ధర్మం నడిచిన రోజు | special story on budha | Sakshi
Sakshi News home page

ధర్మం నడిచిన రోజు

Published Sun, Jul 9 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

ధర్మం నడిచిన రోజు

ధర్మం నడిచిన రోజు

భారతదేశంలో పుట్టి, ఈనాడు ప్రపంచం నలుమూలలా విస్తరించిన ధార్మిక మార్గం బౌద్ధం. ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న అగ్రగామి కూడా బౌద్ధమే. ఇందుకు ప్రధాన కారణం ప్రజల వద్దకే ప్రబోధాల్ని తీసుకుపోయే విధానానికి బుద్ధుడు నాంది పలకడమే. ఆ నాంది పలికిన రోజే ఆషాఢ పున్నమి రోజు. అది నేడు.

ఆషాఢ పున్నమి విశేషం ఏమంటే...
జ్ఞానం తెలుసుకోవడం కోసం ఇల్లు విడిచిన సిద్ధార్థుడు ఆరేళ్లు ఎన్నోచోట్ల, ఎందరో గురువుల దగ్గరకు వెళ్లాడు. ఎక్కడా సరైన దారి కనిపించలేదు. ప్రపంచ ప్రజల దుఃఖాన్ని మాపే మార్గం అగుపించలేదు. చివరికి బుద్ధగయలో ధ్యానసాధన చేశాడు. ఒక వైశాఖ పున్నమి రోజున ఆయనకు ఆ మార్గం అవగతం అయింది. అదే బుద్ధ పూర్ణిమ. బుద్ధునికి కలిగిన సంబోధిలో రెండు ప్రధాన విషయాలున్నాయి.
ఒకటి: ఈ ప్రపంచంలో స్థిరమైనది, శాశ్వతమైనది ఏదీ లేదు. ప్రతిదీ, ప్రతిక్షణం మారిపోతూనే ఉంటుంది. మార్పే ఈ ప్రపంచ భౌతిక నియమం.

రెండు: మనిషి దుఃఖానికి ముదిరిపోయిన కోరికలు (తృష్ణ) ప్రధాన కారణం. జీవితం మీద, జీవనం మీద మనిషికి సరైన దృక్పథం లేకపోవడం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా తనకు ఇష్టమైనట్లో, అయిష్టమైనట్లో చూడ్డం. ఈ మోహ, ద్వేషాలే దుఃఖానికి కారణం. ఈ దుఃఖం పోవాలంటే సరైన దృక్పథం కావాలి. ఆ సరైన దృక్పథం (సమ్యక్‌ దృష్టి) కలగాలంటే మనం అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. జ్ఞానం, శీలం, ధ్యానం (నియంత్రణ) ఈ మూడింటి సాకారమే అష్టాంగ మార్గం.

ఈ రెండు విషయాల్నీ ఆమూలాగ్రం బోధిస్తే చాలా కష్టంగా అర్థం అవుతుంది. తాను కనుగొన్న ఈ నూతన మార్గాన్ని ఎలా సులభతరం చేయాలా అని మధన పడుతూ అలాగే ఏడువారాలు గడిపాడు. ఈ గంభీర విషయాన్ని సులువుగా ప్రజల భాషలోనే, ప్రజల మధ్య తిరుగుతూ చెప్పాలని నిర్ణయం తీసుకుని.. తన పాత మిత్రగురువులైన ఆలార కాలముడు, ఉద్ధవ రామపుత్రునికి చెప్పాలని చూస్తాడు. కానీ వారిద్దరూ అప్పటికే మరణించడంతో... తన ఐదుగురు మిత్రులు సారనాథ్‌ (రుషిపట్టణం) జింకల వనంలో ఉన్నారని తెలిసి వారి దగ్గరకు వెళ్లాడు. తాను కనుగొన్న నూతన మార్గాన్ని వారికి ఐదురోజులు బోధించాడు. వారి అనుమానాలన్నీ తీర్చాడు. ఆ ప్రబోధాల సారం మొదటి రోజున కొండన్నకు, రెండోరోజున బద్ధియునికి, మూడోరోజున కాశ్యపునికి, నాలుగోరోజున అశ్వజిత్తుకి, ఐదోనాడు మహానామకు అవగతం అయ్యాయి.

వారు ఐదుగురూ ఆయన అనుయాయులుగా మారారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అదే తొలి బౌద్ధ సంఘం. ఇది బౌద్ధసంఘం పుట్టిన రోజు. కాలినడక తిరుగుతూ (చారిక) ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని బయలుదేరాడు. అలా ధర్మచక్రం కదలింది. దానికి గుర్తుగా ఈ రోజున ధర్మచక్ర ప్రవర్తన దినంగా ప్రపంచ బౌద్ధులు జరుపుకుంటారు.

బౌద్ధభిక్షువులు దీన్నే మహా గురువైన బుద్ధుని తొలి ప్రబోధదినంగా భావించి గురుపూర్ణిమగా జరుపుకుంటారు. నిజం... ఇది ధర్మం నడక ప్రారంభించిన రోజు. జ్ఞానవెలుగులు పరచిన రోజు. – డా. బొర్రా గోవర్ధన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement