బౌద్ధవాణి కృష్ణవేణి | Buddhism in the Krishna River Valley of Andhra | Sakshi
Sakshi News home page

బౌద్ధవాణి కృష్ణవేణి

Published Sun, Aug 7 2016 10:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

బౌద్ధవాణి కృష్ణవేణి

బౌద్ధవాణి కృష్ణవేణి

కృష్ణానది చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల నాటిది. అప్పటికింకా హిమాలయాలే పుట్టలేదు. కాబట్టి గంగా, సింధూ నదుల ఊసే ఉండదు. సూర్య కుటుంబంలో భూమి పుట్టిన వందల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడ్డ గోండ్వానా భూభాగంలో మన దక్కను పీఠభూమి కూడా ఉంది. అప్పుడు జరిగిన అగ్నిపర్వత చర్యల వల్ల ఎగజిమ్మిన లావా నుండి ఏర్పడినదే ఈ పీఠభూమి. అందుకే ఇది నల్లరేగడి నేల అయ్యింది.
 
ఈ నల్లరేగడి నేల పాయ నల్లమల అడవులు దాటి గుంటూరు జిల్లాలో ఇటు అమరావతి నుండి, అటు ప్రకాశం జిల్లాలో మోటుపల్లి వరకు విస్తరించి ఉంది. ఈ నేలలో ప్రవహించినదే కృష్ణానది. నల్లటి నేలలో ప్రవహించడం వల్ల ఈ నది నీరు కాస్త నూనెరంగులో కనిపిస్తాయి. గంగా, గోదావరి నదుల్లా బురదగా ఉండవు. అందుకే ఈ నదిని నల్లనది అని, నల్లయేరు అని, తేలవాహనం అనీ, కృష్ణానది అనీ అంటారు.
 
కృష్ణానది అతి పురాతన నది కాబట్టి, దీని పరివాహక ప్రాంతం నల్ల రేగడి నేల కాబట్టి, ఆ నేల పీఠభూమి కాబట్టి ఇక్కడ వరి పంటతో పాటు మెట్టపంటలు ఇబ్బడి ముబ్బడిగా పండుతాయి. అందుకే ఈ తీరం అపరాలు, వాణిజ్యపంటల క్షేత్రంగా మారింది. సర్వపంటల సమాహారంగా రూపొందింది. అందుకే అతి పురాతన కాలం నుండి మానవజాతులకు నిలయంగా మారడమే గాక, ప్రపంచంలో అతి ప్రధాన విదేశీ వ్యాపార కేంద్రంగానూ వర్ధిల్లింది. అలా వ్యవసాయం, వ్యాపారాలలోనే కాకుండా ధార్మికంగా కూడా దివ్యత్వాన్ని సంపాదించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నదీ తీరం బుద్ధుని ధర్మప్రబోధలు మారుమోగిన ధరణీ తలం.
 
బౌద్ధ సాహిత్యంలో...
బౌద్ధ సాహిత్యంలో కృష్ణానది ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తుంది. ఎందరో వ్యాపారులు తేలివాహన నదీతీరంలోని ఆంధ్రనగరికి వచ్చిన సందర్భాలు కనిపిస్తాయి. ఆ ఆంధ్రనగరే... ఈనాటి అమరావతి. ఆ తేలివాహన (తైలవాహనం) నదే కృష్ణానది. కర్నూలు, శ్రీశైలం, విజయపురి (నాగార్జునసాగర్), అమరావతి, భట్టిప్రోలు, ఘంటసాల - ఇలా ఈ తీరం వెంట వెలసిన బౌద్ధనగరాలు.

వీటిలో ఒక్కొక్క ఘన చరిత్ర ఉంది. ఇవన్నీ అశోకునికి ముందే ఏర్పడ్డ మహానగరాలు. కర్నూలు జిల్లా ‘ఎర్రగుడి’లో దొరికిన అశోక శాసనాలను బట్టి ఈ ప్రాంతంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పవచ్చు. అశోకుడు వేయించిన శాసనాలన్నీ ‘ఎర్రగుడి’లో ఉన్నాయి. ఇంకా సాతానికోట, రాజుల మందగిరి, అహోబిలం ఇవన్నీ ఒకనాటి బౌద్ధ క్షేత్రాలే.
 
విజయపురి- బోధిసిరి
విజయపురి (నాగార్జున కొండ) ప్రాంతం సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇప్పుడున్న నాగార్జున కొండను గతంలో నందికొండ అనేవారు. అంతకు పూర్వం శ్రీపర్వతం అనేవారు. ఆచార్య నాగార్జునుని కాలంలో ఇక్కడ విరాజిల్లిన బౌద్ధారామం శ్రీపర్వత ఆరామం. ఈ ఆరామంలో దేశ విదేశ భిక్షువులకు ఆరామాలు, వసతి గృహాలు కట్టించిన ధార్మికురాలు బోధిసిరి. ఈమె ఒక వ్యాపారి భార్య. ఇక్కడ ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. 14 దేశాల విద్యార్థులతో కళకళలాడేది. ఈనాడు ఈ విద్యాలయ ఆనవాళ్లు గుంటూరు వైపునున్న ‘అనుపు’లో చూడవచ్చు.
 
ఆంధ్రనగరి- అమరావతి
ఈనాడు మనం ‘అమరావతి’గా పిలుచుకునే ఊరి ప్రక్కనే ఒకనాడు ఒక మహానగరం ఉండేది. అదే బౌద్ధ జాతక కథల్లో వర్ణించిన ‘ఆంధ్రనగరి’. దీనికి ధనకటక, ధాన్యకటక, ధరణికోట... ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. బౌద్ధుల గీతాల్ని ‘ధారణులు’ అంటారు. ‘ధారణులు’ మారుమ్రోగే క్షేత్రం కాబట్టి దీనికి ‘ధారణికోట’ అంటారనీ, అదే కాలక్రమంలో ధరణికోటగా మారిందనీ అంటారు. ఇక్కడ బౌద్ధ సాహిత్యం ‘త్రిపిటకాల’ బోధన జరిగేది. ఈ ‘పిటకాల’ పేరుతో దీన్ని ‘పేట’ అని పిలిచేవారు. ఈ కోట, పేటలే ఈనాడి అమరావతి.
 
చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు ఇది దక్షిణ భారత దేశ రాజధానిగా విలసిల్లింది. ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మహాస్థూపం భారతదేశంలోనే అతి ఎత్తై స్థూపాల్లో ఒకటి. ‘అమరావతి’ నగరానికి బౌద్ధ సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధంలోని మహాయాన సంప్రదాయానికీ, ఆ తర్వాత వచ్చిన వజ్రయాన (కాలచక్ర) సంప్రదాయానికీ అమరావతే జన్మస్థానం. అమరావతి చుట్టూ చైత్యక, పూర్వ శైలీయ, అపరశైలీయ లాంటి ఎన్నో బౌద్ధ సంప్రదాయాలు వెలిశాయి. ఇది ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ఆయన తన శూన్యవాదాన్ని ప్రవచించిన తీరం. బౌద్ధం తొలిగా ఈ తీరం వెంబడి సాగి విదేశాలకు ప్రయాణం చేసింది.
 
భౌగోళిక సానుకూలతల వల్ల ఇది గొప్ప వ్యాపారనగరంగా, రాజధాని నగరంగా వందల ఏళ్లు మనగలిగింది. వ్యాపారులు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించారు కాబట్టి వారి ద్వారా తెలుగు భిక్షువులు విదేశాలకు వెళ్లారు. వారి వల్లే బౌద్ధం ప్రపంచ వ్యాపితం అయ్యింది.
 
ఇక శిల్పకళలో కూడా అమరావతికి ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధ శిల్పకళారీతులు మూడు. గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ. ఈ మూడింటిలో అందమైన శిల్పకళ అమరావతి శిల్పకళే. ఈనాడు ప్రపంచ వ్యాపితంగా ఉన్న బౌద్ధ చైత్యాలన్నింటిలో కన్పించే శిల్పకళ ఇదే!
 
