‘కృష్ణా’పై తేల్చండి | controversy continues on krishna river water | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై తేల్చండి

Published Sat, Jan 24 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

‘కృష్ణా’పై తేల్చండి

‘కృష్ణా’పై తేల్చండి

సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నీటి విడుదలపై వివాదం ముదురుతోంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకుంటే శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని రాష్ర్ట ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. సాగర్ డ్యాం వద్ద శుక్రవారం ఇరు రాష్ట్రాలకు చెందిన వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నీటి విడుదలకు పరిష్కారంలో జాప్యం వల్ల రెండు రాష్ట్రాల మ ధ్య శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందం టూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ సర్కారు తాజాగా లేఖ రాసింది. ఇరు రాష్ట్రాలతో తక్షణమే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుత రబీ సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే విషయంలో స్పష్టత కోరుతూ బోర్డుకు మరో లేఖ కూడా రాసింది. ఇప్పటికే నిర్దిష్ట వాటాను మించి సాగర్ నీటిని వాడుకున్న ఏపీ అసాధారణరీతిలో మరింత వాటాను కోరుతోందని, కుడి కాల్వ ద్వారా నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని ఫిర్యాదు చేసింది. ఏపీ వైఖరితో సాగర్ ప్రాజెక్టు పరిధిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా తక్షణమే సమావేశం నిర్వహించి తగిన పరిష్కారం చూపాలని కోరింది. సాగర్‌లో నీటి నిల్వలు పడిపోతుం డటం, ఎడమ కాల్వ కింద రబీ పంటల సాగు ఆరంభం కావడం, నీటి విడుదలకు రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న దృష్ట్యా రబీ నీటి కేటాయింపులపై వెంటనే తేల్చాలని ప్రభుత్వం పేర్కొంది.  

 ఇదీ నీటి వినియోగం తీరు..

 కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో సాగర్ పరిధిలోని ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం వివరించిం ది. దీని ప్రకారం.. కృష్ణా నదిలో ఈ ఏడాది 616.37 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. అం దులో 549.65 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకునే అవకాశముంది. ఈ నీటిని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 42:58 నిష్పత్తి ప్రకారం వాడుకోవాల్సి ఉంది. ఈ వాటా మేరకు తెలంగాణకు 228.71 టీఎంసీలు, ఏపీకి 320.94 టీఎంసీలు దక్కుతాయి. అయితే ఏపీ తన వాటాకు మించి 30.60 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నదని, ఇప్పుడు మరింత నీటి విడుదలను కోరుతోందని రాష్ర్ట ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 85 టీఎంసీల నీటిలో ఏపీ వాటా ఒక్క చుక్క కూడా లేదని, మొత్తం నీటిని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని బోర్డును కోరింది. ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కరించేందుకు వెంటనే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించింది. ఈ లేఖ ప్రతిని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ పాండ్యాకు కూడా అధికారులు పంపించారు. కాగా, కృష్ణా నీటి కేటాయింపుల విషయమై ఎలాంటి స్పష్టత రాకపోవడం, బోర్డు ఎటూ తేల్చకపోవడంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో నీటి పారుదల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై న్యాయ సలహా కోరారు. ఈ అంశాన్ని  కోర్టులో తేల్చుకునే అవకాశాలపై ఆయనతో సమాలోచనలు జరిపారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

 పోలీస్ పహారాలో సాగర్ డ్యాం

 మరోవైపు సాగర్ డ్యాం పోలీసుల మయమైం ది. హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదలపై రెండు రోజులుగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాన డ్యాంకు ఇరువైపులా రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి. ప్రధాన ప్రాజెక్టు గేట్లతోపాటు కుడికాలువ హెడ్‌రెగ్యులేటర్, విద్యుత్కేంద్రాన్ని పరిశీలించేందుకు శుక్రవారం ఏపీ అధికారులు రావడం తో నల్లగొండ టీఆర్‌ఎస్ నేతలూ అక్కడకు చేరారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏం జరుగుతోందో ఆరా తీస్తూ గుంటూరు నేతలు కూడా మరోవైపు బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి ఎవరినీ డ్యాంపైకి అనుమతించలేదు. ఇరువైపుల నేతలకు నచ్చజెప్పి పంపించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు సాగర్‌డ్యాంను సందర్శించారు. గొడవకు గల కారణాలను ఆరా తీశారు.

 సాగర్ జలాలపై బాబు కుట్ర: హరీశ్

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాత్రికి రాత్రే నాగార్జునసాగర్ డ్యాంను ఆక్రమించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. డ్యాంలోని 13 గేట్లను వెంటనే తమ అధీనంలోకి తీసుకోవాలని గుంటూరు జిల్లా మాచర్ల నీటిపారుదల ఈఈని చంద్రబాబు ఆదేశించారని శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో హరీశ్‌రావు మీడియాకు పేర్కొన్నారు. సాగర్ కుడికాల్వ గేజింగ్ స్టేషన్ తనిఖీ కోసం వెళ్లిన తెలంగాణ అధికారులను అక్కడి వారు అడ్డుకున్నారన్నారు. అడ్డదారిలో ఖమ్మం జిల్లాలోని ఎనిమిది మండలాలను ఏపీలో కలుపుకొన్నట్లుగానే ఇప్పుడు సాగర్ డ్యాంపై కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి రావాలని కృష్ణా బోర్డు చేసిన సూచనకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఏపీనే సహకరించడం లేదని అన్నారు.
 
 జూరాల తెలంగాణలో ఉందన్న విషయం మరవొద్దు
 
 ఏపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ హెచ్చరిక

 సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 13 గేట్లను వశం చేసుకోవడానికి టీడీపీ నేతలు, మంత్రులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు తెలంగాణలో ఉందన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం మరిచిపోవద్దని, ఇలా అయితే చుక్కనీరు కూడా కిందికి వెళ్లదని హెచ్చరించారు. యువజన విభాగం నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ప్రమాణ స్వీకారం నుంచే కయ్యానికి కాలు దువ్వుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement