Telangana New Secretariat
-
ఆగస్టులోగా ‘పాలమూరు’ తాగునీళ్లు!
సాక్షి, హైదరాబాద్: ‘పాలమూరు’ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి వచ్చే ఆగస్టులోగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా జూలై నాటికి కరివెన జలాశయానికి, తర్వాతి నెలరోజుల్లో ఉద్ధండాపూర్ జలాశయానికి నీళ్లను ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాల మిగులు పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయంలో సోమవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించారు. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు పనులను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన పనుల పురోగతిపై కూలంకంషంగా చర్చించారు. జలాశయాల పంపుహౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక పాలమూరు జిల్లాలోని ఇతర ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్‌రావు, అడ్వైజర్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ద్వితీయం పూజల్లో పాల్గొన్న సీఎం నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ సోమవారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తూర్పు ప్రధానద్వారం ద్వారా సచివాలయంలోకి ప్రవేశించారు. నేరుగా యాగశాలకు చేరుకున్నారు. అక్కడ వేదపండితులు నిర్వహించిన ద్వితీయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆరో అంతస్తుకు చేరుకున్నారు. తన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, పీఆర్వో కార్యాలయాలను పరిశీలించారు. కారిడార్లలో కలియదిరిగారు. అనంతరం తన చాంబర్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో తిరిగి ప్రగతిభవన్‌కు బయలుదేరారు. -
బౌద్ధ వైభవ చిహ్నం తొలగించడమా?
చరిత్రలో హేతువాదాన్ని వ్యాప్తి చేయడంలో అగ్రగామి, బౌద్ధ ధర్మం. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించినది, యజ్ఞ యాగాదులను నిరసించినది కూడా ఇదే ధర్మం. అలాంటి మహత్తర ధర్మాన్ని తెలుగు నేల ఇరు చేతులా హత్తుకుంది. దేశంలోని ఏ బౌద్ధ స్థావరం నుంచి దొరకని ఆనవాళ్లు తెలుగు నేలలో దొరికాయి. అలాంటి తెలుగు నేల విశిష్ట బౌద్ధ వారసత్వపు చిహ్నంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ‘పూర్ణఘటాన్ని’ నెలకొల్పారు. కానీ కొత్తగా ప్రారంభమైన తెలంగాణ సచివాలయంలో ఆ ఆనవాళ్లను చెరిపేశారు. భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో అదే అంబేడ్కర్ పేరిట ఏర్పాటైన సచివాలయంలో బౌద్ధ చిహ్నాన్ని కూల్చేశారు. భారత సెక్యులర్ రాజ్యాంగ నిర్మాత, బౌద్ధ సంస్కృతీ ప్రియుడైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకూ శుభాభినందనలు తెలుపు తున్నాను; కానీ ఈ సందర్భంలోనే సెక్రటేరియట్లో ఉండవలసిన, ఉమ్మడి తెలుగు బౌద్ధ సంస్కృతీ వైభవ ప్రతీకగా అంతకుముందు నుంచీ ఉన్న విశిష్ట శాశ్వత కట్టడాన్ని తొలగించినందుకు విచారం వెలిబుచ్చక తప్పడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2008) ఆయన ఆధ్వర్యాన తెలుగు ప్రజల ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ చిహ్నంగా ఆ కట్టడం నాలుగు భాషల ఉద్దీపనతో వెలిసింది. ఎంతోమంది పర్యాటకుల్ని ఆకర్షించిన బౌద్ధ సంస్కృతీ చిహ్నమది (ఘనాకారపు గ్రానైట్ రాయి మీద తొలిచిన పూర్ణఘట ప్రతిరూపం). కానీ నేటి సెక్రటేరియట్ ఆవరణలో ఆ విశిష్ట చిహ్నం ఆనవాళ్ళు ‘కలికానికైనా’ కానరావు. ఇంతకూ ఆ బౌద్ధ ధర్మ సంస్కృతీ వైభవ కట్టడం ఏమైనట్టు? భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో ఆ చిహ్నాన్నే కూల్చేశారు. ఏ యజ్ఞయాగాదులకు దూరంగా జరిగి సర్వ మానవ సమానత్వం లక్ష్యంగా అంబేడ్కర్ ముందుకు సాగాడో –అందుకు విరుద్ధంగా యజ్ఞయాగాదులతో ‘బీఆర్ఎస్’ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన అంబేడ్కర్ సచివాలయ ప్రవేశం చేశారు. విశేషమేమంటే, ‘బౌద్ధ ధర్మ చక్ర ప్రశస్తి’ శాసనం మన దేశం మొత్తం మీద ఏ బౌద్ధ స్థావరం నుంచీ ఇంతవరకూ వెలుగు చూడనందుననే తెలంగాణలోని ‘ఫణిగిరి’ ధర్మ చక్ర ప్రశస్తి శాసనానికి చారిత్రక ప్రాధాన్యం లభించింది. ప్రాకృత భాషను, పాలీ లిపిని, ‘బ్రాహ్మీ’ లిపిని ప్రేమించి, ప్రోత్సహించిన ధర్మం కూడా బౌద్ధానిదేనని మరచి పోరాదు. క్రీ.పూ. 3 – క్రీ.శ. 18 శతాబ్దాల మధ్య వెలువడిన వేలాది శాసనాలను ఉమ్మడి తెలుగువారి సొత్తుగా భావించి ఈ విశేషాలన్నింటినీ ఆవిష్కరించిన ప్రసిద్ధ స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఒకరు. ఈయనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో తెలుగు వారి బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే అత్యున్నత కట్టడ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సరిగ్గా ఆ కట్టడం ఆనవాళ్లే కనపడకుండా చేసింది కేసీఆర్ పాలన. కాక పోతే అంబేడ్కర్ పేరును ఒక ముసుగుగా వాడుకోవడం పాలకుల కొత్త ‘సంస్కృతి’! కొండా శ్రీనివాసులు, అవధానం ఉమా మహేశ్వరి సంపాదకులుగా శివనాగిరెడ్డి తెలుగు సంస్కృతీ వైభవాన్ని కళ్లకు కట్టి చూపే ‘మీరూ శాసనాలు చదవొచ్చు’అన్న అమూల్య గ్రంథాన్ని అందించారు. ఇందులో ఆయా కాలాల్లో హైందవ, బౌద్ధ మతాలకు మధ్య జరిగిన భావ సంఘర్ష ణలు, లిపిలో వచ్చిన మార్పులు వగైరా చరిత్ర ఉంది. ఈ పరిణామ క్రమానికి శాశ్వత నిలువుటద్దంగా నిలిచిన, సెక్రటేరి యట్ ఆవరణలో స్థాపితమైన ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ అమూల్య చారిత్రక కట్టడాన్ని ఎందుకు తొలగించారో సమా ధానం కావాలి. హేతువాదాన్ని వ్యాప్తి చేయ డంలో స్థిర చిత్తంతో ముందుకు దూసుకు వెడుతున్న బౌద్ధ ధర్మాన్నీ, దాని తాలూకు ప్రచార సంస్థ లనూ ఎదుర్కొంటున్న దశలో హైందవంలోని ఛాందసులు బౌద్ధా రామాల్ని కూల్చకుండా ఉంటారా అని మహాపండితులు రాహుల్ సాంకృత్యాయన్, తిరుమల రామచంద్ర పదేపదే ప్రశ్నించవలసి వచ్చిందని మరవరాదు. హైదరాబాద్‌లో మూసీ తీరాన ఉన్న క్రీ.శ. 4వ శతాబ్ది నాటి బౌద్ధారామాన్ని కాస్తా 30 ఏళ్ల క్రితమే కొనగండ్ల నరసింహస్వామి ఆలయంగా మార్చేశారని శాసనాల చరిత్రలో పేర్కొన్నారు. అహో బిలం, మంగళగిరి, భీమునిపట్నం (పావురాళ్ల కొండ), సింహాచలం మున్నగు నరసింహ క్షేత్రాలన్నీ ఒకనాటి బౌద్ధ స్థావరాలేనంటారు. హైదరాబాద్‌లో లభించిన ప్రాకృత బౌద్ధ శాసనం క్రీ.శ. 4వ శతాబ్ది నాటిది. ప్రముఖ శాసన పరిశోధకులు పీవీ పరబ్రహ్మ శాస్త్రి దానిని ధ్రువీకరించారు. బౌద్ధానికి విస్తారంగా రాజాదరణ లభించిన విష్ణుకుండినుల కాలంలో (క్రీ.శ. 6వ శతాబ్ది) విష్ణుకుండి మొదటి గోవింద వర్మ పట్టపురాణి పరమభట్టారిక మహా దేవి నల్గొండ జిల్లా తుమ్మల గూడెంలో తన పేర ఒక మహా విహారాన్ని నిర్మించి, సర్వ జీవరాసుల హితాన్ని కోరే బౌద్ధం పట్ల తన మక్కువను తెలియజేసింది. ఇక క్రీ.శ. 14–17 శతాబ్దుల్లో విజ యనగర శాసనాలు బౌద్ధ ధర్మాన్ని తలదాల్చి యశస్సు గడించినవే. కాకతీ యుల తరువాత మొత్తం తెలుగునేలను పాలించిన కుతుబ్‌షాహీలు తెలుగును ప్రోత్సహించినవాళ్లే. సుప్రసిద్ధ నాణేల పరిశోధకులు డాక్టర్ దేమె రాజారెడ్డి కోటిలింగాల తవ్వకాల్లో అనేక పేర్లున్న నాణేలపై గల లిపి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటిదనీ, రాజుల పేర్లు తెలుగులో ఉన్నాయనీ నిర్ధారించారు. తెలుగు లిపి ఆవిర్భావ, వికాసాల గురించి పీవీ పరబ్రహ్మశాస్త్రి, డా.ఎస్. రామచంద్రమూర్తి అనేక విషయాలు వెల్లడించారు. ఇంత చరిత్ర సంస్కృతి ఉభయ ప్రాంతాలలోని తెలుగు వారికి ఉండగా, ఉమ్మడి బౌద్ధసంస్కృతీ వైభవాన్ని వెలార్చిన సాధికార నిర్మాణ రూపాన్ని సెక్రటే రియట్‌లో నామరూపాలు లేకుండా చేయడం దుర్మార్గం. పాలకుల స్థాయికి మించిన దుశ్చర్యగా పరిగణించక తప్పదు. ఇంతకూ ‘జీవతత్వం’ ఎక్కడుందన్న ప్రశ్నకు వేమన్నను అడిగితే చెబుతాడు:‘‘తనువులోన జీవతత్వ మెరుంగక వేరెకలదటంచు వెదుక నేల,భానుడుండ దివ్వెపట్టి వెదుకు రీతి?!’’ abkprasad2006@yahoo.co.in -
Video: బాణసంచా వెలుగుల్లో కొత్త సచివాలయం.. అదరహో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Big Day In Telangana Today… ❤️ Opening of New Telangana’s Secretariat 👏 Not Graphics like in other states 😀 It’s A Reality… The Best in India… Thanks to Visionary KCR Garu ✊️#Telangana #Secretariat 😍@KTRBRS pic.twitter.com/YQR07zozon — Govardhan Reddy Dharmannagari (@DGRforBRS) April 30, 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు -
కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నమే ఈ కొత్త సచివాలయ డిజైన్ అని సెటైర్లు వేశారు. వీరి ప్రేమకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాయబారులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త సచివాలయాన్ని కూలగొడతానని తానెప్పుడూ అనలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రోజూ కేసీఆర్ ఆఫీస్‌కు వస్తారా?: ఈటల రాజేందర్ కరీంనగర్: నూతన సచివాలయం ప్రారంభంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజు ఆఫీస్‌కు వస్తారా? అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికి, కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు.తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్థమైందని ధ్వజమెత్తారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుపడాలని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ -
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు) ] -
సాగర తీరాన ధగధగల సౌధం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ తీరాన ఓ భారీ భవన సముదాయం.. ఇండో–పర్షియన్ నిర్మాణ శైలి.. నిలువెల్లా సాంకేతికత.. గుమ్మటాలతో సంప్రదాయ రూపు..ఆధునిక హంగులతో కూడిన అద్భుత కట్టడం. చూడగానే తాజ్‌మహల్, మైసూర్ ప్యాలెస్‌ను తలపించే శ్వేతసౌధం..635 గదులు.. 30 సమావేశ మందిరాలు..34 గుమ్మటాలు.. అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. మొత్తం 28 ఎకరాల్లో.. ► సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ► సచివాలయ ప్రాంగణం 28 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో భవనాల విసీర్ణం రెండున్నర ఎకరాలు. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. వెరసి 90 శాతం స్థలం ఖాళీగా ఉంటే, పది శాతం మాత్రమే భవనాలున్నాయి. ► ప్రాంగణంలో మొత్తం నిర్మిత స్థలం దాదాపు 10 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కూడా దాదాపు ఇంతే విస్తీర్ణంలో ఉంది. ► ఈ భవనాన్ని 26 నెలల్లో పూర్తి చేశారు. మధ్యలో కోవిడ్ కారణంగా ఆరు నెల లు వృథా అయింది. అంటే 20 నెల ల్లోనే భవనాన్ని సిద్ధం చేసినట్టయింది. ► నిర్మాణ పనుల్లో 3 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. చివరలో రాత్రింబవళ్లు 4 వేల మంది వరకు పనిచేశారు. కుతుబ్‌మినార్ కన్నా ఎత్తు ► సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులు, ఇది కుతుబ్‌మినార్ (239 అడుగులు) కంటే ఎత్తు. భవనంపైన ప్రధాన రెండు గుమ్మటాల మీద ఏర్పాటు చేసిన అశోక చిహ్నాల్లో ఒక్కోదాని ఎత్తు 14 అడుగులు ► భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. ఇతరత్రా కారణాలతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. ► ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకునేందుకు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే. ►గుమ్మటాల్లో రెండు పెద్దవి. ఒక్కోటి 50 అడుగుల డయాతో 48 అడుగుల ఎత్తున్నాయి. కొన్ని డోమ్‌లపై ఉన్న శూలాల్లాంటి శిఖర భాగం 9 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పుతో ఉంది. 360 డిగ్రీల కోణంలో నగర అందాలు ► పెద్ద గుమ్మటాల్లో ఉన్న స్థలాన్ని ప్రత్యేక ప్రాంతంగా రూపొందించారు. విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్లకు వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు.ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్‌గా పేర్కొంటున్నారు. ► పార్లమెంటు భవనానికి వినియోగించిన ధోల్పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3.500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకు రాజస్థాన్‌లోని ధోల్పూర్లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాద్‌కు తరలించారు. బేస్మెంట్ మొత్తానికి ఎర్ర రాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు రాయిని వాడారు. ► స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ (జీఆర్సీ) పద్ధతిలో ప్రీఫ్యాబ్రికేటెడ్ డెకొరేషన్ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిచిలింది. 42 అడుగుల పోర్టికో.. ► ప్రధాన పోర్టికో ఎత్తు ఏకంగా 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ► భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కై లాంజ్ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి. ► సచివాలయానికి తూర్పువైపు ప్రధాన ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులకు అనుమతి ఉంటుంది. పశ్చిమం వైపు అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్యం వైపు ఉద్యోగుల ద్వారం, దక్షిణం వైపు సందర్శకుల ద్వారం ఏర్పాటు చేశారు. సందర్శకుల వాహనాలు ప్రధాన ప్రహరీ బయటే నిలపాల్సి ఉంటుంది. అధికారులు, సిబ్బందికి లోపల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ► భవనానికి దక్షిణం వైపు సందర్శకుల రిసెప్షన్, ఎన్ఆర్ఐ రిసెప్షన్, పబ్లిసిటీ సెల్, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసు, బస్, రైల్వే కౌంటర్లు, క్యాంటీన్, మీడియా కేంద్రాలను విడిగా నిర్మించారు. వెనుక వైపు సెక్యూరిటీ కార్యాలయం, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఉద్యోగుల పిల్లల క్రెచ్, ఆరోగ్య కేంద్రం, ఇండోర్ గేమ్స్ ప్రాంగణం, సహకార పొదుపు సంఘ కార్యాలయం, తదితరాలతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించారు. నైరుతి వైపు దేవాలయం, వెనక వైపు చర్చి, మసీదు నిర్మించారు. ప్రత్యేక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ► తాగు నీటి కోసం 1.20 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంకు నిర్మించారు. ఇతర అవసరాలకు 1.80 లక్షల లీటర్ల సామర్థ్యంతో, అగ్నిమాపక అవసరం కోసం 2.80 లక్షల లీటర్ల సామర్థ్యంతో, వర్షపు నీరు స్టోరేజీ కోసం 2.40 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భంలో ట్యాంకులు నిర్మించారు. ► వెనుకవైపు ఏడో అంతస్తులో ప్రత్యేకంగా సచివాలయ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధునిక సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు. నిత్యం తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన 300 మంది రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కలెక్టరేట్లు, ప్రధాన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సచివాలయం అనుసంధానమై ఉంటుంది. ► సహజ సిద్ధమైన వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, పోర్టికోలు డిజైన్ చేశారు. నీళ్లు, కరెంటు పొదుపునకు వీలుగా నిర్మించినందున ‘ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ఈ భవనానికి గోల్డ్ రేటింగ్ జారీ చేసింది. ఈ రేటింగ్ ఉన్న సచివాలయ భవనం దేశంలో ఇదొక్కటే. ► త్వరలో సచివాలయ పార్కింగ్ కేంద్రాల రూఫ్‌టాప్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. -
తెలంగాణ: కొత్త సచివాలయ ప్రారంభానికి డేట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఈ మేరకు తేదీని వెల్లడించారు. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అలాగే.. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సచివాలయ పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడి రోడ్లను సైతం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
TS: నూతన సచివాలయ భవనం ఏరియల్ వ్యూ అదిరిందిగా..
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలు. కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా ప్రారంభోత్సవానికి సిద్ధమైన తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం భవనం. తెలంగాణ కొత్త సచివాలయం ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుక వాయిదా పడిన సంగతి పక్కనపెడితే.. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను ప్రభుత్వం అత్యంత సుందరరీకరణగా తీర్చిదిద్దుతోంది. ఒకవైపు సచివాలయ నిర్మాణం ఇప్పటికే తుది మెరుగులు దిద్దుకోగా, ట్యాంక్ బండ్ పరిసరాలు కొత్త రూపును సంతరించుకోనున్న క్రమంలో ఆ ప్రాంతం మరింత ఆహ్లాదంగా మారనుంది. ఇందుకు నూతన సచివాలయం యొక్క ఏరియల్ వ్యూనే సాక్షంగా నిలుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తాం: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ హీట్ మరోసారి పెరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామన్నారు. ప్రగతిభవన్‌ను కూడా ప్రజా దర్బార్‌గా మారుస్తామని కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాశంగా మారాయి. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. రోడ్లకు అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు కూల్చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలుపెట్టాలి. కేసీఆర్ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీచేస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాము. తెలంగాణలో నిజాం రాజ్యం పోవాలి. మన రాజ్యం రావాలి. కరెంట్ ఇవ్వడం లేదు. పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు, పాస్‌పోర్టులు ఎందుకు రావడంలేదో ఎంఐఎం నేతలు, పాతబస్తీలు ఆలోచించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటనా జరిగినా పాతబస్తీకి చెందిన వ్యక్తులే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. -
కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగనిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమౌతూ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమౌతున్న తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో, అత్యంత సహజమైన రీతిలో, నలు దిశలనుంచి సహజమైన గాలి వెలుతురు ప్రసరించేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించేలా దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి గారి పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియ తిరిగి అణువణువునూ సీఎం కేసీఆర్ పరిశీలించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా ఇంజనీర్లకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రధాన ద్వారం గుండా పరిశీలన ప్రారంభించారు. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మితమౌతున్న రోడ్లను పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలను, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు. అక్కడి సౌకర్యాలను తదితర వివరాలను, ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతి దిక్కున నిర్మితమౌతున్న ప్రార్థనా మందిరాన్ని సీఎం పరిశీలించారు. ఆ తర్వాత పడమటి దిక్కున ఉన్న అంతర్గత రోడ్లు, వాటి వైశాల్యం, తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంటు తదితర నాణ్యతా అంశాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. సచివాలయం పడమటి భాగంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని కూడా సీఎం పరిశీలించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు. వెహికల్ పార్కింగులను కూడా సీఎం కేసీఆర్ సందర్శించారు. అక్కడనుంచి తిరిగి నేరుగా సచివాలయ ప్రధాన ద్వారం గుండా మెట్లెక్కి మొదటి ఫ్లోరుకు చేరుకున్నారు. మెట్లకు కుడి ఎడమ పక్కన ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి ఇంజనీర్లకు సూచించారు. మొదటి ఫ్లోరు కలియదిరిగిన సిఎం కేసీఆర్ లిఫ్టు ద్వారా 6వ ఫ్లోరులోని సీఎం చాంబర్ కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఫాల్స్ సీలింగ్, వుడ్ పానెలింగ్, ఎసీ ఫిట్టింగ్స్, తదితర తుది మెరుగుల పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం , చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌ను సీఎంఓ కార్యదర్శులు, పీఆర్వోలు, తదితర సీఎంవో సిబ్బంది సహా ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను సిఎం పరిశీలించారు. సిఎం చాంబర్ లో మార్పులు చేపట్టాలని సూచనలు చేశారు. అదే ఫ్లోర్ మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్‌లను వాటిల్లో చేపట్టిన ఫాల్స్ సీలింగ్ పనులను పరిశీలించారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులను, ఎలివేషన్ లో భాగంగా జిఆర్సీ తో చేసే కళాకృతులను, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. ఆరవ అంతస్తు నుండి అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు నిర్మితమౌతున్న కట్టడాలను కిటికీ నుండి బయటికి వంగి క్షుణ్ణంగా పరిశీలించి చూసారు. ఇంటీరియర్ డిజైన్లు, కరెంటు పనులు, ఏసీల ఫిటింగ్, పిల్లర్లకు, స్థంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్కు పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన సీఎం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులను, వుడ్ వర్క్స్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, లిఫ్టుల పనులతీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆరవ ఫ్లోర్ నుంచి లిఫ్టు ద్వారా కిందికి దిగిన సీఎం కేసీఆర్ మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అక్కడనుంచి మెట్లు దిగి ప్రధాన ద్వారానికి ఎదరుగా రెండు వైపుల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను పరిశీలించారు. ఉత్తర తూర్పు ఈశాన్య దిశగా నిర్మితమౌతున్న లాన్ లను, రోడ్లు, పార్కింగ్, తో పాటు గార్డెనింగ్ పనులను పరిశీలించారు. మ్యాపు ద్వారా అన్ని నిర్మాణాల తీరును పరిశీలిస్తూ, వర్క్ ఏజెన్సీలను, మంత్రిని అడిగి తెల్సుకున్నారు. అక్కడి నుంచి కాలి నడకన కలియదిరుగుతూ రాళ్లమీద నడుస్తూ, నిర్మాణానానికి ఉపయోగించే కర్రలు, ఇనుప సామాగ్రిని దాటుతూ ముందుకు సాగారు. వీఆర్వీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఏసీ ప్లాంట్లను, జనరేటర్లను, అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించారు. ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ పనులపై ఇంజనీర్లకు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సచివాలయ నిర్మాణం పై నివేదిక
-
'ఎన్ని కుట్రలు చేసినా కొత్త సచివాలయం ఖాయం'
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎన్నికుట్రలు చేసిన తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు కొత్త అసెంబ్లీ నిర్మాణం విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం సచివాలయంలో కనీసం వసతులు లేవన్న ఆయన అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరిగే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయానికి ఉండాల్సిన విధి విధానాలు పాటించలేదని, విధుల నిర్వహణకు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా కేవలం రెండు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్లో నూతన సచివాలయం నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుతగులుతున్నాయో అర్థం కావడం లేదని, ఎవరు అడ్డుకున్నా తాము నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. -
తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు గ్రీన్‌సిగ్నల్
-
కొత్త సచివాలయం - విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణం 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సచివాలయంలో వివిధ విభాగాలకు ఎంతెంత స్థలం కావాలి? మొత్తం ఎంత స్థలం కావాలి? తదితర అంశాలన్నిటినీ చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియిమించింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా అయిదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం, సీఎం కార్యాలయం, మంత్రులు, మంత్రుల పేషీలు, సచివాలయం సిబ్బంది, హెచ్ఓడీలకు కావలసిన స్థలంపై ఈ కమిటీ చర్చిస్తుంది. అలాగే సీఎం క్యాంపు కార్యాలయం, ఐఏఎస్‌లకు కొత్త క్వార్టర్స్‌పై కూడా ఈ కమిటీ విధివిధానలు ఖరారు చేస్తుంది. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పురపాలన పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి సభ్యులుగా, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.