తొలి ఆనవాలు భట్టిప్రోలు
కృష్ణాతీరంలో చెప్పుకోదగ్గ అతి పురాతన బౌద్ధక్షేత్రం భట్టిప్రోలు. కృష్ణానదికి పశ్చిమ తీరాన ఉన్న భట్టిప్రోలు భారత దేశంలోని అతి పురాతన చైత్యాల్లో ఒకటి. ఇది అశోకుని కాలం నాటి కంటే ముందరిదే అని అంటారు. అందుకే ఈ భట్టిప్రోలు బౌద్ధం తొలి ఆనవాలు. ఇది కృష్ణానది సముద్రంలో కలిసే చోటుకు దగ్గరగా ఉంది. ఇక్కడి నుండి విదేశాలకు వస్త్రాల ఎగుమతి జరిగేది. భట్టిప్రోలుని ‘ప్రిటుండ్ర’ నగరం అనేవారు. ఈ పదానికి ‘నేత పని’ అని అర్థం. ఇప్పటికీ రేపల్లె ప్రక్కన ‘పేటేరు’ అనే ఊరు ఉంది. అది ఈనాటికీ వస్త్రాల తయారీకి ముఖ్య ప్రదేశమే.
 
భట్టిప్రోలులో ‘సింహ గోష్ఠి’ అనే బౌద్ధ పండితుల సంఘం ఉండేది. ఇది కూడా గొప్ప విద్యాకేంద్రంగా విరాజిల్లింది. ఈ ప్రాంతంలో తగవులు జరిగినప్పుడు లేదా లావాదేవీలు జరిగినప్పుడు మధ్యవర్తులు చేసే ఒప్పందాన్ని ‘భట్టిప్రోలు పంచాయతీ’ అంటారు. ఇరువర్గాలకీ మధ్యస్థంగా సమస్యను పరిష్కరిస్తారు. మధ్యస్థం అనేది బౌద్ధుల ‘మధ్యమ మార్గం’. ఇలాంటి మధ్యవర్తిత్త్వాల్ని ‘మధ్యమ మార్గం’ అనీ ‘భట్టిప్రోలు పంచాయతీ’ అనీ పిలిచేవారు. దీన్నిబట్టి బౌద్ధం ఈ ప్రాంతంలో ఎంతగా వేళ్లూనుకుందో అర్థం అవుతుంది.
 
కంటకశైలే ఘంటసాల
కృష్ణానదికి తూర్పున ఘంటసాల ఉంది. బుద్ధుని గుర్రం ‘కంటకం’. దాని పేరు మీద ఇక్కడ బౌద్ధారామం పేరు ‘కంటకశైల’గా వచ్చింది. ఈ కంటకశైల ఆరామం పేరే క్రమేపీ ‘ఘంటసాల’గా మారింది. కృష్ణానది ముఖద్వార సమీపంలో ఉన్న ఈ నగరం ఒకనాటి గొప్ప వ్యాపార కేంద్రం.

గొప్ప నౌకా కేంద్రం. ఆనాటి నావికుల్లో ఎక్కువమంది ఘంటసాలలోనే ఉండేవారు. ఒక మహానావికుడి భార్య ఘంటసాల స్థూపాన్ని నిర్మించడంలో ఎక్కువ ఆర్థికసాయం అందించింది. గ్రీకు పరిశోధకుడు టాలమీ కూడా ఇది గొప్ప వ్యాపార కేంద్రం అని రాశాడు. ఇక్కడికి సమీపంలో ఉన్న మైసోలియా (మచిలీపట్నం)ని కూడా నౌకా కేంద్రంగానే అభివర్ణించాడు. ఇక్కడ స్థూపం, ఆరామాల శిథిలాలు అనేకం బయట పడ్డాయి. ఇవేగాక గుడివాడ, జగ్గయ్యపేట, మొగలిరాజపురం, సీతానగరం, గుమ్మడి దుర్ర, కంచికచర్ల.. ఇలాంటి బౌద్ధ క్షేత్రాలు కృష్ణా తీరం వెంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఇటీవల మరెన్నో క్షేత్రాలు బయట పడుతున్నాయి.


