'ఎన్ని కుట్రలు చేసినా కొత్త సచివాలయం ఖాయం'
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎన్నికుట్రలు చేసిన తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు కొత్త అసెంబ్లీ నిర్మాణం విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం సచివాలయంలో కనీసం వసతులు లేవన్న ఆయన అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరిగే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయానికి ఉండాల్సిన విధి విధానాలు పాటించలేదని, విధుల నిర్వహణకు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా కేవలం రెండు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో నూతన సచివాలయం నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుతగులుతున్నాయో అర్థం కావడం లేదని, ఎవరు అడ్డుకున్నా తాము నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.