విశ్వవీణపై మన పాట
రెండో మాట
‘‘విశ్వంభర’’ ద్వారా కావ్య నాయకుణ్ణి మానవుణ్ణి చేసి, కథకు నేపథ్యంగా ప్రకృతిని ఉపాసించి వాటి పుట్టుపూర్వాలనూ, అభ్యుదయ పరంపరనూ కీర్తిస్తాడు. ‘సృష్టికి జీవహేతువేదో, ప్రకృతి పురుషులకు మూలధాతువేదో’ చెబుతాడు. మానవుని ఉషోదయానికి ముందు ప్రకృతి పురుటినొప్పులను పరవశించి వర్ణించాడు. కావ్యసాధనకూ, కార్యసాధనకూ పొట్టి మాటలలోనే గట్టి భావాలూ, చిట్టిపాదాలలోనే దిట్టతనమూ వ్యక్తం చేస్తాడు. సినారె శిరస్సున కవి, మనస్సున కవి. కనుకనే వ్యక్తిత్వం, సహృదయత అతని రచనలకు ఆయుధాలు.
అతడొక ‘పద్మశ్రీ’, కళాప్రపూర్ణ, మధురకవి, ఈనాటి ‘జ్ఞానపీఠ్’ పురస్కార పురుషుడు. అతడే డాక్టర్ సి. నారాయణరెడ్డి. ఒకనాడు రాక్షసుణ్ణి పట్టుకున్నవాడికి ‘‘లక్ష రూపాయల బహుమతి’’ని ప్రకటించిన పత్రికావార్త ఆధారంగా ప్రచలితుడై అందుకు వేట ప్రారంభించిన వాడు ‘సినారె’. మంచి–చెడుల పూర్ణకుంభమైన మానవునిలోని సగం రాక్షసాంశ, సగం మానవాంశను గురించి, అతడి అంతరంగంలోకి చొరబడి, రాక్షసుడెక్కడి వాడోకాడు, నీలో నాలో ఉన్నాడని చాటాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు భగవద్గీతనూ, భర్తృహరినీ అదే పనిగా పదే పదే వల్లిస్తుండే, తిరగేస్తుండే ఈ పయోముఖ విషకుంభం ‘‘దండలు వేయించుకుంటూ’’, దండోరా వాయించుకుంటూ, గుహల్లో తానై, గ్రూపు ఫొటోలో తానై, సభల్లో తానై, సంతల్లో తానై, ప్రదర్శనశాలల్లో తానై, పానశాలలోనూ తానై చరించే ఈ మానవుడెవడు? పై లక్షణాలున్న రాక్షసుణ్ణి ‘సినారె’ పసికట్టాడు: ‘‘ప్రతి ఇద్దరిలో ఒక రాక్షసుడు/ ప్రతి ఒక్కరిలో ఒక రాక్షసుడు/ అంతరంగంలోకి తొంగిచూడగా అక్కడా ఒక రాక్షసుడు!’’అయితే ఈ పరిశోధనను జైత్రయాత్రగా సాగించిన నారాయణరెడ్డి అపరాధ పరిశోధనకై ప్రకటించిన ‘‘లక్ష రూపాయల బహుమతి’’ తనకు చిక్కనందుకు చింతించనక్కరలేదు! తన స్వరూపం తెలిసినందుకు (మానవుని అంతరంగం) సంతృప్తిగా నాడు నిట్టూర్చినందుకు ప్రతిఫలంగా, మానవునిలో రాక్షసాంశ పోనూ మిగిలిన మానవాంశకు గుర్తింపుగా, మానవతా విలువలకు నివాళిగా జావళీ పట్టిన ‘‘జ్ఞానపీఠ్’’లక్షన్నర రూపాయల అవార్డూ ప్రతిభా పురస్కార పరిహారంగా భావించుకోవచ్చు! నాడూ, నేడూ కూడా లోకవృత్తానికి కేంద్రబిందువైన ప్రకృతినీ–మానవుణ్ణీ తన చైతన్య కవితారథానికి రెండు చక్రాలుగా మలచుకున్నవాడు సినారె. ఈ లోకం మానవ ద్వేషికీ, సమున్నత శిఖరాలను అధిరోహించగోరే మానవతా ఉన్మేషికీ భిన్న రూపాలలో దర్శనమిస్తుంది.
