krishna pushkaralu - 2016
-
కృష్ణా పుష్కరాల సందర్భంగా విద్యార్థులకు పోటీలు
శ్రీకాకుళం పాత బస్టాండ్: కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 అంశాలపై రోజుకో అంశంపై పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సంయుక్త కలెక్టర్–2 పి.రజనీకాంతారావు తెలిపారు. ఆయన సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జల సంరక్షణ, నదుల అనుసంధానంపై ఇరిగేషన్ అధికారులు, అమరావతి అంశాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నగేస్, మనం–వనం అంశాన్ని అటవీ శాఖ, విద్య, నైపుణ్యం అంశాన్ని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఫిజికల్ లిటరసీ అంశాన్ని డీఎస్డీఓ ఆహార అలవాట్ల అంశాన్ని ఐసీడీఎస్, స్వచ్ఛభారత్ అంశాన్ని విద్యాశాఖాధికారి, రెండంకెల అభివృద్ధి అంశాన్ని ముఖ్యకార్యనిర్వహణాధికారి, సాంకేతికత అంశాన్ని డీఐఓ, పేదరికంపై గెలుపు అంశాన్ని డీఆర్డీఏ, ఉపాధి అంశాన్ని సెట్‌శ్రీ సీఈఓలు పర్యవేక్షించాలని తెలిపారు. అంశాలను ప్రతిరోజు ఫొటోలతో సహా నోడల్ అధికారి అయిన జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయాలని సూచించారు. అనంతరం ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు. పశువుల డాటాను కూడా ఇందులో పొందుపరచాలని చెప్పారు. సమావేశానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఆర్. కూర్మనాథ్, జిల్లా అధికారులు హాజరయ్యారు. -
కూచిపూడి పుట్టినిల్లు!
భారతదేశంలోని సుప్రసిద్ధ శాస్త్రీయ నృత్యరీతులలో కూచిపూడికి ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణాతీరంలోని కూచిపూడి గ్రామమే ఈ అద్భుత నృత్యరీతికి పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో నడయాడిన యతి నారాయణ తీర్థులు, ఆయన శిష్యుడు సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యరీతికి ఆద్యులని అంటారు. కూచిపూడి నృత్య రీతికి కూడా భరతముని రచించిన నాట్యశాస్త్రమే ఆధారమని చెబుతారు. నాట్యశాస్త్రం క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్ది మధ్యకాలానికి చెందినదై ఉంటుందని చరిత్రకారుల అంచనా. దేశంలో భక్తి ఉద్యమం పుంజుకుంటున్న క్రీస్తుశకం ఏడో శతాబ్ది కాలంలో కూచిపూడి నృత్యం ఊపిరి పోసుకుంది. తంజావూరు వరకు ‘తరంగాల’ తాకిడి కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడైన నారాయణ తీర్థులు ‘శ్రీ కృష్ణలీలా తరంగిణి’ని విరచించారు. ఇందులో నృత్యానికి అనువుగా ఆయన రచించిన లయబద్ధమైన పాటలే తరంగాలుగా ప్రసిద్ధి పొందాయి. నారాయణ తీర్థులు కొంతకాలం తంజావూరులో గడిపారు. అప్పట్లో ఆయన తంజావూరు ఆలయంలో తాను రూపొందించిన నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఆనాటితో కూచిపూడి ‘తరంగాల’ తాకిడి తంజావూరు వరకు పాకింది. నారాయణ తీర్థుల శిష్యుడైన సిద్ధేంద్రయోగి ‘పారిజాతాపహరణం’ నృత్య రూపకాన్ని రూపొందించారు. కూచిపూడి నృత్యరీతిలో ఇది ‘భామాకలాపం’గా ప్రసిద్ధి పొందింది. నారాయణ తీర్థుల తరంగాలను, సిద్ధేంద్రయోగి రూపొందించిన భామాకలాపాన్ని ప్రదర్శించని కూచిపూడి నర్తకులే ఉండరు. ఆధునిక కాలంలో సైతం కూచిపూడి నృత్యప్రదర్శనల్లో ఈ అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. గోల్కొండ నవాబుల ఆదరణ కూచిపూడి నృత్యాన్ని గోల్కొండ నవాబులు ఎంతగానో ఆదరించారు. కూచిపూడి నర్తకుల ప్రదర్శనకు మంత్రముగ్ధుడైన గోల్కొండ నవాబు అబుల్ హసన్ కుతుబ్ షా కూచిపూడి కళాకారుల కోసం కూచిపూడి గ్రామంలో ఉదారంగా భూములిచ్చారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నంత కాలం వారు ఆ భూములను అనుభవించవచ్చని ఆయన తన శాసనంలో స్పష్టం చేశారు. తర్వాతి కాలంలో సిద్ధేంద్రయోగి రూపకల్పన అయిన ‘భామాకలాపం’ ప్రేరణతో రామశాస్త్రి అనే నాట్యవిద్వాంసుడు ‘గొల్లకలాపం’ రూపొందించారు. ఒక గోపికకు, ఒక బ్రాహ్మణుడికి నడుమ జరిగే హాస్య సంభాషణతో రూపొందించిన ‘గొల్లకలాపం’ కూడా కూచిపూడి నృత్య ప్రదర్శనలలో ప్రసిద్ధి పొందింది. ఆధునిక సొబగులు ఆధునిక కాలంలో హరిమాధవయ్య కూచిపూడి నృత్యప్రదర్శనల్లో భాగవత మేళ నాటకాన్ని ప్రవేశపెట్టారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో చింతా వెంకటరామయ్య కూచిపూడి కళాకారులందరినీ సంఘటితపరచి నాట్యబృందాన్ని ఏర్పరచారు. ధార్వాడ్, పార్శీ నాటక కంపెనీల తరహాలో ఆయన ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య బృందాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చాయి. అప్పట్లోనే కూచిపూడి నృత్యప్రదర్శనల్లో విద్యుద్దీపాలంకరణలు, వస్త్రాలంకరణల్లో ఆధునిక పోకడలతో రంగాలంకరణ ఆధునిక సొబగులను దిద్దుకుంది. ఆ కాలంలోనే బందా కనకలింగేశ్వరరావు, విస్సా అప్పారావు, తాండవకృష్ణ వంటి కళాకారులు నృత్యప్రదర్శనలను కొనసాగించడంతో పాటు కూచిపూడి నృత్యరీతిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాసేవారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి తన తనయుడు జగన్నాథ శర్మతో కలసి కూచిపూడి ప్రదర్శనల్లో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు కూచిపూడి ప్రదర్శనల్లో స్త్రీపాత్రలను కూడా పురుషులే అభినయించేవారు. వేదాంతం వారి చొరవతో స్త్రీ పాత్రలను స్త్రీలే అభినయించడం మొదలైంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1958లో నిర్వహించిన అఖిలభారత నాట్య సదస్సులో కూచిపూడి నృత్యరీతికి తొలిసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. కూచిపూడి ప్రదర్శనల్లో స్త్రీలు రంగస్థలంపైకి రావడం మొదలయ్యాక తొలితరంలో ఇంద్రాణి రెహమాన్, యామినీ కృష్ణమూర్తి వంటి వారు నృత్యతారలుగా వెలుగొందారు. వారి స్ఫూర్తితో మరింత మంది నర్తకీమణులు రంగప్రవేశం చేసి, కూచిపూడి కీర్తిని ఖండాంతరాలకు చాటుతున్నారు. -
పుష్కరాల పండగొచ్చింది!
కృష్ణానది స్వగతం నన్ను ‘అమ్మా’ అని పిలుచుకునే రైతుబిడ్డలు ఎప్పుడూ కనిపిస్తుంటారు. నా దీవెనల కోసం తపిస్తుంటారు. నేను చల్లగా, కడుపు నిండుగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడప్పుడూ పిల్లాపాపలతో పర్యాటకులు వచ్చి నా అణువణువునూ తడిమి చూడాలని తపన పడుతూ నిలువెల్లా తడిసిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు... నా తీరాన కొత్త మనుషులు కనిపిస్తున్నారు. మడత నలగని చొక్కాలు, ప్రభుత్వ వాహనాలు, ఫైలు పట్టుకున్న బిళ్ల బంట్రోతు. ఒకరు కొలతలు వేస్తున్నారు, ఒకరు గుర్తులు పెడుతున్నారు. గెంతులు వేస్తున్న జింకలు ఆగి మరీ ఈ తతంగాన్ని చూస్తున్నాయి. పక్షులు ఓ కంట చూసి రెక్కలు టపటపలాడిస్తూ వెళ్లిపోతున్నాయి. మరాఠా, కన్నడ, తెలుగు కుటుంబాలు ప్రయాణాలకు సిద్ధమవుతున్నాయి. అవును మరి. నాకు పండుగ కళ వస్తోంది. వేడుకకు నన్ను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి వేడుక జరిగి పుష్కరకాలమైంది. ఇప్పుడు నాకు మళ్లీ పండగొచ్చింది. గత ఏడాది గోదారమ్మ పండుగ చేసుకుంది. అప్పటి నుంచి ఈ ఏడాది నా పండుగను తలుచుకుంటూనే ఉన్నారు. నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నేను దేశంలో పెద్ద నదుల్లో నాలుగో స్థానంలో ఉన్నాను. గంగమ్మ, గోదారమ్మ, బ్రహ్మపుత్ర నాకంటే పెద్దవి. ఉత్తరాదిన గంగమ్మకు ఇచ్చిన స్థానం దక్షిణాదిలో మహాగణపతి సాక్షిగా నాకే ఇచ్చారు. పశ్చిమ కనుమల్లో నేను పుట్టిన మహాబలేశ్వర్కు దగ్గరలోనే ‘వాయికారులు’ నా తీరాన విశ్వేశ్వరాలయం కట్టి దక్షిణకాశి అని పేరు పెట్టుకున్నారు. స్నాన ఘాట్లు కట్టి ఏడాదంతా నన్ను దర్శించుకుని, పవిత్ర స్నానాలు చేస్తున్నారు. దేవగిరి రాజు నేను పుట్టిన చోట నాకు ‘కృష్ణబాయి ఆలయం’ కట్టాడు. సముద్రమట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో పుట్టి బిరబిరా పరుగులు పెట్టే నా ప్రవాహం కవుల ఊహకు మాత్రమే అందగలిగిన ఓ సృజనాత్మకత. అరేబియా సముద్రానికి 64 కిలోమీటర్ల దూరాన పుట్టి అటుగా పయనించక... వయ్యారాలు పోతూ వలపుల మలుపులు తిరుగుతూ 1,400 కిలోమీటర్ల దూరం వడివడిగా పరుగులు తీయడంలోనూ ఓ సృజనాత్మకత దాగి ఉంది. ఇంతకంటే గొప్ప ఊహ నా బిడ్డలది. నాకు ఆలయం కట్టిన చోటనే ఓ తటాకాన్ని తవ్వి నా ప్రవాహాన్ని అందులోకి మళ్లించి గోముఖం నుంచి బయటపడేటట్లు నాకో చక్కని దారినిచ్చారు. శివాజీ అనుచరుడు ఆ ఆలయంలో నన్ను మొక్కిన తర్వాతనే అఫ్జల్ఖాన్ మీద విజయం సాధించాడని విజయోత్సవాలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అప్పటి నుంచి ఏటా ఆ సంతోషాన్ని నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు మరాఠా బిడ్డలు. నాతోపాటు నలుగురు! నేను పుట్టిన మహాబలేశ్వర్ కొండల్లోనే పుట్టిన కొయ్నా, వేణి, సావిత్రి, గాయత్రి వచ్చి నాతో కలిసే వరకు నేను కృష్ణమ్మనే. వేణితో కలిసి కృష్ణవేణినయ్యాను. మా అందరినీ కలిపిన నేలను పంచగంగగా కొలుస్తారు. జనం నన్ను జీవనదిగా కొలుస్తారు. కానీ... నాకు ఆ గౌరవాన్ని తెచ్చి పెట్టిన నా ఉపనదులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? వారణ, భీమ, డిండి, ఎర్ల, పెద్దవాగు, హాయిలా, మూసీ, పాలేరు, మున్నేరు, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగ-భద్రల్లో చాలా నదులు నాలో కలిసి తమ ఉనికినే త్యాగం చేస్తున్నాయి. నా తీరాన వెలసిన రాజ్యాలు, పాలకులు, పాలితులు నన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. వారి జీవితంలో నేనూ ఓ భాగం అయ్యాను. జొన్న, మొక్కజొన్న, వరి ధాన్యాలనిస్తున్నాను. నేలను సారవంతం చేయాలనే తపనతో అంత ఎత్తు నుంచి నేలకు దూకుతుంటాను కదా. అందుకే నాకు తొందరెక్కువ. స్థితప్రజ్ఞతతో మంద్రంగా ప్రవహించడం నాకు చేతకాని పని. నిజమే... నన్ను శంకరంబాడి సుందరాచారి బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోందన్నాడు. ఆ బిరబిరలో భూదేవి గుండెను నిలువునా చీల్చేస్తుంటాను. 75 అడుగుల లోతుకు తొలుస్తున్నా కూడా ఆ సహనమూర్తి నా కోతను భరిస్తూ నా ప్రవాహానికి దారినిస్తుంది. మహాబలేశ్వర్ నుంచి హంసలదీవి దగ్గర ఉన్న పాలకాయి తిప్ప వరకు ఆద్యంతం కనువిందు చేసే నా ప్రవాహంలో... కునె, గోకక్, గోడ్చిన మలకి, కల్హట్టి, సిరిమనె, యతిపోతల, మల్లెల తీర్థం జలపాతాలది సింహభాగం. విశాలమైన చెట్లు చేమల మీద సేదదీరే వలస పక్షులకు ఘటప్రభ, గుడావి ఓ మజిలీ. వన్యప్రాణులు నా తీరాన విస్తరించిన అడవుల్లో ధైర్యంగా సంచరిస్తుంటాయి. కృష్ణ సౌరభాలు! కవుల కలాల్లో ఇంకిన సిరాని నేను. మరాఠులైతే మంచి మనిషిని నాతో పోలుస్తారు. తెలుగు కలాలు నల్లని కురులున్న అమ్మాయిని నాతో పోలుస్తాయి. ‘కృష్ణమ్మ అందాలు...’ అంటూ ఒకరు రాస్తే, ఆ ఒడ్డు- ఈ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అంటూ మరో కవి రాస్తాడు. నా తీరం కళలకు కాణాచి. కూచిపూడి మువ్వల రవళి నా తీరాన్నే ఘల్లుమంది. చరిత్రలో సూర్యప్రభలా వెలిగిన శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాలు నా తీరంలోనే రాజ్యాలను విస్తరించుకున్నాయి. మౌర్యుల నుంచి స్వాతంత్య్రం పొందిన శాతవాహనులు నా తీరాన్నే స్వతంత్య్ర రాజ్యం ఎంచుకున్నారు. అలా తొలి తెలుగు రాజ్యం నా తీరానే వెలిసింది. ఇప్పుడు నా తీరమే రాజధానికి ఆధారం అనే కొత్త పల్లవి విని అంతగానే పరవశించిపోయాను. కానీ... పంట పొలాలకు ఇవతల నేను ప్రవహిస్తుంటే అవతల రైతుబిడ్డ కన్నీరు ప్రవహిస్తోంది. ఆ కన్నీటిని తుడిచే గుండె గల మనిషి కోసం నా కళ్లు వెతుకుతున్నాయి. బౌద్ధగమనం! ఉత్తరాదిలో నిరంజన నది తీరాన పుట్టిన బౌద్ధం దక్షిణాదిలో నా తీరాన పరిఢవిల్లింది. ఇప్పుడు బౌద్ధం కనిపించడం లేదు కానీ ఆచార్య నాగార్జునుడి శ్రమకు ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. అవి బౌద్ధాన్ని గుర్తు చేస్తున్నాయి. విగ్రహారాధన, పూజాదిక్రతువులు వద్దని చెప్పిన బుద్ధుడిని అనుసరించిన తరాలను చూశాను. ఆ తర్వాత బుద్ధుడి విగ్రహానికే పూజలు చేస్తున్న తరాలనూ చూశాను. బౌద్ధకాలచక్రం కోసం స్వయంగా దలైలామా అమరావతికి వస్తే సమసమాజం కోసం బుద్ధుడు చెప్పిన ప్రవచనాలను వినిపిస్తాడేమో... అనుకున్నాను. కానీ ఆయన బుద్ధుడి విగ్రహానికి పూజలు చేసి వెళ్లాడు. నాగార్జున కొండ ఆత్మీయులను దూరం చేసుకున్న పసిబిడ్డలా ఉందిప్పుడు. బౌద్ధవిస్తరణ కాలంలో వెలిసిన స్థూపాలు, చైత్యాలు, ఆరామాలు రిజర్వాయర్ ముంపులో మునిగి పోయి శిఖరం మాత్రం ఒక దీవిలా కనిపిస్తోంది. రిజర్వాయర్ నిర్మాణం కోసం స్థానభ్రంశం చెందిన బౌద్ధ ప్రతీకలు నా మీద అలకబూనినట్లే కనిపిస్తుంటాయి. ఆ ఒడ్డు... ఈ ఒడ్డు! నా తీరాన అడవులున్నాయి, కొండ కోనలున్నాయి. పంటపొలాలున్నాయి, నివాస ప్రదేశాలున్నాయి. అయితే వాటి మధ్య నేను... ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి మధ్య ఓ విభజన రేఖలా ఉండేదాన్ని. బ్రిటిష్ పాలకులు ఆ దూరాన్ని తగ్గించేశారు. మహారాష్ర్టలో ‘వాయి’ దగ్గర కృష్ణ వంతెన మొదలు, సంగ్లి దగ్గర ఇర్విన్ వంతెన. ఇక మహారాష్ట- కర్నాటకలను కలుపుతూ రాయిబాగ్ దగ్గర సౌందట్టి వంతెన, బీజాపూర్- భాగల్కోట్లను కలుపుతూ తంగదాగి వంతెన కట్టే వరకు పడవ ప్రయాణమే ఏకైక మార్గం. వంతెనలు కట్టాక పాదం తడవకుండా ప్రయాణం చేయగలగడం సాధ్యమైంది. నా పరుగుకు పగ్గాలు! కొండంత మబ్బు ఒక్కసారిగా ఒలికిపోయినట్లు ఉంటుంది నా ప్రవాహం. అంత నీటిని సాగరం పాలు కానివ్వకుండా ఆనకట్టలు కడుతుంటే ఇదీ మంచిదే... అని మురిసిపోయాను. అందరూ నా బిడ్డలే. అన్ని కంచాల్లోకి అన్నం రావాలనేదే నా తపన కూడా. అలా మొదలైన ఆనకట్టల పరంపర నన్ను నన్నుగా ఉంచుతారా లేదా అని సందేహపడేటట్లు చేస్తోందిప్పుడు. ధోమ్, హిప్పగిరి, కానూర్, అమర్, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, పులిచింతల, తుంగ-భద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్‌లతో అడుగడుగునా ఆనకట్టలే. పైగా ఎవరెంత నీటిని నిలుపుకోవాలనే వివాదాలు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఆనకట్ట తలుపులు తెరుస్తారో? మాకు ఎక్కువయ్యావు... చాలు పొమ్మని నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు. నా ప్రవాహాన్ని నిలువరించుకోవడం నా చేతుల్లో ఉండదు. ఒక్కసారిగా ఊళ్లను ముంచేస్తాను. అయినా... మనిషికి ఎంతిచ్చినా ఇంకెంతో పొందాలనే అశ. అయితే అంతటి అశ ఉండాలేమో! ఆ ఆశే లేకపోతే నిశీధిని నీటితో వెలిగించడం సాధ్యమయ్యేది కాదేమో? నా మీద జలవిద్యుత్ కేంద్రాలతో జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నాడు. అంతటితో సంతోషించక నా తీరాన నెలకొల్పిన బొగ్గు కరెంటు కేంద్రాలు విడుదల చేసి బూడిదను నాలోకే వదిలి నన్ను కలుషితం చేస్తున్నాడు. అదేమంటే అభివృద్ధి అంటాడు. బిడ్డ అభివృద్ధి చెందుతున్నాడని సంతోషించడమే నేను చేయగలిగింది. ప్రాచీనకాలంలో మనిషి నన్ను శుద్ధి చేయడం కూడా తన బాధ్యతే అనుకునేవాడు. నదిని చూసినప్పుడు ఒక నాణెం వేయడాన్ని ఆనవాయితీగా అనుసరించాడు. నాణెం వేయడం అనే నమ్మకాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే అప్పటి నాణేలు రాగివి. వాటికి నీటిని శుద్ధిచేసే గుణం ఉండేది. ఇప్పటి నాణేలకు ఆ గుణం లేదు. అయినప్పటికీ వేస్తూనే ఉన్నారు. ఆ లోహాలను కూడా నా కడుపులో కరిగించుకునే ప్రయత్నం చేస్తున్నాను. పుణ్యతీరం! భారతీయ పురాణాలు నన్ను విష్ణువు స్వరూపం అంటాయి. విష్ణువు అవతారమైన కృష్ణుడి పేరే నా పేరంటాయి. కృష్ణుడికైనా, నాకైనా ఆ పేరును తెచ్చింది మా నల్లదనమే. నాలో మునిగి లేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం. దత్తాత్రేయుడు ఔదుంబర్లో నా తీరాన నివసించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైల క్షేత్రం నా తీరానే ఉంది. అది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం కూడా. జోగులాంబ నా తీరానే అలంపూర్‌లో ఉంది. రెండు సంగమేశ్వరాలయాలకు సాక్షిని. సంగ్లి దగ్గర వరుణ నది కలిసే ప్రదేశంలో ఒకటి, కర్నూలులో తుంగభద్ర కలిసే చోట ఓ సంగమేశ్వరాలయం ఉన్నాయి. ఇక అమరావతిలోని అమరేశ్వరాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ ఆలయం నిత్యం వేదమంత్రోచ్ఛారణతో నా తీరాన్ని పులకింప చేస్తుంటుంది. నా తీరాన ఆలయాలు కట్టిన పాలకులను చూశాను. దేవుడి విగ్రహాలను నా నీటితో అభిషేకించి భక్తిగా కళ్లు మూసుకుని దణ్ణం పెడితే ముచ్చటపడ్డాను. ఇప్పటి పాలకులు ఆ ఆలయాలే అడ్డు అని కూలుస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నాను. పుష్కరశోభ! నా తీరాన విస్తరించిన చెట్లు పక్షులకు ఆవాసాలు. అవి కువకువలాడుతుంటే ఆలకిస్తాను. వలస పక్షులు వస్తుంటాయి పోతుంటాయి. ఏడాది మారిందని నాకు చెప్పకనే చెబుతుంటాయి. అలా పన్నెండు ఏడాదులు మారితే పుష్కరకాలం. సందడే సందడి. పెద్ద పండుగకు పిల్లలంతా వచ్చినట్లు ఉంటుంది. జనం నేలను చీల్చుకుని పుట్టుకొచ్చినట్లు కనిపిస్తారు. నాలో మునిగి, లేచి గుండెల నిండా గాలిపీల్చుకుంటుంటారు. చన్నీరు ఒంటిని వణికిస్తుంటే, అరచేత్తో కళ్లను తుడుచుకుని ఆశ్చర్యంగా ఒంటిని చూసుకుంటుంటారు పిల్లలు. బాల్యం ఎంత అందమైనదో. వాళ్లనలా చూస్తుంటే ఈ పండగ ఇలాగే ఉంటే బావుణ్ణు. పుష్కరానికోసారి నా బిడ్డలందరూ నన్ను పలకరిస్తారు. ప్రేమగా స్పృశిస్తారు. వాయి దగ్గర కృష్ణమాయి నుంచి విజయవాడలోని కృష్ణవేణి వరకు నా ప్రతీకలుగా ఉన్న దేవతామూర్తులందరికీ వందనం చేస్తారు. నన్ను ఇంత ప్రేమిస్తున్న బిడ్డలకు నేనేమివ్వగలను? ఏటా పంటలతో సస్యశ్యామలం చేయడం తప్ప! అందుకే తెలుగుతల్లి మెడలోని పూలదండలో నేనూ ఓ పరిమళ సుమాన్నయ్యాను. - వాకా మంజులారెడ్డి నా మీద నాగార్జునసాగర్ ఆనకట్ట కట్టారు. దానిని అప్పట్లో దేశం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ప్రధాని నెహ్రూ కలలకు ప్రతిరూపం అది. ప్రపంచంలో నిర్మించిన పొడవైన ఆనకట్ట. బహుళార్థసాధకంగా నిర్మించిన ఆ ఆనకట్ట మీద నుంచి రాత్రి ప్రయాణిస్తే ఆకాశంలో నక్షత్రాలన్నీ నేలకు దిగి నా ముంగిట ప్రణమిల్లినట్లు ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు నుంచి 11 కి.మీ.ల దూరంలో యతిపోతల జలపాతం ప్రకృతి తీర్చిదిద్దుకున్న అద్భుతం. అమరావతికి వస్తే రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధస్థూపాన్ని అబ్బురంగా చూసి మురిసిపోవచ్చు. ద్రావిడ నిర్మాణశైలిలో ఉన్న అమరేశ్వరాలయం ప్రముఖమైనది. అక్కడి నుంచి విజయవాడను పలకరిస్తే కనకదుర్గమ్మ కొండ మీద ఠీవిగా కనిపిస్తుంది. అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి ఇదే. ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నా ప్రవాహాన్ని చూస్తూ, పిల్లతెమ్మెరలను ఆస్వాదించని వారుండరు. ఇక్కడికి దగ్గరలోనే ఉంది భవానీ ద్వీపం. ఇక్కడి వరకూ వచ్చాక ఉండవల్లి గుహలను చూడకుండా వెళ్లవద్దు. నా పుట్టిల్లు... నేను పుట్టిన మహాబలేశ్వర్ కొండలు అడుగడుగునా ప్రకృతి సౌందర్య వీచికలే. నదుల కలయిక, ఉపనదుల సంగమాలు, జలపాతాల ఝరులు... కమనీయ దృశ్యాల సుమహారాలు. లాడ్విక్ పాయింట్ నుంచి చుట్టూ చూస్తే కలిగే పరవశం అంతా ఇంతా కాదు. అర్థర్ పాయింట్‌ను క్వీన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అని కూడా అంటారు. అందమైన ప్రదేశాలను బ్రిటిష్ కాలంలో విదేశీ టూరిస్టులు కనిపెట్టడంతో పేర్లన్నీ పాశ్చాత్య వాసన వస్తుంటాయి. అర్థర్ పాయింట్ నుంచి చూస్తే లోయలో సావిత్రి మౌనంగా ప్రవహిస్తుంటుంది. నా పరుగును ఆపి... ఎల్ఫిన్‌స్టోన్ పాయింట్, టైగర్స్ స్ప్రింగ్, కేట్స్ పాయింట్, బాంబే పాయింట్, విల్సన్ పాయింట్, వెన్నా లేక్, లింగమల, చినమాన్, దోభీ వాటర్ ఫాల్స్ అందాలను కళ్లారా చూద్దామని పిస్తుంది. కేట్స్ పాయింట్‌ని సన్‌రైజ్ పాయింట్ నుంచి చూస్తే... పశ్చిమ కనుమల సౌందర్యాన్ని చూడడానికి సూర్యుడు పర్వతాల మీదకు పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. ఐదు నదుల జన్మస్థానం కావడంతో నా పుట్టింటిని ‘ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్’ అంటారు. -
ఆ లిపికి కృష్ణమ్మే సాక్షి
ఏ భాషకైనా లిపి అవసరం. లిపి ఉన్నప్పుడే ఆ భాష చరిత్రలో నిలబడుతుంది. కృష్ణాజిల్లాలో కృష్ణానది సముద్రంలో కలిసే చోటు హంసలదీవి మనందరికీ తెలిసిందే. హంసలదీవిలో పురాతనమైన వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. దేవాలయ స్తంభాలపై ఒక పురాతన లిపితో రాసిన శిలాశాసనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ లిపిలోని భాష ఏమిటో, అది ఎవరికి చెందినదో మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. దేశ విదేశాల నుంచి చాలా మంది వచ్చి ఈ భాషపై అధ్యయనాలు చేశారు. ప్రపంచంలో వివిధ భాషలకు చెందిన పరిశోధకులు ఇక్కడకు వచ్చి చూసి, ఈ లిపి తమది కాదని తేల్చిచెప్పారు. లిపి రూపంలో ఉన్న ఈ భాషకు కృష్ణమ్మే సాక్షి. ఈ లిపికి సంబంధించిన ఆనవాళ్లు కృష్ణమ్మకు మాత్రమే తెలుసు! ఎవరి లిపి? ఇక్కడి శాసనాల్లోని లిపి పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన చోళులు లేదా మౌర్యులకు సంబంధించినది కావచ్చని కొందరి ఊహ. చోళులు, మౌర్యులు భారతదేశాన్ని పరిపాలించారు. వీరి కాలంలోనే ఒక జాతికి చెందిన భాషకు సంబంధించిన లిపి అయి ఉండవచ్చని, ఆ తర్వాతి కాలంలో ఇందులోని భాష అంతరించిపోయి ఉండవచ్చని కూడా కొందరు పరిశోధకుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ నిర్మాణం చోళుల కాలం నాటిదిగా పరిగణిస్తున్నారు. - ఇందిరా ప్రియదర్శిని -
