కలగలసిన ప్రపంచం ద్వంద్వ జగత్తు. జనన మరణాలు సైతం రెండు. ఈ రెండింటి నడుమ చిక్కుకుని అమూల్యమైన జీవనకాలం మానవ జన్మ నష్ట పోయింది. లక్ష్యం సిద్ధంచలేదు– అని భావం. తిరుగుతున్న విసుర్రాయిని చూసి కబీర్‌ అలా అన్నాడు).

ఉర్దూతో విద్యాభ్యాసం మొదలైనా తెలుగు భాషాభిమాని అయ్యాడు నారాయణరెడ్డి. ఆయన కవిత్వంలో ఉర్దూ గజళ్లలోని మానవతావాద స్పర్శ ఉంది. అయితే ఆయన నిరాశను కాక ఆశావహ సందేశాన్ని ఇవ్వడానికే ప్రయత్నించాడు. ఉర్దూ కవిత్వం నుంచి ఆయన చీకటిని పారద్రోలి, వెలుగును చిమ్మే అభ్యుదయ పద్ధతిని స్వీకరించాడు. వామపక్ష భావాలున్న అభ్యుదయానికి బౌద్ధాన్ని సమన్వయించాడు. అయితే ఆయన విప్లవకారులు మరణించినప్పుడు కన్నీటి సంద్రమై కూడా రగిలాడు. ‘ఉదయం నిన్నురితీస్తారని తెలుసు, ఆ ఉదయాన్నే ఉరి తీస్తారని తెలుసు, కాంతి పచ్చినెత్తురులా గడ్డకట్టునని తెలుసు, కాలం క్షణకాలం స్తంభించిపోవునని తెలుసు.

న్యాయాన్నే శవంలాగ విసిరేస్తారని తెలుసు, ధర్మాన్నే చితి లోపల తగలేస్తారని తెలుసు. నీ నాదం జలధరాల నిండిపోవునని తెలుసు, నీ క్రోధం సాగరాల పొంగి పొరలునని తెలుసు. నీ చూపులు జ్యోతులుగా నీ శ్వాసలు ఝంఝలుగా, నీ స్మృతి జనసంస్కృతిగా నిలిచిపోవునని తెలుసు.’ అన్నారాయన. ఆయన రచనల్లో ‘మనిషి , మట్టి, ఆకాశం’ విశిష్టమైన కావ్యం. ఆయనది జీవన మథనం. ఆయన మనిషిని లోతుగా చూశాడు. మనిషిలోని వైరుధ్యాలను కవితాత్మకం చేశాడు. మనిషిలో ఉండే చీకటిని పారద్రోలి, మనిషిలో ఉన్న క్రాంతి నదులకు ఆనకట్టలు కట్టాడు. ఆయన నిత్యనూతనం. నిరంతర అక్షర సృష్టి ఆయనది. ఆయన పాటల్లోని కవిత్వం తెలుగు సినిమాలకు నూత్న శోభనిచ్చింది. మానవతా సందేశాన్ని, ప్రబోధ చైతన్యాన్ని, కుటుంబ నీతిని, స్త్రీ అభ్యుదయాన్ని, ఆత్మీయ బంధాన్ని అందించింది.

మనిషిని నమ్మినవాడు
సినారె జీవితంలో స్నేహభావం మెండు. బుద్ధుడు చెప్పిన ప్రేమ, కరుణ, ప్రజ్ఞలు ఆయన జీవిత గమనంలో కనిపిస్తాయి. ఆయన మనిషిని నమ్మాడు. మనిషే ఆయన కవిత్వానికి గీటురాయి. గురజాడ ప్రభావం ఆయన మీద బలంగా ఉంది. రాయప్రోలు సుబ్బారావు ప్రభావమూ ఉంది. ఆయన తెలుగు కవే అయినా సంస్కృత భాషా పదాలను కవిత్వంలో విరివిగా వాడారు. కొత్త తెలుగు పదబంధాలను సృష్టించారు. ‘మనిషి, మట్టి, ఆకాశం’లో ఆయన ఇలా అన్నాడు. ‘మడిచి చూస్తే మనిషి మెదడు పిడికెడు, తరిచి చూస్తే సముద్రమంత అగాధం ఆకాశమంత అనూహ్యం. ఎన్ని సజీవ భావధారలను తనలో కలుపుకుంటుందో ఎన్ని ప్రాణాం తక ప్రవృత్తుల తిమింగలాలను తన అడుగు పొరల్లో భద్రంగా దాచుకుంటుందో. పరవశించిందా అంతరిక్ష ఫాలంలో కొత్త నక్షత్రమై మెరుస్తుంది. కసి పుట్టిందా చీకటి పుట్టలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తుల్లో విషం నింపుకుని వస్తుంది. సృష్టి ఎత్తునూ లోతునూ కొలిచే మానదండం మానవ మస్తిష్కం. మస్తిష్కమంటే ఒత్తితే సొనకారే గుజ్జు పదార్థం కాదు. అమూర్తంగా ప్రభవించే అద్భుతాలోచనల ప్రసూతి నిలయం’’.


ఆయన అవార్డుల కంటే ఆయనే ఉన్నతుడు
సినారె గారితో నాది 30 ఏళ్ళ సాహితీ బంధం. ఆయనకంటే 22 సంవత్సరాలు చిన్నవాడిని. అయినా అటువంటి తేడాలు ఎప్పుడూ చూపించలేదు. ఆయనకు కవిత్వమంటే ప్రాణం. కవిత్వం వినటమే ద్యానం. కవిత్వం చదవడమే గానం. అందుకే ఆయనకు కవితా మిత్రులే ఎక్కువ. సంభాషణలో ఎన్నో జీవన గా«థలు వర్ణిస్తారు. జీవనసూత్రాలు చెబుతారు. నా కవితా సంకలనాలు పది ఆయనే ఆవిష్కరించారు. నాకు ఆయన పేరున ఉన్న పురస్కారాలు వచ్చాయి. ఆయన పొందిన పదవులు, అవార్డుల కంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. డాక్టర్‌ నారాయణరెడ్డి జీవనశైలి ఆయన గుండెల్లో ఉండే భావోద్వేగాలను వ్యక్తావ్యక్తంగా ఉంచుతుంది.

ఆయన ఉపన్యాసం సంగీత ధుని. ఆయన పాఠం గజల్‌ గానం. ఆయన ఎదుట మనిషిని నొప్పించడు. చెప్పదలచుకున్నది మాత్రం చతురంగా చెబుతారు. ప్రవక్త, తత్వవేత్త మరణిస్తే తిరిగి లేస్తారు. కవికైతే మరణమే రాదు. తెలుగు కవిత్వంలో వేమన, గురజాడ, జాçషువ, శ్రీశ్రీ, సినారె వీరంతా కవిత్వంగా పుట్టి కవిత్వంగా జీవిం చారు. శరీరం మట్టిలో కలుస్తుంది. అక్షరం ఆకాశ నక్షత్రమై వెలుగొందుతుంది. అక్షరానికి మరణం లేదు.. కవికీ మరణం లేదు..

వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత
డా.కత్తి పద్మారావు
మొబైల్‌ : 98497 41695

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement