hamsaladeevi
-
దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం
పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపలతో అపవిత్రమై, నల్లని రూపాన్ని సంతరించుకుంది. ఆ పాపలనుంచి విముక్తికై ఆమె మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపత్ముల పాపల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథ.పులిగడ్డ దగ్గర కృష్ణానది చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినౖ వెనం గురించి ఒక కథ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది. పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం నిర్మించాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. దాంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.స్వామి ఆవిర్భావం గురించి.... పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామి దర్శనమిచ్చారు.. అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి. ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.ఉత్సవాలు...ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.సరదాలు... కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గో΄ాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారు అని ,సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు.ఎలా వెళ్లాలి?విజయవాడకు 110 కి.మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది హంసలదీవి. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే మచిలీ పట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డనుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయి.దారి బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్తే కృష్ణానదీ, సాగర సంగమాల దాకా కూడా వెళ్ళిరావచ్చు. అయితే మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు. వెలుతురు ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. – స్వాతీ భాస్కర్(చదవండి: జీవితాల్ని మార్చే జీవన'గీత'!) -
హంసలదీవి తీరానికి పోటెత్తిన భక్తులు
కోడూరు (అవనిగడ్డ): మాఘపౌర్ణమిని పురస్కరించుకొని సింధుస్నానాలు ఆచరించేందుకు భక్తులు హంసలదీవి సాగరతీరానికి పోటెత్తారు. వేలాది వాహనాల రాకతో కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామ రహదారులన్ని కిక్కిరిశాయి. దీంతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సముద్ర రహదారి వెడల్పు చిన్నది కావడంతో వన్‌వే ట్రాఫిక్‌ను పోలీసులు అమలు చేశారు. దీంతో పాలకాయతిప్ప గ్రామం నుంచి హంసలదీవి వరకు, దింటిమెరక రహదారిలో సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి బారులు తీరాయి. బీచ్ వద్ద కూడా అధికారులు వాహనాలను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. -
ఎగువన గరళం.. దిగువన స్వచ్ఛం
సాక్షి, అమరావతి: కృష్ణా నది పురుడుపోసుకునే మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల వరకు కృష్ణా నది జలాలు తాగడానికి పనికిరానంతగా కలుషితమవుతున్నాయి. మహారాష్ట్రతోపాటు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర తదితర ఉప నదులను కలుపుకొని ప్రవహించే కర్ణాటకలో కృష్ణా జలాలు విషతుల్యమే. తెలంగాణలో కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికిరావు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే స్వచ్ఛంగా, నేరుగా తాగే విధంగా ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వాస్తవాలివి. సీపీసీబీ.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (జాతీయ ప్రమాణాలు) ప్రకారం ఒక్క రాష్ట్ర పరిధిలో మాత్రమే కృష్ణా జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నదీ జలాలు కలుషితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని స్పష్టం చేస్తున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్ర పరిధిలో కృష్ణా బేసిన్లో మురుగు నీటిని శుద్ధి చేయడం, పారిశ్రామిక, గనుల వ్యర్థాలు నదిలో కలపకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా జలాలు స్వచ్ఛంగా మారాయని సీపీసీబీ వర్గాలు వెల్లడించాయి. కదిలే కాసారంగా కృష్ణా నది ► మహారాష్ట్రలో సతారా జిల్లాలోని పశ్చిమకనుమల్లో మహాబళేశ్వర్కు సమీపంలోని జోర్ గ్రామం వద్ద మొదలయ్యే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1400 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నై)లలో సుమారు 16 కోట్ల మందికి తాగు నీరందించడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సాగు, పారిశ్రామిక అవసరాలను కూడా కృష్ణా నదే తీరుస్తోంది. ► కృష్ణమ్మ ప్రారంభమయ్యే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, గనుల వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేస్తున్నారు. మహారాష్ట్రలో షిండి నుంచి కురంద్వాడ్ వరకు కృష్ణా నది జలాల్లో ఒక లీటర్ నీటికి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) 14 మిల్లీగ్రాములు ఉంది. ఈ జలాలు తాగడానికి కాదు కదా కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావు. ఆ జలాల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి. ► కర్ణాటక పరిధిలో యదుర్వాడి నుంచి తింతిని వరకు కృష్ణా నది కలుషితమయ్యాయి. అక్కడి జలాల్లో ఒక లీటర్‌కు బీవోడీ 13 మిల్లీ గ్రాములు ఉంది. ఈ నీరు స్నానం చేయడానికి కూడా పనికి రాదు. ► తెలంగాణలో తంగడిగి నుంచి వాడపల్లి వరకు ఒక లీటర్ కృష్ణా జలాల్లో బీవోడీ 11 మిల్లీ గ్రాముల వరకు ఉంది. ఈ నీరు కూడా తాగడానికి పనికి రావు. ► రాష్ట్రంలో 2018 వరకు అమరావతి నుంచి హంసలదీవి వరకు కృష్ణా జలాల్లో ఒక లీటర్ నీటికి 8 మిల్లీ గ్రాముల వరకు బీవోడీ ఉండేది. కాలుష్య కాసారంగా మారిన కృష్ణా నదిని పరిరక్షించాలని 2018 సెప్టెంబరు 28న జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ చర్యలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిధిలో కృష్ణా నదిని పరిరక్షించడానికి చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుంచి హంసలదీవి వరకు కృష్ణా నది పరిసర విజయవాడ వంటి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మించారు. ఎస్టీపీల్లో మురుగు నీటిని శుద్ధి చేసి, పంటల సాగుకు వినియోగించేలా చర్యలు చేపట్టారు. పారిశ్రామిక, గనుల వ్యర్థాలను శుద్ధి చేయడంతోపాటు నదిలో కలపకుండా చర్యలు చేపట్టారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి, ఆ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం ద్వారా కృష్ణా నది కాలుష్యం బారిన పడకుండా చేశారు. దాంతో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజ్, హంసలదీవి వరకూ కృష్ణా జలాలు స్వచ్ఛంగా మారాయి. ► ఇప్పుడు కృష్ణా నదిలో సంగమేశ్వరం వద్ద లీటర్ నీటిలో పీహెచ్ 6 శాతం, డైల్యూట్ ఆక్సిజన్ (డీవో) 5 మిల్లీ గ్రాములు, బీవోడీ 1.8 మిల్లీ గ్రాములు ఉంది. ► అమరావతి నుంచి హంసలదీవి వరకు నదిలో లీటర్ నీటిలో పీహెచ్ 6.1 శాతం, డీవో 6 మిల్లీ గ్రాములు, బీవోడీ 2.6 మిల్లీగ్రాములు ఉంది. ► సీపీసీబీ, జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్ర పరిధిలో కృష్ణా జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ నీటిని మనుషులు నేరుగా తాగొచ్చు. చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు
సాక్షి, కోడూరు: చెన్నైకి చెందిన రెండు వేట బోట్లు సాంకేతిక సమస్య కారణంగా సముద్రం మధ్యలో నిలిచిపోయి మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఘటన హంసలదీవి సాగరతీరంలో చోటుచేసుకుంది. పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన నలుగురు మత్స్యకారులు, కాకినాడకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వారం క్రితం రెండు బోట్లలో సముద్రంలో వేటకు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ (శనివారం) సాయంత్రం పాలకాయతిప్ప సముద్రతీరానికి వచ్చే సరికి రెండు బోట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో కంగారుపడిన మత్స్యకారులు ఆ రాత్రంతా బోట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం సముద్రం పాటు సమయంలో మత్స్యకారులు బోట్లలో ఉన్న కొన్ని పరికరాల సహాయంతో ఒడ్డుకు చేరారు. ఈ విషయాన్ని మత్స్యకారులు ఎవరికి చెప్పకుండా బోట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. సోమవారం ఉదయం స్థానిక మత్స్యకారులు సముద్రంలో బోట్లు నిలిచి ఉండడాన్ని గమనించి విషయాన్ని పాలకాయతిప్ప మెరైన్ పోలీసులకు అందించారు. ప్రత్యేక పడవలో వెళ్లిన పోలీసులు మెరైన్ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక పడవలో నిలిచిన బోట్లకు వెళ్లారు. బోట్లలో ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. నలుగురు మాత్రమే బోట్లలో ఉండగా మిలిగిన వారు సామగ్రి కోసం విజయవాడ వెళ్లినట్లు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. వారి వద్ద మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నట్లు మెరైన్ సీఐ పవన్‌కిషోర్ చెప్పారు. సముద్రంలో చోరబాటుదారులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీకి వెళ్లిన వారిలో ఎస్ఐ జిలానీ, రైటర్ రెహమాన్ జానీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. -
కృష్ణా సాగరసంగమంలో బోయపాటి భారీ సెట్లు
ప్రముఖ సినీ తారాగణంతో చిత్రీకరణకు ఏర్పాట్లు సెట్‌ను సిద్ధంచేస్తున్న ఆర్ట్స్ ప్రొడక్షన్ డిపార్టుమెంట్ 21 నుంచి పది రోజుల పాటు ఫైట్లు, పాటల చిత్రీకరణ కోడూరు (అవనిగడ్డ) : మాములు సమయాల్లో మానవమాత్రుడి ఉనికి కూడా అంతంతమాత్రంగా ఉండే సాగరతీరం నేడు సిని షూటింగ్ సందడితో కళకళలాడుతోంది. ప్రముఖ సినీతారాగణంతో పలు ఫైట్లు, పాటలు చిత్రీకరించేందుకు తీరంలో భారీ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హంసలదీవి సమీపంలోని పవిత్ర కృష్ణాసాగరసంగమ ప్రాంతాన్ని పరిశీలించి, ఇక్కడ సినిమాలు చిత్రీకరించేందుకు ఎంతో అనువైన ప్రాంతం ఉందని, త్వరలోనే తన చిత్రాన్ని ఇక్కడ తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బోయపాటి చెప్పిందే తడవుగా, ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిరియాల వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో ‘అల్లుడు శ్రీను’ సినిమా ఫేమ్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చిత్రీకరిస్తున్న సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీరం వెంట భారీ సెట్టింగ్.. సినిమాలో ముఖ్యమైన ఫైట్ సిన్ను ఫైట్మాస్టర్లు రామ్–లక్ష్మణ్ పర్యవేక్షణలో చిత్రీకరించేందుకు తీరం వెంట రూ.లక్షలతో పెట్టి భారీ సెట్టింగ్‌ను నిర్మిస్తున్నారు. తెలుగు వైభవం ఉట్టిపడేలా దేవాలయం నమూనాను ఏర్పాటు చేసి, అందులో హీరోహీరోయిన్లు హోమగుండాల వద్ద పూజలు చేసే సీన్‌ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో పాటు సినిమాలోని ఒక ముఖ్యమైన పాటను కూడా ఇక్కడే తీసేందుకు బోయపాటి ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవాలయం సెట్‌కు సంబంధించిన పనులను ఆర్ట్ డైరెక్టర్ సాయిసురేష్ పర్యవేక్షణలో హైదరాబాద్‌కు చెందిన కార్మికులు నిర్మిస్తున్నారు. 21 నుంచి షూటింగ్ ఈనెల 20వ తేదీన నాటికి సెట్‌ను పూర్తిచేసి, 21 నుంచి పది రోజుల పాటు షూటింగ్ నిర్వహించేందుకు చిత్రయూనిట్ అనుమతులు తీసుకుంది. హీరో బెల్లకొండ శ్రీనివాస్‌తో పాటు హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, నటులు జగపతిబాబు, శరత్‌బాబు, సితార కూడా ఈ షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు ప్రముఖ సినీ తారాగణం కూడా పలు సన్నివేశాల్లో పాల్గొంటారని, వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చినట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా రిషి, కో–డైరెక్టర్లుగా కుర్రా రంగారావు, మిరియాల రవీంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని సినిమా మేనేజర్ కిషోర్ ‘సాక్షి’కి తెలిపారు. దివిసీమ ప్రాంతంలో తొలిసారిగా భారీ ఎత్తున సిని షూటింగ్ చేపట్టారని తెలుసుకున్న ప్రజలు, సెట్‌ను తిలకించేందుకు సాగరసంగమానికి భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో సాగరతీరం అగ్ర సినీ తారాగణంతో కళకళలాడనుంది. -
కూర్మాల మృత్యుఘోష..!!
కోడూరు : సముద్రంలో సందడి చేసే భారీ తాబేళ్లు హంసలదీవి బీచ్ దగ్గర నుంచి నాగాయలంకలోని ఎదురుమొండి వరకు సాగరతీరం వెంట నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాతకు గురవుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల మరపడవలకు కింద భాగంలో ఉండే ఫ్యాన్ రెక్కలు తాబేళ్లకు తగిలి మృతిచెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆదివారం సాగరసంగమం ప్రాంతంలో సుమారు పది తాబేళ్ల కాళేబరాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. తాబేళ్లను పునరుత్పత్తి చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారులు, వాటి సంరక్షణ కోసం ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని పర్యటకులు ఆరోపించారు. మత్స్యకారులకు తగిన సూచనలిచ్చి తాబేళ్ల ఉనికిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
పర్యాటక కేంద్రంగా హంసలదీవి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి కోడూరు : పవిత్ర సాగర సంగమ ప్రాంతాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరొన్నారు. హంసలదీవి సంగమ క్షేత్రంలో సీఎం గురువారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పుష్కరాల్లో మాత్రమే దేవతలు–పుష్కరడు కలుస్తారని, కాని సాగర సంగమం వద్ద సంవత్సర కాలం పాటు పుష్కరుడు దేవతలతో కలిసి ఉండడం ఎంతో ప్రాశస్త్యం సంతరించుకుందని అన్నారు. హంసలదీవి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 1977 ఉప్పెనలో వేలాది మంది మరణించినా, వేణుగోపాలుడి ఆలయంలోకి మాత్రం నీరు వెళ్లలేదంటే ఈ క్షేత్రం ఎంత మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చని సీఎం అన్నారు. కృష్ణమ్మ పాదాలు ఎంతో శుభసూచికం.. దేశంలో మరెక్కడ లేని విధంగా కృష్ణమ్మ పాదాలు సాగరసంగమ క్షేత్రంలో ఉండడం ఎంతో శుభసూచికమని చంద్రబాబు అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం–భవానీపురం’ వారధి నిర్మాణంతో తీరప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జలాన్ని కాపాడుకుంటే జలం మనల్ని కాపాడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పుష్కరాలను ప్రభుత్వం పెద్ద పండుగలా నిర్వహిస్తుందని అన్నారు. సంగమం వద్ద పూజలు.. సాగర సంగమం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీమ తల్లికి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం కృష్ణవేణమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనగళ్ల నారాయణరావు, కలెక్టర్ బాబు ఏ, ఎస్పీ విజయకుమార్ ఉన్నారు. -
ఆ లిపికి కృష్ణమ్మే సాక్షి
ఏ భాషకైనా లిపి అవసరం. లిపి ఉన్నప్పుడే ఆ భాష చరిత్రలో నిలబడుతుంది. కృష్ణాజిల్లాలో కృష్ణానది సముద్రంలో కలిసే చోటు హంసలదీవి మనందరికీ తెలిసిందే. హంసలదీవిలో పురాతనమైన వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. దేవాలయ స్తంభాలపై ఒక పురాతన లిపితో రాసిన శిలాశాసనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ లిపిలోని భాష ఏమిటో, అది ఎవరికి చెందినదో మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. దేశ విదేశాల నుంచి చాలా మంది వచ్చి ఈ భాషపై అధ్యయనాలు చేశారు. ప్రపంచంలో వివిధ భాషలకు చెందిన పరిశోధకులు ఇక్కడకు వచ్చి చూసి, ఈ లిపి తమది కాదని తేల్చిచెప్పారు. లిపి రూపంలో ఉన్న ఈ భాషకు కృష్ణమ్మే సాక్షి. ఈ లిపికి సంబంధించిన ఆనవాళ్లు కృష్ణమ్మకు మాత్రమే తెలుసు! ఎవరి లిపి? ఇక్కడి శాసనాల్లోని లిపి పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన చోళులు లేదా మౌర్యులకు సంబంధించినది కావచ్చని కొందరి ఊహ. చోళులు, మౌర్యులు భారతదేశాన్ని పరిపాలించారు. వీరి కాలంలోనే ఒక జాతికి చెందిన భాషకు సంబంధించిన లిపి అయి ఉండవచ్చని, ఆ తర్వాతి కాలంలో ఇందులోని భాష అంతరించిపోయి ఉండవచ్చని కూడా కొందరు పరిశోధకుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ నిర్మాణం చోళుల కాలం నాటిదిగా పరిగణిస్తున్నారు. - ఇందిరా ప్రియదర్శిని