Siddharthudu
-
బౌద్ధ వర్ధనుడు
వైశాఖ పున్నమి రోజున పుట్టిన సిద్ధార్థుడు తన పదహారో ఏట యశోధరను వివాహమాడాడు. ఆయనకు 29వ ఏట సంతానం కలిగింది. రాహులుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే ధర్మమార్గాన్ని, దుఃఖ నివారణ మార్గాన్నీ వెతుక్కుంటూ, తల్లిదండ్రులని, భార్యాబిడ్డల్నీ, మిత్రుల్నీ, అన్నదమ్ముల్నీ, ఆస్తిపాస్తుల్నీ రాజ్యాధికారాన్నీ వదిలి వనాలకు వెళ్లిపోయాడు. ఆరేళ్లు అనేక చోట్ల తిరిగి, అనేకమందితో చర్చించి చివరికి వైశాఖ పున్నమి నాడే బోధగయలోని రావి చెట్టుకింద జ్ఞానోదయం పొందాడు. దుఃఖ నివారణ మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత సారనాథ్‌లో తొలిసారిగా ఐదుమంది అనుయాయులతో బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొద్ది నెలల్లోనే ఆ సంఘం మహా సంఘంగా విస్తరించింది. ఎందరో వేలాదిమంది ఆ సంఘంలో చేరారు. ఎవరో తాత్వికులు కాదు. గృహస్థులు కూడా. రాచకుటుంబాలకు చెందినవారు, వ్యాపారులు, పనీపాటలు చేసే కూలినాలీ జనం, అంటరాని కులాలవారు– అందరూ సంఘంలో చేరారు. నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోయినట్లు సంఘంలో చేరిన వారంతా తమ తమ కులం, గోత్రం, నామం, ప్రాంతీయతలు అన్నింటినీ కోల్పోయారు. బౌద్ధ సంఘంలో అందరూ సమానులే! అందరూ భిక్షాటన మీదే బతకాలి. అందరూ కాషాయ చీవరాలే ధరించాలి. నేలమీదే నిద్రించాలి.ఈ నిరాడంబర జీవితానికి, సంఘంలో చేరి బంధువులుగా గడపడానికీ బుద్ధుడు చెప్పిన ధర్మవ్యక్తికి తమ వంతు కర్తవ్యాన్ని జోడించడానికి అందరిలాగే .. బుద్ధుని కుటుంబ సభ్యులు, శాక్యరాజ్యం వంశీకులు దాదాపుగా అందరూ ముందుకొచ్చారు. వారిలో మొదటివాడు ఆయన తండ్రి శుద్ధోదనుడే!శాక్యరాజవంశంలో ప్రముఖులు ఐదుగురు. వారు శుద్ధోదనుడు, అతని నలుగురు సోదరులు శుక్లోదనుడు, శాక్యోదరుడు, ధోతోదనుడు, అమితోదనుడు. వారికి ఒక చెల్లి, అమితాదని. ఐదుగురు అన్నదమ్ములకూ ఎనిమిది మంది సంతానం. సిద్ధార్థుడు, నందుడు, ఆనందుడు, మహానాముడు, అనిరుద్ధుడు, భద్దియడు, భాడవుడు, కింబిలుడు.అమితాదనికి ముగ్గురు సంతానం. తిష్యుడు, దేవదత్తుడు, యశోధర.వీరిలో తొలుత బుద్ధోపదేశం విని బౌద్ధాభిమానిగా మారిన తొలి వ్యక్తి శుద్ధోదనుడే!సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాక శుద్ధోదనుడు తమ నగరం కపిలవస్తుకు రమ్మని బుద్ధుని బాల్యమిత్రుడు కాలు ఉదాయితో కబురు పెడతాడు.బుద్ధుడు కపిలవస్తు నగరం వదిలిన తర్వాత ఏడేళ్లకు తిరిగి అక్కడికి వెళ్తాడు.అనారోగ్యంతో మంచి పట్టిన తండ్రికి ధర్మోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంతో ఆయనలో అంతకుముందు ఉన్న దుఃఖం తీరిపోతుంది. తననూ బౌద్ధునిగా అనుమతించమని వేడుకుని నమస్కరిస్తాడు తండ్రి. అలా శుద్ధోదనుడు శాక్యవంశ తొలి బౌద్ధ ఉపాసకుడయ్యాడు. ఆ తర్వాత యశోధర తన ఏడేళ్ల బిడ్డను బుద్ధుని దగ్గరకు పంపుతుంది. ‘వారే నీ తండ్రిగారు. నీకు రావలసిన ఆస్తి, అధికారానికి సంబంధించిన హక్కుల్ని అడిగి తెచ్చుకో’ అని రాహులుణ్ణి బుద్ధుని దగ్గరకు పంపుతుంది యశోధర.‘‘నాయనా! నాకున్న ఆస్తి ఇదే’ అని ఏడేళ్ల కొడుకు చేతిలో భిక్షాపాత్ర పెడతాడు బుద్ధుడు. ‘‘నాకుంది ధర్మాధికారమే. అది నీవూ గ్రహించు’’ అని బౌద్ధసంఘంలో చేర్పించుతాడు. అలా తొలి బౌద్ధ సంఘం బాలభిక్షువు రాహులుడయ్యాడు!ఆ తర్వాత బుద్ధుని మిత్రుడు కాలు ఉదాయి, అతని సోదరులు, మేనత్త బిడ్డలు దాదాపుగా కాస్త వెనకాముందుగా అందరూ బౌద్ధసంఘంలో చేరి భిక్షువులుగానే జీవితాంతం జీవించారు.తన భర్త శుద్ధోదనుడు మరణించాక సిద్ధార్థుని పెంచిన తల్లి, పిన్నమ్మ గౌతమి కూడా కపిలవస్తు నుండి రాజగృహకు కాలినడకన వెళ్లింది. తనతోపాటు కోడలు యశోధరను, మిగిలిన కోడళ్లనూ, మరికొంతమంది శాక్య స్త్రీలనూ వెంటబెట్టుకుని వెళ్లింది.‘తమకూ భిక్షుసంఘంలో అర్హత కల్పించమని అడిగింది.బుద్ధుడు అందుకు అనుమతించి తొలిగా తన తల్లినే భిక్షుణిగా మార్చాడు. భిక్షుణీ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలా బౌద్ధభిక్షువుగా మారిన తొలి మహిళా మూర్తి గౌతమే!శాక్యవనం ఆస్థాన క్షురకుడు ఉపాలీ, రథచోదకుడు చెన్నుడూ– ఎందరెందరో బౌద్ధ సంఘంలో చేరారు. ఉపాలికి ఎంత గౌరవ సంస్కారం దక్కిందంటే బుద్ధుని పరినిర్యాణం తర్వాత మూడు నెలలకి ఏర్పాటైన మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఆయనే!తానా కాకుండా తన కుటుంబాన్ని, తన శాక్యవంశాన్ని మొత్తం రాచరిక వ్యవస్థ నుండి బైటకు రప్పించి ధర్మమార్గంలో నడిపించిన ఆదర్శ దార్శనికుడు గౌతమ బుద్ధుడే!బుద్ధుని జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ఆయన లుంబినీవనంలో పుట్టిందీ, బుద్ధగయలో బుద్ధత్వం పొందిందీ, చివరకు కుసీనగరంలో నిర్వాణం చెందిందీ వైశాఖ పున్నమి రోజునే! అందుకే ఈ వైశాఖ పున్నమి ఒక బుద్ధ జయంతి... ఒక బుద్ద వర్ధంతి! అంతేకాదు.. యశోధర జయంతి కూడా ఈనాడే! – డా. బొర్రా గోవర్ధన్ బుద్ధుణ్ణి సంసార చక్ర విధ్వంసకుడు అంటారు. సుఖదుఃఖాల గానుగ మరలాంటి సంసార చక్రాన్నుండి మానవాళిని బైట పడేసి, రక్షించిన ధార్మికునిగా బుద్ధుని కీర్తిస్తారు. కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, పదవి, అధికారం, శాసనం, యుద్ధం... ఇవన్నీ ఒకే ఒరలో దాగిన రకరకాల కత్తులు. వీటివల్ల హింస, ఉన్మాదం కలిగి చివరికి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది మానవ జీవితం. ఈ దుఃఖ మహాసాగరాన్నుండి బైటకు వచ్చి, యోగం, ధ్యానం, సమాధి, ఇలాంటి స్థితుల్ని సాధించి ముక్తి, కైవల్యం లేదా నిర్వాణ మార్గాన సాగితే శాశ్వతంగా దుఃఖం నుండి మనిషి విముక్తుడవుతాడని భారతదేశంలో పుట్టిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు చెప్పాయి. వాటిలో బౌద్ధం కూడా ఒకటి. దుఃఖ నివారణ మార్గంలో నిర్వాణాన్ని అది చెప్పింది. సంసారాన్ని త్యజించి భిక్షువులుగా, సంసారంలోనే ఉంటూ, ఉపాసకులుగానూ ఈ నిర్వాణ స్థితుల్ని పొందవచ్చునని బుద్ధుడు చెప్పాడు. దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరించే వారందరికీ ఒక సంఘాన్ని స్థాపించాడు. అదే బౌద్ధ సంఘం. ఆ సంఘంలో చేరి ధర్మాచరణ ద్వారా, ధర్మాన్ని ప్రచారం చేసే వారే భిక్షువులు. వీరికి కుటుంబం ఉండదు. ఆస్తిపాస్తులుండవు. వ్యక్తిగత వస్తువులు ఉండవు. అన్నీ సంఘానివే. అన్నీ ఉమ్మడివే! నియమ నిబంధనల రూపకల్పనలో కూడా ఉమ్మడి నిర్ణయమే తుది నిర్ణయం. -
రాహులుడు బౌద్ధ సుతుడు
గౌతమ బుద్ధుడు ధర్మమార్గంలో నడిచాడు. తన కుమారుడైన రాహులుడికి ధర్మమార్గాన్ని ప్రబోధించాడు. బుద్ధుడంటే బుద్ధి కలిగిన వాడు.. బుద్ధిని ఇచ్చేవాడు. ఆయన తన వారసుడైన రాహులుడికి ధర్మాన్నే ఆస్తిగా పంచి ఇచ్చాడు. మనందరం బుద్ధుని బిడ్డలమే! ఆ ఆస్తికి మనం కూడా అర్హులమే! బుద్ధపూర్ణిమ సందర్భంగా ఆయన తన కుమారుడికి బోధించిన మార్గంలో నడుద్దాం.. బుద్ధిమంతులుగా ఉందాం... ఆకాశం పండువెన్నెల్ని కుమ్మరిస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ల యువరాజు సిద్ధార్థుడు మెల్లగా మేడమెట్లు ఎక్కి ఒక గది ముందు ఆగాడు. గడియ తీసి తలుపు మెల్లగా తోసి గదిలోని మంచం దగ్గరకు వెళ్లాడు. సిద్ధార్థుని భార్య యశోధర నిద్రలో కూడా ఆనందపడు తున్నట్టుగా పడుకుని ఉంది. ఆమె ఎడమ చేతి పొత్తిలిలో వెన్నెల చిరునవ్వులాంటి పసికందు తల్లి చేతిని తలగడగా చేసుకుని నవ్వుకుంటున్నాడు. అతడే రాహులుడు. దోమతెరను మెల్లగా పక్కకు తీసిన సిద్ధార్థుడు వారిద్దరి మోములు తేరిపార చూశాడు. ప్రేమించి, స్వయంవరంలో తనకు జీవితభాగస్వామిగా మారిన అందమైన ఇల్లాలు... వివాహమైన పన్నెండేళ్లకు లేకలేక కలిగిన సంతానం... అనంత ఐశ్వర్యం... అఖండ సామ్రాజ్య వారసత్వం... ముఖ్యంగా కొడుకు. తన వైజ్ఞానిక తృష్ణ తీర్చుకోవడానికీ, ఈ ప్రపంచ ప్రజలందరి దుఃఖం దూరం చేయడానికి సాగే తన ప్రయాణానికి ఆఖరి అడ్డంకి అతడు. అందుకే బిడ్డ పుట్టాడని తెలియగానే ‘నాకు రాహులుడు (అడ్డంకి) కలిగాడు’ అన్నాడు. చివరికి అదే బిడ్డకు నామమైపోయింది. చివరిసారి బిడ్డను ముద్దాడాలని, ప్రియురాలి నుదుటిని చుంబించాలని వంగాడు. అలా చేస్తే... వారు లేస్తే.. తనకు మరలా అడ్డంకి అవుతారనుకొని దయాదృక్కులతో చూస్తూ మెల్లగా లేచి.. గది దాటి... మెట్లు దిగి.. పెరటిలోకి వెళ్లాడు. ఆ రోజు చంద్రగ్రహణం. అప్పటికి సంపూర్ణ గ్రహణం పట్టింది. చీకటి ఆవహించింది. ఆ చీకటిలో కలిసిపోయి కపిలవస్తు నగరాన్ని దాటిపోయాడు. ఆ కటిక చీకట్లను పారద్రోలి కాంతి రేఖల్ని కనుగొనడానికి. ఆయనే మీ నాన్నగారు... అలా వెళ్లిన సిద్ధార్థుడు ఆరేళ్లు ధ్యానం చేశాడు. బోధివృక్షం కింద జ్ఞానం పొంది బుద్ధుడయ్యాడు. ఆనాటి మగధ దేశానికి రాజధాని అయిన ‘రాజగృహ’లో ఉంటున్నాడు. ఒకరోజు తన తండ్రి శుద్ధోధనుడి నుండి కబురు వచ్చింది ఆ బోధలు తమ నగరంలో చేయమంటూ. దాంతో ఏడేళ్ల తర్వాత తిరిగి కపిలవస్తు చేరాడు. ముందు బుద్ధుడు. చేతిలో భిక్షాపాత్ర. ఆ వెనక వందలాది మంది భిక్షువులు- ఆ దృశ్యం మేడ మీద నుంచి చూసింది యశోధర. మహారాజులా సైన్యం వెంటరాగా రథం మీద తిరగాల్సిన భర్త ఇలా భిక్షువులా యాచిస్తూ రావడం చూసి ఆమె హృదయం బరువెక్కింది.‘అమ్మా! ఆయన ఎవరమ్మా’ రాహులుని ప్రశ్న. యశోధర గుండె మరింత బరువెక్కింది. ‘చెప్పమ్మా! ఎవరమ్మా!?’ ‘నాయనా. సూర్యబింబంలా ప్రకాశించే మోము, తామరల కన్నా మెత్తనైన ఆ హస్తాలు, నీలి రత్నాల్లాంటి ఆ నేత్రాలు, ఇంద్రధనువులా వంగిన ఆ కనుబొమలు, మత్తగజంలాంటి ఆ నడక, పున్నమి చంద్రునిలాంటి వెన్నెల రూపు, సాగర గంభీరుడు, శాక్యకుమారుడు, సుమ సుకుమారుడు, దేవమానవ పూజనీయుడు వారే.. వారే నాన్నా మీ నాన్నగారు’... ఆ బిడ్డ ఆలోచనలో పడ్డాడు. ఇంతకాలం తాతగారి పెంపకంలో ఉన్నాడు. ఆయన్నే ‘నాన్నా!’ అంటూ పిలుస్తున్నాడు. ఇప్పుడు ‘వీరా నా నాన్నగారు’ అనుకొన్నాడు. ‘నాన్నగారూ’ అంటూ కేకవేశాడు. కేక వీధిదాకా చేరలేదు. వెంటనే బిడ్డను దగ్గరకు తీసుకుంది యశోధర. తండ్రి సామ్రాజ్య వారసత్వంబుద్ధుడు కపిలవస్తుకు వచ్చిన ఏడోరోజు తన భిక్షుగణంతో ఊరి చివరన ఉన్న ఆరామం కేసిపోతున్నాడు. ‘నాన్నగారూ! ఆగండి’ అంటూ ఏడేళ్ల రాహులుడు వెంటపడ్డాడు. యశోధర తన బిడ్డను అలా వెళ్లమని చెప్పింది. ‘నాయనా! మీ నాన్నగారి దగ్గరకు వెళ్లు. వారి దగ్గర నుండి నీకు రావాల్సిన వారసత్వాన్ని అందుకో. నీ వాటా నీకు ఇమ్మని కోరు. వెళ్లిరా’అని చెప్పి పంపింది. అందుకే రాహులుడు బుద్ధుని వెనకాల పడ్డాడు. ఎండ తీవ్రంగా ఉంది. బుద్ధుని నీడ ఒక పక్కగా నేలమీద పడుతోంది. ఆ నీడలోకి వచ్చి- ‘ఆగండి! మీ నీడ నాకు ఎంతో హాయిగా ఉంది. సుఖాన్నిస్తోంది’ అన్నాడు రాహులుడు. ‘నాయనా ఎవరు?’ అడిగాడు బుద్ధుడు. ‘నేను మీ కుమారుణ్ణి. రాహులుణ్ణి. మీ దగ్గర నుండి నాకు రావాల్సిన వారసత్వాన్ని తెచ్చుకోమంది అమ్మ’ ‘అలాగా! నాయనా!’ అంటూ ఆ పక్కన ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి ‘సారిపుత్రా! రాహులునికి భిక్షు దీక్ష ఇవ్వు’అని చెప్పి- ‘రాహులా! నాది ధర్మసామ్రాజ్యం. ఇదే నా ఆస్తి’ అంటూ కొడుకు చేతులకు భిక్షాపాత్ర అందించాడు బుద్ధుడు. అలా తన ఏడోఏటనే రాహులుడు బాలభిక్షువుగా మారాడు. బౌద్ధ చరిత్రలో తొలి బాల భిక్షువు రాహులుడు. బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు. ఆ విషయం తెలిసి శుద్ధోధనుడు తల్లడిల్లాడు. దుఃఖాన్ని ఆపుకోలేక ‘ఇక నాకెందుకు రాజ్యం. నన్నూ నీ బౌద్ధ సంఘంలో చేర్చుకో’ అన్నాడు. చివరికి బుద్ధుని తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు. అలా తన యావత్ వంశాన్ని ధర్మం బాటలోనే నడిచేట్టు చేశాడు బుద్ధుడు. యువభిక్షువు రాహులుడికి పద్ధెనిమిదేళ్లు వచ్చే వరకూ ఇద్దరు గురువుల దగ్గరే పెరిగాడు. సారిపుత్రుడు ధర్మంలో శిక్షణ ఇస్తే, మహా మౌద్గల్యాయనుడు నడవడికలో శిక్షణ ఇచ్చారు. ‘నా తండ్రి బుద్ధుడు’ అని ఎప్పుడూ గర్వపడేవాడు కాదు. అవినయంగా ప్రవర్తించేవాడూ కాదు. ఒక్కోసారి కటికనేల మీద, మరుగుదొడ్ల పక్కన కూడా నిద్రించేవాడు. తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. బౌద్ధ ధర్మంలో ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రత్యేక ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి. ధర్మమార్గంలో ‘రాహులా! ఇటురా’అని ఒక అద్దం ముందుకు తీసుకుపోయి ‘అద్దంలోకి చూడు ఎవరున్నారో’ అని అడిగాడు బుద్ధుడు.‘భగవాన్! నా ప్రతిబింబమే ఉంది’ ‘మనం మన ముఖం మీద ఉన్న మరకల్ని చెరుపుకోవడానికి, లోపాల్ని సరిచేసుకోవడానికి అద్దం ఎలా ఉపయోగపడుతుందో మన ప్రవర్తనా దోషాల్ని సరిచేసుకోవడానికి మన మనస్సు, ఆలోచన అలా ఉపయోగపడాలి’ అని చెప్పాడు బుద్ధుడు. ‘రాహులా! నీవు చేసే పని గురించి ముందే ఆలోచించు. మంచిది కాదనిపించితే చేయకు. లేదా చేస్తున్నప్పుడైనా ఆలోచించు. మంచిది కాకుంటే అప్పుడైనా విరమించు. అప్పుడు కుదరకపోతే చేసిన తరువాత వచ్చిన ఫలితాన్ని బట్టైనా ఆలోచించు. అప్పటికైనా ఆ చెడు పనుల్ని విరమించు. ఇలా ప్రతిదశలో నీవు చేసే పనుల గురించి నీకు నీవే సమీక్షించుకో. ఎప్పుడూ తప్పులు చేయవు’ అని కూడా చెప్పాడు. అలా.. బుద్ధుని ధర్మమార్గంలో ఉంటూ అర్హంతుడు అంటే పరిపూర్ణమైన భిక్షువు కాగలిగాడు రాహులుడు. ఆయన ఎక్కువకాలం రాజగృహం దగ్గరి ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు ఎప్పుడు మరణించాడో తెలియదు. కానీ, చాలా తక్కువ వయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రి ధర్మాన్ని నడిపించిన ధర్మయువ రథసారథి రాహుల థేరుడు. - డా. బొర్రా గోవర్ధన్ -
టూకీగా ప్రపంచ చరిత్ర 109
వేకువ జ్ఞానం పొందేందుకు రకరకాలుగా ప్రయత్నించాడు సిద్ధార్థుడు. కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోధర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది. ఆశ్రమాన్ని వదిలి, వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని తపస్సులో కూర్చున్నాడు. కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇలా లాభం లేదనుకుని నదివొడ్డునే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. అలా తర్కించుకోగా తర్కించుకోగా... మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు. లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది.అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం. ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం.అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు. అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం. ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకం కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు. బుద్ధుని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు దగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. (సమాప్తం) ఇన్ని రోజులుగా మీ ఆదరణ పొందిన ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ను నేటితో ముగిస్తున్నాము. దీనిని పుస్తకరూపంలో చూడాలనుకునేవారు ఈ క్రింది రచయితను సంప్రదించవచ్చు. - ఎడిటర్ -
నిరంజన నదీ తీరంలో.. రావిచెట్టు నీడలో..
బౌద్ధ మత ఆవిర్భావం భారతదేశంలో క్రీ.పూ. ఆరో శతాబ్దంలో జరిగిన మత ఉద్యమాల్లో భాగంగా వైదిక మతంపై తిరుగుబాటు ఉద్యమంగా బౌద్ధ మతం ఆవిర్భవించింది. దీని స్థాపకుడు సిద్ధార్థుడు. ఇతడినే గౌతముడు అంటారు. సిద్ధార్థుడు క్రీ.పూ. 563లో ప్రస్తుత నేపాల్‌లోని లుంబినీలో జన్మించాడు. ఇతడి తండ్రి కపిలవస్తును పాలించిన శాక్య క్షత్రియరాజైన శుద్దోధనుడు. ఈ వంశంలో జన్మించడం వల్ల బుద్ధుడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. ఇతడి తల్లి మహామాయ. సిద్ధార్థుడు నాలుగు సంఘటనల్లో వరుసగా ఒక వృద్ధుడిని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని, ఒక శవాన్ని, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిని చూశాడు. అనంతరం ఈ బాధల నుంచి మానవులకు విముక్తిని ప్రసాదించే మార్గం అన్వేషించడానికి 29వ ఏట చెన్న అనే సేవకుడి సహాయంతో, కంటక అనే గుర్రం ద్వారా సిద్ధార్థుడు అంతఃపురాన్ని వదిలి సత్యాన్వేషణకు బయలుదేరాడు. ఈ సంఘటనను ‘మహాభినిష్ర్కమణం’గా పేర్కొంటారు. ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు సన్యాసిగా జ్ఞానార్జనకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడు మొదటగా వైశాలిలోని అలారకలామ, తర్వాత రాజగృహంలోని ఉద్దకుడు (రామ పుత్రుడు) అనే గురువుల వద్ద శిష్యరికం చేశాడు. చివరికి 35 ఏళ్ల వయసులో బిహార్‌లోని గయా వద్ద నిరంజన్ నది ఒడ్డున, రావి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు. దీన్ని ‘నిర్వాణం’ లేదా ‘సంబోధి’ అంటారు. నాటి నుంచి సిద్ధార్థుడుని గౌతమ బుద్ధుడిగా, తథాగతుడిగా పిలిచారు. జ్ఞానోదయం పొందిన తర్వాత నుంచి 45 సంవత్సరాల పాటు (మరణించే వరకు) బుద్ధుడు తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. ఇతడు తొలిసారిగా సారనాథ్ వద్ద ఉన్న జింకల తోటలో అయిదుగురు వ్యక్తులకు ప్రవచనాలను బోధించాడు. దీన్నే ‘ధర్మ చక్రప్రవర్తనం’గా పేర్కొంటారు. ఇక్కడి నుంచి బౌద్ధ మతం ప్రారంభమైంది. బుద్ధుడు క్రీ.పూ. 483లో 80 ఏళ్ల వయసులో కుశి నగరంలోని సాలచెట్టు కింద తనువు చాలించాడు. దీన్నే ‘మహాపరి నిర్యాణం’ అంటారు. బౌద్ధమత సిద్ధాంతాలు: బౌద్ధమతం, నాటి వైదిక మత సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించింది. కొన్ని వర్గాలకే పరిమితమైన మోక్షాన్ని లింగ, కుల, వర్గ విభేదాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. సర్వకాల సర్వావస్థల్లో ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరించే విధంగా బౌద్ధమత సిద్ధాంతాలను రూపొందించారు. బుద్ధుడు దేవుడి ఉనికిని గుర్తించలేదు. కుల వ్యవస్థను, పురోహిత (బ్రాహ్మణ) వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. చత్వారి ఆర్యా సత్యాలు: {పపంచమంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని తొలగించవచ్చు. దీన్ని సాధించేందుకు ఉన్న ఏకైక మార్గమే అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం: సరైన దృక్పథం/ దృష్టి సరైన లక్ష్యం ఠి సరైన వాక్కు సరైన క్రియ ఠి సరైన జీవనోపాధి సరైన కృషి/ ప్రయత్నం సరైన చైతన్యం/ అవగాహన సరైన ధ్యానం అష్టాంగ మార్గం ఒక హేతుబద్ధమైన సిద్ధాంతం. దీన్ని ఒక నైతిక ప్రవర్తనా నియమావళిగా భావించవచ్చు. ఇది అందరికీ అనుసరణీయంగా ఉంది. దీని ద్వారా అతి సులువుగా మోక్షాన్ని పొందవచ్చు. బౌద్ధ మతంలో మోక్షం అంటే జననమరణాల నుంచి విముక్తి. అయితే బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. కర్మ, పునర్జన్మకు సంబంధించిన బౌద్ధమత సిద్ధాంతాన్ని ‘ప్రతిత్య సముప్పాద’ అంటారు. ఇందులో ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుందని చెప్పారు. పంచ వ్రతాలు (పంచశీల): జైన మతంలో ఉన్నట్లుగానే బౌద్ధ మతంలోనూ పంచ సిద్ధాంతాలున్నాయి. అవి: అహింసను పాటించాలి. ఇతరుల ఆస్తిని ఆశించరాదు. మత్తు పదార్థాలను సేవించరాదు. అసత్యమాడరాదు. లంచగొండి పనులు చేయరాదు. బౌద్ధ సంఘం: బౌద్ధ మతంలో బిక్షువులు, ఉపాసకులు అనే రెండు వర్గాల భక్తులున్నారు. బిక్షువులతో ఏర్పడిందే బౌద్ధ సంఘం. బౌద్ధ సంఘాలు బుద్ధుని కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇందులో సభ్యత్వం కోసం బౌద్ధ త్రిరత్నాల పట్ల ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అవి బుద్ధం, ధమ్మం, సంఘం. బౌద్ధ సంఘంలో సభ్యత్వం పొందిన మొదటి స్త్రీ బుద్ధుని సవతి తల్లి గౌతమి. 15 ఏళ్లు దాటనివారు, నేరస్థులు, దివాళా తీసిన వారు, అంటువ్యాధిగ్రస్థులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. బౌద్ధమత సంగీతులు బౌద్ధ మతంలో వివిధ కాలాల్లో నాలుగు సమావేశాలు (సంగీతులు) జరిగాయి. మొదటి బౌద్ధ సంగీతి: బుద్ధుడు మరణించిన వెంటనే క్రీ.పూ. 483లో రాజగృహ వద్దనున్న సాతపన్ని గుహల్లో ఈ సమావేశం జరిగింది. బుద్ధుని ప్రముఖ అనుచరుడైన మహాకశ్యపుడు దీనికి అధ్యక్షత వహించాడు. ఇది అజాతశత్రువు పాలనా కాలంలో జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం బుద్ధుని బోధనలను క్రోడీకరించడం. ఈ మండలి పర్యవసానంగా బుద్ధుని శిష్యులైన ఆనందుడు ‘స్తుత’ పీటకం, ఉపాలి ‘వినయ’ పీటకాలను క్రోడీకరించారు. రెండో బౌద్ధ సంగీతి: దీన్ని బుద్ధుడు మరణించిన వందేళ్లకు (క్రీ.పూ. 383లో) కాలాశోకుని పాలనాకాలంలో వైశాలిలో నిర్వహించారు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి వజ్జీ సన్యాసులు, ఇతర సన్యాసులకు మధ్య ఉత్పన్నమైన విభేదాలను పరిష్కరించడం దీని ప్రధాన ఉద్దేశం. సబకామి దీనికి అధ్యక్షత వహించారు. ఈ మండలి పర్యావసానంగా బౌద్ధ సంఘం స్థవిరవాదులు (థేరవాదులు), మహాసాంఘికులు అనే రెండు వర్గాలుగా చీలి పోయింది. మూడో బౌద్ధ సంగీతి: అశోకుని పాలనా కాలంలో క్రీ.పూ. 250లో పాటలీపుత్రంలో దీన్ని నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన బౌద్ధ సన్యాసి మొగలిపుత్తతిస్స. దీని ప్రధాన ఉద్దేశం రెండో సంగీతిలో ఏర్పడిన రెండు వర్గాల మధ్య సయోధ్య సాధించడం, బౌద్ధమత సిద్ధాంత గ్రంథాలపై చర్చించడం. ఈ సమావేశం ఫలితంగానే అభిదమ్మ పీటికను రూపొందించారు. దీంతో బుద్ధుని బోధనలున్న త్రిపీటకాలు రూపుదిద్దుకున్నాయి. నాలుగో బౌద్ధ సంగీతి: క్రీ.శ. 1వ శతాబ్దంలో కుషాణ రాజు కనిష్కుని పాలనాకాలంలో కశ్మీర్‌లోని కుందలవనంలో దీన్ని నిర్వహించారు. దీని అధ్యక్షుడు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం బౌద్ధ మతంలోని 18 శాఖల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం. కానీ ఈ సమావేశంలో బౌద్ధమతం మహాయానం, హీనయానం అనే రెండు ప్రధాన శాఖలుగా విడిపోయింది. మహాయానుల (మహా సాంఘికులు, సర్వస్థివాన్లు మొదలైనవారు) సిద్ధాంతలన్నింటినీ కలిపి ‘మహావిభాషా శాస్త్రం’గా క్రోడీకరించారు. బౌద్ధమత శాఖలు: బౌద్ధమతంలో చీలికలు రెండో బౌద్ధమత సంగీతితోనే ప్రారంభమయ్యాయి. నాలుగో సంగీతితో అవి స్పష్టమైన రూపాన్ని సంతరించుకొని మహాయాన, హీనయాన అనే ప్రధాన శాఖలు ఏర్పడ్డాయి. తర్వాతి కాలంలో వజ్రయానం అనే 3వ శాఖ కూడా ఏర్పడింది. మహాయాన బౌద్ధం: బౌద్ధ మతంలోని 18 శాఖల్లో ముఖ్యమైన సర్వస్తివాదిన్లు, మహాసాంఘికులు, లోకోత్తరవాదులు లాంటి వారితో ఈ శాఖ ఏర్పడింది. గొప్ప వాహనాన్ని మోక్ష మార్గంగా కల్గి ఉండి, అందులో మోక్ష ప్రాప్తిని హామీనివ్వడం ద్వారా భారత దేశంలో ఇది అధికంగా ఆదరణ పొందింది. వీరు పాళీకి బదులుగా సంస్కృతాన్ని ఉపయోగించారు. వైపుల్య సూత్రాలు అనే ప్రత్యేక మత గ్రంథాలను రూపొందించుకున్నారు. గౌతమబుద్ధునితో పాటు అతడికి పూర్వం ఆరుగురు బుద్ధులు ఉన్నారనీ, భవిష్యత్‌లో మైత్రేయనాథుడనే బుద్ధుడు జన్మిస్తాడనీ వీరు విశ్వసించారు. బోధిసత్వుల్లోనూ వీరికి నమ్మకం ఉంది. మహాయానంలో భాగంగా రెండు తత్త్వ సిద్ధాంతాలు ప్రారంభమయ్యాయి. మొదటిది మాధ్యమిక శాఖ. ఆచార్య నాగార్జునుడు దీన్ని స్థాపించాడు. వీరినే శూన్యవాదులు, మాధ్యమికవాదులు, మాయావాదులుగా పిలుస్తారు. నాగార్జునుడు రచించిన ‘మాధ్యమిక కలిక’ వీరి ప్రామాణిక గ్రంథం. విజ్ఞాన వాద శాఖ: దీని స్థాపకుడు మైత్రేయనాథుడు. ఈ శాఖకు చెందిన వారిలో గొప్ప తత్త్వవేత్తలున్నారు. వీరిలో ముఖ్యులు ఆర్య అసంగ, వసుబంధుడు, దిగ్నాగుడు, ధర్మకీర్తి. హీనయాన బౌద్ధం: థేరవాదులు లేదా స్థవిరవాదులు ప్రముఖ వర్గంగా ఉన్న శాఖ హీనయానం. బుద్ధుని వాస్తవ బోధనల పట్ల వీరు విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. వ్యక్తిగత మోక్షానికి ఇందులో ప్రాధాన్యం ఉంది. వీరు మహాయానుల్లా విగ్రహారాధనను చేయలేదు. బుద్ధుడిని ప్రతీకల ద్వారానే ఆరాధించారు. బుద్ధుడు బోధించిన పాళీ భాషనే వీరు కొనసాగించారు. ఇది భారత్ కంటే బర్మా, సిలోన్, థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియాలో అధిక ప్రాచుర్యం పొందింది. వజ్రయాన బౌద్ధం: క్రీ.శ. 5వ శతాబ్దంలో హిందూమతంలోని తాంత్రిక సిద్ధాంతాల ప్రభావంతో బౌద్ధంలోనూ తాంత్రిక వాదం ప్రారంభమైంది. అదే వజ్రయానం. సంభోగ క్రియలు, మంత్రతంత్రాలు, అతీంద్రీయ శక్తుల ద్వారా మోక్ష సాధనకు వీరు ప్రయత్నించారు. ఇందులో వామాచార, దక్షిణాచార అనే రెండు ప్రధాన శాఖలున్నాయి. ఈ మతంలో బోధి సత్త్వులను, వారి భార్యలైన తారలను ప్రధానంగా పూజించారు. ఇది బెంగాల్, బిహార్, టిబెట్‌లో బాగా ఆదరణ పొందింది. బుద్ధుడు జన్మించిన వెంటనే తల్లి మరణించడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి అతడిని పెంచింది. దీనికి కృతజ్ఞతగానే సిద్ధార్థుడు గౌతముడిగా పిలుపించుకున్నాడు. చిన్న వయసులోనే యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే రాహులుడు. సిద్ధార్థుని సవతి తల్లి కుమారుడు దేవదత్తుడు. సిద్ధార్థుని జీవితంలో సంభవించిన నాలుగు సంఘటనలు అతడికి ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తిని కలిగించాయి. కె. యాకూబ్ బాష సీనియర్ ఫ్యాకల్టీ