దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం
పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపలతో అపవిత్రమై, నల్లని రూపాన్ని సంతరించుకుంది. ఆ పాపలనుంచి విముక్తికై ఆమె మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపత్ముల పాపల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథ.పులిగడ్డ దగ్గర కృష్ణానది చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినౖ వెనం గురించి ఒక కథ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది. పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం నిర్మించాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. దాంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.స్వామి ఆవిర్భావం గురించి.... పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామి దర్శనమిచ్చారు.. అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి. ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.ఉత్సవాలు...ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.సరదాలు... కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గో΄ాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారు అని ,సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు.ఎలా వెళ్లాలి?విజయవాడకు 110 కి.మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది హంసలదీవి. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే మచిలీ పట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డనుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయి.దారి బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్తే కృష్ణానదీ, సాగర సంగమాల దాకా కూడా వెళ్ళిరావచ్చు. అయితే మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు. వెలుతురు ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. – స్వాతీ భాస్కర్(చదవండి: జీవితాల్ని మార్చే జీవన'గీత'!)