న్యాయంతో సంఘర్షణ తగదు
రెండో మాట
ఈ మూడేళ్ల బీజేపీ పరిపాలనలో మున్నెన్నడూ చూడని రీతిలో న్యాయ వ్యవస్థకూ, పాలనా వ్యవస్థకూ మధ్య సంఘర్షణ పెరిగిపోతున్న వాస్తవాన్ని గమనించాం. ధర్మాసన చైతన్యం (జ్యుడీషియల్ యాక్టివిజమ్) పాలకులకు రుచించడం లేదు. పాలకుల నిరంతర జోక్యం కూడా ధర్మాసనానికి చీకాకు కలిగిస్తున్నది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే న్యాయ మూర్తుల నియామకాలు న్యాయశాస్త్ర విభాగంలో భాగంగానే (కొలీజియం)వృత్తిపరంగా జరగాలన్న జ్యుడీషియరీ నిర్ణయాన్ని బీజేపీ పాలకులు తోసిపుచ్చుతున్నారు.
‘ఒక చట్టాన్ని ఎప్పుడు ఎలా అమలులోకి తేవాలో ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కూ, అధికారం న్యాయస్థానానికి లేవని గుర్తించాలి.’(లోక్‌పాల్, లోకాయుక్త సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొంది మూడేళ్లు గడిచినా ఎందుకు అమలు జరగడం లేదన్న ప్రశ్న సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఇచ్చిన సమాధానం.) ‘భారతదేశాన్ని లంచగొండితనం, అవినీతి రుగ్మతల నుంచి విముక్తం చేస్తానని 2014 సాధారణ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీ పాలకపక్షం ప్రజలను మోసగిస్తున్నది. ఆ నేరం నుంచి తప్పించుకునే క్రమంలోనే ఇప్పుడు పాలకపక్షం లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నది. గత మూడేళ్లలో బీజేపీ (మోదీ) ప్రభుత్వం తలపెట్టిన అనేక చర్యల వల్ల, నిష్క్రియా పరత్వం వల్ల ఒక సత్యం బయటపడింది– అవినీతి నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్న సంకల్ప శుద్ధి పాలక శక్తికి లేదు.’
అమృతా భరద్వాజ్, అమృతా జోహ్రీ (సమాచార హక్కు సా«ధనకు ఉద్దేశించిన జాతీయ స్థాయి ప్రచార సంస్థ విశిష్ట సభ్యులు, ది హిందూ 22–4–2017) మరోసారి కాదు, పదిసార్లయినా వేసుకోవలసిన ప్రశ్న: పార్లమెం టులో మందిబలంతో ఆమోదించిన లోక్‌పాల్, లోకాయుక్త నియామక సవరణ చట్టం సైతం మూడేళ్లుగా ఎందుకు అమలు జరగడం లేదు? ఇందుకు ఉన్న అడ్డంకులేమిటి? మరొక పరిణామం కూడా కనిపిస్తున్నది. రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగం నిర్వచించిన రాజ్యాంగ సాధికార సంస్థలు మూడూ సమస్యలపైన, నిర్ణయాలపైన తరచు పరస్పరం సంఘర్షించుకునే వాతావరణం మునుపెన్నడూ లేని (ఎమర్జెన్సీ కాలంలో తప్ప) విధంగా ఈ దఫా బీజేపీ పాలనలో తీవ్రమౌతున్నట్టు కనిపిస్తున్నది.
కోరలు పీకే యత్నం
శ్రుతి మించిన అధికారం, అహంకారం పాలనా వ్యవస్థలో కేంద్రీకరించిన ప్పుడు ఎలాంటి పరిణామాలను చూడవలసి వస్తుందో సత్యవాది కాళోజీ ఒక మరాఠీ సామెత కథతో వివరించేవారు. ఒక తేలు శివలింగం మీదకు పోయి కూర్చుంది. ఒక భక్తుడు పూజకు కూర్చున్నాడు. తేలుని చేత్తో జరిపితే కుడుతుంది. మామూలుగా చంపినట్టు చెప్పుతో కొడితే అపచారం. అలాగే నేడు అధికారంలో తిష్ట వేసి, అన్యాయాలు చేస్తున్న వారు అలాంటి తేళ్లేనని ఆయన అనేవారు. అవినీతికర వ్యవస్థ హద్దులు మీరుతున్నప్పుడు ఆ ఫలితాలను న్యాయ, ప్రభుత్వ వ్యవస్థలు, పాలకులు నోరు మెదపకుండా భరిస్తున్నారు. ఏనాటి నుంచో పనిచేస్తున్న ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక చట్టం, అపమార్గం పట్టిన ప్రజా ప్రతినిధులను బొడ్లో చేయివేసి శిక్షించగలిగే ప్రజాప్రాతినిధ్య చట్టం– వాటి లక్ష్యాల మేరకు జాప్యం లేకుండా ప్రజలకు మంచి ఫలితాలను చూపిన సందర్భాలు బహు స్వల్పం. వాటిని వేళ్ల మీద లñ క్కించవచ్చు. పైగా అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలలో సయితం లోక్‌పాల్ నియామక చట్టం అమలు విషయంలో పాలక వ్యవస్థల నుంచి కొర్రీల పేరిట ఎదురవుతున్న సవాళ్లను అధిగమిం చడం కూడా కష్టంగా ఉంది.
అలాంటి పరిస్థితినే ప్రస్తుతం పౌరులు, న్యాయస్థానాలు ఎదుర్కొనవలసి వస్తున్నది. గుజరాత్‌లో ఒకనాడు (నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో) దాదాపు పన్నెండేళ్ల పాటు లోకా యుక్త వ్యవస్థ ఏర్పడకుండానే కాలం గడచిన సంగతిని విస్మరించలేం. ఈ దురవస్థ గురించి సుప్రీంకోర్టు నిలదీసిన సంగతిని కూడా మరచిపోలేం. అలాంటి పరిణామమే లోక్‌పాల్ –లోకాయుక్త సవరణ చట్టం విషయంలో కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితులలో ప్రభుత్వ శాసన వ్యవస్థల నిర్ణయాలను ప్రశ్నించి, నిర్దేశించే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంది. వాటికి స్వేచ్ఛగా, అర్థ వంతమైన భాష్యం చెప్పే విశిష్టాధికారాన్ని కూడా న్యాయ వ్యవస్థ కలిగి ఉంది. కానీ వాస్తవం వేరు. ఇటీవల బీజేపీ పాలకుల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఒత్తిళ్లకు గురౌతున్న సంగతి అర్థమ వుతుంది. వివిధ పరిణామాలతో ఇది స్పష్టమవుతుంది.
సుప్రీం విధి నిర్వహణకు అడ్డంకులు
సుప్రీంకోర్టుకు సైతం కొన్ని సన్నాయి నొక్కుళ్లు తప్పని పరిస్థితి ఎలా ఎదురవుతున్నదో ఇటీవలి ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ పరిణామాల తరువాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ న్యాయ మూర్తులకు ఒక సవాలు విసిరారు. అది: ‘మా ఉద్యోగాలనే (మంత్రి పదవులు) న్యాయమూర్తులు కోరుకుంటే వారు తమ న్యాయమూర్తుల పదవులు వదులుకుని ఎన్నికలలో పోటీ చేయాలి’ (11–5–16). అదేరోజు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్టీ మరో అడుగు ముందుకు వేసి, ‘న్యాయ వ్యవస్థ ఒక్కొక్క అడుగు వంతున, ఒక్కొక్క ఇటుక చొప్పున శాసన వ్యవస్థను ఆక్రమిస్తోంది’ అన్నారాయన. ఈ మేరకు జైట్లీ రాజ్యసభలో వాపోవడం విశేషం. ఇంతకూ వీరంతా న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధిం చిన కీలక సూత్రాన్నే మరచిపోతున్నారు. ఆ సూత్రం– చట్టానిది పాలకుని కన్నా సమున్నత స్థానం. ఈ సత్యాన్ని పదిహేడో శతాబ్దం తొలినాళ్లలోనే ఇంగ్లండ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడైన జస్టిస్ కోక్ నిరూపించాడు. నాటి ఇంగ్లండ్ రాజు జేమ్స్ (1) రాయల్ కోర్టులో ప్రవేశించి, తన ఇష్టం మేరకు ఏ కేసునైనా కోర్టుల పరిధి నుంచి తప్పించి తానే దాని మీద తీర్పును వెలువరిస్తానని ప్రకటించాడు.
ఇందుకు ప్రధాన న్యాయమూర్తి కోక్ : ‘మీరు అలా చేయడానికి వీల్లేదు. ఏ కేసునైనా చర్చించి, నిర్ణయించి పరిష్కరించా ల్సింది చట్టం ప్రకారం న్యాయస్థానమే’. అని సమాధానం ఇచ్చాడు. దీనితో రాజుకు ఆగ్రహం వచ్చింది. ‘నేను (రాజు/ పాలకుడు) చట్టానికి లోబడాలా? అంటే నాది విద్రోహమని మీ నిర్ణయమా?’ అంటూ వాచాలత్వం ప్రదర్శిం చాడు. ‘మీరు అనుకున్నట్టు రాజు లోబడి ఉండవలసింది మరో మనిషికి కాదు. మీరు లొంగవలసింది దైవానికి, చట్టానికి మాత్రమే’నని జస్టిస్ కోక్ సమాధానం ఇచ్చాడు. ఆ రోజుల్లో న్యాయమూర్తులను తొలగించే హక్కు రాజుకు ఉండేది. తరువాత రాజే చట్టానికి లొంగి ఉండవలసి వచ్చింది. అంటే ఎవరూ చట్టానికి అతీతుడు కాడు. ఈ సత్యాన్నే జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి ప్రభృతులు అనేక తీర్పులలో చాటారు. కానీ కాలక్రమేణా కుక్కమూతి పిందెలు కొన్ని పాలనా వ్యవస్థలోను, సామాజిక రంగాలలోను పుట్టుకొస్తు న్నాయి. విపరిణామాలకు ఇదే కారణం.
ధర్మాసన చైతన్యం మీద ఆగ్రహం
ఈ మూడేళ్ల బీజేపీ పరిపాలనలో మున్నెన్నడూ చూడని రీతిలో న్యాయ వ్యవస్థకూ, పాలకులకూ మధ్య సంఘర్షణ పెరిగిపోతున్నది. ధర్మాసన చైతన్యం (జ్యుడీషియల్ యాక్టివిజమ్)పాలకులకు రుచించడం లేదు. పాలకుల నిరంతర జోక్యం కూడా ధర్మాసనానికి చీకాకు కలిగిస్తున్నది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే న్యాయమూర్తుల నియామకాలు న్యాయశాస్త్ర విభాగంలో భాగంగానే (కొలీజియం)వృత్తిపరంగా జరగాలన్న జ్యుడీషియరీ నిర్ణయాన్ని బీజేపీ పాలకులు తోసిపుచ్చుతున్నారు. న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన పాత్ర వహించాలని పాలకులు చొచ్చుకురావడంతో వివాదాలు ముదురుపాకాన పడ్డాయి.
అంతేకాదు, న్యాయమూర్తుల నియామకాలలో తమకు అనుగుణంగా నడుచుకునే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని (ఎమర్జెన్సీ కాలంలో మాదిరిగా) పాలకులు పట్టుబడుతున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రకటిస్తూనే ఉన్నారు. స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు జ్యుడీషియరీలో చోటు దక్కకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు మించిన దారుణం–బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ముఖ్య నియామకాలను ఆరెస్సెస్ తనిఖీ చేసి పంపుతున్నదని మరో న్యాయవాది చెప్పినట్టు వార్తాకథనం.
