కృష్ణా సాగరసంగమంలో బోయపాటి భారీ సెట్లు
- ప్రముఖ సినీ తారాగణంతో చిత్రీకరణకు ఏర్పాట్లు
- సెట్‌ను సిద్ధంచేస్తున్న ఆర్ట్స్ ప్రొడక్షన్ డిపార్టుమెంట్
- 21 నుంచి పది రోజుల పాటు ఫైట్లు, పాటల చిత్రీకరణ
కోడూరు (అవనిగడ్డ) : మాములు సమయాల్లో మానవమాత్రుడి ఉనికి కూడా అంతంతమాత్రంగా ఉండే సాగరతీరం నేడు సిని షూటింగ్ సందడితో కళకళలాడుతోంది. ప్రముఖ సినీతారాగణంతో పలు ఫైట్లు, పాటలు చిత్రీకరించేందుకు తీరంలో భారీ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
వారం రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను హంసలదీవి సమీపంలోని పవిత్ర కృష్ణాసాగరసంగమ ప్రాంతాన్ని పరిశీలించి, ఇక్కడ సినిమాలు చిత్రీకరించేందుకు ఎంతో అనువైన ప్రాంతం ఉందని, త్వరలోనే తన చిత్రాన్ని ఇక్కడ తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బోయపాటి చెప్పిందే తడవుగా, ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిరియాల వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో ‘అల్లుడు శ్రీను’ సినిమా ఫేమ్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చిత్రీకరిస్తున్న సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తీరం వెంట భారీ సెట్టింగ్..
సినిమాలో ముఖ్యమైన ఫైట్ సిన్‌ను ఫైట్‌మాస్టర్లు రామ్–లక్ష్మణ్ పర్యవేక్షణలో చిత్రీకరించేందుకు తీరం వెంట రూ.లక్షలతో పెట్టి భారీ సెట్టింగ్‌ను నిర్మిస్తున్నారు. తెలుగు వైభవం ఉట్టిపడేలా దేవాలయం నమూనాను ఏర్పాటు చేసి, అందులో హీరోహీరోయిన్లు హోమగుండాల వద్ద పూజలు చేసే సీన్‌ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో పాటు సినిమాలోని ఒక ముఖ్యమైన పాటను కూడా ఇక్కడే తీసేందుకు బోయపాటి ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవాలయం సెట్‌కు సంబంధించిన పనులను ఆర్ట్ డైరెక్టర్ సాయిసురేష్ పర్యవేక్షణలో హైదరాబాద్‌కు చెందిన కార్మికులు నిర్మిస్తున్నారు.
21 నుంచి షూటింగ్
ఈనెల 20వ తేదీన నాటికి సెట్‌ను పూర్తిచేసి, 21 నుంచి పది రోజుల పాటు షూటింగ్ నిర్వహించేందుకు చిత్రయూనిట్ అనుమతులు తీసుకుంది. హీరో బెల్లకొండ శ్రీనివాస్‌తో పాటు హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, నటులు జగపతిబాబు, శరత్‌బాబు, సితార కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు ప్రముఖ సినీ తారాగణం కూడా పలు సన్నివేశాల్లో పాల్గొంటారని, వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చినట్లు యూనిట్ సభ్యులు చెప్పారు.
ఈ సినిమాకు కెమెరామెన్‌గా రిషి, కో–డైరెక్టర్లుగా కుర్రా రంగారావు, మిరియాల రవీంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని సినిమా మేనేజర్ కిషోర్ ‘సాక్షి’కి తెలిపారు. దివిసీమ ప్రాంతంలో తొలిసారిగా భారీ ఎత్తున సిని షూటింగ్ చేపట్టారని తెలుసుకున్న ప్రజలు, సెట్‌ను తిలకించేందుకు సాగరసంగమానికి భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో సాగరతీరం అగ్ర సినీ తారాగణంతో కళకళలాడనుంది.