tourisim spot
-
అవార్డుల.. హరిత
కడెం: కడెం ప్రాజెక్ట్ తీరాన.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైనా విడిది గదులతో పర్యాటకుల మనసు దోచుతుంది కడెం హరిత రిసార్ట్స్. పర్యాటకులకు చక్కని అతిథ్యాన్ని అందిస్తూ.. అవార్డులను సొంతం చేసుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రిసార్ట్స్ మేనేజర్ నునవత్ తిరుపతి ఉత్తమ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకున్నారు. ఆహ్లాదకరంగా హరిత రిసార్ట్... కడెం ప్రాజెక్ట్ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్ తీరాన 2015లో పర్యాటకశాఖ 12 విడిది గదులు, రెస్టారెంట్, మీటింగ్‌హాల్‌తో హరిత ఏకో టూరిజం రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల కాలంలో పర్యాటకుల ఉత్తమ సేవలందిస్తూ మూడు సార్లు బెస్ట్ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకుంది. ప్రముఖులతో పాటు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విడిది చేస్తుంటారు. సెలవు దినాల్లో, వీకెండ్లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు సేదతీరేందుకు విడది గదులతో పాటుగా, పిల్లలకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. పర్యాటకులతో పాటుగా ప్రీ వెడ్డింగ్, బర్త్‌డే షూట్లతో పాటుగా, ఫిల్మ్ షూట్లకు హరిత రిసార్ట్ ఫేమస్. అయితే ఇందులో తొమ్మిది మంది విధులు నిర్వహిస్తుండగా ఏడాదికి సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం సమకూరుతుంది. గదుల బుకింగ్ పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీఎస్‌టీడీసీ.కామ్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. వీకెండ్లో (శుక్ర, శని, ఆదివారల్లో) 1848, మిగాత రోజు ల్లో 1680(జీఎస్టీతో కలిపి). మరిన్ని వివరాలకు 9133053007 నంబర్లో సంప్రదించవచ్చు. సిబ్బంది సహకారంతో రాష్ట్రంలోనే బెస్ట్ రిసార్ట్‌గా కడెం హరితకు అవార్డ్ దక్కడం వెనుక సిబ్బంది సహకారం ఎంతో ఉంది. మూడుసార్లు హరిత రిసార్ట్స్‌కు అవార్డ్ దక్కడం అనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శుభాకార్యలు, వింధులు జరుపుకునేందుకు అవకాశం ఉంది. పర్యాటకుల టూరిజం శాఖ తరఫున సౌకర్యాలు అందిస్తున్నాం. – నునవత్ తిరుపతి, హరిత రిసార్ట్స్ మేనేజర్, కడెం -
పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్
మంత్రి పల్లెరఘునాథరెడ్డి మచిలీపట్నం(కోనేరుసెంటర్) : మంగినపూడి బీచ్‌ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం రాష్ట్ర చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి బందరు మండలంలోని మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బందరుకు విశిష్టస్థానం ఉందన్నారు. బందరుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పోర్టును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. పోర్టు అభివృద్ధితో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, భూముల విలువ పెరిగిపోతుందని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మంగినపూడి బీచ్‌ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత మంత్రి రఘునాథరెడ్డి చిలకలపూడిలోని శ్రీపాండురంగ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్ ఎంపీపీ ఊసా వెంకట సుబ్బారావు, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా హంసలదీవి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి కోడూరు : పవిత్ర సాగర సంగమ ప్రాంతాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరొన్నారు. హంసలదీవి సంగమ క్షేత్రంలో సీఎం గురువారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పుష్కరాల్లో మాత్రమే దేవతలు–పుష్కరడు కలుస్తారని, కాని సాగర సంగమం వద్ద సంవత్సర కాలం పాటు పుష్కరుడు దేవతలతో కలిసి ఉండడం ఎంతో ప్రాశస్త్యం సంతరించుకుందని అన్నారు. హంసలదీవి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 1977 ఉప్పెనలో వేలాది మంది మరణించినా, వేణుగోపాలుడి ఆలయంలోకి మాత్రం నీరు వెళ్లలేదంటే ఈ క్షేత్రం ఎంత మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చని సీఎం అన్నారు. కృష్ణమ్మ పాదాలు ఎంతో శుభసూచికం.. దేశంలో మరెక్కడ లేని విధంగా కృష్ణమ్మ పాదాలు సాగరసంగమ క్షేత్రంలో ఉండడం ఎంతో శుభసూచికమని చంద్రబాబు అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం–భవానీపురం’ వారధి నిర్మాణంతో తీరప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జలాన్ని కాపాడుకుంటే జలం మనల్ని కాపాడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పుష్కరాలను ప్రభుత్వం పెద్ద పండుగలా నిర్వహిస్తుందని అన్నారు. సంగమం వద్ద పూజలు.. సాగర సంగమం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీమ తల్లికి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం కృష్ణవేణమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనగళ్ల నారాయణరావు, కలెక్టర్ బాబు ఏ, ఎస్పీ విజయకుమార్ ఉన్నారు. -
పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధి
ఆటపాక(కైకలూరు) : కొల్లేరు సరస్సు, పరివాహక ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని అటవీశాఖ హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ పీసీసీఎఫ్ మిశ్రా అన్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరో పీసీసీఎఫ్ (అడ్మినిస్ట్రేటీవ్) ఆర్జీ కలగాటితో కలసి బుధవారం సందర్శించారు. పక్షుల దొడ్డి విస్తీర్ణం, ఈఈసీ కేంద్రాన్ని పరిశీలించారు. మిశ్రా మాట్లాడుతూ టూరిజం పాయింటుగా కొల్లేరును అభివృద్ధి పరుస్తామన్నారు. మరో రెండు నెలల్లో సమావేశమై ప్రణాళికపై చర్చిస్తామని తెలిపారు. అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కొల్లేరులో నీటి లభ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఏకో టూరిజం సీసీఎఫ్ రమణారెడ్డి, రాజమండ్రి సీఎఫ్ ఎం.రవికుమార్, ఏసీఎఫ్ వినోద్‌కుమార్, డీఎఫ్‌వో నాగేశ్వరచౌదరి, రేంజర్ అరుణ్‌కుమార్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.