krishna river-water
-
ఎగువన గరళం.. దిగువన స్వచ్ఛం
సాక్షి, అమరావతి: కృష్ణా నది పురుడుపోసుకునే మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల వరకు కృష్ణా నది జలాలు తాగడానికి పనికిరానంతగా కలుషితమవుతున్నాయి. మహారాష్ట్రతోపాటు మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర తదితర ఉప నదులను కలుపుకొని ప్రవహించే కర్ణాటకలో కృష్ణా జలాలు విషతుల్యమే. తెలంగాణలో కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికిరావు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే స్వచ్ఛంగా, నేరుగా తాగే విధంగా ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వాస్తవాలివి. సీపీసీబీ.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (జాతీయ ప్రమాణాలు) ప్రకారం ఒక్క రాష్ట్ర పరిధిలో మాత్రమే కృష్ణా జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నదీ జలాలు కలుషితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని స్పష్టం చేస్తున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్ర పరిధిలో కృష్ణా బేసిన్లో మురుగు నీటిని శుద్ధి చేయడం, పారిశ్రామిక, గనుల వ్యర్థాలు నదిలో కలపకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా జలాలు స్వచ్ఛంగా మారాయని సీపీసీబీ వర్గాలు వెల్లడించాయి. కదిలే కాసారంగా కృష్ణా నది ► మహారాష్ట్రలో సతారా జిల్లాలోని పశ్చిమకనుమల్లో మహాబళేశ్వర్కు సమీపంలోని జోర్ గ్రామం వద్ద మొదలయ్యే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1400 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నై)లలో సుమారు 16 కోట్ల మందికి తాగు నీరందించడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సాగు, పారిశ్రామిక అవసరాలను కూడా కృష్ణా నదే తీరుస్తోంది. ► కృష్ణమ్మ ప్రారంభమయ్యే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, గనుల వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేస్తున్నారు. మహారాష్ట్రలో షిండి నుంచి కురంద్వాడ్ వరకు కృష్ణా నది జలాల్లో ఒక లీటర్ నీటికి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) 14 మిల్లీగ్రాములు ఉంది. ఈ జలాలు తాగడానికి కాదు కదా కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరావు. ఆ జలాల్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి. ► కర్ణాటక పరిధిలో యదుర్వాడి నుంచి తింతిని వరకు కృష్ణా నది కలుషితమయ్యాయి. అక్కడి జలాల్లో ఒక లీటర్‌కు బీవోడీ 13 మిల్లీ గ్రాములు ఉంది. ఈ నీరు స్నానం చేయడానికి కూడా పనికి రాదు. ► తెలంగాణలో తంగడిగి నుంచి వాడపల్లి వరకు ఒక లీటర్ కృష్ణా జలాల్లో బీవోడీ 11 మిల్లీ గ్రాముల వరకు ఉంది. ఈ నీరు కూడా తాగడానికి పనికి రావు. ► రాష్ట్రంలో 2018 వరకు అమరావతి నుంచి హంసలదీవి వరకు కృష్ణా జలాల్లో ఒక లీటర్ నీటికి 8 మిల్లీ గ్రాముల వరకు బీవోడీ ఉండేది. కాలుష్య కాసారంగా మారిన కృష్ణా నదిని పరిరక్షించాలని 2018 సెప్టెంబరు 28న జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ చర్యలు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిధిలో కృష్ణా నదిని పరిరక్షించడానికి చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం నుంచి హంసలదీవి వరకు కృష్ణా నది పరిసర విజయవాడ వంటి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మించారు. ఎస్టీపీల్లో మురుగు నీటిని శుద్ధి చేసి, పంటల సాగుకు వినియోగించేలా చర్యలు చేపట్టారు. పారిశ్రామిక, గనుల వ్యర్థాలను శుద్ధి చేయడంతోపాటు నదిలో కలపకుండా చర్యలు చేపట్టారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి, ఆ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం ద్వారా కృష్ణా నది కాలుష్యం బారిన పడకుండా చేశారు. దాంతో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజ్, హంసలదీవి వరకూ కృష్ణా జలాలు స్వచ్ఛంగా మారాయి. ► ఇప్పుడు కృష్ణా నదిలో సంగమేశ్వరం వద్ద లీటర్ నీటిలో పీహెచ్ 6 శాతం, డైల్యూట్ ఆక్సిజన్ (డీవో) 5 మిల్లీ గ్రాములు, బీవోడీ 1.8 మిల్లీ గ్రాములు ఉంది. ► అమరావతి నుంచి హంసలదీవి వరకు నదిలో లీటర్ నీటిలో పీహెచ్ 6.1 శాతం, డీవో 6 మిల్లీ గ్రాములు, బీవోడీ 2.6 మిల్లీగ్రాములు ఉంది. ► సీపీసీబీ, జాతీయ ప్రమాణాల ప్రకారం రాష్ట్ర పరిధిలో కృష్ణా జలాలు స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ నీటిని మనుషులు నేరుగా తాగొచ్చు. చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
‘కృష్ణా’పై తేల్చండి
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నీటి విడుదలపై వివాదం ముదురుతోంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకుంటే శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని రాష్ర్ట ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. సాగర్ డ్యాం వద్ద శుక్రవారం ఇరు రాష్ట్రాలకు చెందిన వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నీటి విడుదలకు పరిష్కారంలో జాప్యం వల్ల రెండు రాష్ట్రాల మ ధ్య శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందం టూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ సర్కారు తాజాగా లేఖ రాసింది. ఇరు రాష్ట్రాలతో తక్షణమే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుత రబీ సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే విషయంలో స్పష్టత కోరుతూ బోర్డుకు మరో లేఖ కూడా రాసింది. ఇప్పటికే నిర్దిష్ట వాటాను మించి సాగర్ నీటిని వాడుకున్న ఏపీ అసాధారణరీతిలో మరింత వాటాను కోరుతోందని, కుడి కాల్వ ద్వారా నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని ఫిర్యాదు చేసింది. ఏపీ వైఖరితో సాగర్ ప్రాజెక్టు పరిధిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా తక్షణమే సమావేశం నిర్వహించి తగిన పరిష్కారం చూపాలని కోరింది. సాగర్‌లో నీటి నిల్వలు పడిపోతుం డటం, ఎడమ కాల్వ కింద రబీ పంటల సాగు ఆరంభం కావడం, నీటి విడుదలకు రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న దృష్ట్యా రబీ నీటి కేటాయింపులపై వెంటనే తేల్చాలని ప్రభుత్వం పేర్కొంది. ఇదీ నీటి వినియోగం తీరు.. కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో సాగర్ పరిధిలోని ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం వివరించిం ది. దీని ప్రకారం.. కృష్ణా నదిలో ఈ ఏడాది 616.37 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. అం దులో 549.65 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకునే అవకాశముంది. ఈ నీటిని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 42:58 నిష్పత్తి ప్రకారం వాడుకోవాల్సి ఉంది. ఈ వాటా మేరకు తెలంగాణకు 228.71 టీఎంసీలు, ఏపీకి 320.94 టీఎంసీలు దక్కుతాయి. అయితే ఏపీ తన వాటాకు మించి 30.60 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నదని, ఇప్పుడు మరింత నీటి విడుదలను కోరుతోందని రాష్ర్ట ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 85 టీఎంసీల నీటిలో ఏపీ వాటా ఒక్క చుక్క కూడా లేదని, మొత్తం నీటిని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని బోర్డును కోరింది. ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కరించేందుకు వెంటనే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించింది. ఈ లేఖ ప్రతిని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు కూడా అధికారులు పంపించారు. కాగా, కృష్ణా నీటి కేటాయింపుల విషయమై ఎలాంటి స్పష్టత రాకపోవడం, బోర్డు ఎటూ తేల్చకపోవడంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో నీటి పారుదల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై న్యాయ సలహా కోరారు. ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకునే అవకాశాలపై ఆయనతో సమాలోచనలు జరిపారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పోలీస్ పహారాలో సాగర్ డ్యాం మరోవైపు సాగర్ డ్యాం పోలీసుల మయమైం ది. హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదలపై రెండు రోజులుగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాన డ్యాంకు ఇరువైపులా రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి. ప్రధాన ప్రాజెక్టు గేట్లతోపాటు కుడికాలువ హెడ్‌రెగ్యులేటర్, విద్యుత్కేంద్రాన్ని పరిశీలించేందుకు శుక్రవారం ఏపీ అధికారులు రావడం తో నల్లగొండ టీఆర్ఎస్ నేతలూ అక్కడకు చేరారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏం జరుగుతోందో ఆరా తీస్తూ గుంటూరు నేతలు కూడా మరోవైపు బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి ఎవరినీ డ్యాంపైకి అనుమతించలేదు. ఇరువైపుల నేతలకు నచ్చజెప్పి పంపించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు సాగర్‌డ్యాంను సందర్శించారు. గొడవకు గల కారణాలను ఆరా తీశారు. సాగర్ జలాలపై బాబు కుట్ర: హరీశ్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాత్రికి రాత్రే నాగార్జునసాగర్ డ్యాంను ఆక్రమించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. డ్యాంలోని 13 గేట్లను వెంటనే తమ అధీనంలోకి తీసుకోవాలని గుంటూరు జిల్లా మాచర్ల నీటిపారుదల ఈఈని చంద్రబాబు ఆదేశించారని శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో హరీశ్‌రావు మీడియాకు పేర్కొన్నారు. సాగర్ కుడికాల్వ గేజింగ్ స్టేషన్ తనిఖీ కోసం వెళ్లిన తెలంగాణ అధికారులను అక్కడి వారు అడ్డుకున్నారన్నారు. అడ్డదారిలో ఖమ్మం జిల్లాలోని ఎనిమిది మండలాలను ఏపీలో కలుపుకొన్నట్లుగానే ఇప్పుడు సాగర్ డ్యాంపై కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి రావాలని కృష్ణా బోర్డు చేసిన సూచనకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఏపీనే సహకరించడం లేదని అన్నారు. జూరాల తెలంగాణలో ఉందన్న విషయం మరవొద్దు ఏపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 13 గేట్లను వశం చేసుకోవడానికి టీడీపీ నేతలు, మంత్రులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు తెలంగాణలో ఉందన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం మరిచిపోవద్దని, ఇలా అయితే చుక్కనీరు కూడా కిందికి వెళ్లదని హెచ్చరించారు. యువజన విభాగం నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ప్రమాణ స్వీకారం నుంచే కయ్యానికి కాలు దువ్వుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.