పర్యాటక కేంద్రంగా హంసలదీవి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
కోడూరు :
పవిత్ర సాగర సంగమ ప్రాంతాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరొన్నారు. హంసలదీవి సంగమ క్షేత్రంలో సీఎం గురువారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పుష్కరాల్లో మాత్రమే దేవతలు–పుష్కరడు కలుస్తారని, కాని సాగర సంగమం వద్ద సంవత్సర కాలం పాటు పుష్కరుడు దేవతలతో కలిసి ఉండడం ఎంతో ప్రాశస్త్యం సంతరించుకుందని అన్నారు. హంసలదీవి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 1977 ఉప్పెనలో వేలాది మంది మరణించినా, వేణుగోపాలుడి ఆలయంలోకి మాత్రం నీరు వెళ్లలేదంటే ఈ క్షేత్రం ఎంత మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చని సీఎం అన్నారు.
కృష్ణమ్మ పాదాలు ఎంతో శుభసూచికం..
దేశంలో మరెక్కడ లేని విధంగా కృష్ణమ్మ పాదాలు సాగరసంగమ క్షేత్రంలో ఉండడం ఎంతో శుభసూచికమని చంద్రబాబు అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం–భవానీపురం’ వారధి నిర్మాణంతో తీరప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జలాన్ని కాపాడుకుంటే జలం మనల్ని కాపాడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పుష్కరాలను ప్రభుత్వం పెద్ద పండుగలా నిర్వహిస్తుందని అన్నారు.
సంగమం వద్ద పూజలు..
సాగర సంగమం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీమ తల్లికి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం కృష్ణవేణమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనగళ్ల నారాయణరావు, కలెక్టర్ బాబు ఏ, ఎస్పీ విజయకుమార్ ఉన్నారు.