
మార్క్స్, లెనిన్, మావో అందరూ నాస్తికులే, హేతువాదులే, గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకొన్నవారే. మరి మన జీవితాల్లోనూ హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి. ప్రశ్నించేవారు. ఆవేదన వ్యక్తం చేసేవారు.
ఆధునిక యుగ హేతువాద ఉద్యమ వైతాళికుడు, అలుపెరుగని కలం యోధుడు. ఆరు దశాబ్దాల పైగా అక్షర జ్వలనాలతో వెలిగిన జ్ఞాన సూర్యుడు సి.వి. (సి. వరహాలరావు) 88వ యేట విజయవాడలో తన నివాసంలో మంగళవారం రాత్రి చివరి శ్వాస విడిచారు. నలభై యేళ్ళ హేతువాద ఉద్యమం అనుబంధం మాది. భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన చార్వాక వాది సి.వి. హేతువాదిగా ప్రత్యామ్నాయ సాహితీ సృజ నను పుంఖానుపుంఖంగా చేసి, వేదాలు, ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసి, అందులోని వైరుధ్యాలను బయటబెట్టిన సాహసి. మనుస్మృతి లోతులు చూసి, వర్ణ వ్యవస్ధ పునాదులను తవ్వి వేసి సమసమాజ భావనకు పతాకలెత్తిన హేతువాది సి.వి. కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వచ్చిన సి.వి. కమ్యూనిస్టు సాంస్కృతిక, సాంఘిక, తాత్విక ఉద్యమాలను ఇంకా బలంగా నడపవలసి ఉందని ఆకాంక్షించారు. అస్పృశ్యతను, కులాన్ని పారదోలందే, మూఢాచారాల బూజును దులపనిదే వర్గపోరాటం కూడా విజయవంతం కాదని అంబేడ్కర్ ఆలోచనలను తన భాషలో పలికిన ఆధునిక వైతాళికుడాయన.
మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్‌ల ఆలోచనలను తన రచనల్లో జ్వలితమైన భాషలో నినదించిన మహాకవి సి.వి. 1970 దశకం నుంచి 90వ దశకం వరకు తెలుగువాడిగా పెరియార్‌లా, మరో హోచ్‌మిన్‌లా ఉక్కునాలుకతో పలికిన ధైర్యశాలి. ఆయన రాసిన విషాద భారతం, దిగంబర కవిత్వానికి విప్లవ కవిత్వానికి మధ్య వారధి గట్టింది. ఆ తరువాత వర్ణం, కుల అభ్యుదయ విప్లవ జీవన విధానాల్లో కూడా దాగి వుందని గమనించి ‘వర్ణ వ్యవస్ధ’, ‘చార్వాక దర్శనం’, ‘సత్యకామ జాబాలి’, ‘మధ్యయుగాల్లో కులం’ వంటి లోతైన విమర్శనా గ్రంథాలు వ్రాశారు.
సి.వి. కులనిర్మూలనా వాది, ఆయనొక గొప్పకవి, ఆయన వర్ణనా సామర్ధ్యం ‘పారిస్ కమ్యూన్’లో నరబలిలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఆయన అక్షరాలతో ఆయుధాలు తయారు చేస్తారు. అక్షరాల్లో సాయుధ సైనిక కవాతులు మనకు చూపిస్తారు. శ్రీశ్రీ కవిత్వంలోని పరుగు ఆయన కవిత్వంలో మనకు కనిపిస్తుంది. వేమన కవిత్వంలోని కులాధిపత్యంపై పోరు, కబీర్, చక్రధర్, నానక్, పోతులూరి వీరబ్రహ్మం భక్తి కవుల్లోని మానవతా వాదాన్ని ఆయన హేతువాద భావాల్లో చెప్పారు. భారతదేశ సామాజిక సాంస్కృతిక భారతాల్లోని వైరుధ్యాలను మన కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు.
నేను హేతువాదిని నాకు దేవుడు లేడు అని చాటుకున్న సి.వి. ఇటీవల ప్రజాశక్తి వారు ఆయన రచనలన్నీ ప్రచురించిన సభలో నన్ను ప్రేమతో కౌగిలించుకొన్న అనుభూతిని మరువలేను. ఆయన పురాణాల్లో అణగారిన పాత్రలకు జీవం పోశారు. సి.వి.ని నేను 1978లో మొదట చార్వాక ఆశ్రమం నిడమర్రులో చూశాను. నా మొదటి పుస్తకం ‘కులం పునాదులు’ ఆయన నేతృత్వంలో 1979లో అచ్చయింది. కొండవీటి వెంకటకవి, బి.రామకృష్ణ, సి.వి., ఈశ్వర ప్రభుగార్లు మా తరానికి ముందు హేతువాద భావజాల వ్యాప్తిలో మార్గాన్ని సుగమం చేశారు. ఎన్నో సదస్సుల్లో, సభల్లో సి.వి. నేను పాల్గొన్నాం. ఆయన నిరాడంబరత ఆదర్శనీయమైంది. ఆర్భాటాలు లేవు. స్నేహం, ఆత్మీయత, నిరంతర రచన, అధ్యయనం ఆయన దినచర్యలు. స్వాములు, యోగు లు, పరాన్న భుక్కులు మూఢాచారాలతో ప్రజలను దోచుకొంటున్న విధానాలను అధ్యయనం చేసేవారు.
ఆయనది సాంఘిక సాంస్కృతిక పోరాటమే అయినా రాజకీయాల్లో వున్న ఫాసిజం మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఆయన ఆవేదనంతా కమ్యూనిస్టు ఉద్యమం మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేయడంలో వెనకబడుతోందనన్నదే. మతోన్మాద సంస్ధలను కేవలం రాజకీయాల ద్వారా ఎదిరించలేం.. తప్పకుండా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి పదును పెట్టాలనేదే ఆయన భావన. పుక్కిట పురాణాలకు ప్రత్యామ్నాయంగా శాస్త్ర జ్ఞానం కావాలని సి.వి. ప్రబోధించారు. మార్క్స్, లెనిన్ మావో అందరూ నాస్తికులే, హేతువాదులే, గతితార్కిక భౌతిక వాదాన్ని జీవితంగా మలుచుకొన్నవారే. మరి మన జీవితాల్లో కూడా హేతువాద జీవన విధానం ఎందుకు లేదు అని సి.వి. ప్రశ్నించారు. ఇప్పుడు ఈ అవసరాన్ని మరింతగా గుర్తించే ప్రజాశక్తి ప్రచురణలు సి.వి.గారి మొత్తం గ్రంథాలను ప్రచురించాయి.
అవార్డులకు, సన్మానాలకు, పొగడ్తలకు, ధనకాంక్షకు, ఆశ్రిత పక్షపాతానికి లోబడకుండా జీవించిన సి.వి. ఈనాటి ఉద్యమకారులందరికి జీవితాచరణలో ఆదర్శప్రాయుడు. అధ్యయనం, రాత ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణానికి సోపానాలని ఆయన ఆచరించి చూపాడు. ఈనాడు అంబేడ్కర్ వాదులు, మార్క్స్ వాదులు, హేతువాదులు కలిసి పని చేయడానికి కావలసిన పునాది కృషిని సి.వి. చేశారు. తెలుగువారి మరో మహాత్మాఫూలే అయిన ఆయన కోరినట్టే మార్క్స్, అంబేడ్కర్, హేతువాద, లౌకిక వాద శక్తులన్నీ ఐక్యంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా నిర్మించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అవుతుంది. చరిత్ర నిర్మాతలకు మరణం లేదు. సి.వి.కి మరణం లేదు.
- డాక్టర్. కత్తి పద్మారావు
వ్యాసకర్త సామాజిక కార్యకర్త, రచయిత
మొబైల్ : 98497 41695