ఆ విశ్వదర్శనంలో భాగంగానే విశ్వనాథ, రాయప్రోలు, మధునాపంతుల, శ్రీశ్రీ, బైరాగి, రావిశాస్త్రి, బీనాదేవి అమోఘమైన రచనలు చేశారు. అయినా గత పందొమ్మిదేళ్లలో ‘విశ్వనాథ’కు తప్ప మిగతా వారెవరినీ ‘జ్ఞానపీఠం’ పురస్కరించి తన ప్రతిష్టను నిలబెట్టుకోలేక పోయింది. పందొమ్మిదేళ్ల తరువాత మరొక తెలుగువాడికి (సినారెకు) ఈ పురస్కారం లభించినందుకు సంతోషించనివాడుండడు. అయితే అవార్డు ప్రకటనానంతరం సినారె హుందాగా, నిగర్వంగా చెప్పినట్టు ‘‘ఆంధ్రదేశంలో అర్హతగల ప్రతిభావంతులైన కవులూ, రచయితలూ కనీసం పదిమంది ఉన్నారు. వారిలో తానొకణ్ణ’’ని బెర్నార్డ్‌షాలా దిలాసాగా ప్రకటించాడు, అయితే ‘‘వారిలో ఎవరికి ఈ అవార్డు వచ్చినా నేను సంతోషించేవాణ్ణే’’నని చాటారు! ఎందుకంటే, నిజానికి ఒక ‘‘ఆంధ్రపురాణం’’, ఒక ‘‘మహా ప్రస్థానం’’అవార్డులకు మించిన అనంత ప్రతిభా సంపన్నాలు, అఖండ కీర్తిమంతాలు. అవి, సినారె ‘‘మంటలూ–మానవుడూ’’, ‘‘విశ్వంభర’’కావ్యాలకు ముందు విశ్వజనీన సత్యాలను విశాల ప్రపంచానికి పంచిపెట్టిన నవనీతాలు.
ఈ విశ్వం పుట్టుకకూ సినారె ‘‘విశ్వంభర’’ కావ్యజనానికీ పూర్వరంగం ఒక్కటే. ‘బిగ్ బ్యాంగ్’ తర్వాత ఈ భూమండలం ఏర్పడినప్పుడు పుట్టిన మంటలు కాలక్రమంలో చల్లారాయిగానీ మనిషిలోని ఆవేదన చల్లారలేదని సినారె ‘‘మంటలూ–మానవుడూ’’ కవితా ఖండికలలో చెప్పాడు: ‘‘మార్కం డేయుని లాంటి/ మారుతిలాంటి/ మహోజ్వల భావి చిరంజీవి మానవుడు చల్లారలేదు’’ అన్న కవి ‘‘విశ్వంభర’’ ద్వారా కావ్య నాయకుణ్ణి మానవుణ్ణి చేసి, కథకు నేపథ్యంగా ప్రకృతిని ఉపాసించి వాటి పుట్టుపూర్వాలనూ, అభ్యుదయ పరంపరనూ కీర్తిస్తాడు. ‘‘సృష్టికి జీవహేతువేదో, ప్రకృతి పురుషులకు మూలధాతువేదో’’ చెబుతాడు. మానవుని ఉషోదయానికి ముందు ప్రకృతి పురుటినొప్పులను పరవశించి వర్ణించాడు. కావ్యసాధనకూ, కార్యసాధనకూ పొట్టి మాటలలోనే గట్టి భావాలూ, చిట్టిపాదాలలోనే దిట్టతనమూ వ్యక్తం చేస్తాడు. సినారె శిరస్సున కవి, మనస్సున కవి. కనుకనే వ్యక్తిత్వం, సహృదయత అతని రచనలకు ఆయుధాలు. అతని దృష్టిలో, సాహిత్య సృష్టిలో ఉపమాలంకారం లేనిదే మానవుని ఉనికే ఉబుసుపోనిది (ఉపమా సినారెస్య).
ఉక్తిలోనూ, వక్రోక్తిలోనూ అందెవేసిన చెయ్యి. కనుకనే ‘‘విశ్వంభర’’లో ప్రకృతిలో అంతర్లీనమైన మానవుని జీవనాదం వినిపించాడు. ఆత్మర క్షణకు నేర్చుకున్న ఆది పాఠాలు చెప్పాడు. మనిషిలో, మనస్సులో ఒక ప్రభాతం వెలసి మౌనాన్ని చీల్చుకుపోతున్నప్పుడు ఆ నాదం సర్వసంగమానికి నాంది ఎలా అయిందో వినిపిస్తాడు. ‘‘విశ్వంభర’’ రెండో అధ్యాయం ఒక రసవత్ గుళిక. పదపదంలో పరిమళం, భావనలో సమభావనలో మంగళం. నిజానికి పరిమళ బిరుదులు కుమారగిరికే (వసంతరాయలు, ‘కర్పూర వసంతరాయలు’) కాదు, సినారెకూ వర్తిస్తాయి– సంస్కృతంలో పరిమళ కాళిదాసుల్లో, తెలుగులో ఘంట సింగయలాంటి మలయమారుత కవుల్లా! ఎందుకంటే ఉపమాలంకార ప్రియుడైన సినారె ‘‘పొడుపుకొండ మీద/శిరస్సు జెండా ఎత్తి/ అడుగేసిన ఉదయా’’న్నీ, ‘‘పడమటి ఉరికంబం మీద వెలుతురు తలను వేలాడదీసిన అస్తమయా’’న్నీ ఒకటిగా భావించినప్పుడు ‘‘ఉర్రూతలూగెడు ఉదయాస్తగిరులతో ఆకాశలక్ష్మి కోలాటమాడె’’నన్న నాచన సోముడు చటుక్కున గుర్తుకొస్తాడు.
పద్య కవిత కంటే, వచన కవిత ఎంత కష్టమో సినారె ప్రయోగాలూ, కుందుర్తి శ్రమా స్పష్టం చేస్తాయి. మాత్రా ఛందస్సులో తొలి మజిలీ ‘‘నాగార్జున సాగరం’’ కాగా, ‘‘కర్పూర వసంతరాయలు’’ మలి మజిలీ కాగా, ‘‘మంటలూ–మానవుడూ’’ వచన కవితా ఖండికలు. ‘విశ్వంభర’ వచన కవితలో సమగ్ర కావ్యం. మాత్రా ఛందస్సులో కూడా డి.హెచ్. లారెన్స్ ("Mountain Lion") లాగా ఛందోమాత్రలుæ మార్చడమే కాదు, గతులను కూడా అందంగా మార్చుతాడు. సెలఏళ్లూ జలపాతాలూ కావ్యాత్మను ఊగించి శాసిస్తాయి. హెర్మన్ మెల్‌విల్లీ ‘‘మాబీడిక్’’ను నవల అయినా కావ్యంగా భావించారు; వాల్ట్ విట్‌మన్ ‘‘లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ వచన కవిత అయినా ఒక సమగ్ర కావ్యంగా తలంచారు. ఆ మాటకొస్తే, కాల్పనిక కవులైన బైరన్ సుదీర్ఘ కవిత రాయగా, టెన్నిసన్ వచన కవితలో ఒక నవలే (‘‘ది ప్రిన్సెస్’’) రాసిపడేశాడు. కథాకావ్యం నడిపిన మాస్ ఫీల్డు కూడా అంతే.
విల్ఫ్రెడ్ ఓవెన్ మాదిరిగా (The poetry is in the Pity) కరుణ, శృంగారాలకు, ధీరత్వానికీ సమపాళ్లలో సినారె జ్ఞానపీఠాలు అమర్చాడు. మానవుణ్ని ఉద్దేశించి, ‘‘మిత్రమా! నీ రాకతో/ ధాత్రి నవచైతన్య గాత్రి/ఆప్తుడా! నీ రేఖతో ప్రకృతి రూపెత్తిన ద్యుతి’’ అని సినారె అన్నప్పుడు– డబ్లు్య.బి.యేట్స్ కవి ("Easter 1916") చరణాలు గుర్తుకు వచ్చి తీరుతాయి: "All chan-ged, changed utterly/ A terrible beauty is born" అంతేగాదు, సాహసానికీ, సాలోచనా పూర్వకమైన జ్ఞానానికీ మధ్య సరిహద్దులను నిర్ణయించడంలో ఓవెన్ కవికీ, సినారెకూ పోలికలు కన్పిస్తాయి.
"Courage was mine, and I had Mystery
Wisdom was mine, and I had Mastery"అని ఓవెన్ అంటే ఇక్కడ సినారె ‘‘సత్యమంటే నగ్నమైందని/తాండవ నృత్యం కంటే ఉద్విగ్నమైందని/ఇన్నాళ్లు అనుకునేవాణ్ణి/ సత్యానికీ అందముందని/ చట్రాయిలోనూ హృదయ స్పందనముంద’’నీ చాటాడు. ఎందుకని? దురంత పద్మవ్యూహాల వల్ల కానిది రవంత అనురాగం వల్ల అవుతుందన్నది సినారె విశ్వా సం. అతను శ్రమజీవి చెమట బిందువులో ఆణిముత్యాలను మాత్రమేగాక, అగ్నిగోళాలను కూడా ఏకకాలంలో చూడగలిగిన కవి. మానవుణ్ణి చేతనామూర్తిగా మలచి, కొలిచిన కవి వాగర్ధమూర్తి. ఆ ‘‘వెలుగు ఆవులించే కాలానికి వెన్ను చరువు/ఆ అడుగు ఆగిపోయిన మార్గానికి మరో మలుపు’’. అందుకే సినారె కూడా అభ్యుదయ మార్గాన్ని సునిశితం చేయడానికి మందు మాత్రం గానైనా వాడిన మంటల మానవుడూ, విశ్వంభరా జ్ఞానపీఠమూ సినారె.
సెప్టెంబర్ 19, 1989 (‘ఏబీకే సంపాదకీయాలు’ నుంచి)
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in