ఎన్డీఏ చేసిన పెద్ద తప్పిదం
ఈ సమయంలోనే జ్యుడీషియరీలో భారీ ఎత్తున చేపట్టవలసిన న్యాయ మూర్తుల నియామకాల విషయంలో రాజ్యాంగ వ్యవస్థా విభాగాల మధ్య ఘర్షణలను సుప్రీంకోర్టు కోరుకోవడం లేదని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ప్రకటించారు. అంటే ఇలాంటి నియామకాల విషయంలో తలెత్తిన తగాదాలను దృష్టిలో ఉంచుకునే ఆయన సమన్వయ పరచడానికి ఈ మాట అన్నారు. న్యాయమూర్తుల నియామకం విషయంలోనే ఎన్డీఏ చేసిన మరో తప్పిదం– అర్హులైన వారిని ఆ పదవులకు ఎంపిక చేసే సంఘంలో ప్రతిపక్ష నాయకునికి(లోక్‌సభలో పదిశాతం సభ్యులు కూడా లేరన్న సాకుతో) చోటు లేకుండా చేశారు. ఇది పరమ ప్రజాస్వామ్య విరుద్ధ చర్యగా, నిరంకుశ ప్రవర్తనగా పేర్కొనక తప్పదు. అందుకే జస్టిస్ కృష్ణయ్యర్ ఇలా వ్యాఖ్యా నించారు: ‘చరిత్రను పోతపోసి కమ్మెచ్చులాగి తీర్చిదిద్దింది మానవజాతేగాని కోర్టులు, మంత్రివర్గ తాఖీదుల మీద, రిట్ పిటిషన్‌ల ద్వారా మురికివాడలలోని అనాథ జీవుల గుడిసెలను పీకివేయడానికి వేచిచూస్తున్న బిల్డర్లు కాదు కాదు’.
అయితే అదే సమయంలో ఈ దోపిడీ వ్యవస్థలో న్యాయమూర్తులు కూడా పాలక భద్రపురుషుల్లో భాగస్వాములేనని మరచిపోరాదని ప్రసిద్ధ బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ స్క్రూటన్ అన్నాడు. బహుశా ఉన్నత న్యాయస్థానం అప్పుడప్పుడూ తన వైఖరిని తేల్చి చెప్పగల కరుకుదనాన్ని తీర్పుల సందర్భంగా చూపి పాలకులను, పాలనా వ్యవస్థనూ ఉన్న అవకాశం మేరకే సరైన గాడిలో పెట్టలేకపోతోంది. ఈ మెతకదనంతో కాకుండా, ఇంకా చెప్పాలంటే పాలనా వ్యవస్థకు తలొగ్గక, సామాజిక బాధ్యతలను మరింత తెగువతో ఒకనాటి ధర్మాసన చైతన్యాన్ని పునరుద్ధరించగల చేవలను ప్రదర్శించడానికి నిర్ణయించుకోవాలి. ఇవాళ దేశంలో ఉన్న స్థితి– కోర్టు తీర్పులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని, కార్పొరేట్ శక్తులు గాని హెచ్చు సందర్భాలలో తలదాల్చగల వాతావరణం లేదన్న సంగతి గుర్తించాలి. న్యాయమూర్తులు కూడా ఆకాశం నుంచి ఊడిపడరు. వారూ వర్గ ప్రతి నిధులేనన్న వాస్తవాన్ని విస్మరించరాదని ప్రొఫెసర్ గిఫ్రిత్ పేర్కొన్నాడు.
సీనియర్ సంపాదకులు
ఏబీకే ప్రసాద్
abkprasad2006@yahoo.co.in