బౌద్ధవాణి కృష్ణవేణి
కృష్ణానది చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 400 కోట్ల సంవత్సరాల నాటిది. అప్పటికింకా హిమాలయాలే పుట్టలేదు. కాబట్టి గంగా, సింధూ నదుల ఊసే ఉండదు. సూర్య కుటుంబంలో భూమి పుట్టిన వందల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడ్డ గోండ్వానా భూభాగంలో మన దక్కను పీఠభూమి కూడా ఉంది. అప్పుడు జరిగిన అగ్నిపర్వత చర్యల వల్ల ఎగజిమ్మిన లావా నుండి ఏర్పడినదే ఈ పీఠభూమి. అందుకే ఇది నల్లరేగడి నేల అయ్యింది. ఈ నల్లరేగడి నేల పాయ నల్లమల అడవులు దాటి గుంటూరు జిల్లాలో ఇటు అమరావతి నుండి, అటు ప్రకాశం జిల్లాలో మోటుపల్లి వరకు విస్తరించి ఉంది. ఈ నేలలో ప్రవహించినదే కృష్ణానది. నల్లటి నేలలో ప్రవహించడం వల్ల ఈ నది నీరు కాస్త నూనెరంగులో కనిపిస్తాయి. గంగా, గోదావరి నదుల్లా బురదగా ఉండవు. అందుకే ఈ నదిని నల్లనది అని, నల్లయేరు అని, తేలవాహనం అనీ, కృష్ణానది అనీ అంటారు. కృష్ణానది అతి పురాతన నది కాబట్టి, దీని పరివాహక ప్రాంతం నల్ల రేగడి నేల కాబట్టి, ఆ నేల పీఠభూమి కాబట్టి ఇక్కడ వరి పంటతో పాటు మెట్టపంటలు ఇబ్బడి ముబ్బడిగా పండుతాయి. అందుకే ఈ తీరం అపరాలు, వాణిజ్యపంటల క్షేత్రంగా మారింది. సర్వపంటల సమాహారంగా రూపొందింది. అందుకే అతి పురాతన కాలం నుండి మానవజాతులకు నిలయంగా మారడమే గాక, ప్రపంచంలో అతి ప్రధాన విదేశీ వ్యాపార కేంద్రంగానూ వర్ధిల్లింది. అలా వ్యవసాయం, వ్యాపారాలలోనే కాకుండా ధార్మికంగా కూడా దివ్యత్వాన్ని సంపాదించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నదీ తీరం బుద్ధుని ధర్మప్రబోధలు మారుమోగిన ధరణీ తలం. బౌద్ధ సాహిత్యంలో... బౌద్ధ సాహిత్యంలో కృష్ణానది ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తుంది. ఎందరో వ్యాపారులు తేలివాహన నదీతీరంలోని ఆంధ్రనగరికి వచ్చిన సందర్భాలు కనిపిస్తాయి. ఆ ఆంధ్రనగరే... ఈనాటి అమరావతి. ఆ తేలివాహన (తైలవాహనం) నదే కృష్ణానది. కర్నూలు, శ్రీశైలం, విజయపురి (నాగార్జునసాగర్), అమరావతి, భట్టిప్రోలు, ఘంటసాల - ఇలా ఈ తీరం వెంట వెలసిన బౌద్ధనగరాలు. వీటిలో ఒక్కొక్క ఘన చరిత్ర ఉంది. ఇవన్నీ అశోకునికి ముందే ఏర్పడ్డ మహానగరాలు. కర్నూలు జిల్లా ‘ఎర్రగుడి’లో దొరికిన అశోక శాసనాలను బట్టి ఈ ప్రాంతంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పవచ్చు. అశోకుడు వేయించిన శాసనాలన్నీ ‘ఎర్రగుడి’లో ఉన్నాయి. ఇంకా సాతానికోట, రాజుల మందగిరి, అహోబిలం ఇవన్నీ ఒకనాటి బౌద్ధ క్షేత్రాలే. విజయపురి- బోధిసిరి విజయపురి (నాగార్జున కొండ) ప్రాంతం సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఇప్పుడున్న నాగార్జున కొండను గతంలో నందికొండ అనేవారు. అంతకు పూర్వం శ్రీపర్వతం అనేవారు. ఆచార్య నాగార్జునుని కాలంలో ఇక్కడ విరాజిల్లిన బౌద్ధారామం శ్రీపర్వత ఆరామం. ఈ ఆరామంలో దేశ విదేశ భిక్షువులకు ఆరామాలు, వసతి గృహాలు కట్టించిన ధార్మికురాలు బోధిసిరి. ఈమె ఒక వ్యాపారి భార్య. ఇక్కడ ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. 14 దేశాల విద్యార్థులతో కళకళలాడేది. ఈనాడు ఈ విద్యాలయ ఆనవాళ్లు గుంటూరు వైపునున్న ‘అనుపు’లో చూడవచ్చు. ఆంధ్రనగరి- అమరావతి ఈనాడు మనం ‘అమరావతి’గా పిలుచుకునే ఊరి ప్రక్కనే ఒకనాడు ఒక మహానగరం ఉండేది. అదే బౌద్ధ జాతక కథల్లో వర్ణించిన ‘ఆంధ్రనగరి’. దీనికి ధనకటక, ధాన్యకటక, ధరణికోట... ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. బౌద్ధుల గీతాల్ని ‘ధారణులు’ అంటారు. ‘ధారణులు’ మారుమ్రోగే క్షేత్రం కాబట్టి దీనికి ‘ధారణికోట’ అంటారనీ, అదే కాలక్రమంలో ధరణికోటగా మారిందనీ అంటారు. ఇక్కడ బౌద్ధ సాహిత్యం ‘త్రిపిటకాల’ బోధన జరిగేది. ఈ ‘పిటకాల’ పేరుతో దీన్ని ‘పేట’ అని పిలిచేవారు. ఈ కోట, పేటలే ఈనాడి అమరావతి. చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు ఇది దక్షిణ భారత దేశ రాజధానిగా విలసిల్లింది. ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మహాస్థూపం భారతదేశంలోనే అతి ఎత్తై స్థూపాల్లో ఒకటి. ‘అమరావతి’ నగరానికి బౌద్ధ సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధంలోని మహాయాన సంప్రదాయానికీ, ఆ తర్వాత వచ్చిన వజ్రయాన (కాలచక్ర) సంప్రదాయానికీ అమరావతే జన్మస్థానం. అమరావతి చుట్టూ చైత్యక, పూర్వ శైలీయ, అపరశైలీయ లాంటి ఎన్నో బౌద్ధ సంప్రదాయాలు వెలిశాయి. ఇది ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ఆయన తన శూన్యవాదాన్ని ప్రవచించిన తీరం. బౌద్ధం తొలిగా ఈ తీరం వెంబడి సాగి విదేశాలకు ప్రయాణం చేసింది. భౌగోళిక సానుకూలతల వల్ల ఇది గొప్ప వ్యాపారనగరంగా, రాజధాని నగరంగా వందల ఏళ్లు మనగలిగింది. వ్యాపారులు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించారు కాబట్టి వారి ద్వారా తెలుగు భిక్షువులు విదేశాలకు వెళ్లారు. వారి వల్లే బౌద్ధం ప్రపంచ వ్యాపితం అయ్యింది. ఇక శిల్పకళలో కూడా అమరావతికి ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధ శిల్పకళారీతులు మూడు. గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ. ఈ మూడింటిలో అందమైన శిల్పకళ అమరావతి శిల్పకళే. ఈనాడు ప్రపంచ వ్యాపితంగా ఉన్న బౌద్ధ చైత్యాలన్నింటిలో కన్పించే శిల్పకళ ఇదే! తొలి ఆనవాలు భట్టిప్రోలు కృష్ణాతీరంలో చెప్పుకోదగ్గ అతి పురాతన బౌద్ధక్షేత్రం భట్టిప్రోలు. కృష్ణానదికి పశ్చిమ తీరాన ఉన్న భట్టిప్రోలు భారత దేశంలోని అతి పురాతన చైత్యాల్లో ఒకటి. ఇది అశోకుని కాలం నాటి కంటే ముందరిదే అని అంటారు. అందుకే ఈ భట్టిప్రోలు బౌద్ధం తొలి ఆనవాలు. ఇది కృష్ణానది సముద్రంలో కలిసే చోటుకు దగ్గరగా ఉంది. ఇక్కడి నుండి విదేశాలకు వస్త్రాల ఎగుమతి జరిగేది. భట్టిప్రోలుని ‘ప్రిటుండ్ర’ నగరం అనేవారు. ఈ పదానికి ‘నేత పని’ అని అర్థం. ఇప్పటికీ రేపల్లె ప్రక్కన ‘పేటేరు’ అనే ఊరు ఉంది. అది ఈనాటికీ వస్త్రాల తయారీకి ముఖ్య ప్రదేశమే. భట్టిప్రోలులో ‘సింహ గోష్ఠి’ అనే బౌద్ధ పండితుల సంఘం ఉండేది. ఇది కూడా గొప్ప విద్యాకేంద్రంగా విరాజిల్లింది. ఈ ప్రాంతంలో తగవులు జరిగినప్పుడు లేదా లావాదేవీలు జరిగినప్పుడు మధ్యవర్తులు చేసే ఒప్పందాన్ని ‘భట్టిప్రోలు పంచాయతీ’ అంటారు. ఇరువర్గాలకీ మధ్యస్థంగా సమస్యను పరిష్కరిస్తారు. మధ్యస్థం అనేది బౌద్ధుల ‘మధ్యమ మార్గం’. ఇలాంటి మధ్యవర్తిత్త్వాల్ని ‘మధ్యమ మార్గం’ అనీ ‘భట్టిప్రోలు పంచాయతీ’ అనీ పిలిచేవారు. దీన్నిబట్టి బౌద్ధం ఈ ప్రాంతంలో ఎంతగా వేళ్లూనుకుందో అర్థం అవుతుంది. కంటకశైలే ఘంటసాల కృష్ణానదికి తూర్పున ఘంటసాల ఉంది. బుద్ధుని గుర్రం ‘కంటకం’. దాని పేరు మీద ఇక్కడ బౌద్ధారామం పేరు ‘కంటకశైల’గా వచ్చింది. ఈ కంటకశైల ఆరామం పేరే క్రమేపీ ‘ఘంటసాల’గా మారింది. కృష్ణానది ముఖద్వార సమీపంలో ఉన్న ఈ నగరం ఒకనాటి గొప్ప వ్యాపార కేంద్రం. గొప్ప నౌకా కేంద్రం. ఆనాటి నావికుల్లో ఎక్కువమంది ఘంటసాలలోనే ఉండేవారు. ఒక మహానావికుడి భార్య ఘంటసాల స్థూపాన్ని నిర్మించడంలో ఎక్కువ ఆర్థికసాయం అందించింది. గ్రీకు పరిశోధకుడు టాలమీ కూడా ఇది గొప్ప వ్యాపార కేంద్రం అని రాశాడు. ఇక్కడికి సమీపంలో ఉన్న మైసోలియా (మచిలీపట్నం)ని కూడా నౌకా కేంద్రంగానే అభివర్ణించాడు. ఇక్కడ స్థూపం, ఆరామాల శిథిలాలు అనేకం బయట పడ్డాయి. ఇవేగాక గుడివాడ, జగ్గయ్యపేట, మొగలిరాజపురం, సీతానగరం, గుమ్మడి దుర్ర, కంచికచర్ల.. ఇలాంటి బౌద్ధ క్షేత్రాలు కృష్ణా తీరం వెంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఇటీవల మరెన్నో క్షేత్రాలు బయట పడుతున్నాయి. ఈ తీరం అమరావతి శిల్పకళకి, మహాయాన సంప్రదాయానికీ, వజ్రయాన బౌద్ధ మార్గానికీ, విద్యా వికాసమంతా ఆంధ్రదేశంలో జరిగితే అందునా కృష్ణా తీరమే ప్రధాన కేంద్రం అయింది. అందుకే... కృష్ణా తీరం గట్లు బౌద్ధ ధమ్మానికి మెట్లు! కృష్ణవేణి జీవజలాలు బుద్ధ ప్రబోధ ఫలాలు!! - డా. బొర్రా గోవర్ధన్ బౌద్ధ తాత్విక దిగ్గజాలు తెలుగు బౌద్ధ తాత్విక దిగ్గజాలు ఏడుగురిలో నలుగురు కృష్ణాతీరం వారే. నాగార్జునుడు (క్రీ.శ. 100-200): రెండో బుద్ధుడుగా కీర్తిగాంచిన తాత్వికుడు నాగార్జునుడు. ఈయన జన్మస్థలం ‘వేదలి’ అని ‘లంకావారసూత్ర’ అనే గ్రంథంలో ఉంది. ఈ వేదలి గుంటూరు జిల్లాలోని బాపట్ల, పొన్నూరు మధ్యన ఉన్న ‘యాజలి’ అని ప్రముఖ పురావస్తు పరిశోధకులు, స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారి అభిప్రాయం. అయితే ఈ విషయం ఇంకా రుజువు కావాల్సి ఉంది. ఆర్యదేవుడు (క్రీ.శ. 170-270): ఆచార్య నాగార్జునుని శిష్యుడు. బౌద్ధ మాధ్యమిక వాదంలో మహా దార్శనికుడు. పొన్నూరు ప్రాంతం వాడని అంటారు. చతుశ్శతక, శతశాస్త్ర, చతుహస్తిక, అక్షర శతక అనే గ్రంథాలు రాశాడు. భావవివేకుడు (క్రీ.శ. 490-570): అమరావతికి నైరుతి దిశలోఉన్న ఒక గుహలో నివసించాడు (ఉండవల్లి). కొందరు భావవివేకుణ్ని నాగార్జునుని శిష్యుడే అంటారు. ఇతని జన్మస్థలం మలయగిరి అంటే ఈనాటి మంగళగిరి. బుద్ధఘోషుడు (క్రీ.శ. 5వ శతాబ్దం): బుద్ధఘోషుడి జన్మస్థలం ‘మొరంద ఖేతకం’ అంటే మయూరపట్టణం. అదే ఈనాడు గుంటూరు జిల్లాలో ఉన్న కోటనెమలిపురం. వీరుకాక మరో జగద్విఖ్యాత బౌద్ధ భిక్షువు బోధిధమ్ముడు. ఈయన అమరావతి నివాసి అంటారు. ఇక్కడి నుంచి కాంచీపురానికి వెళ్లాడు. అక్కడ వ్యాపారులతో (సార్ధవాహులతో) కలసి చైనా చేరి అక్కడ బౌద్ధంతోపాటు మార్షల్ ఆర్ట్స్ ప్రచారం చేశాడు. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయటపడిన బౌద్ధావశేషాలను జలాశయం మధ్యలో కొండపై నిర్మించిన మ్యూజియంలో భద్రపరిచారు. దీనికి బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేరు పెట్టారు. ఇది నాగార్జునకొండగా ప్రసిద్ధి పొందింది. కృష్ణా పరివాహక రాష్ట్రాలు నిర్మించుకున్న ప్రాజెక్ట్‌లలో ముఖ్యమైనవి... 1. కర్ణాటక: ఆల్మట్టి ప్రాజెక్ట్, నారాయణపూర్ ప్రాజెక్ట్ 2. తెలంగాణ: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 3. ఆంధ్రప్రదేశ్: శ్రీశైలం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్. -
పుష్కరాలు... గురుగ్రహ సంచారం
మనదేశంలోని పన్నెండు ప్రధాన నదులకు పుష్కరాలు జరుగుతాయి. ఒక్కో నదికి ఈ పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతాయి. అయితే, ప్రతి ఏడాదీ ఈ పన్నెండు నదులలో ఏదో ఒక నదికి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. గురుగ్రహ సంచారం ఆధారంగా ఈ పన్నెండు నదులకూ పుష్కరాలు ఏర్పడుతుంటాయి. మేషం నుంచి మీనం వరకు గల పన్నెండు రాశులలో గురువు ఒక్కో రాశిలో ఉన్నప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి. గురువు ఒక్కో రాశిలో ఏడాది పాటు ఉంటాడు. గురువు ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ నదికి పుష్కరాలు జరుగుతాయంటే... పుష్కరాల నేపథ్యం... పుష్కరుడి గాథ వరుణదేవుడి కొడుకైన పుష్కరుడి వల్ల నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు ఒకసారి బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. విష్ణువు పాదాల నుంచి ఉద్భవించిన పవిత్రజలాల్లో నిరంతరం జీవిస్తూ, నదులకు పరిశుద్ధత కల్పించేలా తనకు శాశ్వత పవిత్రతను అనుగ్రహించాలని వేడుకున్నాడు పుష్కరుడు. నిస్వార్థమైన పుష్కరుడి కోరికకు బ్రహ్మదేవుడు వెంటనే సరేనంటూ వరాన్ని అనుగ్రహించాడు. పుష్కరుడు వరాలు పొందే సమయానికి దేవగురువైన బృహస్పతి కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయసాగాడు. బృహస్పతి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరుకోమన్నాడు. ‘దేవా! నీ అనుగ్రహం వల్ల శాశ్వత పవిత్రతను పొందిన పుష్కరుడు నన్ను ఎల్లవేళలా వెన్నంటి ఉండేలా వరం ప్రసాదించు’ అని కోరుకున్నాడు దేవగురువు. ‘పుష్కరుడికి నేను వరమిచ్చిన మాట నిజమే! అయితే, అతడు స్వతంత్రుడు. అతడి అభిప్రాయం కోరదాం. అతడు సరేనంటే నాకేమీ అభ్యంతరం లేదు’ అన్నాడు బ్రహ్మదేవుడు. పుష్కరుడిని పిలిచి, దేవగురువు కోరికను తెలిపాడు. తాను స్వేచ్ఛాసంచారినని, ఎల్లవేళలా దేవగురువును వెన్నంటి ఉండటం తనకు సాధ్యం కాదని తేల్చేశాడు పుష్కరుడు. అతడి మాటలతో బృహస్పతి నిరాశ చెందాడు. దీనికి పరిష్కారంగా బ్రహ్మదేవుడు ఒక మధ్యేమార్గాన్ని సూచించాడు. దేవగురువు ఒక రాశిలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు, ఆ రాశిని విడిచిపెట్టే ముందు చివరి పన్నెండు రోజులూ అతడిని అనుసరిస్తూ ఉండాలని కోరాడు. బ్రహ్మదేవుడి సూచనకు సమ్మతించాడు పుష్కరుడు. ఒక్కో రాశికి ఒక్కో పవిత్రనది చొప్పున ఎంపిక చేసి, దేవగురువు ఆయా రాశుల్లో ప్రవేశించిన తొలి పన్నెండు రోజులు, తుది పన్నెండు రోజులు ఆయా నదుల్లో ఉండేందుకు అంగీకరించాడు. పుష్కరుడు ఉండే సమయాల్లో ఆయా నదులకు పవిత్రత ఏర్పడుతుండటంతో నాటి నుంచి వాటి పుష్కరాలు నిర్వహించడం మొదలైంది. ద్వాదశరాశుల్లో గురుగ్రహ సంచార ఫలితాలు నవగ్రహాలలో దేవగురువైన బృహస్పతి కూడా ఒకరు. జ్యోతిష పరిభాషలో బృహస్పతినే గురుగ్రహంగా సంబోధిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గురువు నైసర్గిక శుభుడు. అంటే, సహజంగానే శుభాలను ఇచ్చే గ్రహం. సంపదకు, అదృష్టానికి, అధ్యయన శక్తికి, విద్యకు, కుటుంబంలో శాంతి సామరస్యాలకు, వంశాభివృద్ధికి కారకుడు గురువు. జాతకరీత్యా, గోచార రీత్యా గురువు అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు తన కారకత్వాలకు సంబంధించి సకల శుభఫలితాలను అనుగ్రహిస్తాడు. అననుకూల స్థానాల్లో ఉన్నప్పుడు తన కారకత్వాలకు సంబంధించి శుభఫలితాలను అందించలేకపోతాడు. అలాంటి సమయాల్లోనే జాతకులకు ఆయా అంశాలకు సంబంధించిన ఈతిబాధలు ఎదురవుతాయి. ద్వాదశరాశుల్లో గురుగ్రహ ఫలితాలు ఇలా ఉంటాయి... జన్మరాశి: ఆరోగ్యం, కార్యసిద్ధి, ఆర్థికలాభం, శుభకార్యాలు, ఆధ్యాత్మిక చింతన ద్వితీయం: ఆర్థికలాభం, సంఘంలో పలుకుబడి, సంపద పెరుగుదల, సంతానం వల్ల సంతోషం తృతీయం: ఆరోగ్యం, విద్యలో పురోగతి, శ్రమ, వృథా వ్యయం చతుర్థం: సంతోషం, కుటుంబసౌఖ్యం, మనశ్శాంతి, ఆర్థికలాభం, వాహన సౌఖ్యం పంచమం: విద్యాభివృద్ధి, కళాభినివేశం, పాండిత్యం, ప్రేమ వ్యవహారాలు, సంతానలాభం