నిరంజన నదీ తీరంలో.. రావిచెట్టు నీడలో.. | emergence of the Buddhist | Sakshi
Sakshi News home page

నిరంజన నదీ తీరంలో.. రావిచెట్టు నీడలో..

Published Sat, Mar 28 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

నిరంజన నదీ తీరంలో.. రావిచెట్టు నీడలో..

నిరంజన నదీ తీరంలో.. రావిచెట్టు నీడలో..

బౌద్ధ మత ఆవిర్భావం

భారతదేశంలో క్రీ.పూ. ఆరో శతాబ్దంలో జరిగిన మత ఉద్యమాల్లో భాగంగా వైదిక మతంపై తిరుగుబాటు ఉద్యమంగా బౌద్ధ మతం ఆవిర్భవించింది. దీని స్థాపకుడు సిద్ధార్థుడు. ఇతడినే గౌతముడు అంటారు. సిద్ధార్థుడు క్రీ.పూ. 563లో ప్రస్తుత నేపాల్‌లోని లుంబినీలో జన్మించాడు. ఇతడి తండ్రి కపిలవస్తును పాలించిన శాక్య క్షత్రియరాజైన శుద్దోధనుడు. ఈ వంశంలో జన్మించడం వల్ల బుద్ధుడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. ఇతడి తల్లి మహామాయ.

సిద్ధార్థుడు నాలుగు సంఘటనల్లో వరుసగా  ఒక వృద్ధుడిని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని, ఒక శవాన్ని, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిని చూశాడు. అనంతరం ఈ బాధల నుంచి మానవులకు విముక్తిని ప్రసాదించే మార్గం అన్వేషించడానికి 29వ ఏట చెన్న అనే  సేవకుడి సహాయంతో, కంటక అనే గుర్రం ద్వారా సిద్ధార్థుడు అంతఃపురాన్ని వదిలి సత్యాన్వేషణకు బయలుదేరాడు. ఈ సంఘటనను ‘మహాభినిష్ర్కమణం’గా పేర్కొంటారు. ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు సన్యాసిగా జ్ఞానార్జనకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడు మొదటగా వైశాలిలోని అలారకలామ, తర్వాత రాజగృహంలోని ఉద్దకుడు (రామ పుత్రుడు) అనే గురువుల వద్ద శిష్యరికం చేశాడు. చివరికి 35 ఏళ్ల వయసులో బిహార్‌లోని గయా వద్ద నిరంజన్ నది ఒడ్డున, రావి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు. దీన్ని ‘నిర్వాణం’ లేదా ‘సంబోధి’ అంటారు. నాటి నుంచి సిద్ధార్థుడుని గౌతమ బుద్ధుడిగా, తథాగతుడిగా పిలిచారు. జ్ఞానోదయం పొందిన తర్వాత నుంచి 45 సంవత్సరాల పాటు (మరణించే వరకు) బుద్ధుడు తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. ఇతడు తొలిసారిగా సారనాథ్ వద్ద ఉన్న జింకల తోటలో అయిదుగురు వ్యక్తులకు ప్రవచనాలను బోధించాడు. దీన్నే ‘ధర్మ చక్రప్రవర్తనం’గా పేర్కొంటారు. ఇక్కడి నుంచి బౌద్ధ మతం ప్రారంభమైంది. బుద్ధుడు క్రీ.పూ. 483లో 80 ఏళ్ల వయసులో కుశి నగరంలోని సాలచెట్టు కింద తనువు చాలించాడు. దీన్నే ‘మహాపరి నిర్యాణం’ అంటారు.

బౌద్ధమత సిద్ధాంతాలు:

బౌద్ధమతం, నాటి వైదిక మత సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించింది. కొన్ని వర్గాలకే పరిమితమైన మోక్షాన్ని లింగ, కుల, వర్గ విభేదాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. సర్వకాల సర్వావస్థల్లో ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరించే విధంగా బౌద్ధమత సిద్ధాంతాలను రూపొందించారు. బుద్ధుడు దేవుడి ఉనికిని గుర్తించలేదు. కుల వ్యవస్థను, పురోహిత (బ్రాహ్మణ) వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు.

చత్వారి ఆర్యా సత్యాలు:

{పపంచమంతా దుఃఖమయం.
దుఃఖానికి కారణం కోరికలు.
కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని తొలగించవచ్చు.
దీన్ని సాధించేందుకు ఉన్న ఏకైక మార్గమే అష్టాంగ మార్గం.

అష్టాంగ మార్గం:

సరైన దృక్పథం/ దృష్టి
సరైన లక్ష్యం    ఠి సరైన వాక్కు
సరైన క్రియ     ఠి సరైన జీవనోపాధి
సరైన కృషి/ ప్రయత్నం
సరైన చైతన్యం/ అవగాహన
సరైన ధ్యానం

 అష్టాంగ మార్గం ఒక హేతుబద్ధమైన సిద్ధాంతం. దీన్ని ఒక నైతిక ప్రవర్తనా నియమావళిగా భావించవచ్చు. ఇది అందరికీ అనుసరణీయంగా ఉంది. దీని ద్వారా అతి సులువుగా మోక్షాన్ని పొందవచ్చు. బౌద్ధ మతంలో మోక్షం అంటే జననమరణాల నుంచి విముక్తి. అయితే బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. కర్మ, పునర్జన్మకు సంబంధించిన బౌద్ధమత సిద్ధాంతాన్ని ‘ప్రతిత్య సముప్పాద’ అంటారు. ఇందులో ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుందని చెప్పారు.

 పంచ వ్రతాలు (పంచశీల): జైన మతంలో ఉన్నట్లుగానే బౌద్ధ మతంలోనూ పంచ సిద్ధాంతాలున్నాయి. అవి:
అహింసను పాటించాలి.
ఇతరుల ఆస్తిని ఆశించరాదు.
మత్తు పదార్థాలను సేవించరాదు.
అసత్యమాడరాదు.
 లంచగొండి పనులు చేయరాదు.
 
బౌద్ధ సంఘం: బౌద్ధ మతంలో బిక్షువులు, ఉపాసకులు అనే రెండు వర్గాల భక్తులున్నారు. బిక్షువులతో ఏర్పడిందే బౌద్ధ సంఘం. బౌద్ధ సంఘాలు బుద్ధుని కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇందులో సభ్యత్వం కోసం బౌద్ధ త్రిరత్నాల పట్ల ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అవి బుద్ధం, ధమ్మం, సంఘం. బౌద్ధ సంఘంలో సభ్యత్వం పొందిన మొదటి స్త్రీ బుద్ధుని సవతి తల్లి గౌతమి. 15 ఏళ్లు దాటనివారు, నేరస్థులు, దివాళా తీసిన వారు, అంటువ్యాధిగ్రస్థులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం.

 బౌద్ధమత సంగీతులు

 బౌద్ధ మతంలో వివిధ కాలాల్లో నాలుగు సమావేశాలు (సంగీతులు) జరిగాయి.
 మొదటి బౌద్ధ సంగీతి: బుద్ధుడు మరణించిన వెంటనే క్రీ.పూ. 483లో రాజగృహ వద్దనున్న సాతపన్ని గుహల్లో ఈ సమావేశం జరిగింది. బుద్ధుని ప్రముఖ అనుచరుడైన మహాకశ్యపుడు దీనికి అధ్యక్షత వహించాడు. ఇది అజాతశత్రువు పాలనా కాలంలో జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం బుద్ధుని బోధనలను క్రోడీకరించడం. ఈ మండలి పర్యవసానంగా బుద్ధుని శిష్యులైన ఆనందుడు ‘స్తుత’ పీటకం, ఉపాలి ‘వినయ’ పీటకాలను క్రోడీకరించారు.

రెండో బౌద్ధ సంగీతి: దీన్ని బుద్ధుడు మరణించిన వందేళ్లకు (క్రీ.పూ. 383లో) కాలాశోకుని పాలనాకాలంలో వైశాలిలో నిర్వహించారు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి వజ్జీ సన్యాసులు, ఇతర సన్యాసులకు మధ్య ఉత్పన్నమైన విభేదాలను పరిష్కరించడం దీని ప్రధాన ఉద్దేశం. సబకామి దీనికి అధ్యక్షత వహించారు. ఈ మండలి పర్యావసానంగా బౌద్ధ సంఘం స్థవిరవాదులు (థేరవాదులు), మహాసాంఘికులు అనే రెండు వర్గాలుగా చీలి పోయింది.

 మూడో బౌద్ధ సంగీతి: అశోకుని పాలనా కాలంలో క్రీ.పూ. 250లో పాటలీపుత్రంలో దీన్ని నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన బౌద్ధ సన్యాసి మొగలిపుత్తతిస్స. దీని ప్రధాన ఉద్దేశం రెండో సంగీతిలో ఏర్పడిన రెండు వర్గాల మధ్య సయోధ్య సాధించడం, బౌద్ధమత సిద్ధాంత గ్రంథాలపై చర్చించడం. ఈ సమావేశం ఫలితంగానే అభిదమ్మ పీటికను రూపొందించారు. దీంతో బుద్ధుని బోధనలున్న త్రిపీటకాలు రూపుదిద్దుకున్నాయి.

నాలుగో బౌద్ధ సంగీతి: క్రీ.శ. 1వ శతాబ్దంలో కుషాణ రాజు కనిష్కుని పాలనాకాలంలో కశ్మీర్‌లోని కుందలవనంలో దీన్ని నిర్వహించారు. దీని అధ్యక్షుడు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం బౌద్ధ మతంలోని 18 శాఖల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం. కానీ ఈ సమావేశంలో బౌద్ధమతం మహాయానం, హీనయానం అనే రెండు ప్రధాన శాఖలుగా విడిపోయింది. మహాయానుల (మహా సాంఘికులు, సర్వస్థివాన్‌లు మొదలైనవారు) సిద్ధాంతలన్నింటినీ కలిపి ‘మహావిభాషా శాస్త్రం’గా క్రోడీకరించారు.
 బౌద్ధమత శాఖలు: బౌద్ధమతంలో చీలికలు రెండో బౌద్ధమత సంగీతితోనే ప్రారంభమయ్యాయి. నాలుగో సంగీతితో అవి స్పష్టమైన రూపాన్ని సంతరించుకొని మహాయాన, హీనయాన అనే ప్రధాన శాఖలు ఏర్పడ్డాయి. తర్వాతి కాలంలో వజ్రయానం అనే 3వ శాఖ కూడా ఏర్పడింది.
 మహాయాన బౌద్ధం: బౌద్ధ మతంలోని 18 శాఖల్లో ముఖ్యమైన సర్వస్తివాదిన్‌లు, మహాసాంఘికులు, లోకోత్తరవాదులు లాంటి వారితో ఈ శాఖ ఏర్పడింది. గొప్ప వాహనాన్ని మోక్ష మార్గంగా కల్గి ఉండి, అందులో మోక్ష ప్రాప్తిని హామీనివ్వడం ద్వారా భారత దేశంలో ఇది అధికంగా ఆదరణ పొందింది. వీరు పాళీకి బదులుగా సంస్కృతాన్ని ఉపయోగించారు. వైపుల్య సూత్రాలు అనే ప్రత్యేక మత గ్రంథాలను రూపొందించుకున్నారు. గౌతమబుద్ధునితో పాటు అతడికి పూర్వం ఆరుగురు బుద్ధులు ఉన్నారనీ, భవిష్యత్‌లో మైత్రేయనాథుడనే బుద్ధుడు జన్మిస్తాడనీ వీరు విశ్వసించారు. బోధిసత్వుల్లోనూ వీరికి నమ్మకం ఉంది. మహాయానంలో భాగంగా రెండు తత్త్వ సిద్ధాంతాలు ప్రారంభమయ్యాయి. మొదటిది మాధ్యమిక శాఖ. ఆచార్య నాగార్జునుడు దీన్ని స్థాపించాడు. వీరినే శూన్యవాదులు, మాధ్యమికవాదులు, మాయావాదులుగా పిలుస్తారు. నాగార్జునుడు రచించిన ‘మాధ్యమిక కలిక’ వీరి ప్రామాణిక గ్రంథం.

 విజ్ఞాన వాద శాఖ: దీని స్థాపకుడు మైత్రేయనాథుడు. ఈ శాఖకు చెందిన వారిలో  గొప్ప తత్త్వవేత్తలున్నారు. వీరిలో ముఖ్యులు ఆర్య అసంగ, వసుబంధుడు, దిగ్నాగుడు, ధర్మకీర్తి.

 హీనయాన బౌద్ధం: థేరవాదులు లేదా స్థవిరవాదులు ప్రముఖ వర్గంగా ఉన్న శాఖ హీనయానం. బుద్ధుని వాస్తవ బోధనల పట్ల వీరు విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. వ్యక్తిగత మోక్షానికి ఇందులో ప్రాధాన్యం ఉంది. వీరు మహాయానుల్లా విగ్రహారాధనను చేయలేదు. బుద్ధుడిని ప్రతీకల ద్వారానే ఆరాధించారు. బుద్ధుడు బోధించిన పాళీ భాషనే వీరు కొనసాగించారు. ఇది భారత్ కంటే బర్మా, సిలోన్, థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియాలో అధిక ప్రాచుర్యం పొందింది.

వజ్రయాన బౌద్ధం: క్రీ.శ. 5వ శతాబ్దంలో హిందూమతంలోని తాంత్రిక సిద్ధాంతాల ప్రభావంతో బౌద్ధంలోనూ తాంత్రిక వాదం ప్రారంభమైంది. అదే వజ్రయానం. సంభోగ క్రియలు, మంత్రతంత్రాలు, అతీంద్రీయ శక్తుల ద్వారా మోక్ష సాధనకు వీరు ప్రయత్నించారు. ఇందులో వామాచార, దక్షిణాచార అనే రెండు ప్రధాన శాఖలున్నాయి. ఈ మతంలో బోధి సత్త్వులను, వారి భార్యలైన తారలను ప్రధానంగా పూజించారు. ఇది బెంగాల్, బిహార్, టిబెట్‌లో బాగా ఆదరణ పొందింది.
 
బుద్ధుడు జన్మించిన వెంటనే తల్లి మరణించడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి అతడిని పెంచింది. దీనికి కృతజ్ఞతగానే సిద్ధార్థుడు గౌతముడిగా పిలుపించుకున్నాడు. చిన్న వయసులోనే యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే రాహులుడు. సిద్ధార్థుని సవతి తల్లి కుమారుడు దేవదత్తుడు. సిద్ధార్థుని జీవితంలో సంభవించిన నాలుగు సంఘటనలు అతడికి ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తిని కలిగించాయి.
 
కె. యాకూబ్ బాష సీనియర్ ఫ్యాకల్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement