కోవింద్‌లో కేఆర్‌ను చూస్తామా! | Abk questioned Let's see KR in Kovind! | Sakshi
Sakshi News home page

కోవింద్‌లో కేఆర్‌ను చూస్తామా!

Published Tue, Jun 27 2017 12:59 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

కోవింద్‌లో కేఆర్‌ను చూస్తామా! - Sakshi

కోవింద్‌లో కేఆర్‌ను చూస్తామా!

♦ రెండో మాట
బీజేపీ ఏలుబడి ఆరంభమైనది మొదలు దళితుల మీద, మైనారిటీల మీద, మేధావుల మీద, న్యాయ వ్యవస్థ ఉనికి మీద, విద్యార్థుల మీద అనేక అకృత్యాలు జరిగాయి. ఇన్ని జరిగినా బీజేపీలోని దళిత సభ్యులు ఎవరూ (కొన్ని మినహాయింపులు తప్ప) గట్టిగా మాట్లాడిన పాపాన పోలేదు. కోవింద్‌ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ సహా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, ఒడిశా, ఇత్యాది రాష్ట్రాల్లో దళిత బహుజనులపై, మైనారిటీలపై జరిగిన, ఈ రోజుకీ జరుగుతున్న దాడులను, అత్యాచారాలను కోవింద్‌ ఖండించిన ఉదాహరణ ఒక్కటీ లేదు.

‘రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎప్పుడూ దళిత బలహీన వర్గాల తరఫునే మాట్లాడిన వ్యక్తి. తన సేవలను ఒక రైతు కొడుకుగా, ప్రజా సేవకు అంకితమైన సేవకునిగా, పేదల కోసం పనిచేసిన నాయకునిగా వర్ధిల్లిన వ్యక్తి. ఆయన నిరాడంబర జీవి. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరులో రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేయడమే ఒక విజయంగా భావించాలి.’
– (బీజేపీ– ఆరెస్సెస్‌ తరఫున ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ గురించి ఇటీవల ప్రధాని మోదీ, బీజేపీ నేత అమిత్‌షా, ఆదిత్యనాథ్, నితిన్‌ గడ్కరీ ప్రభృతులు చేసిన ప్రకటనల సారాంశం)


ఒక దళిత మేధావి, అది కూడా ఇంతటి ప్రతిభ, చరిత్ర కలిగిన వారని దేశానికీ, కనీసం దళిత బహుజన సమాజానికీ తెలియకపోవడం తప్పు కాదు. బిహార్‌ గవర్నర్‌గా ఆయనను నియమించడానికి ముందు కూడా ఆయన ఎవరో తెలియకపోవడం నేరం కాదు. కానీ అలాంటి వ్యక్తి గురించి ఇంతవరకు దేశ ప్రజలకు తెలియచెప్పకుండా ఉంచడం వెనుక బీజేపీ రహస్యం ఏమిటి? అయినా, స్నేహశీలిగా, సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా పేరున్న దళిత మేధావి కోవింద్‌ను అభినందించడానికి వెనుకాడవలసిన అవసరం లేదు. కానీ ఆయన ప్రతిభా పాటవాలను దళిత బహుజనులందరికీ వెల్లడయ్యేటట్టు చేయకుండా ఇంతకాలం గోప్యంగా ఉంచడంలో మర్మమేమిటి? సెక్యులర్‌ భారతదేశంలో ప్రజలను చీలుబాటలు పట్టించి హిందూ రాష్ట్ర/ హిందూ రాజ్య నిర్మాణానికి పునాదులు నిర్మించాలని తలపెట్టిన ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలను ఇంతకాలం ప్రశ్నించకుండా కర డుగట్టిన కార్యకర్తగా కొనసాగుతున్నందుకే కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేశారా?

వారు రాజకీయ చదరంగంలో పావులేనా?
భారత రాజకీయాలలో అటు కాంగ్రెస్, ఇటు ఆరెస్సెస్‌ తానులో ముక్క బీజేపీ (అది ఎన్నడూ హిందూ జనతాపార్టీగా ప్రకటించుకోకపోయినా) శతాబ్దాలుగా ప్రజలపై పలు అణచివేతలకూ, అత్యాచారాలకూ, భౌతిక దాడులకూ పాల్పడుతూనే ఉన్నాయి. ఇక దళితులైతే స్వాతంత్య్రం లభించిన ఏడు దశాబ్దాల తరువాత కూడా అత్యాచారాలకు గురవుతూ, సామాజిక ఆర్థిక న్యాయానికి వెలిపడుతూనే ఉన్నారు. అలాంటి దళిత బహుజనులను అధికార క్రీడలో భాగంగా ఆ రెండు పార్టీలు పావులుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.

కోవింద్‌ను బీజేపీ–ఆరెస్సెస్‌ పాలక వర్గం రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే, కాంగ్రెస్‌ కూడా యావత్తు ప్రతిపక్షం తరఫున జగ్జీవన్‌రామ్‌ కుమార్తె, మరొక దళిత మేధావి, మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను పోటీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇందుకు ఒక్కటే కారణం– పాలక, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఒక తాటిపైకి రాలేకపోయాయి. దీనితో ఇరుపక్షాలు చేసిన పని– దళిత వర్గాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడం. ఇది మరొక రూపంలో ఆ వర్గం వారిని అవమానించడమే. ఇక్కడే ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్‌ హయాంలో సౌమ్యులు, మేధా సంపన్నులు రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఆ కాలంలో కూడా దళిత బహుజనులకు అవమానాలే మిగిలాయి. 21వ శతాబ్దంలోకి ప్రవేశించి ఒకటిన్నర దశాబ్దం గడుస్తున్నా దళితులపై అత్యాచారాలకు ముగింపు కనిపించడం లేదు.

 కాంగ్రెస్, ఆ పార్టీ వి«ధానాలు, వైఖరులతో విసిగిపోయిన ప్రజలు 2014లో ప్రత్యామ్నాయం కోసం చూశారు. ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలను మోసగించి, దళితులను మభ్యపెట్టి బీజేపీ వచ్చింది. నోట్ల రద్దు పేరిట ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఈ సంక్షోభ దశలో బీజేపీకి దళితులు గుర్తుకు వచ్చారు. బీజేపీ ఏలుబడి ఆరంభమైనది మొదలు దళితుల మీద, మైనారిటీల మీద, హేతువాదులైన మేధావుల మీద, న్యాయ వ్యవస్థ ఉనికి మీద, విద్యార్థుల మీద అనేక అకృత్యాలు జరిగాయి. ఇన్ని జరిగినా బీజేపీలోని దళిత సభ్యులు ఎవరూ (కొన్ని చిన్న చిన్న మినహాయింపులు తప్ప) గట్టిగా మాట్లాడిన పాపాన పోలేదు.

కోవింద్‌ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ సహా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఇత్యాది రాష్ట్రాల్లో దళిత బహుజనులపై, మైనారి టీలపై జరిగిన, ఈ రోజుకీ జరుగుతున్న దాడులను, అత్యాచారాలను దళితుడైన కోవింద్‌ ఖండించిన ఉదాహరణ ఒక్కటీ లేదు. కోవింద్‌ను బీజేపీ నిలబెట్టాలని నిర్ణయించిన రోజుకు (19.6.17) ఒక్కరోజు ముందే (18.6.17) ఉత్తరప్రదేశ్‌లో సంపన్న ఠాకూర్‌లకు, దళితులకు మధ్య కొట్లాటలు జరిగాయి. వేధింపులకు, అవమానాలకు తాళలేని వందలాది దళిత కుటుంబాలు హిందూమతాన్ని వదిలి బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయిం చాయి. ఠాకూర్‌ అయిన బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ స్వస్తి చెప్పించకపోతే బౌద్ధాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించినప్పుడయినా ‘కోలీ’హిందువైన కోవింద్‌ దళిత హిందువుల రక్షణకు రాలేదు.

అంబేడ్కర్‌ గుర్తుకొచ్చే సమయం
అందుకనే కావచ్చు రాజ్యాంగ నిర్మాతల్లో అగ్రగణ్యులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారత కుల, వర్గ వ్యవస్థను ఇలా వివరించాల్సి వచ్చింది: ‘‘భారతదేశ చరిత్ర అంటే– ప్రజల మధ్య సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించిన బౌద్ధ ధర్మానికీ, వైదిక ఛాందస వర్గాలకూ మధ్య నిరంతరం సాగుతూ వచ్చిన పోరాటాల చరిత్ర అనే అర్థం. హేతువాదాన్ని ప్రవచించి, ప్రబోధించిన ప్రపంచ దేశాలలో భారతదేశం ఒకటి. ఇలాంటి ధర్మాన్ని ఇంతకుముందు ప్రపంచం ఎరుగదు... అందుకే భారత చరిత్ర విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ చరిత్రను చరిత్రకారులు అశ్రద్ధ చేశారు. ప్రాచీన భారతంలో బౌద్ధ ధర్మానికీ, ఛాందసవర్గానికీ మధ్య జరిగిన నిరంతర పోరాటాన్ని మరచిపోరాదు.

ఈ పోరాటం మౌలికంగా ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏదసత్యం అన్న అంశాలపైన సాగినది. ఇది కేవలం సైద్ధాంతిక విప్లవమే కాదు, రాజకీయంగానూ, సామాజికపరంగానూ సాగిన తాత్విక ఘర్షణ కూడా. ఈ అంశంపైననే క్రీ.పూ. 2500–3000 సంవత్సరాల నాటి బౌద్ధ ధర్మానికీ, ఛాందసవర్గానికీ మధ్య ఘర్షణ సాగుతూ వచ్చింది. హింసకు, అహింసకు మధ్య భీకరంగా సాగిన ఘర్షణ అదే. ఈ దృష్ట్యానే బౌద్ధులు సామాజిక విప్లవకారులయ్యారు. కాగా ఛాందసవర్గం మార్పుకు ఇష్టపడని విప్లవ ప్రతీఘాతకులుగా చరిత్రలో నమోదయ్యారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సామాజికులందరి మధ్య సహోదర భావ సందేశాన్ని ప్రపంచ చరిత్రలో తొలిసారిగా బోధించిన తొలి ప్రవక్త బుద్ధుడయ్యా డు’’(అంబేడ్కర్‌ స్పీక్స్‌: 1891–1956 వాల్యూం–2 పేజి: 282–284).

మరి హింసకు ప్రోత్సాహం ఎక్కడినుంచి వస్తోంది? హింసకు ప్రేరణ అయిన మాటలనీ, వ్యాఖ్యలనీ చేయకూడదు గదా అని రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ (హిందూ మహాసభ), పండిట్‌ కుంజ్రు ప్రశ్నించినప్పుడు, ఏది హింసో, ఏది కాదో వివరించగలరా? అని అంబేడ్కర్‌ ప్రశ్నించారు. గ్రామాలలో దళిత బహుజను (షెడ్యూల్డ్‌ కులాలు)లకు, హిందూ అగ్రవర్ణ కులాలకు మధ్య జరుగుతున్న కొట్లాటలను, ఘర్షణలను, సంఘ బహిష్కరణలను వరుసగా పేరు పేరునా ఉదాహరణలతో పేర్కొన్నారు.

అందుకే ఆయన రాజ్యాంగంలో దళిత బహుజన, బలహీన వర్గాల ప్రయోజనాల రక్షణకు వీలుగా రాజ్యాంగ నిర్ణయ చర్చల పర్యవసానంగా జీవించే ప్రాథమిక హక్కుకు తోడుగా రూపొందించిన ప్రత్యేక ‘ఆదేశిక సూత్రాల’ అధ్యాయం గురించి ఇలా పేర్కొన్నారు: ‘‘భారత రాజ్యాంగ చట్ట రూపకల్పనలో మా లక్ష్యం రెండు విధాలు. 1. రాజకీయ ప్రజాస్వామ్యం, 2. దానితోపాటు దేశ ప్రజా బాహుళ్యానికి అవసరమైన ఆర్థిక ప్రజాస్వామ్యం. దీనికి అనుగుణంగానే మాటకు కట్టుబడి దేశంలోని ప్రభుత్వాలన్నీ ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు సుకరం చేసి తీరడం’’ (1948 నవంబర్‌ 19). ఈ వైపుగా దృష్టి సారించి ఈ ప్రకటిత లక్ష్యాన్ని గత 75 ఏళ్ల స్వాతంత్య్రంలో తు.చ. తప్పకుండా సాధించటంలో ఎంతమంది రాష్ట్రపతులు, లేదా ప్రధానమంత్రులు, వారి కేబినెట్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాలుక మడతపడకుండా, తడబడకుండా ఆచరణలో కృతకృత్యులయ్యారో గుండెమీద చేతులు వేసుకుని చెప్పమనండి. కానీ ఉన్నంతలో ఈ పరీక్షలో నెగ్గుకుని రాగల రాష్ట్రపతులు ఒకరో ఇద్దరో మాత్రమే మనకు దొరుకుతారు.

కేఆర్‌ నాటి విలువలు నిలబెడతారా?
1997లో రాష్ట్రపతిగా ఎన్నికైన దళిత మేధావి కేఆర్‌ నారాయణన్‌ (సివిల్‌ సర్వీసు). ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న కోవింద్, మీరాకుమార్‌ దళితులే. అయినా నారాయణన్‌ రాష్ట్రపతిగా నెలకొల్పిన నైతిక నియమాలూ రాజ్యాంగ బద్ధంగా విస్పష్టమైన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా దళిత బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రీయ దృక్పథంతో స్పందిం చిన తీరు పలువురి ప్రశంసలకు పాత్రమైనాయి. చిలకలూరిపేట ఉదంతంలో, అంతకుముందెన్నడూ నేర చరిత్రలేని దళిత యువకులకు మరణశిక్ష విధించినప్పుడు రాజ్యాంగంలోని 72వ అధికరణ దేశ రాష్ట్రపతికి కల్పిస్తున్న విచారణాధికారాలను సద్వినియోగం చేసుకుని సామాజిక న్యాయ సులోచనాల ద్వారా మరణ శిక్షను యావజ్జీవ శిక్ష కింద మార్చిన మానవతావాది నారాయణన్‌. ఆయన మానవతా వేదనకు తోడూనీడై నిలచినవారు ఆనాటి యూపీఏ హోంమంత్రి ఇంద్రజిత్‌ గుప్తా (కమ్యూనిస్టు), ప్రముఖ రచయిత్రి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మహాశ్వేతాదేవి ప్రభృతులు.

ప్రజలకు ఇచ్చిన హామీలను, రాజ్యాంగ విధులను న్యాయస్థానాల తీర్పులను ‘తూనాబొడ్డు’ గా భావిస్తున్న పాలకవర్గాలున్న చోట, మరణశిక్ష ప్రక్రియను యథాలాపంగా కలం చేతిలో ఉందిగదా అని అభిలషించి శిక్ష విధించడానికి బదులు అరుదైన, అసాధారణమైన, అనుల్లంఘనీయమైన (రేరెస్ట్‌ ఆఫ్‌ రేర్‌ కేసెస్‌) కేసులున్న సందర్భాలలో తప్ప అన్యధా అమలు చేయరాదన్న 1980నాటి సుప్రీం కోర్టు రాజ్యాంగ విషయ నిర్ణయ ప్రత్యేక ధర్మాసనం తీర్పుకు అనుగుణంగా తన భాష్యం ద్వారా వన్నెచిన్నెలు తొడిగిన స్వతంత్ర శక్తి నారాయణన్‌. అలాంటి మరో నారాయణన్‌ను రాష్ట్రపతి పదవిలో అంత సొంత బుద్ధితో, తోలుబొమ్మలాటకు విరుద్ధంగా వ్యవహరించగల వ్యక్తిని రాష్ట్రపతి భవన్‌లో చూడగలమా?
  ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
 abkprasad2006@yahoo.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement