సాక్షి, అమరావతి: కృష్ణా నది పురుడుపోసుకునే మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల వరకు కృష్ణా నది జలాలు తాగడానికి పనికిరానంతగా కలుషితమవుతున్నాయి. మహారాష్ట్రతోపాటు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర తదితర ఉప నదులను కలుపుకొని ప్రవహించే కర్ణాటకలో కృష్ణా జలాలు విషతుల్యమే. తెలంగాణలో కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికిరావు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే స్వచ్ఛంగా, నేరుగా తాగే విధంగా ఉన్నాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వాస్తవాలివి. సీపీసీబీ.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (జాతీయ ప్రమాణాలు) ప్రకారం ఒక్క రాష్ట్ర పరిధిలో మాత్రమే కృష్ణా జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నదీ జలాలు కలుషితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని స్పష్టం చేస్తున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్ర పరిధిలో కృష్ణా బేసిన్‌లో మురుగు నీటిని శుద్ధి చేయడం, పారిశ్రామిక, గనుల వ్యర్థాలు నదిలో కలపకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా జలాలు స్వచ్ఛంగా మారాయని సీపీసీబీ వర్గాలు వెల్లడించాయి.
కదిలే కాసారంగా కృష్ణా నది
► మహారాష్ట్రలో సతారా జిల్లాలోని పశ్చిమకనుమల్లో మహాబళేశ్వర్‌కు సమీపంలోని జోర్ గ్రామం వద్ద మొదలయ్యే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1400 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నై)లలో సుమారు 16 కోట్ల మందికి తాగు నీరందించడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సాగు, పారిశ్రామిక అవసరాలను కూడా కృష్ణా నదే తీరుస్తోంది.
► కృష్ణమ్మ ప్రారంభమయ్యే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, గనుల వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేస్తున్నారు. మహారాష్ట్రలో షిండి నుంచి కురంద్వాడ్ వరకు కృష్ణా నది జలాల్లో ఒక లీటర్ నీటికి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) 14 మిల్లీగ్రాములు ఉంది. ఈ జలాలు తాగడానికి కాదు కదా కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావు. ఆ జలాల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి.
► కర్ణాటక పరిధిలో యదుర్వాడి నుంచి తింతిని వరకు కృష్ణా నది కలుషితమయ్యాయి. అక్కడి జలాల్లో ఒక లీటర్‌కు బీవోడీ 13 మిల్లీ గ్రాములు ఉంది. ఈ నీరు స్నానం చేయడానికి కూడా పనికి రాదు.
► తెలంగాణలో తంగడిగి నుంచి వాడపల్లి వరకు ఒక లీటర్ కృష్ణా జలాల్లో బీవోడీ 11 మిల్లీ గ్రాముల వరకు ఉంది. ఈ నీరు కూడా తాగడానికి పనికి రావు.
► రాష్ట్రంలో 2018 వరకు అమరావతి నుంచి హంసలదీవి వరకు కృష్ణా జలాల్లో ఒక లీటర్ నీటికి 8 మిల్లీ గ్రాముల వరకు బీవోడీ ఉండేది. కాలుష్య కాసారంగా మారిన కృష్ణా నదిని పరిరక్షించాలని 2018 సెప్టెంబరు 28న జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ చర్యలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిధిలో కృష్ణా నదిని పరిరక్షించడానికి చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుంచి హంసలదీవి వరకు కృష్ణా నది పరిసర విజయవాడ వంటి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)లను నిర్మించారు. ఎస్‌టీపీల్లో మురుగు నీటిని శుద్ధి చేసి, పంటల సాగుకు వినియోగించేలా చర్యలు చేపట్టారు.
పారిశ్రామిక, గనుల వ్యర్థాలను శుద్ధి చేయడంతోపాటు నదిలో కలపకుండా చర్యలు చేపట్టారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి, ఆ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం ద్వారా కృష్ణా నది కాలుష్యం బారిన పడకుండా చేశారు. దాంతో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజ్, హంసలదీవి వరకూ కృష్ణా జలాలు స్వచ్ఛంగా మారాయి.
► ఇప్పుడు కృష్ణా నదిలో సంగమేశ్వరం వద్ద లీటర్ నీటిలో పీహెచ్ 6 శాతం, డైల్యూట్ ఆక్సిజన్ (డీవో) 5 మిల్లీ గ్రాములు, బీవోడీ 1.8 మిల్లీ గ్రాములు ఉంది.
► అమరావతి నుంచి హంసలదీవి వరకు నదిలో లీటర్ నీటిలో పీహెచ్ 6.1 శాతం, డీవో 6 మిల్లీ గ్రాములు, బీవోడీ 2.6 మిల్లీగ్రాములు ఉంది.
► సీపీసీబీ, జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్ర పరిధిలో కృష్ణా జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ నీటిని మనుషులు నేరుగా తాగొచ్చు.
చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే!
Comments
Please login to add a commentAdd a comment