ఈ తీరం అమరావతి శిల్పకళకి, మహాయాన సంప్రదాయానికీ, వజ్రయాన బౌద్ధ మార్గానికీ, విద్యా వికాసమంతా ఆంధ్రదేశంలో జరిగితే అందునా కృష్ణా తీరమే ప్రధాన కేంద్రం అయింది. అందుకే...
 కృష్ణా తీరం గట్లు బౌద్ధ ధమ్మానికి మెట్లు!
 కృష్ణవేణి జీవజలాలు బుద్ధ ప్రబోధ ఫలాలు!!
    - డా. బొర్రా గోవర్ధన్
 
 బౌద్ధ తాత్విక దిగ్గజాలు
 తెలుగు బౌద్ధ తాత్విక దిగ్గజాలు ఏడుగురిలో నలుగురు కృష్ణాతీరం వారే.
 నాగార్జునుడు (క్రీ.శ. 100-200):
 రెండో బుద్ధుడుగా కీర్తిగాంచిన తాత్వికుడు నాగార్జునుడు. ఈయన జన్మస్థలం ‘వేదలి’ అని ‘లంకావారసూత్ర’ అనే గ్రంథంలో ఉంది. ఈ వేదలి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పొన్నూరు మధ్యన ఉన్న ‘యాజలి’ అని ప్రముఖ పురావస్తు పరిశోధకులు, స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారి అభిప్రాయం. అయితే ఈ విషయం ఇంకా రుజువు కావాల్సి ఉంది.
 

ఆర్యదేవుడు (క్రీ.శ. 170-270):
ఆచార్య నాగార్జునుని శిష్యుడు. బౌద్ధ మాధ్యమిక వాదంలో మహా దార్శనికుడు. పొన్నూరు ప్రాంతం వాడని అంటారు. చతుశ్శతక, శతశాస్త్ర, చతుహస్తిక, అక్షర శతక అనే గ్రంథాలు రాశాడు.
 

భావవివేకుడు (క్రీ.శ. 490-570):
 అమరావతికి నైరుతి దిశలోఉన్న ఒక గుహలో నివసించాడు (ఉండవల్లి). కొందరు భావవివేకుణ్ని నాగార్జునుని శిష్యుడే అంటారు. ఇతని జన్మస్థలం మలయగిరి అంటే ఈనాటి మంగళగిరి.

బుద్ధఘోషుడు (క్రీ.శ. 5వ శతాబ్దం):
బుద్ధఘోషుడి జన్మస్థలం ‘మొరంద ఖేతకం’ అంటే మయూరపట్టణం. అదే ఈనాడు గుంటూరు జిల్లాలో ఉన్న కోటనెమలిపురం. వీరుకాక మరో జగద్విఖ్యాత బౌద్ధ భిక్షువు బోధిధమ్ముడు. ఈయన అమరావతి నివాసి అంటారు. ఇక్కడి నుంచి కాంచీపురానికి వెళ్లాడు. అక్కడ వ్యాపారులతో (సార్ధవాహులతో) కలసి చైనా చేరి అక్కడ బౌద్ధంతోపాటు మార్షల్ ఆర్ట్స్ ప్రచారం చేశాడు.
 
నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయటపడిన బౌద్ధావశేషాలను జలాశయం మధ్యలో కొండపై నిర్మించిన మ్యూజియంలో భద్రపరిచారు. దీనికి బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేరు పెట్టారు. ఇది నాగార్జునకొండగా ప్రసిద్ధి పొందింది.
 
కృష్ణా పరివాహక రాష్ట్రాలు నిర్మించుకున్న  ప్రాజెక్ట్‌లలో ముఖ్యమైనవి... 1. కర్ణాటక: ఆల్మట్టి ప్రాజెక్ట్, నారాయణపూర్ ప్రాజెక్ట్ 2. తెలంగాణ: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 3. ఆంధ్రప్రదేశ్: శ్రీశైలం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement