చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు. ఎలా అంటే అలా చెరపడం, కొత్తది రాయడం కుదరదు. చరిత్ర తెలియనివాళ్లే ఇప్పుడు ‘ఇండియా’ స్థానంలోకి ‘భారత్’ను తెస్తున్నారు. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునేవాళ్లు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామవాచకాన్ని మార్చడం అహేతుకం.
కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సంస్కృతీకరణకు గురి చేస్తోంది. దీనికి కారణం పాలకులకు భారతదేశ చరిత్ర తెలియకపోవడమే. నిజానికి భారత్ అనే పదం ప్రాచీనమైనది కాదు. ప్రసిద్ద చరిత్రకారులు డి.డి. కోశాంబి, రొమిల్లా థాఫర్, ఆర్.ఎస్. శర్మా, ఝూ, బి.ఎస్.ఎల్.హనుమంతరావు వంటి వారంతా తాము రాసిన చరిత్రకు ‘ఇండియన్ హిస్టరీ’ అనే పేరు పెట్టారు. మనం ఒకసారి ప్రపంచ దేశాలలో ఉన్న లైబ్రరీలను వీక్షిస్తే...
ముఖ్యంగా లండన్ మ్యూజియం లైబ్రరీలో హిస్టరీ మీద ఒక శాఖ ఉంటుంది. కన్నెమెరా లైబ్రరీ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ దేశాల నుండి పరిశోధకులందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఇండియా అంటేనే స్పందిస్తారు. ‘భారత్’ శబ్దం ఎక్కడా కనపడదు.
యక్షులు, కింపురుషులు, గంధర్వులు భారతదేశంలో ప్రాచీన జాతులు. ఈనాటి దళితులు వారి వారసులే. వారు నదీ దేవతలను సృష్టించారు. వెన్నెలను ఆరాధించారు. ఆర్యులు అంతకుముందు ఉన్నటువంటి జాతుల మొత్తం వారసత్వాన్ని తమదిగా చెప్పు కొన్నారు. దళితులకు సంబంధించిన అనేక చారిత్రక అంశాలను ఆర్యులు సొంతం చేసుకున్నారు. మనది ‘సింధూ నాగరికత’ అంటారు. సింధూ శబ్దం అతి ప్రాచీనమైనది.
ఇండియాలో మానవ జాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్టు మానవజాతి పరిణా మంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహనిర్మాణం, సంపద కీలకపాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ దళితుల జీవన విధానంలో ఉండడం వలన, బి.ఆర్.అంబేడ్కర్ నిర్వచించినట్లుగా వీరు ఇండియన్స్ అనేది నిర్ధారణ అవుతుంది.
హిందువుల మత సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్య కాలు, ఉపనిషత్తులు, సూత్రాలు, ఇతిహాసాలు, స్మృతులు, పురాణాలు ఉన్నాయి. వేద బ్రాహ్మణులు వేదాలకూ, ఇతర రకాల మత సాహిత్యానికీ మధ్య ప్రత్యేకత చూపాలని అభిప్రాయపడ్డారు. వేదాలను ఉన్నతమైనవిగా మాత్రమే కాకుండా పవిత్రమైనవిగా, తిరుగులేనివిగా చేశారు. చరిత్రకు మూలమైన శాసనాలు, వ్రాత ప్రతుల వంటి వాటిని పేర్కొనకుండా కేవలం వేదాల మీద ఆధారపడి చరిత్రను, సంస్కృతిని నిర్మించాలనుకునే సనాతన భావజాలకర్తలు కేవలం వేదాల దగ్గరే ఇండియన్ హిస్టరీ ఉందనుకుంటున్నారు. అందువల్లే వారు భారతదేశ చరిత్రను కుదించాలని చూస్తున్నారు.
దక్షిణ భారత భాషల్లో ఏ భాషలోనూ భారత శబ్దం లేదు.ఇండియన్ లాంగ్వేజెస్ పుట్టు పూర్వోత్తరాల మీద కృషి చేసిన వారెవ్వరూ భారత్ శబ్దాన్ని పేర్కొనలేదు. నిజానికి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధి చెందాయి. వాఙ్మయ దృష్టితో కాకుండా, భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ ప్రాచీనమైనది.
తెలుగు భాష ప్రభావం ఇప్పటికీ తెలుగు తెగలమీద ఉండటాన్ని గమనించాలి. ముఖ్యంగా కోయ భాషలో ఎన్నో తెలుగు పదాలున్నాయి. కోయ భాషమీద పరిశోధన చేసిన జె.కాయన్ ఈ విషయాన్ని చెప్పారు. కోయ జాతి అతి ప్రాచీనమైనదని సామాజిక శాస్త్ర చరిత్ర చెప్తున్న సత్యం. ఈ కోయ భాషలో విశేషంగా తెలుగు ఉండడం వల్ల రాతలేని తెలుగు అతి పురాతన కాలంలోనే ఉందని మనకు అర్థమౌతుంది. తెలుగు భాష ప్రాచీనతను తెలుసుకోవాలంటే, మనం తెలుగులో అతి ప్రాచీనులైన తెగలను పరిశీలించవలసిందే.
ఇకపోతే ఆంధ్రజాతిని నాగులుగా పిలవడం, నాగజాతికీ, ఆర్య జాతికీ ఉన్న వైరుధ్యం భారతంలో వర్ణించబడింది. ప్రసిద్ధ చరిత్ర కారులు బి.ఎస్.ఎల్. హనుమంతరావు తన ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రులు ఋగ్వేద కాలం నాటివారనీ, వారు నాగులుగా ఆర్యులతో పోరాడారనీ, ఖాండవ వన దహనం, సర్పయాగం తరువాత వింధ్య పర్వతాల ఇవతలికి వచ్చారనీ, వారే ఆంధ్రులుగా పిలువబడ్డారనీ రాశారు. నాగులకు, ఆర్యులకు జరిగిన తీవ్ర సంఘర్షణలో ‘ఖాండవ దహనం’, జనమేజయుడి ‘సర్పయాగం’ రెండు ముఖ్య ఘట్టాలు. ఈ ప్రమాదం నుండి తప్పించుకొన్న నాగులు దక్షిణంగా వలసవచ్చి కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పాలలోని రాజులకు, రాణులకున్న సర్ప కిరీటాలు వారి జాతీయతకు చిహ్నాలే.
ఈ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, భారత్ కంటే ‘ఇండియా’యే పురాతనమైనది. భారత్ శబ్దం వలన ఇండియా తన ఐడెంటి టీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మనకు చాలా నష్టం. భారత దేశం, హిందూదేశం, ఇండియా... ఈ మూడు పేర్లలో జాతి, మత, లింగ, కుల, వర్ణ, ప్రాంతాలకు అతీతమైన పేరు ఇండియా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్ ఈ దృక్పథంతోనే తమ గ్రంథాలు రాశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇండియాను వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇది వారికి కూడా నష్టమే. అందరికీ నష్టమే. చరిత్ర అనేది బోర్డ్ మీద చాక్‌పీస్‌తో రాసిన రాత కాదు.ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తున్నా, సంస్కృతీకరణ ద్వారా దేశీయ ప్రజలను అవమానిస్తున్నారు. అనేక భాషలు, సంస్కృతులు, జాతులు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యాంగ బద్ధమైన ‘ఇండియా’ నామ వాచకాన్ని మార్చడం అహేతుకం. దేశంలోని ప్రజా స్వామ్య, లౌకికవాద, సామ్యవాద శక్తులందరూ ఇండియాను బలపరు స్తున్నారు. అధిక జనుల అభిప్రాయమే చారిత్రక సత్యం. పేర్లు మార్చడం ద్వారా చరిత్ర మారదు.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment