చరిత్రలో హేతువాదాన్ని వ్యాప్తి చేయడంలో అగ్రగామి, బౌద్ధ ధర్మం. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించినది, యజ్ఞ యాగాదులను నిరసించినది కూడా ఇదే ధర్మం. అలాంటి మహత్తర ధర్మాన్ని తెలుగు నేల ఇరు చేతులా హత్తుకుంది. దేశంలోని ఏ బౌద్ధ స్థావరం నుంచి దొరకని ఆనవాళ్లు తెలుగు నేలలో దొరికాయి.
అలాంటి తెలుగు నేల విశిష్ట బౌద్ధ వారసత్వపు చిహ్నంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ‘పూర్ణఘటాన్ని’ నెలకొల్పారు. కానీ కొత్తగా ప్రారంభమైన తెలంగాణ సచివాలయంలో ఆ ఆనవాళ్లను చెరిపేశారు. భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో అదే అంబేడ్కర్ పేరిట ఏర్పాటైన సచివాలయంలో బౌద్ధ చిహ్నాన్ని కూల్చేశారు.
భారత సెక్యులర్ రాజ్యాంగ నిర్మాత, బౌద్ధ సంస్కృతీ ప్రియుడైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకూ శుభాభినందనలు తెలుపు తున్నాను; కానీ ఈ సందర్భంలోనే సెక్రటేరియట్‌లో ఉండవలసిన, ఉమ్మడి తెలుగు బౌద్ధ సంస్కృతీ వైభవ ప్రతీకగా అంతకుముందు నుంచీ ఉన్న విశిష్ట శాశ్వత కట్టడాన్ని తొలగించినందుకు విచారం వెలిబుచ్చక తప్పడం లేదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2008) ఆయన ఆధ్వర్యాన తెలుగు ప్రజల ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ చిహ్నంగా ఆ కట్టడం నాలుగు భాషల ఉద్దీపనతో వెలిసింది. ఎంతోమంది పర్యాటకుల్ని ఆకర్షించిన బౌద్ధ సంస్కృతీ చిహ్నమది (ఘనాకారపు గ్రానైట్ రాయి మీద తొలిచిన పూర్ణఘట ప్రతిరూపం). కానీ నేటి సెక్రటేరియట్ ఆవరణలో ఆ విశిష్ట చిహ్నం ఆనవాళ్ళు ‘కలికానికైనా’ కానరావు.
ఇంతకూ ఆ బౌద్ధ ధర్మ సంస్కృతీ వైభవ కట్టడం ఏమైనట్టు? భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో ఆ చిహ్నాన్నే కూల్చేశారు. ఏ యజ్ఞయాగాదులకు దూరంగా జరిగి సర్వ మానవ సమానత్వం లక్ష్యంగా అంబేడ్కర్ ముందుకు సాగాడో –అందుకు విరుద్ధంగా యజ్ఞయాగాదులతో ‘బీఆర్‌ఎస్’ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన అంబేడ్కర్ సచివాలయ ప్రవేశం చేశారు.
విశేషమేమంటే, ‘బౌద్ధ ధర్మ చక్ర ప్రశస్తి’ శాసనం మన దేశం మొత్తం మీద ఏ బౌద్ధ స్థావరం నుంచీ ఇంతవరకూ వెలుగు చూడనందుననే తెలంగాణలోని ‘ఫణిగిరి’ ధర్మ చక్ర ప్రశస్తి శాసనానికి చారిత్రక ప్రాధాన్యం లభించింది. ప్రాకృత భాషను, పాలీ లిపిని, ‘బ్రాహ్మీ’ లిపిని ప్రేమించి, ప్రోత్సహించిన ధర్మం కూడా బౌద్ధానిదేనని మరచి పోరాదు. క్రీ.పూ. 3 – క్రీ.శ. 18 శతాబ్దాల మధ్య వెలువడిన వేలాది శాసనాలను ఉమ్మడి తెలుగువారి సొత్తుగా భావించి ఈ విశేషాలన్నింటినీ ఆవిష్కరించిన ప్రసిద్ధ స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఒకరు.
ఈయనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో తెలుగు వారి బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే అత్యున్నత కట్టడ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సరిగ్గా ఆ కట్టడం ఆనవాళ్లే కనపడకుండా చేసింది కేసీఆర్ పాలన. కాక పోతే అంబేడ్కర్ పేరును ఒక ముసుగుగా వాడుకోవడం పాలకుల కొత్త ‘సంస్కృతి’!
కొండా శ్రీనివాసులు, అవధానం ఉమా మహేశ్వరి సంపాదకులుగా శివనాగిరెడ్డి తెలుగు సంస్కృతీ వైభవాన్ని కళ్లకు కట్టి చూపే ‘మీరూ శాసనాలు చదవొచ్చు’అన్న అమూల్య గ్రంథాన్ని అందించారు.
ఇందులో ఆయా కాలాల్లో హైందవ, బౌద్ధ మతాలకు మధ్య జరిగిన భావ సంఘర్ష ణలు, లిపిలో వచ్చిన మార్పులు వగైరా చరిత్ర ఉంది. ఈ పరిణామ క్రమానికి శాశ్వత నిలువుటద్దంగా నిలిచిన, సెక్రటేరి యట్ ఆవరణలో స్థాపితమైన ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ అమూల్య చారిత్రక కట్టడాన్ని ఎందుకు తొలగించారో సమా ధానం కావాలి.
హేతువాదాన్ని వ్యాప్తి చేయ డంలో స్థిర చిత్తంతో ముందుకు దూసుకు వెడుతున్న బౌద్ధ ధర్మాన్నీ, దాని తాలూకు ప్రచార సంస్థ లనూ ఎదుర్కొంటున్న దశలో హైందవంలోని ఛాందసులు బౌద్ధా రామాల్ని కూల్చకుండా ఉంటారా అని మహాపండితులు రాహుల్ సాంకృత్యాయన్, తిరుమల రామచంద్ర పదేపదే ప్రశ్నించవలసి వచ్చిందని మరవరాదు.
హైదరాబాద్‌లో మూసీ తీరాన ఉన్న క్రీ.శ. 4వ శతాబ్ది నాటి బౌద్ధారామాన్ని కాస్తా 30 ఏళ్ల క్రితమే కొనగండ్ల నరసింహస్వామి ఆలయంగా మార్చేశారని శాసనాల చరిత్రలో పేర్కొన్నారు. అహో బిలం, మంగళగిరి, భీమునిపట్నం (పావురాళ్ల కొండ), సింహాచలం మున్నగు నరసింహ క్షేత్రాలన్నీ ఒకనాటి బౌద్ధ స్థావరాలేనంటారు. హైదరాబాద్‌లో లభించిన ప్రాకృత బౌద్ధ శాసనం క్రీ.శ. 4వ శతాబ్ది నాటిది. ప్రముఖ శాసన పరిశోధకులు పీవీ పరబ్రహ్మ శాస్త్రి దానిని ధ్రువీకరించారు.
బౌద్ధానికి విస్తారంగా రాజాదరణ లభించిన విష్ణుకుండినుల కాలంలో (క్రీ.శ. 6వ శతాబ్ది) విష్ణుకుండి మొదటి గోవింద వర్మ పట్టపురాణి పరమభట్టారిక మహా దేవి నల్గొండ జిల్లా తుమ్మల గూడెంలో తన పేర ఒక మహా విహారాన్ని నిర్మించి, సర్వ జీవరాసుల హితాన్ని కోరే బౌద్ధం పట్ల తన మక్కువను తెలియజేసింది. ఇక క్రీ.శ. 14–17 శతాబ్దుల్లో విజ యనగర శాసనాలు బౌద్ధ ధర్మాన్ని తలదాల్చి యశస్సు గడించినవే. కాకతీ యుల తరువాత మొత్తం తెలుగునేలను పాలించిన కుతుబ్‌షాహీలు తెలుగును ప్రోత్సహించినవాళ్లే.
సుప్రసిద్ధ నాణేల పరిశోధకులు డాక్టర్ దేమె రాజారెడ్డి కోటిలింగాల తవ్వకాల్లో అనేక పేర్లున్న నాణేలపై గల లిపి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటిదనీ, రాజుల పేర్లు తెలుగులో ఉన్నాయనీ నిర్ధారించారు. తెలుగు లిపి ఆవిర్భావ, వికాసాల గురించి పీవీ పరబ్రహ్మశాస్త్రి, డా.ఎస్. రామచంద్రమూర్తి అనేక విషయాలు వెల్లడించారు. ఇంత చరిత్ర సంస్కృతి ఉభయ ప్రాంతాలలోని తెలుగు వారికి ఉండగా, ఉమ్మడి బౌద్ధసంస్కృతీ వైభవాన్ని వెలార్చిన సాధికార నిర్మాణ రూపాన్ని సెక్రటే రియట్‌లో నామరూపాలు లేకుండా చేయడం దుర్మార్గం. పాలకుల స్థాయికి మించిన దుశ్చర్యగా పరిగణించక తప్పదు.
ఇంతకూ ‘జీవతత్వం’ ఎక్కడుందన్న ప్రశ్నకు వేమన్నను అడిగితే చెబుతాడు:‘‘తనువులోన జీవతత్వ మెరుంగక వేరెకలదటంచు వెదుక నేల,భానుడుండ దివ్వెపట్టి వెదుకు రీతి?!’’
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment