హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగనిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో, అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమౌతూ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమౌతున్న తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
సీఎం కేసీఆర్ దార్శనికతతో, అత్యంత సహజమైన రీతిలో, నలు దిశలనుంచి సహజమైన గాలి వెలుతురు ప్రసరించేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించేలా దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి గారి పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది.
ఈ సందర్భంగా... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియ తిరిగి అణువణువునూ సీఎం కేసీఆర్ పరిశీలించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా ఇంజనీర్లకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.
మంగళవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రధాన ద్వారం గుండా పరిశీలన ప్రారంభించారు. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మితమౌతున్న రోడ్లను పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలను, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు.
అక్కడి సౌకర్యాలను తదితర వివరాలను, ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతి దిక్కున నిర్మితమౌతున్న ప్రార్థనా మందిరాన్ని సీఎం పరిశీలించారు. ఆ తర్వాత పడమటి దిక్కున ఉన్న అంతర్గత రోడ్లు, వాటి వైశాల్యం, తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంటు తదితర నాణ్యతా అంశాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు.
సచివాలయం పడమటి భాగంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని కూడా సీఎం పరిశీలించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు. వెహికల్ పార్కింగులను కూడా సీఎం కేసీఆర్ సందర్శించారు.
అక్కడనుంచి తిరిగి నేరుగా సచివాలయ ప్రధాన ద్వారం గుండా మెట్లెక్కి మొదటి ఫ్లోరుకు చేరుకున్నారు. మెట్లకు కుడి ఎడమ పక్కన ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి ఇంజనీర్లకు సూచించారు. మొదటి ఫ్లోరు కలియదిరిగిన సిఎం కేసీఆర్ లిఫ్టు ద్వారా 6వ ఫ్లోరులోని సీఎం చాంబర్ కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఫాల్స్ సీలింగ్, వుడ్ పానెలింగ్, ఎసీ ఫిట్టింగ్స్, తదితర తుది మెరుగుల పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం , చీఫ్ సెక్రటరీ ఛాంబర్‌ను సీఎంఓ కార్యదర్శులు, పీఆర్వోలు, తదితర సీఎంవో సిబ్బంది సహా ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను సిఎం పరిశీలించారు. సిఎం చాంబర్ లో మార్పులు చేపట్టాలని సూచనలు చేశారు. అదే ఫ్లోర్ మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్లను వాటిల్లో చేపట్టిన ఫాల్స్ సీలింగ్ పనులను పరిశీలించారు.
కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులను, ఎలివేషన్ లో భాగంగా జిఆర్సీ తో చేసే కళాకృతులను, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. ఆరవ అంతస్తు నుండి అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు నిర్మితమౌతున్న కట్టడాలను కిటికీ నుండి బయటికి వంగి క్షుణ్ణంగా పరిశీలించి చూసారు.
ఇంటీరియర్ డిజైన్లు, కరెంటు పనులు, ఏసీల ఫిటింగ్, పిల్లర్లకు, స్థంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్కు పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన సీఎం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులను, వుడ్ వర్క్స్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, లిఫ్టుల పనులతీరును సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఆరవ ఫ్లోర్ నుంచి లిఫ్టు ద్వారా కిందికి దిగిన సీఎం కేసీఆర్ మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అక్కడనుంచి మెట్లు దిగి ప్రధాన ద్వారానికి ఎదరుగా రెండు వైపుల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను పరిశీలించారు. ఉత్తర తూర్పు ఈశాన్య దిశగా నిర్మితమౌతున్న లాన్ లను, రోడ్లు, పార్కింగ్, తో పాటు గార్డెనింగ్ పనులను పరిశీలించారు. మ్యాపు ద్వారా అన్ని నిర్మాణాల తీరును పరిశీలిస్తూ, వర్క్ ఏజెన్సీలను, మంత్రిని అడిగి తెల్సుకున్నారు. అక్కడి నుంచి కాలి నడకన కలియదిరుగుతూ రాళ్లమీద నడుస్తూ, నిర్మాణానానికి ఉపయోగించే కర్రలు, ఇనుప సామాగ్రిని దాటుతూ ముందుకు సాగారు.
వీఆర్వీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఏసీ ప్లాంట్లను, జనరేటర్లను, అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించారు. ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ పనులపై ఇంజనీర్లకు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment