ఆ లిపికి కృష్ణమ్మే సాక్షి
ఏ భాషకైనా లిపి అవసరం. లిపి ఉన్నప్పుడే ఆ భాష చరిత్రలో నిలబడుతుంది. కృష్ణాజిల్లాలో కృష్ణానది సముద్రంలో కలిసే చోటు హంసలదీవి మనందరికీ తెలిసిందే. హంసలదీవిలో పురాతనమైన వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. దేవాలయ స్తంభాలపై ఒక పురాతన లిపితో రాసిన శిలాశాసనాలు ఉన్నాయి.
ఇప్పటివరకు ఆ లిపిలోని భాష ఏమిటో, అది ఎవరికి చెందినదో మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. దేశ విదేశాల నుంచి చాలా మంది వచ్చి ఈ భాషపై అధ్యయనాలు చేశారు. ప్రపంచంలో వివిధ భాషలకు చెందిన పరిశోధకులు ఇక్కడకు వచ్చి చూసి, ఈ లిపి తమది కాదని తేల్చిచెప్పారు. లిపి రూపంలో ఉన్న ఈ భాషకు కృష్ణమ్మే సాక్షి. ఈ లిపికి సంబంధించిన ఆనవాళ్లు కృష్ణమ్మకు మాత్రమే తెలుసు!
ఎవరి లిపి?
ఇక్కడి శాసనాల్లోని లిపి పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన చోళులు లేదా మౌర్యులకు సంబంధించినది కావచ్చని కొందరి ఊహ. చోళులు, మౌర్యులు భారతదేశాన్ని పరిపాలించారు. వీరి కాలంలోనే ఒక జాతికి చెందిన భాషకు సంబంధించిన లిపి అయి ఉండవచ్చని, ఆ తర్వాతి కాలంలో ఇందులోని భాష అంతరించిపోయి ఉండవచ్చని కూడా కొందరు పరిశోధకుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ నిర్మాణం చోళుల కాలం నాటిదిగా పరిగణిస్తున్నారు.
- ఇందిరా ప్రియదర్శిని