షష్టం: ఆరోగ్యభంగం, అలజడి, శ్రమానంతర ఫలితం, ఆర్థిక ఇబ్బందులు సప్తమం: వివాహయోగం, దాంపత్య సౌఖ్యం, సంతానలాభం, సాంఘిక గౌరవం, ఆర్థికలాభం అష్టమం: మనశ్శాంతి లోపం, రహస్య శత్రుపీడ, ఆర్థిక పురోగతికి అవరోధం, నిరుత్సాహం నవమం: ఆరోగ్యలాభం, ఉత్సాహం, కార్యసిద్ధి, ఆర్థికలాభం, పేరు ప్రఖ్యాతులు దశమం: కార్యక్షేత్రంలో విజయం, ప్రభుత్వ ఆదరణ, కుటుంబ సౌఖ్యం, సాంఘిక గౌరవం ఏకాదశం: ఆర్థిక పురోగతి, వ్యాపార విజయం, పదవీలాభం, శ్రమాధిక్యత, సాంఘిక గౌరవం ద్వాదశం: ఆరోగ్యభంగం, ఆశాభంగం, మనస్తాపం, శ్రమాధిక్యత, విదేశ గమనం గురువు సంచరించే రాశి నది మేషం గంగ వృషభం నర్మద మిథునం సరస్వతి కర్కాటకం యమున సింహం గోదావరి కన్య కృష్ణ తుల కావేరి వృశ్చికం భీమ ధనుస్సు పుష్కరవాహిని మకరం తుంగభద్ర కుంభం సింధు మీనం {పణీత (ప్రాణహిత) గురుదోష పరిహారం గోచార ఫలితాల ఆధారంగానే కాకుండా, జాతకంలో గురు గ్రహం స్థితిగతుల ఆధారంగా, గురువు బలహీనంగా ఉన్నట్లయితే జ్యోతిషులను, పురోహితులను సంప్రదించి పరిహారాలను చేయించుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహ పరిహారాల్లో కొన్ని... శనగలు, పసుపు వస్త్రాలను పండితులకు దానం చేయాలి. గురుగ్రహ మంత్రాన్ని 16 వేలసార్లు జపం చేయాలి. జపాన్ని 11 దినాల్లో పూర్తి చేయాలి. స్వయంగా జపం చేసుకోలేని వారు ఇతోధిక దక్షిణ తాంబూలాలిచ్చి ఇందుకోసం పురోహితుని నియోగించుకోవచ్చు. గురుగ్రహ శాంతి యజ్ఞం నిర్వహించడం వల్ల కూడా సత్ఫలితాలు ఉంటాయి. కుడిచేతి చూపుడువేలికి కనకపుష్యరాగాన్ని ధరించాలి శ్రీ మేధాదక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం మంచిది. గణేశారాధన, రుద్రాభిషేకం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి. -
కృష్ణాతీర పుష్కరఘాట్లు
కృష్ణాజిల్లాలో... జిల్లాలో మొత్తం 74 స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 6 ఘాట్లు, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 68 ఘాట్లు ఉన్నాయి. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒక లక్ష పైబడిన సంఖ్యలో పుష్కర యాత్రికులు పవిత్రస్నానం ఆచరించే స్నానఘట్టాలను ఏ- ప్లస్ కేటగిరీలో ఉంచారు. భవాని, పున్నమి, దుర్గ్గ, కృష్ణవేణి, పద్మావతి, ఇబ్రహీంపట్నం మండలంలో పవిత్రసంగమం, ఫెర్రీ ఘాట్లు ఏ-ప్లస్ కేటగిరీలోకి వస్తాయి. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల, పవిత్రసంగమం ఫెర్రీ ఘాట్లు, ఏ కేటగిరీలోకి వస్తాయి. వీటిలో 50 వేల నుంచి లక్షమంది లోపు స్నానం ఆచరిస్తారు. జగ్గయ్యపేట మండలంలో గుడిమెట్ల ఘాట్ - 1, గుడిమెట్ల ఘాట్ - 2, మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లి ఘాట్, కోడూరు మండలం హంసలదీవి ఘాట్లను బి-కేటగిరీ ఘాట్లుగా నిర్ధారించారు. వీటిలో 10 వేల నుంచి 50 వేల మంది స్నానం ఆచరిస్తారు. మిగిలిన 39 ఘాట్లు సి- కేటగిరీ. వీటిలో 10వేల కంటే తక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. 21 ఘాట్లను, వెయ్యి మంది లోపు స్నానాలు ఆచరించేవిగా, స్థానిక ఘాట్లుగా గుర్తించారు. నగరంలో ఇలా... విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన 3 ఘాట్లు, దిగువన 2 ఘాట్లుగా విభజించారు. పద్మావతి ఘాట్: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ముందు నుంచి రైల్వే బ్రిడ్జి వరకు 11 కి.మీ. మేర విస్తరించి ఉంది. కృష్ణవేణి ఘాట్: రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 750 మీటర్ల మేర విస్తరించింది. ఈ రెండు ఘాట్లకు ప్రకాశం బ్యారేజ్ నుంచి, స్లూయిస్ నుంచి 10 మీటర్ల వెడల్పున తవ్విన ప్రత్యేక కాలువ ద్వారా బ్యారేజీ నుంచి నిరంతరం నాలుగు అడుగుల లోతున పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఇక్కడ జల్లు స్నానం (షవర్‌బాత్) ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకాశం బ్యారేజి ఎగువన... దుర్గాఘాట్: ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ అమ్మవారి గాలిగోపురం వరకు 160 మీటర్ల మేర విస్తరించి ఉన్న ఘాటును 325 మీటర్ల పొడవుకు విస్తరించారు. ఘాట్ వద్ద ప్రత్యేకంగా అభివృద్ధి పరచిన మోడల్ గెస్ట్‌హౌస్‌లో కమాండెంట్, కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. 16 వందల సీసీ కెమెరాల సహాయంతో అన్ని జిల్లాలలోని పుష్కర ఘాట్లలో ప్రతిక్షణం జరుగుతున్న దృశ్యాల్ని కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. పున్నమి ఘాట్: ‘విజయ డైరీ ఇన్‌టేక్‌వెల్’ నుంచి ‘పున్నమి రెస్టారెంట్’ గోడ వరకు 400 మీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ఘాటు. భవానీ ఘాట్: పున్నమి రెస్టారెంట్ గోడ నుంచి గొల్లపూడి వరకు భవానీఘాట్ వద్ద 1.1 కి.మీ. మేర నదికి అభిముఖంగా తీరప్రాంతాన్ని రూపుదిద్దుతున్నారు. రెండు కొత్త ఘాట్లు పవిత్రసంగమం ఘాట్: పోలవరం కుడి ప్రధాన కాల్వ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర కొత్తగా 250 మీటర్ల పొడవైన ఘాట్ నిర్మిస్తున్నారు. ఫెర్రీ ఘాట్: హారతి పెవిలియన్ దాటిన తర్వాత 750 మీటర్ల పొడవైన ఫెర్రీఘాట్ నిర్మాణం జరుగుతోంది. - నండూరి శారంగపాణి, విజయవాడ నల్లగొండ జిల్లాలో... జిల్లాలో ముఖ్యమైన పుష్కర ఘాట్లు ఇవి... 1. కాచరాజుపల్లి (చందంపేట మండలం) 2. పెదమునిగల్ (చందంపేట) 3. అజ్మాపూర్ (పీయేపల్లి మండలం) 4. శివాలయం (పెదవూర) 5. ఆంజనేయస్వామి (నాగార్జునసాగర్) 6. పొట్టిచెలమ (నాగార్జునసాగర్) 7. ఊట్లపల్లి (పెదవూర) 8. కిష్టాపురం (మేళ్లచెరువు) 9. వజినేపల్లి (మేళ్లచెరువు) 10. బుగ్గమాదారం (మేళ్లచెరువు) 11. మహంకాళిగూడెం (నేరేడుచర్ల) 12. ప్రహ్లాద (మఠంపల్లి) 13. మార్కండేయ (మఠంపల్లి) 14. బాలాజీఘాట్ (మఠంపల్లి) 15. శివాలయం, వాడపల్లి (దామరచర్ల) 16. లక్ష్మీనర్సింహ (వాడపల్లి) 17. లక్ష్మీపురం (వాడపల్లి) 18. మెట్లరేవు (వాడపల్లి) 19. ఓల్డ్ పీఎస్ (వాడపల్లి) 20. ముదిరాజ్ (వాడపల్లి) 21. ఓల్డ్ సిమెంట్ (వాడపల్లి) 22. అయ్యప్ప(వాడపల్లి) 23. ముదిమాణిక్యం (వాడపల్లి) 24. అడవిదేవులపల్లి (వాడపల్లి) 25. ఇర్కిగూడెం (వాడపల్లి) 26. దర్వేశిపురం (కనగల్) 27. కనగల్ వాగు (కనగల్) 28. ఛాయాసోమేశ్వర ఆలయం (నల్లగొండ) మహబూబ్‌నగర్ జిల్లాలో... 1. తంగెడి 2. కృష్ణ 3. గుడబెల్లూర్ 4. మూడుమళ్ల 5. పసుపుల 6. పంచదేవుపాడు 7. పారేవుల 8. ముసలపల్లి 9. అనుకొండ 10. గడ్డెంపల్లి 11. నెట్టెంపాడు 12. ఉప్పేరు 13. నందిమల్ల 14. మూలమల్ల 15. రేవులపల్లి 16. పెద్దచింతరేవుల 17. రేకులపల్లి 18. జూరాల 19. నదీ అగ్రహారం 20. ఆరేపల్లి 21. కత్తేపల్లి 22. తెలుగోనిపల్లి 23. జమ్మిచేడు 24. బీరెల్లి 25. రాంపురం 26. బీచుపల్లి 27. రంగాపురం 28. మునగమూన్ దిన్నె 29. బూడిదపాడు 30. తిప్పాయిపల్లి 31. గుమ్మడం 32. యాపర్ల 33. మారుమునగల 34. బెక్కెం 35. గూడెం 36. పెద్దమారూరు 37. క్యాతూర్ 38. వెల్టూరు 39. గొందిమళ్ల 40. కాలూరు 41. చర్లపాడు 42. అయ్యవారిపల్లి 43. కొప్పునూరు 44. జటప్రోలు 45. మంచాలకట్ట 46. మల్లేశ్వరం 47. సోమశిల (వీఐపీ) 48. సోమశిల (జనరల్) 49. అమరగిరి 50. బక్కలింగాయపల్లి 51. పాతాళగంగ బ్రహ్మాండ పురాణం, శివపురాణం, స్కాందపురాణం, మత్స్య, కూర్మ, బ్రహ్మ, వామన, వాయు, నారద, వరాహ పురాణాలలో కృష్ణానది ప్రస్తావన కనిపిస్తుంది. -
యుగయుగాల కృష్ణమ్మకు వందనం...
స్మరణాత్ సర్వదోషఘ్నీం, దర్శనాత్ స్వర్గదాయినీం స్నానేన ముక్తిదాం పుణ్యాం కృష్ణవేణీం నమామ్యహమ్ కృష్ణానదిని తలుచుకుంటే చాలు దోషాలన్నీ పోతాయి. చూస్తే చాలు స్వర్గం లభిస్తుంది. స్నానం చేస్తే ముక్తి చేకూరుతుంది. విష్ణుస్వరూపంగా కృష్ణ, శివస్వరూపంగా వేణి సహ్య పర్వతంపై అశ్వత్థ (రావి), అమలక (ఉసిరి) చెట్ల మొదటి నుంచి ప్రవహిస్తూ కలిసిపోయి కృష్ణవేణిగా ఒక్కటైనారు. హంసలదీవి సాగర సంగమం వరకు ఎన్నో తీర్థాలుగా, క్షేత్రాలుగా యుగయుగాలుగా ప్రవహిస్తున్న నదులరాణి కృష్ణవేణి. ఏ నదులూ కృష్ణమ్మకు సాటి రావు. మిగిలిన నదులన్నీ బ్రహ్మ సృష్టి. శ్రీమన్నారాయణుడు లోకరక్షణ కోసం తన జలావతారంగా కృష్ణానదిని సృష్టించాడు. ఆయనకు తోడుగా పరమేశ్వరుడు తన జలరూపాన్ని వేణీనదిగా చేశాడు. శివకేశ వ సృష్టి కృష్ణవేణి. అల గంగమ్మకు లేదు గౌతమికి లేదీ యోగ మా విష్ణువే వెలసెన్ నీవుగ కృష్ణవేణి! కలిలో వెంటాడు పాపమ్ములన్ తొలగం ద్రోయగ మోక్షమీయగ కళాదుర్గమ్మైవై జ్ఞానదో హలవై కూర్తువు భుక్తి ముక్తులను సస్యశ్యామలానందినీ! అని కవులు కృష్ణవేణీ వైభవాన్ని ఎన్నో విధాలుగా కీర్తించారు. స్కాందపురాణం, పద్మపురాణాలలో రామాయణ భారత భాగవతాలలో కృష్ణానదీ ప్రస్తావన ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు కృష్ణవేణిని భక్తి ప్రపత్తులతో స్తుతించారు. వారి వాక్కులో మహిమ, మంత్రబలం వల్ల ఆ స్తోత్రాలు చదివినవారికి ఎన్నో లాభాలు ఉంటాయి. కలియుగంలో మానవులు తమ పాపాలు పోగొట్టుకోవడానికి గంగ, యమున, నర్మద, గోదావరి వంటి నదుల్లో మునుగుతారు. వారందరి పాపాలతో ఈ నదులు కలుషితం అవుతాయి. వాటి కాలుష్యం పోవటానికి, మళ్లీ పవిత్రం కావటానికి శ్రీమహావిష్ణువు తన అంశతో కృష్ణానదిని సృష్టించాడు. నదులన్నీ వచ్చి కృష్ణలో మునగాలి. అప్పుడు అవి స్వచ్ఛం అవుతాయి. గంగానది కాకి రూపంలో వచ్చి కృష్ణా సాగరసంగమంలో మునిగి హంసగా మారింది. అక్కడ హంసలదీవి ఏర్పడింది. కృష్ణ హంసతీర్థం అయ్యింది. ‘కృష్ణా కృష్ణాంగ సంభూతా ప్రాణినాం పాపహారిణీ స్వర్గదా మోక్షదా నౄణాం భవబంధముక్తిదా’ అంటూ సూతమహర్షి కీర్తించాడు. ‘కార్యద్వయం సముద్దిశ్య కృష్ణవేణీ భవామ్యహం జగతా రక్షణార్థాయ మద్భక్తానాం చ ముక్తయే’ రెండు పనుల కోసం నేను కృష్ణవేణిగా అవతరించాను. ఒకటి లోకాలను పాపాల నుంచి రక్షించడం, రెండు నా భక్తులకు ముక్తినివ్వడం కోసం అని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కృష్ణవేణి ఘనతను చెప్పాడు. నేనే కృష్ణవేణిని కనుక కృష్ణనీళ్లు త్రాగినవారి హృదయంలోకి నేను ప్రవేశిస్తాను. వారి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తాను. అందరూ కృష్ణ నీరు త్రాగండి అని శ్రీమహావిష్ణువు చెప్పాడు. ‘కృష్ణాం ససర్జ సంపన్నో దివ్యమూర్తిం సులోచనాం శ్యామలాం విష్ణుచిహ్నాంకాం చతుర్భుజాం శుభప్రదామ్’ అని నారద మహర్షి కృష్ణవేణీ రూపాన్ని వర్ణించాడు. కల్పాద్యస్య కృతస్యాదా వియం దేవీ వసత్పురా వైష్ణవీ బ్రహ్మణః పుత్రీ పూజ్యమానా సురర్షిభిః తథా పుణ్యమయీ కృష్ణా సర్వత్ర సుధియో జనః విష్ణు స్వరూపిణి, బ్రహ్మ దత్తపుత్రిక, దేవతలు, ఋషులు పూజించే కృష్ణానది సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఆమె పుణ్యప్రదాయిని.. అని సాక్షాత్తు పరమేశ్వరుడు కృష్ణ ఎంత ప్రాచీనమైనదో చెప్పాడు. పేరు ఎలా వచ్చింది... కృష్ణానదికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా పరమేశ్వరుడు ప్రకటించాడు. నదీనమగ్రజననాత్ మాహాత్మ్యాత్చ మహత్వతః సర్వం కర్షతి చాఘౌఘం తేన కృష్ణా ప్రకీర్తితా అన్ని నదుల కంటే ముందు పుట్టి తన మహిమతో అందరి పాపాలను తనలోకి ఆకర్షించుకొనే శక్తి కలిగి ఉండడం వల్ల ఈ నదికి కృష్ణా అనే పేరు వచ్చిందని కుమారస్వామికి శివుడు వివరించాడు. తన రూపమైన వే ణీ నది కలవటం వల్ల కృష్ణవేణి అయిందని కూడా చెప్పాడు. కృస్ణానదికి సహ్యజ అనే పేరు కూడా ఉంది. దానికి కారణం భూలోకంలో కృష్ణ సహ్యగిరి ప్రార్థనకు అంగీకరించి సహ్యపర్వతంపై నుంచి ప్రవహించింది. అప్పుడు కృష్ణ సహ్యాద్రికి ఈ వరం ఇచ్చింది. ఏవమస్తు గిరిశ్రేష్ఠత్వత్తస్సంప్రభవామ్యహమ్ సుతా తవ భవిష్యామి సహ్యజేత్సపి విశ్రుతా సహ్యపర్వతరాజా! నేను నీ నుండి ప్రవహించి నీ కుమార్తెను అవుతాను. ఇక నుంచి నన్ను సహ్యజ అనే పేరుతో పిలుస్తారు. నీ పేరు శాశ్వతం అవుతుంది అన్నది. నారదమహర్షి మరొక దేవ రహస్యాన్ని కృష్ణానది గురించి ఇలా చెప్పాడు... సురభిర్దివిలోక విశ్రుతా భువి కృష్ణేవరప్రపూరణే సురభేరియమేవ బాధికా స్వజనేభ్యోఖిలమోక్షదా దేవలోకంలో కామధేనువు ఉంది. అడిగినవన్నీ ఇస్తుంది. మానవుల కోసం భూలోకంలో కోరికలు తీర్చే కృష్ణానది ఏర్పడింది. కామధేనువు కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది. కృష్ణ అంతకంటే ఎంతో గొప్పది. తన భక్తుల కోరికలు తీర్చటమే కాక మోక్షాన్ని కూడా ఇస్తుంది. వరద కృష్ణమ్మ అంత పరవళ్లు ఎందుకు తొక్కుతుందో మార్కండేయ మహర్షి వర్ణించాడు. కృష్ణానది అలలు స్వర్గానికి మెట్లులాగా ఉంటాయన్నాడు. యాభాతి వితతా భూమౌ నృణాముత్తరాయవై నృణాంరోషేణ పాపాని భాతి హంకుర్వతవయా వరదలు వచ్చినప్పుడు కృష్ణవేణి నరుల పాపాలను చూసి హుంకరిస్తున్నట్టు, బుస కొడుతున్నట్లు ఉంటుంది. కృష్ణవేణి ముగ్గురమ్మల రూపం. ‘ఆవర్తనాభిః పద్మాక్షీ శుభ్రాంగీ ఫేనహారిణీ’ స్వచ్ఛమైన నీటిలో, తెల్లని నురుగు హారాలతో కృష్ణ సరస్వతిలా ఉంటుంది. ‘చకాస్తియా స్వయం లక్ష్మీః జగద్దుర్గతి నాశినీ’ పద్మహస్త అయిన లక్ష్మిలా ఉంటుంది. ‘సౌభాగ్యదాయినీ గౌరీ యా భాతి జగదంబికా’ సౌభాగ్యాన్ని ఇచ్చే జగదాంబ గౌరిలా ఉంటుంది కృష్ణ. పురాణాల్లో ఇన్ని విధాలుగా వర్ణింపబడిన యుగయుగాల కృష్ణమ్మకు కోటి దండాలు. పుణ్యదాయినికి పుష్కర ప్రణామాలు. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మహాబలేశ్వర్కు దిగువన ఉన్న పట్టణం ‘వాయి’లో ఏడు కృష్ణా ఘాట్లు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో డ్యోలా గణపతి ఆలయం ఉంది. కృష్ణానదికి వరద వస్తే ... ఆ నీరు ఆలయాన్ని తాకకుండా ఉండడానికి డ్యోలా గణపతి ఆలయ వెనుక భాగాన్ని చేప ఆకారంలో నిర్మించారు. -
పరమపావని ఆ మాత...
ఈ పుణ్యభూమిలో కృష్ణమ్మను భక్తితో స్మరించేవారు సంసారమాయను దాటగలరని స్కాంద పురాణం చెబుతోంది.. తనను భక్తితో సేవించే వారి కష్టాలు పారద్రోలడానికి ఈ నది నిత్యం ప్రవహిస్తూ జీవనది అయింది. భక్తితో కృష్ణాజలాలను సేవించేవారి హృదయాలలో విష్ణుమూర్తి నివసించి, సంసార భయం పోగొట్టి, జ్ఞానం ప్రసాదిస్తాడు. శాంతిని కోరేవారికి కృష్ణామహాత్మ్యం మంచి ఔషధంగా పనిచేస్తుంది. కృష్ణునిచే సృష్టించబడిన ఈ తల్లి, సర్వపాపాలను తొలగించేది కనుక కృష్ణ అనే పేరు సార్థకమైంది. విష్ణుమూర్తి అనుజ్ఞ ప్రకారం కృష్ణమ్మను బ్రహ్మదేవుడు తన కుమార్త్తెగా చేసుకున్నాడు. సకల పాపాలను తొలగించే కృష్ణమ్మ పవిత్రగాథను కుమారస్వామికి శివుడు వివరించగా, ఆ గాథను నారదుడు వివరిస్తున్నాడు.. బ్రహ్మాది దేవతలతో పూజలు అందుకుంటున్న శివుని దర్శించాలని ఒకనాడు కుమారస్వామి కైలాసానికి వచ్చి, తండ్రితో, ‘దేవా! నమస్కారం. అష్టమూర్తివై వెలుగుతున్న నీ విభూతిరేఖలే కదా ఈ పుణ్యనదులన్నీ. కృష్ణవేణీ మహాత్మ్యం వినాలని ఉంది’ అన్నాడు. బ్రహ్మలోకం నుండి కృష్ణవేణి భూమికి వచ్చుట... కృతయుగంలో కృష్ణవేణి దేవతల చేత, మహర్షుల చేత సేవించబడుతూ, పుణ్యమూర్తిగా విరాజిల్లుతోంది. ప్రజలంతా ఉత్తమ, అధమ తేడా లేకుండా కాలం గడుపుతున్నారు. కాలానుగుణంగా వారిలో వారికి కలహాలు బయలుదేరాయి, ఆనందం తరిగిపోయింది. పాపం వృద్ధి చెంది, ప్రజానాశనం జరగటం చూసి, రక్షణోపాయం ఆలోచించి, కృష్ణునితో ‘పాపవిముక్తి కోసం కృష్ణవేణినదిని సృష్టించారు. ఇప్పుడు అది బ్రహ్మలోకంలో ఉంది. నీవు వెంటనే అక్కడకు వెళ్లి, కృష్ణానదిని భూలోకానికి తీసుకుని వచ్చి, భూమి మీద పాపాలను ప్రక్షాళన చేసే తీర్థాలను సృష్టించు, లే కపోతే లోకస్థితి తారుమారవుతుంది’ అన్నారు. వారి కోరిక మేరకు కృష్ణుడు కృష్ణానదిని కానుకగా పొంది, భూమి మీదకు తీసుకువస్తున్న సమయంలో, కృష్ణవేణి ఏ ప్రదేశంలో నిలుస్తుందా అని బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు వెంట వస్తున్న సమయంలో, ఒక చోట ఒక మహాతపస్విని చూచి, ‘నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు తపస్సు చేస్తున్నావు? కృష్ణవేణీ మాత వస్తున్న సందర్భంగా వరం కోరుకో, ఆ తల్లి ప్రసాదిస్తుంది’ అన్నారు. ఆ మహర్షి, ‘నేను సహ్యాద్రిని. ఈ నది ఇక్కడ ప్రవహించాలి. ఈ పవిత్ర నదీజలంతో స్నానం చేసి పవిత్రుడనవుతాను. ఆ తల్లి అనుగ్రహంతో లోకంలో ప్రసిద్ధి చెందుతాను’ అన్నాడు. ‘ఓ మహాత్మా! నువ్వు కోరినట్లే నీ నుండి ఉద్భవించి ‘సహ్యజ’ పేరుతో ప్రసిద్ధి చెందుతాను. నాకు చెల్లెళ్లయిన ఇతర నదులు కూడా నీ నుండే జన్మించే వరం కూడా ఇస్తున్నాను’ అని కృష్ణవేణి అనుగ్రహించింది. సహ్యాద్రి సంతోషించి కృష్ణమ్మను తనతో తీసుకువెళ్లాడు. కృష్ణమ్మ తల్లి ప్రభావంతో స్వర్గం విశాలమైపోయింది. నరకం కుంచించుకుపోయిందని ఋషులు, దేవతలు ప్రశంసించారు. ఆ సమయంలో విష్ణుమూర్తి, ‘నేను శ్వేత అశ్వత్థ రూపంలో ఉంటాను. కృష్ణవేణి కూడా ఆ చెట్టు మొదటి నుంచే బయలుదేరి ప్రకాశిస్తుంది’ అని చెప్పి ఆయన అశ్వత్థ రూపం ధరించాడు. కృష్ణమ్మ ఆ చెట్టు మొదట్లో జలధారగా రూపొందింది. ఆ తల్లి లోకంలోని పాపాలను కడుగుతూ పూర్వదిశగా ఉన్న సముద్రంలో చేరింది. అది మొదలు కృష్ణాతీరంలో అడుగడుగునా తీర్థాలు వెలశాయి.. వేదాలలో ఋగ్వేదంలాగ తీర్థాలలో కృష్ణవేణి ఉత్తమం...’ అని శివుడు చెప్పగా స్కందుడు స్వర్గానికి వెళ్లాడు. - డా.పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ శ్రీ దత్తాత్రేయస్వామి కలియుగ అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలోని గురుద్వీపంలో తన అవతారాన్ని చాలించారు. కృష్ణానది మధ్యన ఉన్న ఈ చిన్న దీవి పేరు నిజానికి కురవపురం. దీనినే కురుగడ్డ, కురంగడ్డ అని కూడా అంటారు. -
పుష్కర తృష్ణ
ఆశలు తీర్చుకోవాలనే ఆకలి ఉన్నట్లే ఆశయాలు తీర్చుకోవాలనే దాహం ఉండాలి. దాన్నే తృష్ణ అంటారు. నదులతో మానవాళి అనుబంధం ఈనాటిది కాదు. అది అనాదిగా కొనసాగుతూనే ఉంది. దేశదేశాల్లోని నాగరికతలు నదీతీరాల్లోనే వెలశాయి. జీవధారలైన నదులు మానవాళికి ప్రాణాధారాలుగా నిలుస్తున్నాయి. అన్ని దేశాల్లోనూ నదులను గౌరవిస్తారు. మన దేశంలో నదులను నదీమాతలుగా పూజిస్తారు కూడా. నదీమాతలకు అందరూ బిడ్డలే! నదులు నేలను సస్యశ్యామలం చేస్తాయి. నవధాన్యాల సిరులు పండిస్తాయి. సకల చరాచర జీవరాశుల మనుగడకు భరోసా ఇస్తాయి. నదులు దాహార్తిని తీరుస్తాయి. ఉధృత ప్రవాహంతో సమస్త కశ్మలాలనూ ప్రక్షాళన చేస్తాయి. కశ్మలాలంటే బాహ్య కశ్మలాలనేనా? అంతఃకశ్మలాలను కూడా జీవనదులు ప్రక్షాళన చేస్తాయని, అన్ని పాపాలనూ కడిగేసి లోకులను పునీతం చేస్తాయని భారతీయులు నమ్ముతారు. అందుకే నదీతీరాల్లో అన్ని తీర్థాలు వెలశాయి. అన్ని క్షేత్రాలు వెలశాయి. అవన్నీ మన వేద శాస్త్రాల్లో, పురాణేతిహాసాల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి. మానవులకు జనన మరణాలు ఆద్యంతాలుగా ఉన్నట్లే నదులకు కూడా ఒక ఆవిర్భావం, ఒక ముగింపు ఉంటాయి. ఎక్కడో సన్నని ధారగా మొదలైన నదులు ఎక్కడెక్కడి జలధారలనో తమలో కలుపుకొని, తమను తాము విస్తరించుకుని నేలను చీల్చుకొని ప్రవహిస్తాయి. ప్రవాహ మార్గంలో ఎన్నెన్నో ఎగుడుదిగుళ్లను చవి చూస్తాయి. మార్గమధ్యంలో నానా కాలుష్యాలను ఎంతో సహనంతో భరిస్తాయి. చినుకు రాలనప్పుడు చిక్కిపోతాయి. వర్షాలు కురిసినప్పుడు బలం పుంజుకుని, ఉధృతంగా ఉరకలేస్తాయి. వానలు మోతాదు మించినప్పుడు వరదలుగా పోటెత్తుతాయి. తుదకు ఎక్కడో సముద్రంలో కలిసిపోతాయి. ఏ చోట పుట్టినా, సముద్రంలో ఎక్కడ కలిసినా అవి ప్రవహించినంత మేరా మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశికీ మేలు చేస్తాయి. నదులను మూలం నుంచి ముగింపు వరకు పరికిస్తే, అచ్చం మానవ జీవితానికి నకలులాగానే అనిపిస్తాయి. నదుల రుణం తీర్చుకోలేనిది. తీర్చుకోలేని రుణమైనా శాయశక్తులా తీర్చుకోవాల్సిందేనని మన సంప్రదాయం నిర్దేశిస్తోంది. నదులకు రుణం తీర్చుకునే సందర్భాలుగానే మన పెద్దలు పన్నెండు జీవనదులకు పుష్కరాలను ఏర్పాటు చేశారు. ఇవే పుణ్యనదులుగా మన్ననలు అందుకుంటున్నాయి. త్వరలోనే పుష్కరాలు జరుపుకోబోతున్న కృష్ణానది కూడా ఒక పుణ్యనది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో సన్నని ధారగా మొదలైన ఈ జీవనది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సాగరసంగమం చేస్తోంది. పుష్కరాల సందర్భంగా పితృకార్యాలు చేయడం ఆనవాయితీ. పుష్కరాల్లో కేవలం పితృదేవతలకు మాత్రమే కాదు, మిత్రులు, గురువులు, యజమానులు, ప్రభువులు, రుషులకు కూడా పిండప్రదానం చేస్తారు. పుష్కరకాలంలో దాన ధర్మాలు చేస్తారు. పుష్కలంగా నీళ్లిచ్చే నదికి పుష్కరానికొకసారి నదీపూజ చేస్తారు. ఇదంతా రుణం తీర్చుకోవడం కాదు గానీ, మేలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొనే విధాయకం. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సందర్భం. జీవరాశికి మేలు చేయాలనేదే నదుల తృష్ణ. పుష్కరానికి ఒకసారైనా నదులలో మునిగి బాహ్యాంతరాలను పునీతం చేసుకోవాలనేదే మానవుల తృష్ణ. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణాపుష్కరాలు పుష్కర సమయంలో దేవతలకు గురువు అయిన బృహస్పతితో పాటు పుష్కరుడు, మూడున్నర కోట్ల దేవతలందరూ ఆ నదిలో కొలువుంటారు.